కిష్నయ్య అల్లరి రేపల్లెల అందరికీ అలవాటైపోయింది.
ఎన్నడన్న కిట్టయ్య ఇంటికి రాక ,కనిపించక పోతే గోపెమ్మలకు దో అన్నట్టండేది. ఎతుక్కునేటోల్లు.
చిన్ని కిట్టయ్య ఎనిమిదేండ్ల పిలగాడైండు….
కిష్నయ్య పుట్టినప్పటినుండి ఎన్నో రాగూడని ఆపదలొచ్చినయని ఇంక గీడుంటె కిష్నయ్యకు మంచిదిగాదని నందయ్య బృందావనం బోతమన్నడు…… నందయ్య ఊరిడిచిపెడితే కిష్నయ్య గూడ వోతడని … కిష్నయ్య ను వొదిలి మేముండలేమని రేపల్లె ఊరోల్లంత బృందావనానికి పయనమయ్యినారు.
……
అమ్మ చేతి పెరుగు బువ్వ తింటె గాని కిట్టయ్య కు కడుపు నిండేది గాదు… అదిగిట్ట బతిమిలాడ్తె గాని తినెటోడు గాదు…..
ఒకనాడు సందెటేల యసోదమ్మ ఆ కత ఈ కత జెప్పి బువ్వ వెట్టవట్టింది. సూడు మంచిగ పెరుగు బువ్వదింటే నీకు ఉంగరాల ఉంగరాల ఎంటికెలు వస్తయి… … నేను మీ నాయినకి జెప్పి కిరీటం జేపిస్తగద…. కిరీటానికి నేను నెమిలీక వెడ్త…. ఎంత ముద్దుగుంటవు ఎర్కనా?
అంటన్నది…. ముద్ద నోట్లవెట్టుకోని …. ఏవి నాకు ఉంగరాలెంటుకలు రాలే గద… అన్నడు కిట్టయ్య .
యసోదమ్మ పకపక నగి… అయ్యో నా పిచ్చి పిలగా గిట్ల దినంగనె గట్లొస్తయా…. రోజూ దినాలె బిడ్డా… వొస్తయి …
అయినా నీ ఎంటికలకేం తక్వరా! అని కొడుకును దగ్గరికి దీస్కోని మెటికలిరిచింది…
ఇంతల నందయ్య వొచ్చిండు..
“తల్లీకొడుకులు ఏందో ముచ్చట్లువెడుతున్నరు ?”
ఏంది కత? అన్నడు
“అయ్యొ… గట్ల కుల్లుకోవడ్తిరి … మీరూవెట్టుండి ముచ్చట వొద్దన్నమా! “అన్నది యసోదమ్మ నవ్వుకుంట…
“సాలు సాలు ముచ్చట్లు… మురిపాలు… గార్వంజేసుడు సాలించుండ్రి….రేపటి నుంచి ఊరిపిల్లలందరి లెక్క కిష్నయ్య గిట్ట ఆవులనందీస్కోని అడివికివోతడు మేపనీకె….”అన్నడు నందయ్య.
“అదేందయ్యా!!పసిపిల్లగాడు అప్పుడే ఏం తప్పిపోయింది పనిజేయనీకె”అన్నది యసోదమ్మ.
“తల్లి కి పిల్లలు ఎంత పెద్దగైనా పసోల్లేనే… నీ తల్లి పేగుకు గట్లనే అనిపిస్తది… పెద్దగవుతున్నడు గాదా… పనినేర్చరకోక ఇంట్ల తల్లి కొంగు వట్టుకొని కూకోమంటవా?…” అన్నడు నందయ్య
యసోదమ్మ కు దుక్కం రావట్టింది..
“యసోదా! గంత ఏడ్వనీకె ఏమున్నది చెప్పు?” అంట ఒదార్వనీకె జూసిండు నందయ్య…
“కాదయ్యా! లేకలేకవుట్టిన నలుసు… పుట్టినకాణ్ణించి ఎన్ని గండాలుదప్పె…… వాడు గడప దాటితే నా పానం విల్లవిల్ల గొట్టుకుంటది….”ఏడ్వవట్టింది యసోదమ్మ .
“ఇగో….గట్ల ఏడుస్తె ఎట్లజెప్పు….పిల్లగాడు పని నేర్చుకుంటడని అన్న…నాకు కొడుకుగాడా వాడు…
సోపతి పిల్లలతోటి బయటదిరుగుతె జర దూం తక్వవౌతదేమో …. అంటాని ఆసవడ్తున్న”అన్నాడు నందయ్య…
“ఏమోనయ్య నాకైతే యిష్టం లేదు ఆనక నీ ఇష్టం నీకొడుకిష్టం…”అనుకుంటు లేచి లోపలికివోయింది యసోదమ్మ.
నిద్రవోతున్నట్టు కండ్లు మూసుకున్నడు గానీ అంత యింటనేవున్నడు కిట్టయ్య.తనలో తను నవ్వుకున్నడు కిష్టపరమాత్మ…..
తెల్లారింది…
యసోదమ్మ మొకం చిన్నవోయింది.
మొగని మాట కాదనలేదు. కొడుకును అడివికి తోలియనీకె మనుసొప్పుత లేదు.
మనుసుల దిగులువెట్టుకోని కిష్నయ్య ను తయారుజేయవట్టింది.
సక్కగ ఎన్నపూస ,నలుగు పిండి వెట్టి తానాలువోసింది.
కిష్టయ్య ఉంగరాలెంటుకలను బాగ తుడిసి సాంబ్రాని పొగేసింది
సక్కగ చందనం బూసింది
ఎంటుకలను నున్నగదువ్వి నడినెత్తిల కొండెజుట్టింది… కొండెకు ముత్తేల సరాలు జుట్టి పక్కకు ఏలేలాడేసింది.
కొండె నడిమిట్ల నెమిలీకె వెట్టింది.
పసుప్పచ్చ పీతాంబరం గట్టింది ,దాని మీద ఎర్రని పంచ నడుముకు గట్టింది…. మెడల ముత్యాల దండలేసింది.కౌస్తుభం ఏసింది
నొష్టె కస్తూరి తిలకం దిద్దింది
చెంపమీద దిష్టి సుక్కవెట్టింది
పిల్లంగోవి నడుముకు చెక్కింది
మీగడ పెరుగన్నం తినవెట్టింది
పగటేల దిననీకె పాలన్నంల పెరుగు తోడువెట్టి దాని మీద చారెడంత మీగడేసి నడిమిట్ల మాడికాయ పచ్చ వెట్టింది…
చేతికి ములుగర్ర యిచ్చింది.
ఇంత జేస్తున్నా యసోదమ్మ కు బుగులుతోటి కండ్లల నీల్లు తిరుగుతునే ఉన్నయి
అది జూసి కిట్టయ్య “ అమ్మా! నువ్వేం బుగులువడకు… నేను మంచిగవొయ్యి మంచిగొస్త… అన్నం దినకుండ ఏడిస్త కూసుంటె నామీదొట్టె సూడు మరి…” అని బుంగమూతి వెట్టిండు.
అయ్యో ఒట్టెందుకు బిడ్డా!! గంతమాటనకురా! మంచిది నువుజెప్పినట్టె జేస్త కొడుకా!! సేమంగ వోయిరా!!!
అట్లనే అమ్మా!! పొద్దూకెటేల ఏగిరం వొస్తా!!!అనుకుంట అడివితోవవట్టిండు కిట్టయ్య .
యసోదమ్మ తోవంట సెయ్యూపుతా పెద్దర్వాజకాడ నిలవడ్డది
……
కిష్నయ్య అడివికి వొస్తున్నడని యిన్న గోపాలకుల పిల్లల సంతోసానికి అద్దుబిద్దు లేకుండవోయింది.
రోజుకంటె ముందొచ్చి కిట్టయ్య యింటిముందు నిలవడ్డరు.
రోజు ఆవులనందీసుకోని అడివికి పోతున్నడు కిట్టయ్య .
పిల్లంగోవి ఊదుతా ఆడుకుంట పాడుకుంట పిల్లందరుగలిసి ఒకల్లనొకల్లు ఎక్కిరించుకుంట పోతున్నరు.
ఒకడు యింకోని పంచగుంజి పకపక నగుతడు.
మరొకడు పక్కోని పిలక గుంజి పక్కకు వోయి ఏం తెల్వనట్టు అటుదిరిగి మొకం బెడతడు. పరాచికాలాడుకుంట ఆవులందీస్కోని పోతున్నరు ….. అడివి మద్దెకు వొయినంక ఏటి ఒడ్డున పచ్చని పచ్చికలల్ల ఆవులకు నీల్లుదాపి నిలవెట్టి పిల్లలంత సద్ది మూటలిప్పింన్రు.
ఆకలిగొన్న పిల్లలు తాముదెచ్చిన సద్దిని పెట్టుకోని సుట్టు గూకోనుంటె కిష్నయ్య నడిమిట్ల కూసున్నడు.
అందరికీ కిట్టుడు గావాలె.
అందరు ఆయిననే జూడాలె…
కిష్నయ్య సెనం గనవడకవోతే ఎవ్వనికీ ముద్దదిగదు
తామెరపువ్వు దుద్దులెక్క కిట్టయ్య సుట్టూ రేకలెక్క పిల్లలు గూకోని తినవట్టిరి…
కాల్లుసేతులు కడుక్కోడం తెల్వని గోపాలకులతోని కిష్న పరమాతుమ ఎట్లదింటడో సూద్దామని ముక్కోటి దేవుల్లు ఆకాసమంత నిలవడి సూస్తావున్నరు.
పిల్లల నడిమిన కూసున్నడు కిట్టయ్య .
కొంటెపోరలు చిన్న దూం జేయరు.
సద్దిదిననీకె ఏద్దొరికితే అదిదెచ్చి పెటుకున్నరు.
ఒకడు చెట్టుకున్న తీగెలు దెచ్చి సుట్టగ సుట్టి వెట్టుకున్నడు.
ఇంకోడు బండపలక దొరికితే తెచ్చి పెట్టుకున్నడు.
మరొకడు ఆకు
రాయి ఏది దొరికితే అది తెచ్చి దానిమీద సద్దిబువ్వవెట్టుకోని దినవట్టింన్రు
పక్కోడి అన్నంముద్ద మాయం జేసి ఆకాసం దిక్కుజూసేటోడొకడు.
ఆవకాయ పచ్చ తీస్కోని గుటుక్కుమని మింగి ఇంకోని దిక్కు జూపెటోడు ఇంకోడు
తన ముందున్న అన్నం మొత్తం నోట్లగుక్కుకోని పక్కోడు దిన్నడని కిష్నునికి చెప్పేటోడొకడు
గట్ల ఎన్కనుంచి వొయ్యి ఎవన్నోవొకన్ని నెత్తిమీద గొట్టి గిర్రన తన సోటికొచ్చి కూసునేటోడొకడు . వాడు దిక్కులు సూసేటప్పటికి అందరు పకపక నవ్వెటోల్లు
కిష్నయ్య కు ఒకడొచ్చి ఉత్త మీగడ వెడ్తడు
ఇంకోడొచ్చి పచ్చడి బద్ద తినుమని నోట్లెవెడ్తడు
మరొకడొచ్చి కమ్మగుంది పెరుగని అన్నంముద్ద వెడ్తడు.
కిష్నయ్య ఆవకాయ పచ్చెను ఏళ్ల సందుల యిరికించుకొని మీగడ పెరుగు అన్నంముద్దను చేత్తోటి ఎగిరేసుకుంట యినోదం సూస్తా ఉన్నడు
నారాయనమూర్తి సుచి సుబ్రం ఎంగిలి మంగలం లేక తింటుంటె జూసి సిత్రవోయింన్రు…దేవతలందరూ
పరమాత్మ తల్చుకుంటే ఎవ్వల్లమీదనన్న దయజూపిస్తడుగదా!
ఈ గోపాలకులు ఏం పున్నెం జేసుకున్నరో …. అనుకున్నరు.
…..✍️సుగుణా అల్లాణి