సమాజం ఎప్పుడు సరికొత్తగా కనిపిస్తూనే ఉంటుంది. దీనికి కారణం మనిషి చేసే ప్రణాళికలు. ఆలోచనల అవలోకనల ఫలితం. ముందుకు దూసుకెల్లడం బాగానే ఉంటుంది ఎత్తుకు ఎదగడం మరీ బాగుంటుంది…. కానీ, కింద పడకుండా చూసుకోవడం ఒక బాధ్యత ఒక తెలివిడి.
చదువుకున్నాం ఉద్యోగం చేస్తున్నాం. వ్యాపారం చేస్తున్నాం డబ్బులు సంపాదిస్తున్నాం ఇది చాలదు బ్రతకడానికి ?అని నూటికి 90 శాతం ప్రజలు ఆలోచిస్తారు. వాళ్లకేం చాలా బాగున్నారు అని నైబర్హుడ్, చుట్టుపక్కల వాళ్ళు అనుకునేంతగా బాగానే కనిపిస్తుంటారు. ఇక బంధు గణమైతే సరే సరీ. గుణాలెంచకుండా ఎవరుంటారు? గుడ్డుకు వెంట్రుకలాగే సమాజం ఇది! అటువంటిది మనమెంత అని ప్రతి ఒక్కరూ ప్రతి నిమిషమూ వేసుకోవాల్సిన ప్రశ్న!
ఈ భావాలను ఇంటి నుండే మొదలు పెడితే ఎలా ఉంటుందో ఒకసారి ఆలోచిద్దామా? ఇప్పుడు ఎవరికి ఎవరు నీతి సూత్రాలు వల్లే వేసి చెప్పాల్సిన పని లేదు ,వల్లే వేయమని చెప్పాల్సిన పనీ లేదు! ఎందుకంటే అందరూ చాలా తెలివిగలవాళ్ళే! అందరూ చాలా హుషారైన వాళ్లే, హోషియార్ గా ఉండేవాళ్లే! ఎటు వచ్చి అన్నింట్లో మిడిమిడి జ్ఞానం ఉండి , అన్నీ తెలుసు అని అనుకునే వాళ్లతోటే చిక్కంతా! ఏమీ తెలియని వాళ్ళ కన్నా ఇలా అన్నీ తెలుసు అనుకునే వాళ్ళతోటే ప్రమాదం! నవ్వొస్తుందా చదువుతుంటే! నవ్వుకోండి !!కానీ ఓసారి అయితే ఆలోచించండి .మనం ఏ కోవలోకి వస్తాము? ఏ కోవలోకి చెందిన వాళ్ళము అని అంతర్మధనం చేసుకోండి!
సరే !అన్ని తెలుసు ఎన్నో తెలుసు! అయితే మాత్రం ఏంటట?
అబ్బే ఏం లేదు ఈ కులమానాల ఈ గ్రాఫ్ లైన్లో మనం ఎక్కడ ఉంటాం? ఎక్కడున్నావ్? ఒకసారి ఆలోచించుకుందాం సమాధానం దొరికితే, మనసు పాడే పాట మరి ఎంతో అర్ధమంతమైన పాట అయిపోతుంది!