కాలం ఎంతో వేగంగా పరిగెడుతుంది అని అనుకునే వాళ్ళు కొందరైతే, అబ్బా! సమయమే గడవడం లేదు అనుకునే వాళ్ళు కొంతమంది. పొద్దుపొడుపుల మధ్యన తారతమ్యాలలా అభిప్రాయాలు కూడా! అయితే జీవన విధానంలో ఎన్ని మార్పులు వచ్చినా పెళ్లిళ్లు చేసుకోవడం, పిల్లల్ని కనడాలు, పెంచి పెద్ద చేయడాలూ తప్పడం లేదు, మారడం లేదు .మారవు !తప్పవు !ఇదే బ్రతుకు బండి నడవాల్సిన విధానం. ఇలాంటప్పుడు పాత రోజులు తలుచుకొని బాగున్నవనో? ఆహా లేవు అసలే బాలేదు ,ఇప్పుడే బాగుంది అనుకోవడం కంటే రెండింటి మధ్యన ఉన్న సమన్వయం ఏమిటి సమన్వయం కానిది ఏమిటి అనేవి అంచనా వేసుకోవాల్సిన అవసరం ఉంది .అప్పుడే మనం ఎటువైపు ఒకవైపే నిలవడం కాదు అన్ని సమర్థవంతంగా చేయగలమని ఒక అభిప్రాయానికి రాగలుగుతాం.
ఇంట్లో చిన్నపిల్లలు ఉన్నారు అనుకోండి ఆ ఇంట్లో ఇక సమయం గడపకపోవడం అనే ప్రసక్తి ఉండదు. సరే ఇది కాలం గడవడానికి బాగానే ఉంటుంది కానీ ఎలా వాళ్లతో ఉంటున్నాము అనేది ముఖ్యమైన విషయంగా భావించాలి.వాళ్ళకు ఇష్టమైనదేదో , ఇష్టం కానికి ఏదో వండి పెడుతున్నాము, కొని పెడుతున్నాము. అన్నీ చేస్తున్నాం! కానీ ఒక్కటి మాత్రం ధ్యాస పెట్టడం లేదు !!అదేంటంటే పిల్లలు ఎప్పుడూ ఒక చెవి ఇటు వేస్తారు అనే విషయంపై మనం ధ్యాస పెట్టడం లేదు. అంటే ఇంట్లో పెద్ద వాళ్ళు ఏం మాట్లాడుకుంటున్నారు పిల్లలు వింటున్నట్టు మనకు అర్థం కాదు ,కాని వినేస్తారు! కాబట్టి మంచి చెడులు మాట్లాడేటప్పుడు మనం ఉపయోగిస్తున్న మాటలు ఎలాంటివి? మన ఉపయోగిస్తున్న భాష ఎలాంటిది? అనేదానిపైన జాగ్రత్తగా దృష్టి పెట్టి మాట్లాడాలి. అలాగే ద్వేషపూరితమైనటువంటి చర్చలు ఏమన్నామా?మంచి చర్చలే చేస్తున్నామా? ఎప్పటికప్పుడు మనల్ని మనమే చెక్ చేసుకోవాలి.అసూయ కలిగించేవి ఏమైనా అంటున్నామా? చెడుకు సంబంధించినవి ఎవరికి తెలియదు అరిషడ్వర్గాలలో చిక్కుకోని మనుషులు ఎవరు? మనలో ఉన్న కోపతాపాలను ప్రదర్శించేప్పుడు ఎన్నో రకాల హావభావాలను చూపిస్తాం ఎన్నో రకాల మాటలను ఉపయోగిస్తాం ఇవన్నీ కూడా వాళ్ళు చూడడం లేదు ఆడుకుంటున్నారు లే అని అనుకుంటాం .కానీ పిల్లలు ఆడుకుంటూనే ఒక చెవ్విటు వేస్తారు!ఇది ఎప్పుడు మర్చిపోవద్దు. ఇవే మనం చెప్పని పాఠాలు వాళ్ళకి. ఇవి నేర్చుకొని బయట వాళ్ల ముందు ,వాళ్ళ సిబ్లింగ్స్ తోని వాళ్ళ ప్రవర్తనలో ప్రదర్శిస్తూ ఉంటారు .ఒక్కొక్కసారి మనకు అనిపిస్తుంది అదేంటబ్బా ఎక్కడ నేర్చుకున్నారు! అని !కానీ ఎక్కడో నేర్చుకోవడం కాదు మన ఇంట్లోనే మన మాటల్లోంచి నేర్చుకుంటున్నారు అనే సత్యాన్ని గ్రహించాలి మనం.
వాళ్లకి నేర్పాలి, చెప్పాలి అనుకునే విషయాలు ఏమైనా ఉంటే కాస్తంత తెలివిని కాస్తంత జాగరుకతను వినియోగిస్తూ ఇన్ డైరెక్ట్ గా వాళ్ళు వినేలా అంటే ఆ పనులు వాళ్ళు చేసేస్తారు. ఇది కూడా ఒక ట్రిక్!
శుభ్రత స్వచ్ఛత అనేవి మనలోనూ మన మనసులోనూ ఉంటే పిల్లలకు మలినాలు ఎందుకు అంటుకుంటాయి?
అంటుకోవు. అట్లాగే మంచి మాటలను మాట్లాడుతూ, ధైర్య వచనాలను పలుకుతూ మనం మన పెద్దల పట్ల గౌరవాన్ని ప్రదర్శిస్తూ ,ఎదుటివారిని మనుషుల్లాగానే చూస్తూ , సమాజానికి ఎంతో కొంత మంచి చేస్తే పిల్లలు ఎందుకు చెడుగా పెరుగుతారు?కదా!!