‘ ఎర్రరంగు బురుద’

ధారావాహిక నవల

ప్రముఖ కవయిత్రి, రచయిత్రి జ్వలిత రచించిన ‘ ఎర్రరంగు బురద‘ నవల ధారావాహికంగా వస్తుంది. చదువు లేకపోవడం వలన వెనుకబడి పోయిన మనుషులకు ఈ సమాజం లో ఎన్నెన్ని ఈతిబాధలు ఉన్నాయో అక్షరాక్షరాన చూపించారు జ్వలిత. ముందుకెళ్ళాలంటే చదువుల బాటలే పడాలి, పడ్తాయికూడా అనే ఆశావహ దృక్పథం కూడా వ్యక్తీకరించారు. ఆడవాళ్ళ కు ఆపదలు వస్తే ఎలా ఉపాయం గా ఎదుర్కోవాలో చెప్తుంది ఈ నవల . వారం వారం మిమ్మల్ని పల్లీయుల సంభాషణ లతో ఉత్కంఠ మైన కథతో అలరించడానికి వస్తున్నది సీరియల్ గా ఈ నవల ….. చదవండి ..

జ్వలిత

మొదటివారం

“ఓ టీచరమ్మా.. మీ తరగతిల పద్మను పిలసక రమ్మన్నది మా పెద్ద మేడం” అన్నది ఆయమ్మ రొప్పుకుంట.
“లెక్కల క్లాసు నడుస్తున్నది.. తర్వాత పంపుత పో..” ఆయమ్మ రొప్పుడు పట్టిచ్చుకోకుండా అన్నది పదో తరగతి లెక్కల టీచర్ ప్రగతి.
“కాదమ్మా.. వాల్ల అక్క బిడ్డకు ఫిట్స్ వచ్చినయి డాక్టరు తొందరగ పిలిపిచ్చమన్నడు… ” అన్నది ఆయా భయపడుకుంటనే.
“సరే.. వెళ్ళు పద్మా..” కసిరి పంపింది టీచర్.

“ఏమయింది ఆయమ్మా.. మా పుష్పకు ?” అన్నది పద్మ ఆత్రంగ బయటికొచ్చి .
“ఏమో అమ్మ నాకు తెలవదు, పెద్ద మేడం పిలసకరమ్మన్నది” అన్నది ఆయా.
హైస్కూల్ పక్కన ప్రైమరీ స్కూలుంటది, హాస్టల్ పిల్లలే ఎక్కువుంటరు అందుల.
పద్మకూడా ఆస్కూల్ల సదువుకొనే హైస్కూలుకు పోయింది.

ప్రైమరీ స్కూలు హెచ్చెమ్, పక్కనే ఉన్న హైస్కూల్లో పదోతరగతి చదువుతున్న పద్మను పిలుచుక రమ్మని ఆయాను పంపి, బయట వరండాల నిలబడి ఉన్నది, పద్మను సూసి ” రా.. రా.. తొందరగా.. డాక్టర్ ఎదురు చూస్తున్నరు.. పుష్ప వాళ్ళ అమ్మా నాన్నలను పిలిపించమంటున్నరు..” అన్నది.
“అసలేమయింది మేడం..?” అడిగింది పద్మ.
“రేపు హోలీ పండగ కదా వాళ్ళ క్లాస్ పిల్లలు సీసాలల్ల రంగు నీళ్ళు కలుపుకొని తెచ్చుకున్నట్టున్నరు, బ్యాగుల్ల ఉన్నయట టీచర్లు సూడలే, ఇంటర్వెల్లో ఒకళ్ళ మీద ఒకళ్ళు ఈ రంగు నీళ్ళు సల్లుకుంటుంటే పక్కనే ఉన్న పుష్ప, అది సూసి గట్టిగ అరుసుకుంట పడిపోయింది. డాక్టరు దగ్గరికి తీసుక పోయినం..” అన్నది హెచ్చెమ్.
“మనం పొయ్యి సూద్దాం మేడం ఇప్పుడెట్లున్నదో…” అన్నది పద్మ.
“డాక్టర్ వాళ్ళ అమ్మా నాన్నను పిలిపిచ్చమన్నడు కదా..”
“వాళ్ళ నాన్న లేడు, అమ్మ ఉన్నది,  పిలిపిద్దాం ముందు మనం సూద్దాం రండి మేడం” అన్నది పద్మ.
“ఔనమ్మా.. పుష్ప ఇప్పుడెట్లున్నదో సూసొద్దామమ్మా..” అన్నది ఆయమ్మ.
“సరే సూద్దాం పదండి..” అంటూ…
డాక్టర్ దగ్గరికి వెళ్ళారు అందరూ కలిసి.

*
పక్క బజార్ల ఉన్నది ప్రైవేట్ క్లినిక్, అందులనే మందుల షాపు కూడ ఉంటది. చిన్నపాటి నర్సింగ్ హోమ్, డాక్టర్ సుధాకర్ నడుపుతున్నాడు దాన్ని. ఆయన లయిన్స్ క్లబ్ మెంబర్ కావడం వల్ల, హాస్టల్ పిల్లలకు ఉచితంగా వైద్యం చేస్తాడు. పది అంగల్ల ఆగమాగంగ అక్కడికి పోయిన్రు వాళ్ళు ముగ్గురు.
పుష్ప దగ్గర వాళ్ళ క్లాసుటీచర్ కూర్చుని ఉన్నది.
పుష్ప కళ్ళుమూసుకుని పండుకొని ఉన్నది. పుష్ప ఎనిమిదేళ్ల పిల్ల. ఇంతకు ముందెపుడూ స్కూల్లో ఎవరికీ అట్లా జరగ లేదు. టీచర్లు గాబర గాబర పడ్తాన్రు భయంతో..
“పుష్పా..” అని పిలిసింది, చెయ్యి పట్టుకొని పద్మ.
కళ్ళు తెరిచి చూసి పద్మను పట్టుకొని ‘పద్మక్కా..’ అని ఏడవడం మొదలు పెట్టింది.
వేరే పేషుంటును చూస్తున్న డాక్టరు, పుష్ప ఏడుపు విని అక్కడి కొచ్చి “మళ్ళీ ఏమయింది ?” అన్నాడు.
“ఏం కాలేదు డాక్టర్… వాళ్ళ అక్కను చూసి ఏడుస్తున్నది” అని చెప్పింది టీచర్.
“తల్లి దండ్రిని పిలిపించమన్నా కదండీ..” అన్నాడాయన. “హాస్టలు పిల్లలు కదా డాక్టర్, తల్లిదండ్రులు ఊర్ల ఉంటరు.. రేపు పిలిపిద్దామండీ.. ఆ అమ్మాయి  అక్క వచ్చింది. పద్మ అనీ.. హైస్కూల్లో చదువుతుంది” వివరించింది హెచ్చెమ్.

“ఓ.. పద్మా.. నాకెందుకు తెలవదు వాళ్ళ హాస్టల్ లీడర్ కదా..
సరే ఇంకా ఇద్దరు పేషెంట్లున్నారు, వాళ్ళయి పోయినంక నేను మట్లాడుతా.. భయమేమి లేదు” అంటూ వెళ్ళాడు డాక్టర్.
“నేనుంట మీరెళ్ళండి టీచర్” అని హెచ్చెమ్ పుష్ప వాళ్ళ టీచర్ను పంపించి అక్కడే కుర్చీలో కూర్చుంది.

అర్థగంట తరువాత డాక్టరు వచ్చాడు.
“ఆం.. పద్మా… చెప్పు.. ఈ అమ్మాయి మీ చెల్లెలా…” అన్నాడు.
“కాదు డాక్టర్.. మా అక్క బిడ్డ”
“వాళ్ళ నాన్న ఏమి పని చేస్తాడు ?”
“మా బావ లేడు, చచ్చిపోయిండు” అన్నది పద్మ.
“అయ్యో ఎట్ల చచ్చిపోయాడు..?
ఇంతకుముందు ఇట్ల ఎప్పుడైన ఫిట్సు వచ్చాయా?” సానుభూతిగా అన్నాడు డాక్టర్.
“నాకు తెలవదు డాక్టర్… ప్లీస్ బెటర్ టు అవాయిడ్ ద టాపిక్, బిఫోర్ ద కిడ్ డాక్టర్…” అన్నది చేతులు జోడించి..
“ఓకే.. ఐ అగ్రీ. రేపు సెలవే కదా.. రేపు మాట్లాడుదాము. పుష్ప కూడా ఇప్పుడు ఓకే. ఓకే కదా.. పుష్పా.. ఇంటికి పోతావా హాస్టల్ కు పోతావా..” అన్నాడు.
“ఇంటికే పోతా.. మా తాతొస్తడు సాయంత్రం. రేపు హోలి పండగ కదా..” అన్నది హుషారుగా.
“వెరీ గుడ్.. అయితే మీ తాతను నా దగ్గరకు తీసుకొస్తవా..”
“సరే డాక్టర్ ఇప్పుడు నేను స్కూల్ కు పోనా మరి… రా పద్దక్కా..” పద్మ చెయ్యి పట్టుకొని లాగింది.
“సరే డాక్టర్.. వెళ్ళొస్తాం..” అని చేతులు జోడించింది హెచ్చెమ్.
పద్మ కూడా “రేపు కలుస్తాను డాక్టర్..” అని నమస్కారం పెట్టింది..
ముగ్గురూ బయటకొచ్చారు..

దారిలో “డాక్టర్ తో భలేగా ధైర్యంగా ఇంగ్లీష్ మాట్లాడావు పద్మా.. భయం లేకుండా..” అన్నది..
“భయమెందుకు మేడం.. డాక్టర్ గారే మాకు మోటివేషనల్ క్లాసులు చెప్తారు..
స్పోకెన్ ఇంగ్లీషు కోసం ట్యూటర్ ని పెట్టారు… మమ్మల్ని చాలా ప్రోత్సాహిస్తారు కూడా..”  చెప్తుండగా స్కూలొచ్చింది.
“వస్తా మేడం..” అంటూ తన స్కూల్ కు వెళ్ళింది పద్మ.
డాక్టర్ తో తనెందుకు మాట్లాడాలిసి వచ్చిందో గతం గుర్తు చేసుకుంది పద్మ..
*

తెలుగు రాష్ట్రాల్లో అతిసామాన్య మారుమూల గ్రామీణ ప్రాంతాల్లో ఒక ఊరది. నాగరికతకు లోటు లేకున్నా మూఢనమ్మకాలకు దురలవాట్లకు అలవాటైన జనవాసం. రాజ్యాంగ సౌలభ్యాలు, రాజకీయ హామీలు నోచుకోని జాతిలో మనుషులు కొందరు.. శ్లేష్మంలో వాలిన ఈగల్లా.. కుడితిలో పడ్డ ఎలకల్లా.. జీవనారాట పోరులో కొనసాగుతున్నారు ఆ ఊర్లో. అందులో ఒక ఈగ వంటి, ఒక ఎలుక వంటి ఎరికలి నాంచారి అనే అర్భకురాలు. ఎరికల ఈరన్న, తిరుపతమ్మలకు పెద్ద బిడ్డ నాంచారి, చిన్నది పద్మ. నాంచారి పెనిమిటి ఏదులు. కాలం నాంచారి మొగణ్ణి దారుణంగా మింగింది. భర్త  పోయినంక తన చిన్నబిడ్డ పుష్పని తన తల్లిదండ్రుల దగ్గర వదిలి పెట్టి కొడుకులను తీసుకొని ‘నసూర్లపాడు’, తన అత్తగారి ఊరికి పోయింది నాంచారి, నిజామాబాద్ జిల్లాలో ఒక పల్లెటూరది. మొదట్ల పుష్ప ఉషారుగనే ఉండేది. కానీ అప్పుడప్పుడు ఫిట్స్ వచ్చేది. మూర్ఛలు అనుకున్నరు. కానీ డాక్టర్లు మూర్చ కాదు అన్నారు.

ఒక శుక్రారం నాడు తిరపతమ్మ స్నానం చేసి అంతకు ముందు వారం ‘బాలగామ’కు పెట్టిన ఎర్రచీరకట్టుకుంది. బయట ఆడుకొని ఇంట్లకు అప్పుడే వచ్చిన పుష్ప, తన అమ్మమ్మను సూసి కెవ్వున అరిసి పడిపోయింది. మొకాన నీళ్ళు చల్లంగనే  కండ్లు తెరిచి చూసి అరిసి మళ్ళీ పడిపోయింది. ఇట్ల ఒక్క రోజులనే ఆరుసార్లు అయింది. పిల్లకేదో గాలి తగిలిందని అనుకున్నది తిరపతమ్మ. ఒక సారి అరిసినప్పుడు వాంతి కూడా అయింది. చీరంత పాడయిందని, పిల్ల మూతి తుడిచి పండ పెట్టి, చీర ఇప్పి మరొక చీరకట్టుకొని వచ్చిందామె.

ఈసారి కళ్ళు తెరిసి సూసింది పుష్ప. మల్లీ ఫిట్స్ వస్తయేమో అని భయపడ్డది తిరుపతమ్మ. కానీ మల్ల రాలేదు. ప్రశాంతంగా నవ్వుకుంట కూసున్నది.

ఆరోజు ఈరన్న ఊళ్ళె లేడు. పిల్లలను హాస్టల్ కు పంపడానికి పట్నం పోయిండు.
సాయింత్రం ఈరన్న వచ్చినంక డాక్టర్ దగ్గరికి తీసకపోయి అంతా చెప్పిన్రు.
“అన్నిసార్లు ఎందుకు వచ్చాయి. ఏమన్న భయపడ్డదా.. తిండి తేడా వచ్చిందా..” అని అడిగిండు డాక్టర్ రమేష్.
“ఏంలేదు పప్పన్నం తనకిష్టం అదే తిన్నది. సంతోషంగా పలక మీద రాసుకునేది ఉన్నట్టుండి అట్లయింది” అన్నది తిరపతమ్మ.
వాల్ల పక్కింటామెకు జరమొచ్చిందని వచ్చింది అక్కడికి.. డాక్టర్ మాటలిని.. “బాలగావకు పెట్టిన చీర కట్టినవు ఒదినే పొద్దుగాల.. దేవత మాయనే అది.. మొక్కుకో ఒదినె, పిల్ల బాగయితది” అన్నది.

డాక్టర్ కసిరిండు “మీ మూఢ నమ్మకాలు అయ్యన్ని.. అదికాదు గని, అన్ని సార్లు ఫిట్స్ రాకూడదు. పరీక్షలు చేయించాలె.. పరీక్షలు రాస్తూన్న” అన్నడు.

సరే అని ఈరన్న అన్ని పరీక్షలు చేయించిండు. తెల్లారి రిపోర్టులు తీసుకొని మళ్ళా డాక్టర్ దగ్గరికి పోయిండు.
ఈరన్న తెచ్చిన రిపోర్ట్ లు డాక్టర్ చూసాడు.
“అన్నీ బాగున్నాయి. మరి అట్ల ఎందుకు జరిగిందో” అనుకుంటూ.. తన ఎదురుగా ఉన్న తన స్నేహితుడు డాక్టర్ ప్రసాద్ కు రిపోర్టులందించాడు. ఆయన హేతువాద నాయకుడు, మానవ హక్కుల కార్యకర్త. అన్నీ చూసి “రిపోర్టులన్నీ బాగున్నాయే…” అన్నాడు.

అక్కడే ఉన్న కంపౌండర్  “సార్ వాళ్ళ నాయినే పట్టుంటడు.. అర్థాంతరంగ సంపింన్రు కదా..” అన్నాడు.

———సశేషం——

Written by Jwalitha

కవి, రచయిత, అనువాదకురాలు, ఫ్యామిలీ కౌన్సిలర్, సామాజిక కార్యకర్త, ప్రచురణకర్త, ప్రకృతి ప్రేమికురాలు, తెలంగాణ ఉద్యమ కారిణి అయిన జ్వలిత అసలు పేరు విజయకుమారి దెంచనాల.
‘బహళ’ అంతర్జాతీయ అంతర్జాల త్రైమాసిక మహిళా పత్రికను 2021నుండి నడుపుతున్నారు.
వీరి రచనలు-
కాలాన్ని జయిస్తూ నేను, సుదీర్ఘ హత్య, అగ్ని లిపి, సంగడి ముంత అనే నాలుగు కవితా సంపుటులు; ఆత్మాన్వేషణ, రూపాంతరం అనే రెండు కథల సంపుటులు; జ్వలితార్ణవాలు అనే సాహిత్య సామాజిక వ్యాసాల పుస్తకం; ఎర్రరంగు బురద, ఆత్మార్ణవం, జగన్నాటకం, ఒడిపిళ్ళు అనే నాలుగు నవలలు మొత్తం 11 పుస్తకాలు రచించారు. ముజహర్ నగర్ లో దీపావళి, ‘పరజ’ వంటి అనువాదాలతోపాటు, బహుజన కథయిత్రుల పరిచయం, మెరిసే అనువాదాలు, అనువాద నవలలు పేరుతో శీర్షికలను నిర్వహించారు.
స్వీయ సంపాదకత్వంలో ఖమ్మం కథలు, మల్లెసాల చేతివృత్తికథలు, కొత్తచూపు స్త్రీల కథలు, పరివ్యాప్త, సంఘటిత, రుంజ, కరోనా డైరీ, లేఖావలోకనం, గల్పికా తరువు, ఓరు వంటి పదో సంకలనాలను ప్రచురించారు. గాయాలే గేయాలై, పూలసింగిడి వంటి అనేక పుస్తకాలకు సహసంపాదకత్వం వహించారు.
మర్డర్ ప్రొలాంగేర్, వుండెడ్ లైవ్స్ పేరుతో వీరి కవిత్వం ఆంగ్లానువాద పుస్తకాలు వెలువడ్డాయి

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

నవ్వు

స్వాతీసోమనాథ్