ఇటీవలి కాలంలో తెలుగు సాహిత్యం ముఖ పుస్తకం ద్వారా అందరినీ అలరిస్తూ సాహిత్యాభిమానుల యందు నిక్షిప్తమైన సృజనను వెలికితీసి, వారిలో ఆత్మ విశ్వాసాన్ని పెంపొందిస్తూ సరికొత్త పుంతల్లో చైతన్య వేదికగా మన్ననలను పొందడం అందరం చూస్తూనే ఉన్నాం. అలాంటి వేదికలో ఎక్కువగా కనిపిస్తున్న కొన్ని పేర్లలో విజయలక్ష్మి గోలి గారు కూడా ఒకరు. వారు రచించిన గజల్స్ పిల్లనగ్రోవి, చిత్ర వీణ అనే రెండు సంపుటాలుగా, నాకల- నా స్వర్గం అనే పేరుతో కవిత్వ సంపుటి వెలువడ్డాయి. ఇవే కాకుండా కొన్ని పుస్తకాలకు ముందుమాటలు, మరికొన్ని పుస్తకాలకు సమీక్ష వ్యాసాలు రాసారు.
వారు రాసిన పిల్లనగ్రోవి చదివాక దానిపై సమీక్ష రాయాలనిపించింది. రాధకు మాధవుని పట్ల ఉన్న ప్రేమను విరహ, విలాపాల, సరాగాలుగా వీరు కూర్చిన తీరు అత్యంత రమణీయంగా ఉంది.
చిన్నప్పుడు మాఇంట్లో ప్రతీ రోజూ ” ఆత్మలను పలికించేదే అసలైన భాష, ఆ విలువ కరువై పోతే అది కంఠశోష” అంటూనే సమాజంలోని పోకడలను, జీవిత మార్మికతను తెలుపుతూ “అది దిగులు కాదు సినారె తుది జీవితాశ ” అని గళమెత్తి తన భావాలను, ఆవేదనను గజల్ రూపంలో రాసి పాడిన సి. నారాయణ రెడ్డి గారి గొంతు వినిపిస్తూ ఉండేది. అది గజల్ సాహిత్యం గురించి కనీసం ఆలోచించే వయసు కూడా కాదు. అలాగని ఇప్పుడు ఏదో మొత్తం తెలిసిందీ కాదు. నిజానికి చెప్పాలంటే ఆ సాహిత్యంలోని అందాన్ని అంతగా పట్టించుకున్నది ఎప్పుడూ లేదు. చదివేదాన్ని, వినేదాన్ని అంతే.
ఇక పిల్లనగ్రోవి గురించి….
పిల్లనగ్రోవి అనే మాట వింటేనే రాధాకృష్ణులు,గోపికలు, బృందావనం ఇవన్నీ మనసును ఒక మాధుర్య వాహినిలోకి చేర్చుతాయి. అలాగే విజయగారు రచించిన పిల్లనగ్రోవిలో రాధకు కృష్ణుని పట్ల ఉన్న పవిత్రమైన ప్రేమ, తపనలు మనలను ఏవో తీరాలకు తీసుకొనిపోతాయి. వాటినుండి బయటపడడానికి మనకు కొంత సమయం పడుతుంది. అలలు అలలుగా ఆ భావనా సౌందర్యంలోకి రచయిత్రి సాగిపోతూ ఉంటుంది. ఆ భావనా తరంగాలలో మనలను హాయిగా తేలిపోయేలా చేస్తుంది.
” రాధ తలపుల వెతలు తీయన వేడుకేలే మాధవునకు, అలిగి వగచే అతివ మనసే వలపు దారుల వలచి వచ్చె”
ఆమె బాధలన్నీ మాధవునికి ఒక వేడుకనే కావచ్చు. కానీ అతనిపై ఎంత అలిగినా తిరిగి మనసును ప్రేమ దారులందు పెన వేస్తుంది. ఇక్కడ రాధతో పాటు సున్నితమైన స్త్రీ తన నాథుని పట్ల వ్యక్తం చేసే ప్రేమ హృదయం గోచరిస్తుంది.
” హిమ సుమముల బాటలలో తొలికిరణపు స్పర్శలలో, నులివెచ్చని నీ శ్వాసల నిలిచిపోదు రమ్యముగా”
చల్లదనాన్ని పూవులుగా చెప్తూ, తొలికిరణం తాకిన
సమయంలో కృష్ణుని వెచ్చని శ్వాసలో నిలిచిపోతాననే రాధ అంతరంగంలో కృష్ణునిపై కురిసే అవ్యాజమైన అనురాగం ఎద ఎదల్లో ఊయలలూగుతుంది.
” వెన్నెలంతా ఏటి పాలు వలపంతా నీటిపాలు”
కృష్ణుని ఎడబాటు వలన వెన్నెల, వలపు రెండూ వ్యర్థమయ్యాయని చెప్పడంలో నండూరి వారి ఎంకి గుర్తొస్తుంది. దొంగాటలు, దోబూచులకు కృష్ణుడు దొర. అవి ఆయనకు సరదాలు, సరసాలు అయినాయి. అయితే ఆయన వియోగం మాత్రం రాధకు తట్టుకోలేని దుఃఖ భారం.
“ఏరులైన కన్నీటిలో కలువనైతి నినుకోరి
కంటి కొసన కరుణతోడ నను కానవు న్యాయమా!”
గోవిందుని వియోగంలో కలిగిన దుఃఖం ఏరులయ్యింది.
ఆ నీటిలో కలువగ మారి తనకోసం నిరీక్షిస్తున్న రాధ, కంటి కొనలతో నన్ను చూడకపోవడం న్యాయమా? అని బేలగా ప్రశ్నించిన తీరు మనలను కంట తడి పెట్టించక మానదు.
“శిగపాయల సిరిమల్లెల కోరికలో చిగురింతలు
చిరుచెమటల చెమరింతల తడిచివుంది. ఒక వేడుక”
అనే దాంట్లో ..కొప్పున సింగారించిన మల్లెల కోరికలు చిగురించాయి అనడంలో.. తనలో కోరిక సహజంగానే ఉంది. అది మళ్లీ మళ్లీ మొలకలెత్తుతోంది. అని అనడంలో రాధకు గోపాలునిపై అంతకంతకూ ద్విగుణీకృతమవుతున్న వలపు మనకు దృగ్గోచరమవుతుంది. ఆ తమకంలో పుట్టిన చిరు చెమటలో ఒక వేడుక తడిసింది అని చెప్పడం విజయ గారి ఊహాసౌందర్యానికి తార్కాణం.
“రేయంత నీ ధ్యాస నిదురలే కాజేసె
నిలువెల్ల నిప్పుగా కాల్చింది నను తాకి”
ఇక్కడ….రాధ, మాధవుని మనసులో స్మరిస్తూ నిద్రకు దూరమైంది. ఆ వియోగం ఆమెను నిలువెల్లా నిప్పులా కాల్చివేస్తోంది. నిజమే కదా! విరహవేదనలో సహజంగా ప్రేయసీ ప్రియులు అనుభవించే నిదుర లేని రాత్రుల వెతను తనదైన శైలిలో సహజమైన రీతిలో వర్ణించారు కవయిత్రి.
” ఆనందం అర్ణవమై అంబరాన్ని అందుతుంటె
ఆనందుని రాచకేళి తుళ్ళినదే రంగులలో”
ఇక్కడ ….మహాకవి శ్రీశ్రీ గారి
“ఆనందం అర్ణవమైతే అనురాగం అంబరమైతే, అనురాగపు అంచులు చూద్దాం. ఆనందపు లోతులు తీద్దాం”
అనే సినీ గేయ వాక్యాలు గుర్తు రాక మానవు. కృష్ణుడు తనను చేరిన ఆనందం ఆకాశాన్ని తాకుతుంటే తనతో జరిపే రాసక్రీడ ఎన్నో వర్ణాలను సంతరించుకుంది. ఎడబాటు తర్వాత పొందే కలయిక వల్ల కలిగే ఆనందం జగమంతా హరివిల్లులా చుట్టేస్తుంది. ఇలా చదివే పాఠకులను ఆ రసరమ్య బృందావనంలో కట్టి పడేస్తారు విజయగారు.
” పన్నీరుల పరిమళాల పులకరింత పలుకరిస్తే
తడి తనువుల తమకాలతో తరియించగ పిలిచినాడు””
పన్నీటి సువాసనలు పులకరింతలతో పలుకరిస్తుండగా
కృష్ణుడు తనను తడి తమకంతో తరింపచేయడానికి
పిలిచాడని రాధ ఆనంద పరవశత అవుతుంది. సరస శృంగార సామ్రాజ్యంలో వివశురాలు అవుతున్న రాధ
మదిని అంతేస్థాయిలో ఆవిష్కరించారు కవయిత్రి.
“చిగురించే అల్లికలో జారిపోవు తీగలేల
వమ్ము కాని నమ్మకాల హస్తరేఖ వ్రాస్తున్నా”!
మువ్వ గోపాలుని మురిపాల కోసం తపిస్తూ తనకోసం ఎలాంటి జారిపోని నమ్మకంతో హస్తరేఖ రాస్తున్నా అని , ఆలేఖల్లో మాధవుని కట్టి పడేయాలనుకుంటున్న రాధలో ఉన్న ఆ ముగ్ధత్వాన్ని వర్ణించడం కవయిత్రి రచనా కౌశలాన్ని తెలియచేస్తుంది.
ఇలా చెప్పుకుంటే వెళ్తుంటే ప్రతి పాదం ఆమెలోని అంతర్గత భావనా నైపుణ్యానికి మచ్చుతునకలా
మనసును మాటలు లేని ఒక మౌన జగత్తు లోకి కొనిపోతుంది. ఉలుకు పలుకు లేని ఏకాంతంలో ఉండి ఆ హాయిని అనుభవించాలనిపిస్తుంది.ఇంతేకాక రాధలో అష్టవిధ శృంగార నాయికలను ఆపాదించి రాయడం ఆమెలోని కవితాత్మకతకు ప్రతీకగా చెప్పవచ్చు.
“వెన్నెలలే వేసవులై మరిగాయిలె గోపాలా” చల్లదనాన్ని
ఇచ్చి హాయి గొలిపే వెన్నెల కూడా వేసవిలా మరిగిపోతోంది.అని చెప్పడం విరహం యొక్క పరాకాష్టను సూచిస్తుంది.
ఇంత వేదన అనుభవించిన రాధతో,
“రమణి మనసు తెలియలేని రాలుగాయి కాదుకదా”! అంటూ మాధవుని పట్ల అచంచలమైన విశ్వాసాన్ని ప్రకటింప చేయడం విజయగారి రచన లోని వైవిధ్యం.
ఇలా చెప్పుకుంటూ పోతే ప్రతీ పాదం ఎనలేని సౌందర్యంతో భాసిస్తుంటుంది. ఇందులో ఎక్కడ చూసినా ప్రకృతి ఆనందంతో అక్షరాల్లో పరవశించి పోతుంది. ఋతువులన్నీ ఆనందంగా నర్తిస్తాయి. పాఠకుని మనసును తన రచనలో మమేకం చేయడం కవయిత్రికి బాగా తెలుసు.
రాధాకృష్ణుల గురించి చెప్పబడినా మనసిచ్చిన ప్రేయసి హృదయ స్పందనలను తన ఊహాజనితమైన భావాలతో అతిసహజంగా, అవలీలగా వర్ణించిన కవయిత్రి విజయ గోలి గారు.