తరుణీయం

తరుణి పత్రిక స్త్రీ ల కోసం పెట్టింది. ఎవరెన్నైనా మాట్లాడినా  జీవితంలో వైవాహిక సంబంధాలను దృష్టిలో పెట్టుకొని చూస్తే కుటుంబ విలువలు కాపాడేది భార్య భర్త ఇద్దరూనూ! జగమెరిగిన సత్యం ఏమంటే పిల్లల పెంపకం విషయం లో తల్లిగా స్త్రీ ల పాత్ర ఎక్కువ ప్రాధాన్యత కలిగి ఉంటుంది.

ఈ ఆధునిక యుగంలో విద్యావేత్త గా, సంఘం సంస్కర్త గా, ఇల్లాలి గా , ఉద్యోగినిగా స్త్రీ లు నిర్వహిస్తున్న పాత్ర గొప్పది. అటు ఉద్యోగం ఇటు ఇల్లు రెండు ముఖ్యమైన వే .

ఇంతటి పనులు నిర్వహించాలంటే ఎంతో సంయమనం కావాలి. మనుషులం కదా అరిషడ్వర్గాలను అధిగమిస్తూ ముందుకు పోవాలంటే కొన్ని తడవలు కొన్ని మంచి మాటలు చెప్పేవారు కావాలి. ఇదిగో ఇలా నడుచుకుంటే ఎంతటి ఇబ్బందులు వస్తున్నా ఎదుర్కొనే ధైర్యం నీకు కలుగుతుంది అని చెప్పీచెప్పక మనల్ని ఆలోచనాపరులను చేస్తుంది ఈ ” తరుణీయం”

వేముగంటి శుక్తిమతి గారు ప్రముఖ రచయిత్రి.పాఠశాలలో ఉపాధ్యాయురాలిగా ఉద్యోగం చేస్తున్నప్పుడు పేద పిల్లలకు ఉచితంగా పాఠశాల ను పెట్టాలి అనే గొప్ప ఆలోచన కలగగానే వారి లో కలిగిన ఈ భావాలను తమ భర్త తో పంచుకొని పేదపిల్లలకోసం పాఠశాల ను ప్రారంభించారు. సంకల్పం మంచిదైతే విజయం  స్వంతమవుతుంది అనడానికి శుక్తిమతి గారు నిలువెత్తు నిదర్శనం.

అప్పటినుండి ఎన్నో ఏళ్లుగా ఇలా సమాజ సేవ చేస్తూనే ఉన్నారు.

తల్లి గా , ఇల్లాలి గా ఉద్యోగినిగా సంఘం లో ఒక ఉత్తమ ఆదర్శాలు గల స్త్రీ గా శుక్తిమతి గారు ఎన్నో పాత్రలు పోషిస్తున్నారు. వారి కలం నుండి మనకోసం “తరుణీయం” అనే శీర్షికతో ముందుకు వస్తున్నది. శుక్తిమతి గారిది శక్తివంతమైన కలం . వారం వారం మనల్ని మురిపెంగా పలకరిస్తుంది.

మరి సంతోషంగా ఆహ్వానిద్దామా!

          వేముగంటి శుక్తిమతి

చెప్పేవాళ్ళు లేక

కొన్నాళ్ల క్రితం నా విద్యార్థిని పెళ్లికి విజయవాడ వెళ్లాను. అక్కడ చాలా పేరున్న ఫంక్షన్ హాల్ లో, అంగరంగ వైభోగంగా, అధునాతన సదుపాయాలతో, అత్యాధునిక అలంకారాలతో ఎక్కడ చూసినా ఆడంబరంగా ఏర్పాట్లే. అతిధి మర్యాదలు, షడ్రుచుల భోజనాలు మా స్టూడెంట్ సుధా తండ్రి డబ్బును నీటిలా ప్రవహింప చేశారు. భూలోక స్వర్గాన్ని తలపింప చేసిందంటే అతిశయోక్తి కాదు ఆ వివాహ మహోత్సవ అద్భుతాలు, ఆర్భాటాలు ఎన్నో రోజులు నా స్మృతి పథంలో కదలాడాయి. ఆ తర్వాత ఏ పెళ్లి కి వెళ్లినా ఇదే పెళ్లి గుర్తొచ్చి ఉదాసీనంగా ఉండిపోయే దాన్ని.

అలాంటిది ఒకరోజు అనుకోకుండా రైలు ప్రయాణం లో సుధను నా ఎదురు సీట్ లో చూశాను. ఎంతో కష్టపడితే గానీ పోల్చుకోలేక పోయాను. ఆమె నవ్వుతుంటే బుగ్గన సొట్ట పడేది. అలా సుధా ఎంతో అందంగా అనిపించేది. చాలాసేపటికి ఆమె ఖచ్చితం గా సుధ అని గుర్తించగలిగాను. అసలా రూపమే లేదు. సన్నగా, పాలిపోయి కళా కాంతి లేని మొహంతో ఉన్నఆమె తనను దొంగచాటుగా చూస్తూ వెంటనే పక్కకు చూస్తున్న ఆమెను సుధా అని ప్రేమగా పిల్చాను. అప్పటిదాకా ఏడ్చినట్టు ఉబ్బిన ఆమె కళ్ళనుండి జల జలా నీళ్లు కారాయి. “సుధా ఏంటి నీ ఈస్థితి” దిగ్భ్రాంతి తో ఆనాటి పెళ్లిని ఊహించుకుంటూ అడిగాను.

“మేడం. ఇది నేను చేసిన తప్పుకు ప్రాయశ్చిత్తం.”

“ఇంత తొందర లో ఇంత మార్పా. అసలేం జరిగింది? ఆశ్చర్యంగా అడిగాను.

“భార్యాభర్త ఆనందంగా ఉండటానికి కావలసింది డబ్బు, చదువు, హోదా, పరపతి ఇవేవీ కావు. ఒకరినొకరు అర్థం చేసుకోవడమే. ఇద్దరి మధ్య ఏ దాపరికాలు లేకపోవడమే. ఒకరికి ఒకరుగా ఏ పని చేసినా ఇద్దరూ ఒకటిగా, నమ్మకంగా సఖ్యతగా,…” సుధా రెండు చేతులలో ముఖం దాచుకొని వెక్కి వెక్కి ఏడ్చింది.

అహంభావంతో నమ్మకాన్ని వొమ్ము చేసుకొని, డబ్బు మైకంతో కలకాలం నిలబెట్టుకోవాల్సింది వివాహబంధమని చెప్పేవాళ్లు ఆ బంధం బీటలువారిపోయింది. ఒకరికొకరు కట్టుబడి ఉండాలని ప్రాథమిక విషయాన్ని తెలుసుకోలేక తాత్కాలిక వ్యామోహాలు లతో అతనికి డైవర్స్ ఇచ్చి ఒక తోడు కోసం ఈ మోసగాన్ని పెళ్లి చేసుకున్నాను.

ఒక సినిమా కథలా వింటున్న నాకు కాళ్ళ కింద భూమి కంపించినట్టయింది. పక్కన ఓ ముప్పై ఏళ్ల యువకుడు తప్పతాగి తూలుతూ కూర్చొని ఉన్నాడు. నాకు జుగుప్స తో ఒళ్ళంతా జలదరించింది. ఒక్క ఏడాదిలో రెండు పెళ్లిళ్లు. అంటే ఆ ఫంక్షన్ హాల్ లో అధునాతన ఆర్టిఫిషియల్ వస్తువులు ఆ తెల్లవారే దుమ్ము పట్టి పోయినట్టు. మళ్లీ కడిగి తుడిచి తెల్లవారి జరిగే పెళ్లి కోసం నిన్నటి పాతదనాన్ని తుడిచేసినట్టు. అంటే మనుషులు కూడా వస్తువులేనా. మనసు మనుగడ యాంత్రికమేనా.” నా మనసు నిండా ఏవేవో ఆలోచనలు ముసురుకున్నాయి.

ఆధునిక దంపతులు త్యాగాల్లో, బాధ్యతల్లో పోటీ పడకుండా తమకున్న బలహీనతల్లో , దిగజారుడు లో, హక్కుల లో పోటీ పడుతున్నారు. వివాహ బంధంలోకి అడుగు పెట్టే ముందు సర్దుబాటు ప్రాధాన్యాన్ని ,

భవిష్యత్తు అంతా పూలబాట కాదని అప్పుడప్పుడూ ఆ బాటలో ముళ్ళుంటాయని తల్లిదండ్రులు వివరించాలి. ఒకరి కాలులో ముల్లుకుచ్చుకుంటే ఇంకొకరి కంటిలో కుచ్చినంత స్పందన తో మెలగాలి. దక్షుడు తనను అవమానించినా పట్టించుకోని శివుడు సతీదేవి తండ్రి అయిన దక్షుడి ఆమెను అవమానం చేసినప్పుడు దక్ష యజ్ఞాన్నేధ్వంసం చేస్తాడు. ఇలాంటి ఘనమైన వారసత్వ సంపదను యువతీ యువకులకు గుర్తు చేస్తూ ఉండాలి. ప్రబోధిస్తూ ఉండాలి. అప్పుడే మన వివాహ వ్యవస్థ తిరిగి బలపడుతుంది.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

ప్రేమ

సుభాషితం