మే డే – కొన్ని ఆలోచనలు

సంపాదకీయం

ఈ నిత్య జీవన సమరంలో కొత్త కొత్త పాఠాలు నేర్చుకుంటున్న క్రమంలో ఎన్నెన్నో భావపరంపరలు! మనుషులు ఎంత చేరువవుతున్నారో అంత దూరం అవుతున్నారు! ఎంత దూరం అవుతున్నారో అంత చేరువవుతున్నారు. ఇంత వైరుధ్యం ఏమిటి? అవును ఈ ఆధునిక జీవన సరళి అరచేతి కి వచ్చిన తర్వాత ప్రతి రోజుకు ఒక ప్రత్యేకత ఉన్న విషయం మననం చేసుకోకుంటే ఇప్పుడు బ్రతుకు అర్థం లేదు! అటువంటిది ఎంతో ప్రసిద్ధమైన రోజు మే డే కార్మిక దినోత్సవం! హక్కులు బాధ్యతలు ఆర్టిక విషయాలు వేతనాలు ఇవే కాదు ప్రస్తుతం చర్చించుకోవాల్సింది. ఆత్మ అభిమానం ఆత్మ గౌరవం వంటివి ఆత్మ వివేచనంతో చూస్తున్నామా !ఇటువంటివి చర్చించుకోవాలి.
ఓ …ప్రపంచాన్ని ఉద్ధరించడానికి బయలుదేరాననీ,దేశోద్ధారణ చేయకున్నా గొప్ప సంఘసంస్కర్తలు కాకున్నా, మనుషుల్ని మనుషులుగా గుర్తిస్తే చాలు!ఇందులోనే వ్యక్తిత్వం, వికాసం, చైతన్యం వంటి భావ ప్రకటనలు తెలుస్తాయి.
తోటి మనుషులను గౌరవించడం, తోటి మనుషుల మంచిని కోరడం ,తోటి మనుషులతో కలిసి నడవడం ఇవి చాలు! ఈ విషయంలో మనం ఏం చేస్తున్నాం ఎంతలో ఉన్నాం? ఎక్కడి వరకు పయనించగలిగాం? అని మనసుకు బోధపడితే చాలు.
ఈ ప్రశ్నలు గుండెను పిండేయాలి మనసును వేధించాలి. హృదయాన్ని మధించాలి.

అదేమిటో ……ఒక్క మెసేజ్ తో అన్నీ ఇంటి ముందుకు వచ్చి వాలుతున్నాయి , ఇంకా ఏం కావాలి అనీ, దీంట్లోనే జీవితమంతా ఉందనుకున్న ఒక భ్రమలో ఉన్నట్లు  ప్పటి సమాజం. సరే దీనికే స్థిర పడిపోయిన ఆలోచన తీసుకుందాం-. ఆ వస్తువులు, ఆ పదార్థాలు అన్ని గాలిలో నుండి పుట్టలేదు. వాటంతటావే తయారవ్వలేదు. ఎందరో మేధావులు , శ్రమజీవులు కలిసి చేస్తేనే ఈ వస్తు వినిమయం జరుగుతుంది. మానవ సంబంధాలన్నీ ఆర్థిక సంబంధాలే అయినా దీని వెనక అంతరార్థం తెలుసుకోగలిగితే ఈ ‘ఆర్థిక’ అనే విషయమే ‘హార్థిక’ విషయంగా మారిపోయినప్ఫుడే నుషులుగా మలని మనం నిర్ధారించుకోవచ్చు.

మేధావులు శ్రమజీవులు కలిసి చేసిన విలువైన సంపదలే … కూడు , గుడ్డ , నీడ అనేవి.  మేధావున్ని ఎట్లా గౌరవిస్తున్నామో శ్రమ జీవుల నూ అట్లాగే గౌరవించాలి అనే విషయాన్ని చెప్పేది మే డే.

సూపర్ మార్కెట్లో అందమైన ప్లాస్టిక్ కవర్లో తెల్లగా మెరిసిపోయే బియ్యం గింజలు చూసి పిల్లలు అదే నిజమని భ్రమిస్తున్నారు. మనకు బియ్యం ఎక్కడినుంచి వస్తాయి అంటే నిజంగా ఎక్కడి నుంచి వస్తాయి చెప్పలేని తనలో పిల్లలు ఉన్నారు.
తమ చేతిలోని పెన్ను ,సిపాయి చేతిలోని గన్ను ఎవరు చేశారు ఏ లోహపు హస్తాలు చేసాయా ?ఏ మానవహస్తాలు తయారు చేసాయా? తెలియని అయోమయ పరిస్థితిలో ఉన్నది ఇప్పుడు బాల్యం !ఇవి ,ఒక తల్లిగా, ఒక చెల్లిగా, ఒక అక్కగా, ఒక ఉపాధ్యాయురాలిగా , ఒక సాధారణ స్త్రీగా వాళ్లకి అర్థం చేయిస్తే చాలు!
ఎండనకా వాననక శ్రమిస్తారు వాళ్ళు! కణకణ నిప్పుల సెగ లెక్కచేయరు వాళ్లు! ఈ ప్రాణాపాయం ఉన్న భయపడరు తమ విధిగా ,తమ బాధ్యతగా పనులు చేస్తూనే ఉంటారు. ఆ ఫలితాలే ఇప్పుడు సమస్త లోకం ఒంటి మీద ఉన్న వస్త్రాలు !సమస్త లోకం కంటిని నిండుగా నిద్రపోతున్నా చిత్రాలు ! అన్నీ శ్రామికుల చేతుల కష్టం మించి వచ్చినవే! ఈ శ్రమ శక్తికి మేధా శక్తి, ఆర్థిక శక్తి తోడై వస్తువులుగా పదార్థాలుగా మన కళ్ళ ముందు మన ఇళ్ళ ముందు కదలాడుతున్నాయి.
ఇంట్లో శుభ్రం కనిపించిన, వాడవాడలా వీధి వీధినా పరిశుభ్రత కనిపించిన కొన్ని చేతుల శ్రమదానమే అని గుర్తిస్తే చాలు! ఈ సత్యాన్ని పిల్లలకు అర్థం చేయించి ఈ సత్యాన్ని నిత్యం పాటిస్తూ ఉన్నప్పుడే ‘ మేడే’ నిజంగా జరుపుకున్నట్టు!
సమస్త శ్రమ కోటి జీవులకు శత సహస్ర అభివాదాలు! అభినందనలు!

Written by Dr. Kondapalli Neeharini

డా|| కొండపల్లి నీహారిణి, తరుణి సంపాదకురాలు

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

కృష్ణలీలలు

Art of Aparna