స్వాతీసోమనాథ్

అంతర్జాతీయ నృత్య దినోత్సవం ఏప్రిల్ – 29 ని పురస్కరించుకొని

               స్వాతీసోమనాథ్

“ముదితల్ నేర్వగరాని విద్య గలదె ముద్దార నేర్పింపగన్ ” చిలకమర్తి వారు ఒక నాటకంలో ఇలా వ్రాశారు. వారు ఏ సందర్భంగా , ఎవరి చేత ఈ పలుకులు పలికించారు అనే విషయాన్ని పక్కన పెడితే సున్నితంగా , సుకుమారంగా కనిపించే స్త్రీ కూడా ఓరిమితో నేర్పిస్తే ఏ విద్య అయినా నేర్చుకుని పురుషునితో సమానంగా ఒక విధంగా చెప్పాలంటే అతనికన్నా కూడా ఒక అడుగు ముందుగా నిలబడగలదని దీని భావం . ఇదే అభిప్రాయాన్ని మనం ఇక్కడ స్వాతీ సోమనాథ్ విషయంలో కూడా రుజువైనట్లుగా గమనించవచ్చు . వీరి మూలాలు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని శ్రీకాకుళం జిల్లా దూసి అగ్రహారంలో ఉన్నప్పటికీ, ఝార్ఖండ్ రాష్ట్రంలోని చక్రధర్ పూర్ లో , సాంప్రదాయ బ్రాహ్మణ కుటుంబంలో జన్మించి , పశ్చిమ బెంగాల్ రాష్ట్రంలో పెరిగి , తెలంగాణలోని హైదరాబాదు నగరంలో స్థిరపడ్డారు .

సృష్టిలోని అందమంతా రాశి పోసి దానికి ఒక పేరు పెడితే అది స్వాతి సోమనాథన్ అయ్యింది . పొందికైన వస్త్రధారణలో , నుదుటన రూపాయి కాసంత ఎర్రని బొట్టుతో , సాంప్రదాయికత , ఆధునికతల మేళవింపుతో మెరిసిపోయే పదహారణాల తెలుగింటి ఆడపడుచు . బంగారానికి పరిమళం అలదినట్లుగా ముత్యాల సరాల వంటి పలువరస తళుక్కుమనేలా ఆమె ముఖంలో విరిసే నవ్వు ఆమెకు ప్రత్యేక ఆకర్షణ అని చెప్పవచ్చు . తన చదువు , నాట్యం ,వృత్తి అంతా ఇక్కడేనని చెబుతారు . వీరి తండ్రి సోమనాథన్ గారు వృత్తి రీత్యా రైల్వే ఉద్యోగి అయినప్పటికీ , వీరి అభిరుచి మాత్రం సంగీతం ,సాహిత్యం , నృత్యం ,జర్నలిజం లపై ఉండేదట. కుమార్తెను గొప్ప నృత్యకారిణిగా తీర్చిదిద్దాలన్నది వీరి తపన .

స్వాతీ సోమనాథ్ చిన్నప్పుడు స్కూల్లో ఒకరోజు లంబాడి నృత్యం చేస్తూ ఉండగా , వీరి నృత్యం చేసే పద్ధతిని గమనించిన ఉపాధ్యాయురాలు వీరిలోని ప్రతిభను గుర్తించి వీరి తల్లి గారితో ఆ విషయం చెప్పారట . మరొక సందర్భంలో స్వాతీ సోమనాథ్ తన తండ్రిగారితో ఒక నాట్య ప్రదర్శనకు వెళ్లగా ప్రముఖ కూచిపూడి నృత్యకారిణి అయిన యామినీకృష్ణమూర్తి గారు తరంగం పళ్లెంలో అభినయిస్తుండగా చూశారట! ఆ నాట్యం, ఆ అభినయం చూసి స్ఫూర్తి పొందాననీ , తన ఆసక్తిని గమనించిన తల్లిదండ్రులు తనకు పదకొండు సంవత్సరాల వయసులో ఉన్నప్పుడు నాట్య శిక్షణలో చేర్చారనీ చెప్తారు స్వాతీ సోమనాథ్.
తన మొదటి గురువు భాగవతుల రామకోటయ్య గారని , రెండు సంవత్సరాల శిక్షణానంతరం వారు హఠాత్తుగా కన్నుమూయడంతో , రెండవ గురువుగా సుమతీ కౌశల్ గారి వద్ద నాట్య కళలో నాలుగైదు సంవత్సరాలు శిక్షణ పొందారట. వారి సమక్షంలోనే తనకు పదిహేనేళ్ల వయసులో ఉండగా , 1980 సంవత్సరంలో రవీంద్రభారతిలో పేకేటి శివరాం , జస్టిస్ అమరేశ్వర్ , కె .విశ్వనాథ్ వంటి దిగ్గజాల సమక్షంలో అరంగేట్రం చేశాననీ , అప్పుడు తాను చాలా ఉద్విగ్నతకు లోనయ్యానని చెబుతారు .స్వతంత్ర భావాలు, నిజాన్ని నిర్మొహమాటంగా చెప్పగలిగే ధైర్యం , వ్యవస్థలకు ఎదురువెళ్ళే స్థైర్యం ,వివాదాలకు వెరవని మనోనిబ్బరం వీరి మనస్తత్వంలో ఉన్న ప్రత్యేకతలు.
దేవుడిని,జాతకాలను నమ్ముతారు. స్వాతీ సోమనాథ్ స్వతంత్ర భావాలు గలవారు. ఏది చేసినా చాలా ఆత్మవిశ్వాసంతో చేస్తారు. తను నమ్మిన సిద్ధాంతం కోసం ఎటువంటి వివాదాలకైనా వెరవని ధైర్యం వీరి లక్షణాలు .

తన తండ్రి వైపు నుండి సంగీతం , సాహిత్యం , నృత్యం పట్ల ఆసక్తి కలిగిన కళాకారులు చాలా మంది ఉన్నారు గానీ , నృత్య కళాకారులు లేరని , తానే మొదటి నృత్య కళాకారిణి అని అంటారు .నృత్యం అనేది తనరక్తంలోనే ఉందని , పెద్దగా సాధన తనకు అవసరం కాలేదని , అలవోకగా నవరసాలను పలికించే నైపుణ్యం తనకు దైవదత్తంగా అబ్బిందని, అష్ట విధ నాయికల్లోని మధుర భక్తిని అవలీలగా ప్రదర్శించగలనని , హాయిగా నవ్వేస్తూ చెబుతూ ఉంటారు. మనసు అట్టడుగు పొరల్లో నుండి భావాలు బయటకు ఉప్పొంగినప్పుడే, అభినయ శాస్త్రానికి సొబగులు అలదిన వారవుతారని, ఒక వ్యక్తిలోని కళ ఒక నిర్ణీత స్థాయిని చేరుకోవాలంటే గనుక కనీసం 10 సంవత్సరముల శిక్షణ తప్పనిసరి అని ,అలా కొనసాగించగలిగినప్పుడే దానిపై పట్టు సాధ్యమవుతుందని , మొదట దీనిని హాబీగా తీసుకొని ,తర్వాత వృత్తిగా మలచుకోవాలని , కొత్త వారికి దిశానిర్దేశం చేస్తూ ఉంటారు. నృత్య శిక్షణ అనేది చాలా ఖర్చుతో కూడుకున్న విషయం. తన తండ్రి అకస్మాత్తుగా మరణించడంతో , ఆర్థిక సమస్యలు వెంటాడగా , తాను గురువు వద్ద నుండి వచ్చి ,స్వతంత్రంగా , తన ఆర్కెస్ట్రాతో ప్రదర్శనలు ఇవ్వడం ప్రారంభించాననీ ,అది గురువును ధిక్కరించడం కాదని చెబుతూ ఉంటారు. 1250 పద్యాలు , 36 విభాగాలు,7 భాగాలుగా వ్రాయబడిన వాత్సాయన కామసూత్రను కూచిపూడిలో ఇంతవరకు ఎవరు ప్రదర్శించలేదనీ , ప్రదర్శించాలన్న ఆలోచన కూడా ఎవరికీ రాలేదని , అత్యంత వైవిద్యభరితమైన ,సాహసోపేతమైన చర్య అనీ, తాను ఎం. ఫిల్ చేస్తూ ఉన్న రోజుల్లో ‘శృంగార టు మోక్ష’ అనే అంశాన్ని చదువుతూ ఉండగా , దీనిని నృత్య రూపకంగా ఎందుకు చేయకూడదన్న ఆలోచన వచ్చింది అంటారు. కుటుంబం నుండి తోటి కళాకారుల నుండి దానికి వ్యతిరేకత ఎదురైనప్పటికీ , పట్టుదలతో చేశానని , అయితే ‘వాత్సాయన కామసూత్ర ‘అని టైటిల్ పెట్టడమే వివాదాలకు కారణం అయిందని అంటారు . “సాంప్రదాయ బ్రాహ్మణ కుటుంబం నుండి వచ్చారు కదా బంధువుల నుండి ఏమైనా విమర్శలు ఎదుర్కొన్నారా ? “అన్న ప్రశ్నకు సమాధానంగా అటువంటిదేమీ లేదని , చక్కని ప్రోత్సాహాన్ని అందించిందే వాళ్లని చెప్పారు. కామసూత్ర ప్రదర్శించాక తానంటే తోటి కళాకారుల్లో గాని , సమాజంలో గాని మరింత గౌరవం పెరిగిందని చెబుతారు. అన్యోన్య దాంపత్యం వల్ల సమాజం ఎలా బాగుపడుతుంది అనే సందేశాన్ని కామసూత్ర ప్రదర్శన ద్వారా అందించానని అంటారు. వాత్స్యాయన కామసూత్ర లో చిత్రించిన బొమ్మలే అది అశ్లీలత అనే భావాన్ని పాదుకొల్పడానికి కారణమయ్యాయి తప్ప అది కుటుంబ సభ్యులంతా కలిసి కూర్చుని చూడగలిగే రామాయణ , మహాభారత ఇతిహాసాలంత పవిత్రమైన గ్రంథం అని అంటారు . కామసూత్ర ప్రదర్శన తర్వాత జనంలో తన సామర్థ్యంపై నమ్మకం మరింత పెరిగిందని , తానేది చేసినా అందులో ఏదో ఒక ప్రత్యేకత ఉంటుందనే ఆలోచనతో ఉన్నారన్న విషయం తన దృష్టిని దాటి పోలేదని ,అందుకే తాను చేసే తదుపరి ప్రదర్శన అంతకన్నా పై స్థాయిలో ఉండాలని నిర్ణయించుకున్నానని , దాని ఫలితమే ద్రౌపది బ్యాలే అని , ప్రముఖ స్త్రీవాద రచయిత్రి అయిన ఓల్గా గారు ఈ బ్యాలే ను రచించారని చెబుతారు .

కామసూత్ర , మనుచరిత్ర , నౌకా చరిత్ర వంటి ప్రణయమే ప్రధాన అంశంగా ఉన్నవే ఎంచుకోవడానికి కారణమేమిటన్న ప్రముఖ ఛానల్ వారి ప్రశ్నకు సమాధానంగా భారతీయ తత్వమే శృంగారం మీద ఆధారపడి ఉందని , శృంగారం లేని నృత్య రీతి ఏది కూడా లేదని ,వేదికపై శృంగార రసాన్ని అభినయించని ఏ కళాకారుడు గాని కళాకారిణి గాని మనలేరని , ఒకవేళ అభినయించను అంటే గనుక వాళ్ళు నృత్యాన్ని వదులుకోవడమే శరణ్యం అని నిక్కచ్చిగా చెబుతారు .కామసూత్ర ప్రదర్శన అనంతరం “ఒకటి నుండి పది స్థానాల్లో నృత్యకారిణిగా మీ స్థానం ఏదని మీరు భావిస్తారు ?”అని ఒక విలేఖరి అడిగిన ప్రశ్నకు మొదటి స్థానం అని ఠకీమని సమాధానం ఇవ్వగలిగిన వారి ఆత్మవిశ్వాసానికి చప్పట్లు కొట్టడమే ! కూచిపూడి లో కామసూత్ర ప్రదర్శన ఇప్పటివరకు తాను తప్ప ఎవరూ చేయలేదని, భవిష్యత్తులో ఎంతమంది చేసినప్పటికీ తానే నంబర్ వన్ గా నిలుస్తానని చెప్పగలిగిన వారి మనోనిబ్బరానికి చేతులు జోడించి నమస్కరించకుండా ఉండలేకపోతున్నాను . రైల్వే శాఖలో ఐఆర్టిఎస్ అధికారిగా ఉన్న వీరి సోదరుని ప్రోత్సాహం, సహకారం వీరికి అన్నివేళలా మెండుగా ఉండేవని చెప్తారు. వీరి బాబాయి అయిన దూసి బెనర్జీ గారు పెద్ద హరికథభాగవతార్ అని , ఆంగ్ల భాషలో అప్పటి ముఖ్యమంత్రి ఎన్టీఆర్ గారి ముందు హరికథ చెప్పారని ,ఆంగ్లంలో రామాయణాన్ని చెప్పారని , చిన్నప్పుడు అది చూడటం వల్లనే ఆంగ్ల భాషపై పట్టు సాధించాలనే దృఢ సంకల్పానికి తనలో బీజం పడిందని అంటారు . ఉత్తరాంధ్రలో ప్రసిద్ధిగాంచిన ‘ ‘తూర్పుభాగవతం’ వ్రాసింది వీరి తాతగారేనని , ఈ విధంగా కళలపట్ల వారి కుటుంబ నేపథ్యాన్ని వివరించారు . తనకు ఇష్టమైన డాన్సర్ పద్మాసుబ్రహ్మణ్యం అని చెప్తారు.  సుమతీకౌశల్ గారి వద్ద శిక్షణ పొందాననీ చెబుతారు.

చినజీయర్ గారిని , జగ్గీ వాసుదేవ్ గారిని ఇంటర్వ్యూ చేసే భాగ్యం తనకు కలిగిందని , గరికపాటి , పుల్లల శ్రీరామచంద్ర ,శివశంకర్ శర్మ గార్లతో సంభాషణ జరుపుతున్నప్పుడు ఎన్నో విలువైన విషయాలను వారి నుండి నేర్చుకున్నానని చెబుతారు . ప్రముఖ ఏబీఎన్ ఛానల్ లో ‘సంధి కాలం ‘అనే కార్యక్రమానికి , వనితా చానల్లో ‘బతుకు బండి ‘అనే కార్యక్రమానికి యాంకర్ గా వ్యవహరించాననీ చెబుతారు .

తనను గొప్ప నాట్యకారిణిగా చూడాలనుకున్న తన తండ్రి , తాను ఎదిగి కూచిపూడి నృత్య కళాకారిణి గా ఎదిగి మోగిస్తున్న విజయ ఢంకా వినలేకపోతున్నారన్న బాధ నుండి ఉపశమనం కోసమే తాను తన పేరు చివర సోమనాధన్ అని చేర్చుకున్నానని, తద్వారా సంతృప్తిని పొందుతున్నానని , వివాహానంతరం ఈ విషయంపై తన భర్త ఏ విధమైన అభ్యంతరం వ్యక్తపరచకపోవడం తనకెంతో ఆనందాన్ని కలిగించిందని , పైగా స్వాతి సోమనాథన్ గానే కొనసాగుమని అతను చెప్పడం అతనిలోని ఉన్నతమైన వ్యక్తిత్వానికి నిదర్శనం అని గర్వంగా చెబుతారు .

ఒకానొక సందర్భంలో శ్రీకాకుళం జిల్లా కలెక్టర్ అయిన శ్రీ లక్ష్మీనరసింహం గారు సంగీత కళాశాల ఏర్పాటు గురించిన ప్రతిపాదన చేయగా తాను తక్షణం అంగీకరించానని , అయితే చీఫ్ సెక్రటరీ అయిన జె.ఎస్.వి. ప్రసాద్ గారు సంగీత కళాశాల కాకుండా మద్రాసు కళాక్షేత్రం వలె తెలుగు కళాక్షేత్రం ఏర్పాటు చేసుకోవడం బాగుంటుందని మరో సూచన చేశారని చెప్తూ, వాళ్ళందరి సహాయ సహకారాలతో నెలకొన్నదే ‘ సంప్రదాయం’ అని అన్నారు. 12 ఎకరాల విస్తీర్ణంలో నిర్మించబడిందనీ, జేఎన్టీయూ కాకినాడ వారు నిర్మాణ బాధ్యతలు స్వీకరించారని చెప్పారు . ‘నృత్య భారతి’ అనే పాఠశాల స్థాపించి ఎంతో మందికి శిక్షణ ఇస్తున్నారు .
ఆనాడు వెనకట కొన్ని కారణాలవల్ల చేజారిన తమ పూర్వీకుల ఆస్థిని, తన కష్టార్జితం తో తిరిగి కొనుగోలు చేసి, అందులో అందమైన తోటను
సాగుచేసుకోవడం తన జీవితంలో అత్యంత మధురమైన అనుభూతి అని చెబుతారు.

నాగావళి ఒడ్డున సంగీతం , కూచిపూడి నృత్యం , సంస్కృతం ఆ పాఠశాల ద్వారా పిల్లలకు నేర్పుతూ ఉండాలని తన కోరిక అని చెబుతారు. వారి కోరిక ఫలించాలనీ, నాగావళి నదీ తరగలకు వారి పద మంజీరనాదాలు తోడై , భవిష్యత్తులో మరెందరికో స్ఫూర్తిమతం కావాలని ఆశిద్దాం.

         పద్మశ్రీ చెన్నోజ్వల

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

‘ ఎర్రరంగు బురుద’

సరిగంచు చీర