కృష్ణలీలలు

5వ భాగము

సుగుణ అల్లాణి

కిట్టయ్య ను పసులగాయనీకె పంపిన యసోదమ్మకు … ఏం తోసింది గాదు… సల్ల జేయనీకె కడవకాడికి వోతది. కొడుకు కొంగు గుంజినట్టనిపించి … “జరుండు బిడ్డా!సల్లొలుకుతది”అంట ఎనుకకు దిరిగింది.. ఎవ్వరు కన్పడలే!అయ్యో ! నా బెమనా పిలగాడున్నడనుకున్న….।అనుకుంట తనల తనే నవ్వుకుంది . …ఎన్న జిల్కి మూత వెట్టి వండేయింట్లకువోయింది. ఏందో చెయాలని వచ్చింది .ఏంజేయాల్నా అని ఆలోసించుకుంట నిలవడింది.పొయ్యి కాడికి పోయింది.పీట మీద కూసుంది.పొయ్యిమీది గిన్నె ల గంటెవెట్టి కల్పుతున్నది. మెడమీద నుంచి చిన్న సేతులు సుట్టి వచ్చి లంకేసి బుజం మీద గదువ వెట్టి గారాలువోతూ అమ్మా ఆకలి అన్నట్టు అనిపించింది…. అయ్యో బిడ్డా ఉండు అన్నం బెడ్త…… అనుకుంట లేచింది. ఎదురుగ్గ సూస్తె ఎవరూ లేరు! ఇంగ
యసోదమ్మ కు ఏడ్పాగలేదు! చీరకొంగుతోని కండ్లు తుడుసుకుంట సావిడి దగ్గర్కొచ్చి స్తంబానికి సేరగిల వడింది.
ఒక్కపూట సంటోన్ని సూడకుండ ఉండలేక పోతున్నా! పెద్దగైతే ఆడు నా కాడుంటడా … అప్పుడు గూడ నాకు గిదే యాతన గాదా!
అయినా పసితనం నుంచి ఎన్ని గండాలుదప్పె పిలగానికీ…. నా గుండెల్ల దాసుకొని కాపాడుకొస్తున్న……గానాడు పూతన అనే రాచ్చసి ఎవరో పాలిస్తానిని వచ్చె….అప్పటివన్ని కండ్ల ముందు మెదిల్నయి యసోదమ్మ కు….
***
కిట్టయ్యవుట్టిన పదకొండోరోజు …. ఊర్ల ఉన్న గోపెమ్మలందరు పిలగాన్ని జూడనీకె రావట్టిన్రు.
ఎన్నో ఏండ్లకు యసోదమ్మ కడుపు పండి ఒక మగ నలుసును గన్నది . సూసొత్తం రండని ఒకరికొకరు చెప్పుకోని గుంపులు గుంపులుగ రానట్టిన్రు.
పిలగాన్ని సూసి సిత్రపోయిన్రు. మెటికలిరిసిన్రు, ఏం పిలగాడమ్మా యసోదమ్మా! నీ కొడుకు ఎంతందగాడూ! సూసిన సూపు తిప్పలేక పోతున్నం… ఆ కండ్లల్ల ఎలుగేంది … సూర్యసెంద్రల లెక్క.. ఆ నవ్వేంది ఎన్నెల గురిసినట్టూ! ఆ పిడికిలి మూసిన సేతులు సెంకు సెక్రాల లెక్క లేవా వొదినే! ఆ పాదాలు సూడు తామరపూలు పూసినట్టు …. నల్లతుమ్మెదల లెక్కున్న ఆ ఉంగరాల జంపాలతోటి ……అచ్చం నల్లమబ్బులున్న మొగులు ఉయ్యాల్ల పండుకున్నట్టు ఎంత ముద్దుగున్నడే యసోదక్కా నీ కొడుకూ! అంట మెటికెలిర్సుకుంట ఒక్కొక్కల్లు ఒక్కొక్క మాట …. మాట్టాడుతుంటే పిలగానికి ఏడ దిస్టి తగుల్తదో అన్న బయం తో వొనికి పోయింది యసోదమ్మ! ఇగో యసోదక్కా! ఎక్కడోల్లు అక్కడ వొయినంక దిస్టి దియ్యి ఈ సక్కనోనికి అనేపాలికి నవ్వుకున్నరందరు….
ఇంతల గల్లుగల్లున గజ్జెల సప్పుడినవడ్డది… అందరు అటుదిక్కు సూడవట్టిన్రు….
ఒక సక్కని సుక్క ….…అడుగుల అడుగేసుకుంట నడుము తిప్పుకుంట వొయ్యారంగ నడుసుకుంట రావట్టింది..… పక్వానికొచ్చిన పడుసుదనం నడిచొస్తున్నట్టున్నది. పచ్చని పసుపు సాయ బంగారంచు పట్టుసీర గట్టింది. కాశవోసిన సీర కొంగు కుడిబుజం మీదినుంచి తిప్పి ఏసుకున్నది….. ఒంటి నిండ బంగారు సొమ్ములతోని బొమ్మ లెక్క నడుసుకుంట అందరినీ పలకరించుకుంట రావట్టింది…. ఆమె ఎవరో ఎవల్లకు తెల్వదు. గోపెమ్మలందరూ నోరెల్లవెట్టి సూడవట్టిన్రు.
ఇంతల ఒక పెద్ద ముత్తైద…. ఎవరీమె ఎప్పుడు మన ఊర్లె గనవడలే? కొత్త గ ఊర్లెకెవరన్న ఒచ్చిన్రా?
అంటడగింది….
ఏమో పెద్దమ్మా! మాకూ తెల్వదు….నీకేమన్న తెల్సా చిన్నమ్మా?
నాకూ తెల్వదే!అంట అందరు గుసగుసలాడుతున్నరు….. ఆమె గడప దగ్గర్కి వొస్తున్నంతల ఉయ్యాల్ల ఉన్న కిట్టయ్య ఏడ్పు మొదలువెట్టిండు….. అందరొక్కసారి ఉల్కివడి సూసిన్రు… యసోదమ్మ ..అయ్యో! ఏమాయె పిలగానికి ? బయపడెనా ఏంది? అంట సంకనెత్తుకొని ఈపు రాసుకుంట …
వొద్దు వొద్దు కొడుకా!ఏడ్వకూ! అమ్మ నీకాడనే ఉంది బిడ్డా ! ఏడ్వకు తండ్రీ! నా బంగారు కొండ ! నా వరాల మూట! అనుకుంట బుజం మీదేసుకొని అటూయిటూ తిరగవట్టింది… ఎంత సమ్దాయించినా ఊరుకోడాయె కిట్టయ్య… యసోదమ్మ కండ్లల్ల నీల్లు తిరుగుతుండంగ ఏమైంది కొడుకా ?ఎందుకు బిడ్డా ఇంతగనం ఏడ్వవడ్తివీ? అంటుంటె
గోపెమ్మల్లో ఒక పెద్దామె ….. అయ్యో యసోదమ్మా! పసిపిల్లలు ఏడ్వకుండుంటరా! ఆకలైందో ఏమో పాలిచ్చి తీస్కరా పో !అనంగనే…. యసోదమ్మ లోనికి తీస్కపోతుంటే …. ఆ కొత్త మనిసి “ సంటోన్ని నాకియ్యి యసోదమ్మా…. నేనెత్తుకోని సమ్దాయిస్తా! అన్నది. ఆ మాటినంగనే కిట్టయ్య తల్లి బుజం మీదినించి తల తిప్పి ఆమె దిక్కు జూసిండు.ఆమెను జూసి పకపక నవ్విండు కిట్టయ్య…. అక్కడున్న గోపెమ్మలు ఆసాములు అందరు సిత్రపోయిన్రు.
ఇప్పటిదాకున్న ఏడుపేయాయె…. గిట్ల నగవట్టిండు….అని ముక్కు మీదేలేసుకున్నరు.యసోదమ్మ మత్తులున్నట్టు ఏం మాట్లాడక పిల్లగాడిని ఆమె కిచ్చింది ఆమె ఎత్తుకొని కిట్టయ్య మొకం నిండ ముద్దులు గురిపించుకుంటు ,మీదికెగిరేసుకుంటు
ఎత్తుకోని గిరగిర తిరుక్కుంటూ ఆడ నుంచి లోపలి మంసాలకువోయింది.ఆమె తోని ఆడుకుంట కిట్టయ్య నగుతునే ఉన్నడు. యసోద తో గోపెమ్మ లు గూడ ఆమె పోయిన దిక్కే ఆమెనే చూసుకుంట ఎనకనే పోయింన్రు.
ఆమె “ఎన్నాల్లకు దొరికినవు…. ఆకలిగొన్నవా?పాలుదాగుతావు… ఒక్కసారి నా తాన పాలుదాగితే ఇగ జనమల మల్ల పాలడుగవు ఎర్కేనా… అని నవ్వుకుంట కొంగు కిట్టయ్య మొకం మీద గప్పి తాగు తాగు అని బలవంతంగ పాలియ్యవట్టింది. అది జూసి యసోదమ్మ వద్దు వద్దు పాలియ్యకమ్మా వాడు తాగడు అంటునే ఉంది…..
గోపెమ్మలందరూ “గదేంది యసోదమ్మా గామెవలో తెల్వది… పసిపిలగాన్ని ఆమెకిచ్చి ఏందో గట్ల నిలవడ్డవు…. పాలియనియ్యకు పిలగాన్ని తేపో! అనంగనే యసోదమ్మ ఇగో పోతున్న అంట కిట్టయ్యను తెచ్చుకుందామని పోతునంతల్నే…
పెద్ద పెద్దగా ఇడువు ఇడువురా ఇడువు అన్న అర్పులు ఇనవడ్డయి. ఒక్కసారి అందరు బయం తోని వనికిపోయిన్రు.
వామ్మో ఏమాయెనుల్లా! ఎవరు గట్ట అర్వవట్టినారని అటూఇటూ దిక్కులుజూడంగ … ఆ కొత్తామె పొయిన దిక్కు అని ఎర్కవట్టి అందరు అటువోయిన్రు.
అక్కడ ఆమె లేదు పదిగేనిర్వై అడుగుల ఆడమనిసి రాచ్చసి లెక్కున్నది కిందవడి గిలగిల గొట్టుకుంటుంది . బూమి కదిలిపోతున్నది అంత పెద్ద భవంతి గూడ కదిలివోతుంది …. పెద్దగ నోరుదెర్చి నిట్టూరుస్తుంది. అది పులులు గాండ్రించినట్టు ,పెద్దపిట్టలు కూతవెట్టినట్టు ,
నక్కలు ఊలలెట్టినట్టూ ఇనిపించి అందరినినీ బయపెట్టినయి. ఇంతల యసోదమ్మ కిట్టయ్యను ఎతుక్కున్నది. కన్నయ్యా ! నా కొడుకా ఏడున్నవ్ రా! ఎవలన్న నా కిట్టయ్యను తీస్క రండి… నా బిడ్డ నా బిడ్డ…యెద గొట్టుకుంటూ ఏడ్వవట్టింది.
నందయ్య ఏంగాదు మన పిలగానికి నువ్వు ఏడ్వకు బయపడకు… అని ఆమె బుజం మీద చెయ్యేసి దైర్నం చెపుతున్నడు. ఇంతల ఒక పెద్దాయన ముందుకొచ్చి జర అందరు జరుగుండ్రి…. సూడినియ్యండి ఏమైందో! సూసి …. అంత పెద్దమనిసి కి కూడ ఒల్లు జల్లుమన్నది…. ఆ ఆకారం జూడంగనె!

గుంపులో ఎవరో…. వామ్మో ఈమె పూతన అనే రాచ్చసి…. కంసమహారాజు కొలువుల ఉంటదట….కావలికాండ్లు అనుకోవట్టిన్రు… కంస మారాజు అన్ని ఊర్లకు గిట్టాంటోల్లను పంపిండంట… పోయిన అష్టమి నాడు పుట్టిన పిల్లల్ని సంపమన్నడంట…. గానాడు పుట్టినోల్లతో ఆయినకి పానగండం ఉందట గదా! ఈ రాచ్చసి పక్క ఊర్లె ముగ్గురు సంటి పిల్లలను గిట్లనే పాలిచ్చి సంపిందంట …..మనూర్లెకు గూడ వచ్చిందా అయితే!
అమ్మల్లారా! సంటి పిల్లలు పయిలం….బయిటతిప్పకుండ్రి…..ఈమెగాకపోతే ఇంకోల్లస్తరు…. ఏంజెప్పగల్గుతం……అన్నడు. యసోదమ్మ బిరబిర ఉరికి ఆ రాచ్చసి ఎద మీద ముద్దుగ నోట్లె ఏల్లు వెట్టుకోని నములుకుంట నవ్వుకుంట కాల్లాడించుకుంట ఆడుకుంటున్న కన్నయ్యను సటుక్కున అందుకొని గట్టిగ ఎదకత్తుకున్నది….
ఒక పెద్దమత్తైద “పదు యసోదా! సంటోనికి దిష్టి తీద్దం” అని లోనికి దీస్కవోయి…. ఆకొట్టంలకు వోయి ఒక కర్రావు తోకను పిల్లగాని సుట్టు తిప్పింది…. ఇంతల ఇంకో గోపెమ్మ ఒక పల్లెంల దోసెడు ఎర్ర మిర్పకాయలు ఉప్పు వట్కొచ్చింది. కిట్టయ్యను ఎత్తుకున్న యసోదతో గల్పి దిస్టి దీసి పొయిలవడేసింది.
ఇంకో పెద్దామె నల్లతాడు మంత్రిపించి కన్నయ్య కాలుగ్గట్టింది…..
**
అమ్మా! ఓ అమ్మో! …. యసోదమ్మ ఉలికి పడింది.  కిట్టయ్య మెడ మీదినుంచి చేతులేసి ఊపుతున్నాడు….
వస్తివా బిడ్డా! నా కన్నయ్యా! నా బంగారుకొండా! నా వజ్రాల మూట…. ఏందింటవు … ఆకలవుతుందా!
అంట దమ్ముదీస్కోకుండ కిట్టయ్యను అడగుతంటే….కిట్టయ్య తల్లి ప్రేమల మునకలేస్కుంట అమ్మ ఒడిల పాలసంద్రంల పన్నట్టు హాయిగ నిద్రవొయిండు…..బిడ్డ సేమంగ ఇంటికొచ్చిండు గంతే సాలు…. అని గుండె మీద సేయ్యేసుకొని దేవునికి దండంపెట్టుకునడం ఓరగంట జూసిన పరమాత్మ సన్నగ నవ్వుకున్నడు ….

Written by Suguna Allani

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

పువ్వులం

మే డే – కొన్ని ఆలోచనలు