ఒక జానపద గేయం – కొన్ని విశేషాలు

ఆచార్య మాదిరెడ్డి అండమ్మ

మనుషుల జీవితాలు ఎన్నో రకాల బంధాలతో ముడిపడి ఉంటాయి.
పేద ధనిక వర్గాలు, మంచి చెడుల మధ్య తేడాలు ఈ సమాజం లో ఎన్నో ఉన్నాయి. ఇవి అన్నీ ఎంతో ముఖ్యమైన విషయాలు. అయితే,
విశ్వమానవసమాజం కావాలంటే ప్రాంతేతరవివాహాలు , ఖండాంతరవివాహా లు జరగాలి. మతరహిత సమాజం కావాలంటే మతాంతర వివాహాలు జరగాలి.
కులరహిత సమాజం కావాలంటే కులాంతరవివాహాలు జరగాలి.
కులాంతరవివాహాలు చేసుకోవాలనే ఒక సిద్ధాంతం ఇటీవల బాగా ప్రాచుర్యంలోకి వచ్చింది. అందుకు అనుగుణంగానే వివిధప్రభుత్వాలు ప్రోత్సహకాలు ఇస్తూ ప్రోత్సహిస్తున్నాయి.
అలాంటి వివాహాలు చేసుకున్నవారికి అనేక రకాల రాయితీలు, ఇస్తున్నాయి.
కాని, ఆ తర్వాతనే అసలు సమస్యలు మొదలవుతున్నాయి.
ప్రాంతేతరవివాహాలు, మతాంతర వివాహాలు, కులాంతర వివాహాలు చేసుకున్న వారికి, వారికుండే సమస్యలు వారికున్నాయి. వీరిద్దరు సర్దుకున్నా, వారి పిల్లల పెండ్లిళ్లు
చేయవలసి వచ్చేసరికి
సరికొత్త సమస్యలు ఎదురవుతున్నాయి.
ప్రేమ పెండ్లి అయినా, పెద్దలు చేసిన పెండ్లి అయినా సర్దుకుపోయే మనస్తత్వం లేనప్పుడు పొరపొచ్చాలు వస్తూనే ఉంటాయి.
పైన చెప్పుకున్నటువంటి వివాహాలు చేసుకున్నవారికి పొరపొచ్చాలు (అభిప్రాయ భేదాలు) రావడానికి అనేక కారణాలు మనకు కనిపిస్తున్నాయి.
ప్రధానంగా అవి:
ఆహారపు అలవాట్లు, ఆచారవ్యవహారాలు, భార్యభర్తలమధ్య, కుటుంబసభ్యులమధ్య సర్దుకుపోయే మనస్తత్వం లేకపోవడం, సర్దుకుపోయే మనస్తత్వం ఉన్నా వారి ఆహారపు అలవాట్లు, ఆచారవ్యవహారాలు, భార్యభర్తల మధ్య, కుటుంబసభ్యులమధ్య సర్దుకుపోయే మనస్తత్వం లేకపోవడం, సర్దుకుపోయే మనస్తత్వం ఉన్నా వారి బలహీనతలను ఆధారంగా చేసుకొని చులకనగా చూడడం, ఆర్థికసమస్యలు మొదలైనవి.
కొన్నిసార్లు ఇద్దరిదీ ఒకే కులమైనా ప్రాంతభేదాలున్నపుడు, శాఖాభేదాలున్నపుడు కూడా అభిప్రాయభేదాలు వస్తుంటాయి.
ఉదాహరణకు తెలంగాణలో ఆడపిల్లలకు ఐదారేండ్లకొకసారి సారెచీర లేదా ఒడిబియ్యం పెడ్తారు. రాయలసీమలో ఈ పద్ధతి ఉండ దు. ఇద్దరిది ఒకటే కులం ఒకటే శాఖ. అయినా భేదం ప్రస్ఫుటంగా కనిపిస్తున్నది.

అలాగే తెలంగాణ ప్రాంతంలో ‘బావలకు, బిడ్డ ను ఇచ్చిన అల్లుండ్లకు’ ఆడవారు (మరదలు, అత్త) అగుపడరు. ఆంధ్ర, రాయలసీమలో ఈ పద్ధతి ఉండదు. ఇలా చెప్పుకుంటూ పోతే ఎన్నో భేదాలు కనిపిస్తుంటాయి.

కుటుంబంగానీ, భార్యాభర్తల అనురాగంగానీ సజావుగా సాగాలంటే ఎవరో ఒకరు ఒక మెట్టు దిగాలి, మరొకరు ఒక మెట్టు ఎక్కాలి. అదే సమయంలో ఒకరి అలవాట్లను మరొకరు , పరస్పరం గౌరవించుకోవాలి. ఒకరిని మరొకరు
తమకు అనుగుణంగా మారాలని, అలవాట్లను మార్చుకొమ్మని ఒత్తిడి చేయకూడదు. మానసికంగా ఒత్తిడి చేయకూడదు.
ఇందుకు ఉదాహరణగా విభిన్న ఆహారపు అలవాట్లు కలిగి ఉండి, కులాంతరవివాహం చేసుకొనిన వారి గురించి తెలుసుకుందాం. ఈ గేయంలో మానవబలహీనతలు, వాటిని అలుసుగా తీసుకోవడం, సమాజం ప్రతిస్పందన మొదలైన అంశాలు కూడా మనకు గోచరిస్తాయి. ఈ జానపద గేయాన్ని , 1980లో వెలువర్తి గ్రామం (నల్లగొండజిల్లా) లో నేను సేకరించాను.

కులాంతర వివాహం:
ఓ బ్రాహ్మడు ఏటికి వెళ్లి తానమాడుతుండగా పూలు, పుల్లలు ఏరుకుంటున్న ఓ దళిత అమ్మాయిని చూస్తాడు. ఆ పిల్ల మీద అతనికి మనసు అవుతుంది. అతను ఆ అమ్మాయి వద్దకు వచ్చి.
‘ఎవ్వరే ఓ బాలా! ఎవ్వరే నీవు’ అని ప్రశ్నిస్తాడు. ఆ అమ్మాయి తాను హరిజన స్త్రీని అని, మ్యాదరి(మేదరి)ని అని చెప్పుకుంటుంది (ఎస్సీలలో కుల పెద్దను కొన్ని ప్రాంతాల్లో మ్యాదరి అని అంటారు.)
అతను ‘మ్యాదారి బిడ్డయితే మాపటికి రాను మనసాయె, పోను మనసాయె” అని
తన మనసులోని కోరికను ఆమెకు వెల్లడిస్తాడు. అందుకు ఆమె అతన్ని మందలించకపోగా,
ఆమె ‘మనసైతే మాకింక మహ మంచిదేనయ్యా, మంచిదేనయ్యా,’ అని అంటూ. తన ఇష్టాన్ని తెలియజేస్తూ తన ఇంటికి రమ్మని, తన ఇంటి ఆనవాలు…
‘‘సుట్టూ మొగిలీగోడ, దిగుడూదొడ్డి దిగుడూ దొడ్డి

దిగుడు దొడ్లంగ, ఈగీ రావయ్యా ఈగీ రావయ్యా’ అని చెప్తుంది.

‘. “కాంతను, కనకాన్ని చూస్తే బ్రహ్మకైనా పుట్టు రిమ్మ తెగులు’ అని అంటారు కదా! ఈ గేయం లోనూ, ఆమెను
చూసిన ఆ బ్రాహ్మడు తన సర్వస్వం మరచి, మడిదడి వదలి, ఆమె ఇంటికి వెళ్తాడు. ఆమె పురమాయించిన పనులన్నీ చేయడానికి సిద్ధమవుతాడు.

ఆమె అతనికి చెప్పిన పనులు – వారి సంభాషణ
ఆమె : ‘దొరోరి దొడ్లనె పడ్డా పడ్డదిరా, గొడ్డూ పడ్డదిరా, గడె కట్టెలయ్యిన్న తీసుకోవయ్యా తీసుకోవయ్యా
అతను: నేనెట్ల దెత్తూనే, సిన్ని బ్రామ్మణ్ని, సన్న తిరుమణ్ని, నేనెట్ల దెత్తూనే
ఆమె: మ్యాదారి బిడ్డనైతే రాను మనసాయె, పోను మనసాయె, మ్యాదారి బిడ్డనైతే మ్యాదారి బిడ్డంటే సాలు అయ్యిందా, మేలు అయ్యిందా, మ్యాదారి బిడ్డంటే”
ఆ మాటలతో ఆ బ్రామ్మడు కిక్కురమనకుండా, ఆమె చెప్పినట్లు దొరోరి దొడ్డికి వెళ్లి, గొడ్డును తోలుకొస్తాడు. ఆమె చెప్పినట్లే గుంజకు కట్టేస్తాడు. ఇక్కడ ‘పడ్డ‘ అంటే “ఈత ఈనని (పిల్లను కనని) బర్రె” అని అర్థం.

ఆ గొడ్డును తోలుకొచ్చిన తర్వాత అతనికి చిన్నకత్తి చేతికిచ్చి,

ఆమె: ఆనగపు కాయుందాడ కోయీ బామ్మనుడా కోయీ బామ్మనుడా

అతను : నేనెట్ల చేతునే సిన్ని బ్రామ్మణ్ని, సన్న తిరుమణ్ని, నేనెట్ల చేతూనే
ఆమె: మ్యాదారి బిడ్డనైతే రాను మనసాయె, పోను మనసాయె, మ్యాదారి బిడ్డనైతే మ్యాదారి బిడ్డంటే సాలు అయ్యిందా, మేలు అయ్యిందా, మ్యాదారి బిడ్డంటే”

అతను ఆమె చెప్పినట్టు కాయను కోసి, ముక్కలు చేస్తాడు. ఆ వెంటనే అతనికి ఆమె మరోపని పురమాయిస్తుంది.

ఆమె: పొయ్యిలా మంటపెట్టు, పొయ్యి మీద సరువను (బిందెలాంటిగిన్నె) వెట్టు, పొయ్యిలా మంటవెట్టు,
ఒక్క మంటవెయ్యి, మరొక్క మంటవెయ్యి, బ్రామ్మడా॥ మరొక్క మంటవెయ్యి”

మొత్తం మీద అతనితో వంట వండిస్తుంది. వండిన తర్వాత ఉడికిందో లేదో చూడమంటుంది. డొప్ప కుట్టుకొని, డొప్పలో పెట్టుకొని తినమంటుంది.
అతను : నేనెట్ల తిందూనే, సిన్ని బ్రామ్మణ్ని, సన్న తిరుమణ్ని, నేనెట్ల తిందూనే,
ఆమె : మ్యాదారి బిడ్డనైతే రాను మనసాయె, పోను మనసాయె, మ్యాదారి బిడ్డనైతే మ్యాదారి బిడ్డంటే సాలు అయ్యిందా, మేలు అయ్యిందా, మ్యాదారి బిడ్డంటే
నియమనిష్ఠలతో పెరిగిన ఆ బ్రామ్మడు ఎలా తినాలా
అని సందేహిస్తుంటే, మాయిన్ని కూరల్లు గిట్లనె బ్రామ్మడా, బాగనె ఉంటయి తిను బ్రామ్మడా।

అని అతన్ని ప్రోత్సహిస్తుంటుంది. ఇంతలో పనుమటి(పడమర) నుండి ఒక పాపోసు దెబ్బ , తూరుపునుండి ఒక తుపాకి దెబ్బను తూగేసి కొడ్తారు ఎవరో.

(పై చరణం లో ‘పాపోసు ‘ అంటే కాలి చెప్పు )
అంటే , ఇరు కుటుంబాల వారు వీళ్ళ ను అడ్డగించారు అని దీని అర్థం. ఇలా మనసుపడి వెళ్లే ముందు , ముందు వెనుక చూడకుండా వెళ్ళొద్దని హెచ్చరించారు ఈ జానపద గేయం లో!
ఆడ అయినా, మగ అయినా ప్రాధమికంగా కోరుకునేది సుఖం, మానసిక ప్రశాంతత. అవి లభించేటట్లు చూసుకోవాలి, చేసుకోవాలి. అది ఏ వివాహంలో లభిస్తే ఆ వివాహం చేసుకోవాలి అని ఈ పాట ద్వారా తెలుస్తున్నది.
(వేషభాషలకు సంబంధించిన ఇలాంటి మరొక ఉదాహరణ వచ్చే సంచికలో)

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

ప్రకృతికి మించిన ఆనందం

ఏమండి కథలు