*నా ఆవేదన

( ఒక తండ్రి)

కె.కె.తాయారు

అందరూ ఎదురు చూసిన ఆ రోజు రానే వచ్చింది,
రామలక్ష్మి బిడ్డను కంటుంది అంటున్నారు,
లోపల నొప్పులతో బాధపడుతూ ఉంటే,బయట ఒక పాకలో రగ్గు కప్పుకుని కూర్చున్న పుట్టబోయే బిడ్డకి కాబోయే తండ్రిని,
ఏమి తండ్రో ?
ఎంతో ఆశతో ఎదురు చూస్తే” ఆడపిల్ల ” అన్నారు !
అయినా సంతోషించాను,ఎందుకంటే ” అమ్మా,మా ఇంటి మహాలక్ష్మి నన్ను, కన్నతల్లి అని పొంగిపోయాను సుమీ ”
ఇంత ఆనందంలో ఎక్కడో బాధ, ప్రాణం కొట్టుకుంటుంది ఆనందిస్తున్నా.ఏదో తెలియని బాధ కానీ,” నువ్వు నా మొదటి సంతానం తల్లి “.
ధైర్యం చిక్కబట్టుకొని ఏదో చెబుదాం అనుకుంటే చెప్పలేకపోయాను ఎందుకో తెలుసా !
“ఆడపిల్లవని” ఆ మాట అనడానికే సిగ్గుగా ఉంది.
వింత చూడమ్మా !మిమ్మల్ని పుట్టుకతోనే ఆడపిల్ల అంటారు ఎంత ” నర్మగర్భంగా ” అంటారు కదా!
అందులోనే ఉంది సుమీ ఆంతర్యం అంతా!!
ఇందుకే నాకు తగని మనోవేదన నీ తండ్రి ఆవేదనని అర్థం చేసుకో తల్లి!
నిన్ను బాధ పెట్టకుండా ఎంతో ప్రేమతో మీ అమ్మ కంటే ఎక్కువగా నేను పెంచుకున్నాను,
నేనే నీ మొదటి ఆత్మీయుడిని అందుకే నాన్ననయ్యాను.
అందరూ మీ అమ్మని పొగుడుతారు కదూ !
కానీ బరువు అంతా నాదే తల్లి,భయాలు నావే!!
మీ అమ్మ కడుపులో 9 నెలలు మాత్రమే మోసిందమ్మా,నేను కడవరకు చూసుకోవాలి తల్లి పెంచాలి కదమ్మా?
నీకు స్వతంత్రంగా ధైర్యంగా బతకడం నేర్పాను అందుకే చిన్నప్పుడు నీ చిటికెన వేలు పట్టుకొని నడిపించి తిప్పి తీసుకొచ్చి మళ్ళీ నువ్వు నిద్రపోతున్నప్పుడు నీ పాదాలు సుతి మెత్తగా పట్టేవాడనమ్మా, నొప్పులు లేకుండా!!
రాత్రులు పొలాల దగ్గరికి నాతోటి నిన్ను తీసుకెళ్ళాను నీలో భయం పోగొట్టడానికి నువ్వు ధైర్యంగా నిలబడాలని.
వయస్సు వచ్చాక పొలాల్లో సద్ది పట్టుకొని ఆ గోతుల్లో ఎత్తు పల్లాలలో నడవడం నేర్పించాను,
ఆగంతుకులతో సక్రమంగా నడవడం నేర్పించాను.
నీ జీవితంలో రాబందులు డేగలు నిన్ను ముసురుకోకుండా నిన్ను నువ్వు రక్షించుకోవడం ఎలా అని నేర్పించాను క్రూర మృగాల నుంచి రక్షణ నేర్పించాను,
అందరూ మనవాళ్లు కారు ఇది ప్రపంచం అని నువ్వు తెలుసుకోవాలని తల్లి!
నీకు విద్యాబుద్ధులు నేర్పించాను,
ఏమని తెలుసా?
సైనికులు సరిహద్దులులో ఏ రీతిగా పోరాడుతూ తమని తాము రక్షించుకుంటూ దేశాన్ని కాపాడుతున్నారో అదేవిధంగా నిన్ను నువ్వు రక్షించుకోవాలని,
నువ్వు ఒక గొప్ప సైనికుడి లాగా ముందుకు సాగుతావని!
తప్పా తల్లీ ?
నేను దేవతలకు నువ్వు బాగుండాలని,
నీ సుఖం కోరుతూ దేవతలందరికీ ప్రతి నిమిషం మొక్కుతూనే ఉన్నాను తల్లి,
నీ సుఖం కోసం పూజలు కూడా చేశాను.
నా ధైర్యం నీ ఊపిరి !
నా గెలుపు నీ అదృష్టం,తల్లి నాకేం అనిపిస్తుందంటే,
మా అమ్మే మళ్ళీ నాకు పుట్టింది అనిపిస్తుంది తల్లీ!

అందుకే ఎంత జాగ్రత్త తీసుకున్నాను నా ఊపిరి ఉన్నంతవరకు నీ సకల సౌభాగ్యాలు కోసం నిరంతరం దేవుడిని ప్రార్థిస్తూనే ఉంటాను.

ఒకవేళ చనిపోతే ఆకాశంలో చుక్కగా నీ నడత నీ గొప్పదనం నీ గౌరవం వీక్షిస్తాను.
ఇంకా చెప్పాలంటే నీ ఆత్మలో ఆత్మనైపోతాను తల్లి ఇది నా ఆశ! అమ్మా ఒప్పుకుంటావా?
******-
ఇది నాస్వంతం.
నేను వ్రాయునది ఏమనగా ఇందులో ప్రతీ అక్షరం నా హృదయ స్పందన.మా తండ్రిగారు నాకై వెచ్చించిన మధురక్షణాల,భావ మధురిమలు.ఇది నా ఆంతర్యం అని హామీ ఇస్తున్నాను.

Written by Tayaru

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

నైతిక విలువలకు దర్పణం .. “శారదాంబ శతకం”

తొలి అడుగు