“నాతిచరామి”

కథ

తాటి కోల పద్మావతి

నారాయణ పోస్ట్ మాన్ గా ఉద్యోగం చేసి ఆరోజు రిటైర్డ్ అవ్వబోతున్న సందర్భంగా ఆఫీసులో ఫంక్షన్ ఏర్పాటు చేశారు. స్టాఫ్ అంతా కలిసి ఆఫీసులోనే రంగురంగుల కాగితాలు బెలూన్లు కట్టి అందంగా అలంకరించారు. ఇంతకాలం పోస్ట్ ఆఫీస్ కు సేవలందించి మంచి పేరు తెచ్చుకున్నందుకు నిలువెత్తు ఫ్లెక్సీ కట్టించి అభినందన సభ ఏర్పాటు చేశారు.
కొడుకులు కోడళ్లని , కూతురు అల్లుడుని రమ్మని ఫోన్ చేసి చెప్పారు నారాయణ. ఎవరికి వాళ్లు ఏవో పనులు ఉన్నాయంటూ వీలుపడదని సానుభూతి తెలిపారు. భార్య రాజ్యంని వెంటబెట్టుకొని బయలుదేరాడు నారాయణ. “పిల్లలు కూడా వస్తే బాగుండేది ” అని అంటూ రాజ్యం వాళ్ళు రానందుకు బాధపడింది. “మనం రమ్మని పిలిచాము, వాళ్లకేమో పనులు ఉంటాయి. రాలేదని బాధపడటం దేనికి” అన్నాడు భార్యని ఓదార్చుతూ.
“చూసేవాళ్లంతా ఏమనుకుంటారు. కుటుంబంలో ఎవరూ రాలేదనుకుంటారు. పిల్లలు మనల్ని అశ్రద్ధ చేస్తున్నారని ఊహిస్తారు. అది నాకు చాలా బాధగా ఉంటుంది “అన్నది రాజ్యం.
“తల్లిగా నువ్వు ఆలోచించినట్లు వాళ్లు కూడా ఆలోచించాలిగా వీలు చూసుకుని వస్తారులే “అంటూ భార్యకి సర్ది చెప్పాడు నారాయణ.
అప్పటికే హాల్ అంతా మిత్రులతో, ఆఫీసు స్టాఫ్ వారితో నిండిపోయింది. నారాయణ రాగానే అందరూ కరచాలనం చేశారు. భార్యాభర్తలిద్దరిని కుర్చీలలో కూర్చోబెట్టారు.

“నారాయణ గారు ఇన్నాళ్లు కష్టపడి , ఇష్టం తో పని చేశారు .ఉద్యోగ బాధ్యతలు చేపట్టినప్పటి నుంచి అందరికీ తలలో నాలుకలా ఉంటూ ప్రజలకు సేవలు అందించారు. భుజాన సంచి తగిలించుకొని సైకిల్ తొక్కుకుంటూ ఇంటింటికి వెళ్లి ఉత్తరాలు అందించాడు. అందరినీ చిరునవ్వుతో పలకరిస్తూ గౌరవాన్ని సంపాదించుకున్న నారాయణ గారు ఈనాడు పదవి విరమణ చేస్తుంటే మాకందరికీ బాధగానే ఉంది. కానీ ప్రతి ప్రభుత్వ ఉద్యోగికి ఇలాంటి రోజు తప్పకుండా వస్తుంది . అయినా రిటైర్మెంట్ ను సంతోషం గా స్వీకరించాలి “అని సభాధ్యక్షుడు అనగానే హాలంతా చప్పట్లతో మారుమోగింది.
ఇద్దరికీ శాలువా కప్పి పూలదండ వేశారు సన్మాన పత్రం చదివి వినిపించాక ఆఫీసు స్టాఫ్ అంతా కలిసి చేయించిన గోల్డ్ రింగ్ నారాయణ చేత వేలికి తొడిగారు. శేష జీవితం సుఖంగా సంతోషంగా గడపాలని మరి కొంతమంది మిత్రులు సన్మానించగానే నారాయణకి కళ్ళ వెంట నీళ్లు వచ్చాయి.
చివరిసారిగా అందరికీ వీడ్కోలు చెప్పి ఇంటికి వచ్చారు. ఆ రాత్రి ఎంత సేపటికి నిద్ర పట్టలేదు నారాయణ కి.
ఏమిటండీ ఆలోచిస్తున్నారు అంటూ భర్త పక్కనే వచ్చి కూర్చుంది రాజ్యం.
భార్య ముఖం మీద పడిన ముంగురులు సవరిస్తూంటే భర్త చేష్టలకు సిగ్గు పడింది.
రెండు చేతులు తొలగించి ముఖం పైకెత్తి భార్య కళ్ళల్లోకి సూటిగా చూస్తూ ,”నీరసంతో నీ ముఖం ఎలా వాడిపోయిందో చూడు. కళ్ళ కింద నలుపు చారలు, తెల్లబడిన వెంట్రుకలు . వృద్ధాప్యం వచ్చినా నా కంటికి అందంగానే కనిపిస్తున్నావు. ఇన్నాళ్లు బాధ్యతలు మోసి అలసిపోయావు. రేపటి నుంచి నీకు ఆ కష్టం కలిగించను. మనిద్దరికీ విశ్రాంతిగా శేష జీవితం గడపటానికి పెన్షన్ వస్తుంది . అది చాలు మనకి “అన్నాడు ఆనందంగా నారాయణ.

రాజ్యంకి సంతోషం దుఃఖం రెండు ఏకమై కళ్ళు చమరచాయి. ” ఇవాళ మీరు మరీ చిన్న పిల్లవాడిలా మాట్లాడుతున్నారు. మనం ఒంటరిగా ఎలా ఉండగలం. మనం మన పిల్లల దగ్గరకే కదా వెళ్లి జీవితం గడపాల్సి ఉంటుంది” అన్నది.
“మీ ఆడవాళ్లకు ఇదే స్వార్థం. పెళ్లయిన కొత్తలో అత్తమామలకు భయపడతారు. ఇప్పుడు పిల్లలు అంటూ భర్తకి అన్యాయం చేస్తారు. ఇంతకాలం మన పిల్లలకి చాకిరీ చేసింది చాలక వాళ్ళ పిల్లలకి చేసావు చాలదా! కూతురికి కోడలికి పురుళ్ళు పోసావు . బారసాలలు చేసాము. పెళ్లయినప్పటి నుంచి చీకటితో లేవటం వంటచేసి క్యారేజీలు సర్దడంతోనే నీ జీవితం సరిపోయింది నువ్వేం సుఖపడ్డావు. రేపటి నుంచి విశ్రాంతి తీసుకో రోజు లాగా పెందలాడే లేవకు ” అంటూ భార్యని దగ్గరకు తీసుకున్నాడు నారాయణ.

మర్నాడు ఉదయం బయటికి వెళ్లి నారాయణ టికెట్లు బుక్ చేయించుకుని వచ్చాడు. మనం కొన్నాళ్ళు తీర్థయాత్ర చేసి వద్దాం బట్టలవిసర్దు రేపే మన ప్రయాణం అని చెప్పాడు.
“నేనేమైనా మిమ్మల్ని అడిగానండి “బుంగమూతి తో రాజ్యం.
“నువ్వు అడక్కపోయినా నిన్ను సంతోష పెట్టడం భర్తగా నా బాధ్యత ఇంతకాలం మనం ఎక్కడికి వెళ్ళలేదు ఇప్పుడైనా కాస్త ప్రశాంతంగా గడుపుదాం “అన్నాడు.
అమ్మా ఫంక్షన్ ఎలా జరిగిందంటూ కొడుకులిద్దరూ కూతురు ఫోన్ చేసి పలకరించారు. వాళ్ళు చూపించే ఆప్యాయతకు పొంగిపోయింది రాజ్యం.
మా నాన్నకి పెన్షన్ డబ్బు రాగానే ఖర్చు పెట్టవద్దని చెప్పు ఇక్కడే మంచి అపార్ట్మెంట్ తీసుకొని అందరం కలిసే ఉందామని పెద్ద కొడుకు.
తక్కువ స్థలంలో మంచి ఇల్లు దొరికింది పోనీ పడేసుకుంటే మంచిది. ముందు ముందు ధరలు బాగా పెరిగిపోతాయి ఈ విషయం నాన్నకు చెప్పమంటూ చిన్న కొడుకు ఫోన్ చేశాడు.
కూతురు నుంచి రాలేదనుకొన్నది రాజ్యం.
భర్త ఇంటికి రాగానే పిల్లలు ఫోన్లు చేసినట్టు చెప్పింది.
“దారిలో మా స్నేహితుడు కనిపించి ఈ మధ్యనే కొత్తగా కట్టిన ఇల్లు కొనుక్కోమన్నాడు వాళ్ళు ఇల్లు అమ్ముకొని అమెరికా వెళ్ళిపోతారుట. ఇంతకాలం అద్దె ఇంట్లో గడిపాం. రేపు ఒకసారి ఇల్లు చూసి వద్దాం నీకు నచ్చితే ఇల్లు నీ పేరా రిజిస్ట్రేషన్ చేయిస్తాను “అన్నాడు నారాయణ.
“నా పేరు మీద వద్దండి! కావాలంటే పిల్లల పేరు మీద కొనండి. ఎలాగూ వాళ్లకి మనం ఆస్తి ఇవ్వాలి కదా అదేదో ఇప్పుడే వాళ్ల పేరు మీద కొంటే వాళ్ళు సంతోషిస్తారు “అన్నది ముందు చూపుతో.
“నాకు ఆ మాత్రం ఆలోచన లేదు అనుకున్నావా! ఇప్పుడే వాళ్ల పేరు మీద కొంటే మనం వాళ్ళు చెప్పినట్లు వినాలి. వాళ్ల పిల్లల్ని చూడటానికి నువ్వు పనిమనిషిగా, జీతం బట్టి నేను ఇంటికి కాపలాగా ఉండాలి. అలా పడి ఉండటం నాకు ఇష్టం లేదు మన సొంత ఇంట్లో గడపాలనుకుంటున్నాను “అంటూ తన నిర్ణయాన్ని గట్టిగా చెప్పాడు నారాయణ.
భర్త మాటకి ఎదురు చెప్పలేదు రాజ్యం.
భార్యాభర్తలిద్దరూ తీర్థయాత్రలకు బయలుదేరారు.
15 రోజులు సరదాగా తిరిగి వచ్చారు. కొడుకులు కూతురిని రమ్మని ఫోన్ ఫోన్ చేయగానే అంతా వచ్చారు.
ఇల్లు కన్నా విషయం చెప్పగానే వాళ్ళ ముఖాలు నెత్తురు చుక్క కనిపించలేదు.
మా గురించి ఏమైనా ఆలోచించారా. మాకు ఏదైనా ఇస్తారని ఆశపడ్డాం. ఇప్పుడు అమ్మ పేరు మీద ఇల్లు కొనడం అవసరమా అంటూ నిరసన కంఠాలు వినిపించాయి.
రేపు కొడుకులే తలకొరివి పెట్టాలన్న విషయం మర్చిపోయారా!
తక్కువ కట్నం ఇచ్చి తూతూ మంత్రంగా కూతురి పెళ్లి జరిపించారు మరి నా సంగతేమిటి అంటూ అన్నది కూతురు !
భార్యాభర్తలిద్దరూ ఒకరినొకరు చూసుకున్నారు. కాని నారాయణ వెంటనే, “మా తదనంతరం ఉన్న ఆస్తిని మీరే పంచుకోండి నా భార్యకి న్యాయం చేయాలనుకున్నాను. పెళ్లయినప్పటి నుంచి మీ అమ్మ ఏనాడు ఇది కావాలని నోరు తెరిచి అడగలేదు. పండక్కి చీర కొంటానంటే పిల్లలకు కొనమనేది. మీకు ఇష్టమైన కూర వండితే తాను పచ్చడి మెతుకులు తిని వండిన కూర అంతా మీకే వేసి పెట్టేది. మీకు ఏమాత్రం దెబ్బ తగిలినా విలవిలాడిపోయి దేవునికి దండాలు పెట్టుకుంటూ మొక్కులు మొక్కుకునేది.
ఇప్పుడు చెప్పండి? నా చేత మూడు ముళ్ళు వేయించుకొని ఏడడుగులు నడిచి నాతో ఉంటూ మీకు జన్మనిచ్చినందుకు మీ అమ్మని సుఖపెట్టడం నా బాధ్యత కాదా ?”అన్నాడు.
“కన్న తల్లిదండ్రులందరికీ పిల్లల బాధ్యత కూడా ఉంటుంది. అందరిలాగా మీరు కన్నారు. ఎప్పుడో ఏదో చేస్తాం ఇస్తాం అంటే మీ ప్రత్యేకత ఏముంటుంది. మాకు తల్లిదండ్రుల నుంచి ఆస్తి రావాలని ఆశ ఉండదా “అన్నాడు పెద్ద కొడుకు.
“మీ పిల్లల కోసం మీ భార్యల కోసం కష్టపడి సంపాదించుకుంటున్నారు మీరు. అవసరం వచ్చినప్పుడల్లా మీ అమ్మని పిలిపించుకుని చాకిరీ చేయించుకుంటున్నారు. ఈ చివరి దశలో ఇంకా కష్టపడమంటారా. పెళ్లినాడు చేసిన ప్రమాణం ఎలా మర్చిపోతాను.
ధర్మేచ, అర్దేచ , మోక్షేచ నాతిచరామి అంటూ మీ అమ్మ చేతిని పట్టుకున్నాను. గృహస్థాశ్రమ ధర్మాలను ఆచరించాలని ఒకరికొకరం ప్రమాణం చేసుకున్నాం. కట్టుకున్న భార్యని జీవితాంతం కనిపెట్టుకొని ఉండటం నా కర్తవ్యం. మిమ్మల్ని బాధ పెట్టాలని కాదు. నా ఆస్తి మీకు పంచకూడదని అంతకన్నా కాదు. మా తదనంతరం మీరే తీసుకోండి “అంటూ పిల్లలకు నచ్చ చెప్పాడు.
ఆర్థిక సంబంధాలే కానీ హార్దిక సంబంధాలు లేని కొడుకులు అన్నట్లు ఇంకా ఇక్కడ మనం ఉండటం వేస్ట్ అంటూ వచ్చిన పిల్లలు తిరిగి వెళ్ళిపోయారు అసూయాద్వేషాలు నింపుకొని.
“చూసావా రాజ్యం! బిడ్డలు బిడ్డలని కలవరించావు. వీళ్ళకే మాత్రమైనా మనమీద జాలి గౌరవం ఉన్నాయా? వృద్ధాప్యంలో నువ్వు కష్టపడకూడదు. పిల్లల దగ్గర ఉండి చీదరించుకునే పరిస్థితి తెచ్చుకోకూడదు .అందుకే ఈ నిర్ణయం తీసుకున్నాను “అన్నాడు.
“భార్య కోసం భర్త, భర్త కోసం భార్య బ్రతకాలి అంటారు. నిజంగా మీరు దేవుడండి. మీలాగా అందరి భర్తలు ఆలోచిస్తే మాలాంటి వాళ్ళు హీనంగా, కొడుకుల పంచన చేరి పనికిరాని వస్తువులుగా పడి ఉండరు”అంటూ కన్నీళ్లు పెట్టుకొని రాజ్యం.
నాతిచరామి అర్థం తెలిసిన నారాయణ కాలంతో పాటు మార్పు కోరుకున్నాడు. అనుబంధాలు బంధాలు దూరం చేసుకుని డబ్బు కోసం మానవత్వాన్ని మరిచిపోయి తల్లిదండ్రులని వృద్ధాశ్రమాల్లో దిక్కు లేకుండా వదిలేస్తున్నారు . ఆ వృద్ధాశ్రమాలలో కొడుకుల కోసం తల్లిదండ్రులు ఎంతగా ఎదురు చూస్తారో! తలుచుకుంటేనే ఆ బాధ తట్టుకోవడం కష్టం. తాను బ్రతికుండగా తన భార్యకి అలాంటి కష్టం అలాంటి దుస్థితి రాకూడదని ఈ నిర్ణయం తీసుకున్నాడు. కాలం ఎక్కడా ఆగకుండా రోజులను వెళ్ళదీస్తున్నది.

భర్త నీడలో సేదతీరుతూ చివరికి ప్రశాంతంగా కన్ను మూసింది రాజ్యం.
భార్యని పసుపు కుంకాలతో సాగనంపి నాతిచరామి పదానికి అర్థం పరమార్థం తెలిపాడు నారాయణ.

రచన – తాటి కోల పద్మావతి గుంటూరు

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

విచలిత రాగం

తల్లిదే బాధ్యత…