గృహిణిగా, అధ్యాపకురాలిగా, వివిధ రంగాల్లో రాణిస్తూనే తనకంటూ ఒక ప్రత్యేకతను చాటుకుంది పాలమూరు జిల్లా కేంద్రానికి చెందిన కవయిత్రి రావూరి వనజ . ఆమె కలం నుంచి విడుదలైన తొలి కవితా సంపుటి “శారదాంబ శతకం”.
తాము చేపట్టిన వృత్తిలో రాణిస్తూనే, తమకిష్టమైన కవితా/రచనా ప్రవృత్తి లో తమకంటూ ఒక ప్రత్యేకతను చాటుకుంటూ తెలుగు సాహితీ పీఠము ఆధ్వర్యంలో రావూరి వనజ శారదాంబ శతకమును వెలుగులోకి తెచ్చారు.
తెలుగు సాహిత్యంలో తెలుగు రచనలో పద్యరచనకు ఒక విశిష్ట స్థానం ఉన్నది. కవయిత్రి తన భావాలకు పదను పెడుతూ గణపతిని ప్రార్థిస్తూనే తల్లిదండ్రులను గురువులను కొలుస్తూ ఆటవెలదిలో అలతి అలతి పదాలతో మహత్తరంగా పుస్తకాన్ని రచించి మన ముందుంచింది. తన జీవితంలో ఎదురైన టువంటి కొన్ని సంఘటనలను పద్యరూపంలో పొందుపరుస్తూ, పద్యాలలో చక్కటి నీతిని బోధించింది. సులభమైన, సరళమైన, మృదుమధురమైన భాష ఉపయోగిస్తూ పద్యాలు రాయడం వల్ల పాఠకులు సులభ రీతిలో అర్థం చేసుకుంటారు. ఆ ll పనికిరాని మాట పలుకరాదయనోట /మాట వలన మనిషి మహిమ దెలియు/ మాట మంచిదైన మాన్యుడై వెలుగొందు /సకల కళల రాణి శారదాంబ! అంటూ .. మంచి మాటల వలన దేవతలను మన్నన చేసిన వరాలిస్తారని ఓ చాటుపద్యం ఉంది. పనికిరాని మాటల వలన మనిషి మలినమై పోతాడని, సద్గుణ మైన మాటల వలన మనిషి మహాత్ముడై వెలుగొందుతాడని చాలా చక్కగా వివరించారు. ఆ ll దేవుడెక్క డనుచు దేవులాడడ మేల/దేవుడుండు నీదు దేహమందు/ నక్క డిక్క డ నక నన్నింట తానుండు/ సకల కళల రాణి శారదాంబ ! ఈ పద్యం ద్వారా దేవుడు సర్వప్రాణుల హృదయాల్లో ఉంటాడన్న గీతాచార్యుల వ్యాఖ్యని మరొకసారి జ్ఞాపకం చేశారు. ఆ ll కపిలవాయి గురువు కమనీయంగా నేర్చే/ చక్కనైన చదువు నిక్కువముగా…. నన్ను తీర్చి నారు నలవోలు నరసింహ /రెడ్డి గారు పద్యరీతు లమర/ ప్రోత్సహించి సతము యుత్సాహపరిచారు /సకల కళల రాణి శారదాంబ ! ఈ ప్రయోగంలో రావూరి వనజ తనకు ప్రేరణ అందించిన ప్రముఖ సాహితీ ఋషి, పరిశోధకులు కపిలవాయి లింగమూర్తి గారిని, నలవోలు నరసింహారెడ్డి గారిని పేర్కొని అక్షర మాలతో అభివందనాలు చేసి పద్య రూపంలో రుణం తీర్చుకున్నారు.
శారదాంబ శతకంలో తల్లిదండ్రులను గురువులను దైవాన్నే కాకుండా వ్యక్తిత్వ వికాసానికి దోహదపడే ఎన్నో అంశాలను కవయిత్రి ప్రస్తావించారు. అంతేకాకుండా పర్యావరణం పరిరక్షణ ,మాతృభాష ప్రాశస్తము, కర్శక జీవితాలు, సదాచారాల వల్ల కలిగే లాభాలు, ఓటు వేయడం వల్ల పొందే ప్రయోజనాలు, ఇలా ఎన్నో ఆధునిక జీవనానికి మార్గదర్శనం చేసే అంశాలను స్పృశిస్తూ.. విద్య నేడు వ్యాపారం అయిపోయిందని ఆవేదన వ్యక్తం చేస్తూ ll విద్య జూడ నేడు పెద్ద వ్యాపారమై / సంఘ మందు వెలిసె స్వార్తముగను/ సంఘ హితము గోరు చదువు లవసరమ్ము / సకల కళల రాణి శారదాంబ ! అంటూ.. నేటి విద్యా విధానాన్ని సంస్కరించాలని ఆకాంక్షిస్తూ నైతిక విలువల పునరుద్ధరణ జరగాలని అభిలసించారు. అలాగే మాతృభాష మీద మమకారాన్ని చూయిస్తూ.. ఆ ll మాతృభాష కంటే మధురమైనది లేదు /మాతృమూర్తి కన్న మమత లేదు/ మాతృ భూమి కన్న మజిలి యెచ్చట లేదు/ సకల కళల రాణి శారదాంబ ! ఈ పద్యం ద్వారా మాతృభాష మధురిమను తెలుపుతూ, తెలుగు బాష తేనెకన్న తీయనైనదనీ, తెలుగు పద్యం వెలుగు బావుటాయని ,మాతృభాష మీది మమకారాన్ని రావూరి వనజ మనోజ్ఞంగా వర్ణించారు. అలాగే ఈ శతకంలో అన్నదానం విలువ తెలియజేస్తూ అన్నదానం చేయకుండా, అనాధలను ఆదుకోకుండా ఎన్ని తీర్థయాత్రలు చేసిన నిష్ఫల మని పేర్కొన్నారు. అన్నం పెట్టే అన్నదాత ను వర్ణిస్తూ .. ఆ ll రేయి పగలు తాను కాయకష్టం జేసి/ పంట పండ జేసి ప్రజల కిచ్చు/ నన్న దాత నీకు నందింతు జోతలు/ సకల కళల రాణి శారదాంబ ! అలాగే.. ఆ ll హృదయమందు బాధ పదిలముగను దాచి/ బువ్వ పెట్టు నట్టిబుద్ధి జీవి/ కర్షకుండే ఇలను కారుణ్య మూర్తి /సకల కళల రాణి శారదాంబ ! ఈ పద్యాల ద్వారా అన్నదాతకు అమృతం నీరాజనం పలుకుతూ అతడు లేకయున్న అన్నం పుట్టదు .కష్టజీవి కర్శకుడు లేకుంటే అన్నమే సున్నా.. అన్నం పెట్టిన వాడు దేవుడంటూ గొప్పగా అభివర్ణించారు. అలాగే ప్రకృతి నుంచి మనం ఎంతో లాభపడుతున్నామని, చెట్లను పెంచవలసిన బాధ్యత మనపై ఉందని తెలుపుతూ, చెట్లు ప్రగతికి మెట్లు ,ప్రాణవాయువును ఇచ్చి పూలు, పళ్లను ఇచ్చి, ప్రకృతి సంపదను, పర్యావరణంను సంరక్షిస్తాయని, మానవ జీవన వికాసానికి దోహదం చేస్తాయని చెట్ల యొక్క ప్రాముఖ్యతను తన పద్యం ద్వారా రచయిత్రి రావూరి వనజ హితబోధ చేశారు.
శారదాంబ శతకంలో ఇలాంటివి.. ఎన్నో సమాజానికి ఉపయోగపడే పద్యాలను రచించి, సమాజం పట్ల తనకున్న బాధ్యతను చాటుకుంటూ , గణిత శాస్త్ర అధ్యాపకులు, సామాజిక సేవా తత్పరులైన తన మామ గారు రావూరి సూర్యనారాయణ గారి ఆశీస్సులతో, శ్రీవారు రావూరి కృష్ణ కుమార్ గారి ప్రోత్సాహంతో, అకుంఠిత దీక్షతో అనన్య ప్రతిభా పాటవాలతో ,అచంచల ఆత్మవిశ్వాసంతో, అనతికాలంలోనే సుప్రసిద్ధ రచయిత్రి గా పేరు తెచ్చుకున్నారు. ఇందులో ఇంకొక విశేషం ఏమంటే ఆటవెలది పద్యంలో మూడవ పాదము ఓ సామెతగా భాసించడం . పెద్దలమాట పెరుగన్నం మూట గా అన్నట్టుగానే.. ఈ శతక కవయిత్రి పద్యాల్లోనూ సామెతలాంటి పాదాలు కనిపిస్తాయి. “వెళ్లి పోవునపుడు వెంటనేదియు రాదు / ధనము కన్న మనిషి గుణము ప్రధానంబు / అప్పు లేని వాడు హాయిగా నిద్రించు / ధనము గూర్చే వలయు ధర్మమార్గంలో నా / మాతృభాష కన్న మధురమైనది లేదు / మూట ముల్లె లేవి మాటతో సరిగావు …” ఇటువంటి సూక్తి తుల్య మైన సామెతలు కవయిత్రి పద్యాలకు అందాన్ని ఆపాదించి పెట్టాయి .సరళ సుందర సందేశాత్మక శతకాన్ని అందించిన కవయిత్రి రావూరి వనజ నూతన కవులను/కవయిత్రులను ప్రోత్సహించడానికి “తెలంగాణ రాష్ట్ర మహిళా సాహిత్య సాంస్కృతిక మండలి”ని ఏర్పాటు చేసి అధ్యక్షురాలిగాను కొనసాగుతున్నారు. మొత్తం మీద ఈ శతకంలో పలుకు బళ్ళు ,జాతీయాలు, ఉపమానాలు సహజ సుందరంగా ఉన్నాయనడములో అతిశయోక్తి లేదు. సామాజిక అంశాలతో కూడిన ఇలాంటి రచనలు, కవితా సంపుటాలు, శతకాలు రావూరి వనజ కలం నుంచి మరెన్నో పాఠకులకు చేరువ కావాలని, రావాలని ఆశిద్దాం.
పుస్తక సమీక్షకులు
బండారు సునీత
ఎమ్మే (తెలుగు), ఎమ్మే (హిందీ), ఎమ్మే (ఆంగ్లం), ఎమ్మెస్సీ (సైకాలజీ), *బి.ఎడ్, యచ్.పి.టి. – 9440671530.