చందమామ కథ

       రాజేశ్వరి దివాకర్ల

రతికి మనసులో అలజడిగా ఉంది.
తను పనుల హడావుడిలో పడి పట్టించు కోలేదు.
ప్రభాస్, తను ఏ నియంత్రణను పాటించక పోయినా తమకు సంతానం కలగటం లేదు. డాక్టర్ దగ్గరకు వెళ్ళి చూపించుకోవాలి అనుకుంటూనే కాలం గడచిపోయింది.
ప్రభాస్ అంటూనే ఉన్నాడు, కాని తనే ఒప్పుకోలేదు, మనకు లోపం ఏమిటి? అయినా ఈ విషయం ఎవరికైనా తెలిసినా బాగుండదు అనుకుంది.

తను మూర్ఖంగా ప్రవర్తించిందని ఇప్పుడనుకుంటోంది.
ఇంటినుంచే పని చేసే అవకాశం వచ్చింది. ఇలాగే మరికొన్ని నెలల వరకూ సాగవచ్చు ఈ సమయాన్ని ఉపయోగించుకోవాలి అనుకుంది.
డాక్టర్ దగ్గరకు వెళ్ళే విషయంలో రతి అంగీకారం కోసమే ఎదురు చూస్తున్న ప్రభాస్ వెంటనే తమను పరీక్షించేందుకు డాక్టర్ అపాయంట్ మెంట్ తీసుకున్నాడు.
చికిత్సాలయంలో ముందుగా ఇద్దరికీ ప్రాథమిక పరీక్షలు జరిగాయి. అంతా కుశలమే అని నిర్థారణ అయ్యాక గర్భ ధారణకు గాను ఐవిఫ్ చికిత్సకు సంసిద్ధం కావడానికి అర్హతా పరీక్షలుజరిగాయి. చికిత్స కు అవసరమైన హార్మోన్ ఇంజక్షన్లను ప్రభాస్ ఇస్తున్నాడు.

ఈ గర్భ ధారణ ప్రక్రియ భౌతికమైనదే అయినా మనసుతో ముడి పడి ఉంది. కేవలం ఈరెంటి తోనే కాదు. ఆర్థిక పరమైన ఇబ్బందులూ ఆటంకాలూ కలుగ కూడదు, అంతేకాదు, స్థిరమైన చిత్తము, ప్రశాంతత అవసరం. రతి శరీరం ఇప్పుడొక ప్రయోగశాల, అందులోని ధాతు సం యోగానికి సహజమైన భావనా యోగం కలగాలి.
ప్రభాస్ రతిని ఎంతో ఆప్యాయంగా చూసుకుంటున్నాడు. ఆమెకు ఏ విధమైన చికాకు కలుగకుండా ఎప్పటి కప్పుడు అన్నీ సమకూరుస్తున్నాడు.
దాదాపు మూడు నెలలుగా క్రమం తప్పక అంచెలంచెలుగా జరుగుతున్న ప్రక్రియలో ఆరొజు గర్భధారణా సంయోగం జరిగింది. ఆరోగ్య వంతమైన అండాన్ని ఎన్నుకున్నారు. లింగ నిర్థారణ కూడా జరిగింది.
ప్రభాస్ కు రతికి పుట్టబోయే బిడ్డ సంగతి తెలిసినా, ఆవిషయం కొన్ని నెలలు గడిచాక స్నేహితులకు చెప్పదలచారు. అలాగే శ్రీమంతం పెద్ద ఎత్తున ఏర్పాటు కావించు కోవాలని అనుకున్నారు.
అమ్మ తను చెప్పే విషయానికి వేచి ఉందని రతికి తెలుసు. అమ్మకు సంగతి చెప్పకుండా, అమ్మా నీకు మనుమడు కావాలా! మనుమ రాలు కావాలా! అని అడిగింది, రతి తల్లి చంద్రావతికి మనుమరాలే కావాలని ఉంది, పైకి ఎవరైతేనేమే, అంతా క్షేమంగా జరుగుతేచాలు, అని అంది. నేను రెండు రకాలూ స్వెటర్లు అల్లుతాను. గర్భం ధరించడం జరిగింది కదా! అంతకన్న ఏం కావాలి అంది.
రతి ఇకపైన ఆఫీసు పని తగ్గించుకోవాలని అనుకుంది. ఇక దృష్టిని ఇంటికి మళ్ళించాలని తలచింది. ప్రభాస్ తో అధిక సమయం గడపాలని అనుకుంది. డాక్టరు కూడా ఆమెకు విశ్రాంతి విషయం హెచ్చరించాడు.
తమకు సంతానం కలుగ బోతోందని ఎంతగానో సంతసించిన ప్రభాస్ రాత్రంతా తన ఆఫీస్ గదిని విడిచి రావటం లేదు. ఎప్పుడు వచ్చి నిద్ర పోతున్నాడో , రతి మాత్రం వైద్య ప్రభావం వల్ల అలసి పోయి త్వరగా నిద్ర పోతోంది.
ఆ రోజు రతి ప్రభాస్ ఇచ్చే ఇంజెక్షన్ కోసం ఎదురు చూసింది.
రోజూ ఠంచనుగా రాత్రి తను భోజనం చేయగానే వచ్చి మందులన్నీ వేసుకునే వరకు ఉండి వెళ్ళే ప్రభాస్ రాక పోయేసరికి, రతి ప్రభాస్ ఆఫీస్ రూం కు వెళ్ళింది.
ప్రభాస్ ముఖం వాడిపోయి ఉంది. లేని నవ్వు తెచ్చుకుంటూ, ఇంకారెండు వారాలు ఇంజెక్షన్లు తీసుకోవాలిగా, అన్నాడు.
తను రావడాన్ని చూసి ప్రభాస్ ఖంగారు పడినట్టు రతి గుర్తించింది.
ఇంజెక్షన్ తీసుకుని వస్తాను అంటూ కూచున్న చోటునుంచి లేచి వెళ్ళిన ప్రభాస్ లేప్టాప్ తెరిచే ఉంది. రతి యథాలాపంగా అటు వైపు చూసింది, అందులో ప్రభాస్ పని చేసే కంపనీ పేరు గాక మరొకటి ఉంది. ఒక్క సారి నిర్ఘాంత పోయింది రతి. వెంటనే విషయాన్ని కొంత అవగాహన చేసుకుంది.
ఇంజెక్షన్ ఇచ్చాక ప్రభాస్ ను అడిగింది.
ప్రభాస్! నీ లేప్టాప్ లో కొత్త కంపెనీ లో అనాలిసిస్ట్ గా నీ పేరు ఉంది. నువ్వు ఉద్యోగం మారినట్టు నాతో చెప్పనే లేదు. పైగా ఈ మధ్య రాత్రనక, పగలనక ఆఫీస్ రూం లోనే ఉంటున్నావు ? …….. ప్రశ్నార్థకం గా అడిగింది. ఆ అడగడం లో కొంత సందేహం కూడా ఉంది.
ప్రభాస్ తడబాటు పడ్డ్డాడు
ప్రభాస్ మౌనం తో రతి అనుమానం దృఢం అయింది.
ప్రభాస్ కొంత జంకు తూ
రతీ మనకు బిడ్డ పుట్టబోతోంది. …….
నిన్ను కదల వద్దనీ రెస్ట్ లో ఉండమనీ డాక్టరు చెప్పాడు.
ఇన్ని రోజులూ మనం ఇద్దరమే అని నా ఉద్యోగం లో ఏమీ వెనక వేయ లేదు.
ఇప్పుడు బాధ్యతలు పెరుగు తాయి.
ఈ రోజుల్లో పిల్లల పెంపకం అంటే సామాన్యం కాదు…అందుకనే రెండో కంపనీ లో పని చేస్తున్నాను
ప్రభాస్ మాటలకు రతి నిర్ఘాంత పోయింది.
సైడ్ జాబ్ చేస్తున్నావా? “మూన్ లైటింగ్” చీటింగ్ అని తెలీదా? అంది,
ఉద్యోగం లో చేరినప్పుడు ఆ కంపనీ లో మాత్రమే చేస్తానని ఒప్పందం చేసావు కదా!
భర్త చేసిన పని తప్పు అని నిర్ధారించింది. ఇంత వరకు నైతిక విలువలను కాపాడుకుని ఎంతో పద్ధతిగా జీవితం గడిపిన ప్రభాస్ పుట్ట బోయే బిడ్డ కోసం తను పని చేసే మాతృసంస్థను చీట్ చేయడం ఆమె జీర్ణించు కోలేక పోయింది.
ప్రభాస్ మన పుట్ట బోయే పాప తండ్రి నిజాయతీ గా ఉండడమే నాకు ఇష్టం
…అంది.
వెళ్ళి ఆ రోజు వార్తా పత్రికను తెచ్చింది.
దిన పత్రికలోని వార్త ప్రభాస్ కు తెలుసు. తమకు తెలుపకుండా మరొక చోట పనిని కొనసాగిస్తున్న వారిని అధికార సంస్థ ఎటువంటి హెచ్చరికలూ చేయకనే ఉద్యోగం నుండి తొలగించిన వార్త అది.
రతి క్రమ శిక్షణకూ, నియమా వళికి కట్టు బడి ఉంటుంది.
వెంటనే లేప్టాప్ మూసాడు
రతిని క్షమాపణ కోరాడు. ……….రాజేశ్వరి* దివాకర్ల

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

తరుణి చిత్రం

మనోజ్ఞ పాడిన ‘మగువ’ పాట