అవకాశం వాకిట నిలిచి ఆహ్వానిస్తోంది
సభాస్థలి సాదరంగా స్వాగతిస్తోంది
సంకల్పం సామర్థ్యానికి సాన పెడుతోంది
అవరోధం అడుగడుగునా వెనక్కి లాగుతోంది
వివేకం ససేమిరా అంటూ వెన్నుతట్టి ప్రోత్సహిస్తోంది
రెంటి నడుమ విజ్ఞత సమన్వయకర్తగా వ్యవహరిస్తోంది
అణచిపెట్టిన జ్ఞానమేదో అగ్నికణమై ఎగజిమ్ముతోంది
ఎదలోపలి వేదనేదో లావాగా పెల్లుబుకుతోంది
భాషకందని భావమేదో మబ్బుమాటు చంద్రుని తలపిస్తోంది
మాటకందని మౌనమేదో నివురుగప్పిన నిప్పుకు అద్దంపడుతోంది
అవకాశానికీ ఆరాటానికీ నడుమ అంతరంగ పోరాటం
ఇంతకీ ఏమిటా అవకాశం?
కాగితంపై కలమా?
కచేరీలో స్వరమా?
వేదికపై గళమా?
తెరపై నృత్యమా?
ఒక కన్నీటి చుక్క ఏదో ఇక కొత్త భాష్యం చెప్పాలి