తరుణి పాఠకులందరికీ నమస్కారం!
తురుణి పత్రిక ప్రారంభించి సంవత్సరం పైనే గడిచింది. ప్రారంభంలో పాఠకులు పరిచయం కావాలని ప్రతి రోజు కొన్ని ఆర్టికల్స్ ని పెడుతూ వచ్చేదాన్ని. కవయిత్రులు, రచయిత్రులు, కళాకారులు తరుణి పత్రికకు పరిచయం అయ్యాక, నేను ముందు నిర్ణయించుకున్నట్టుగా దినపత్రిక నుంచి వారపత్రికకు మార్చుకున్నాను. ఇదంతా బాగానే ఉంది. లబ్ద ప్రతిష్టులైన రచయితలు వర్ధమానకవయిత్రులు తరుణి ద్వారా పాఠకులకు పరిచయమయ్యారు. రచనలు ఎక్కువై అంటే లోడ్ ఎక్కువై వెబ్సైట్ తిరుగుతూ ఉండేది , సరిగ్గా ఓపెన్ కాకపోయేది !ప్రారంభంలో నేను తీసుకున్న వెబ్సైటు డిజైన్ ఎలాంటిదో సాంకేతిక విజ్ఞానం తెలియదు.సాంకేతికంగా ఇతరులపై ఆధారపడి చేస్తున్నాను. మళ్లీ వెబ్సైట్ డిజైన్ అంత చేంజ్ చేయించి ఇప్పుడు వస్తున్న విధంగా ఒక క్యాలెండర్ ఒక పద్ధతిగా చేయడానికి మళ్లీ కసరత్తు చేయాల్సి వచ్చింది. అప్పుడు ప్రారంభంలో వచ్చిన ఆర్టికల్స్ ఏవి ఇప్పుడు కనిపించడం లేదు కాబట్టి ఆ ఆర్టికల్స్ అన్ని మళ్ళీ ఇప్పుడు తరుణిలో చేర్చాలని నిర్ణయించుకున్నాను. చక్కని కవితలు, కథలు,ఉషోదయం, తరుణీయం ,ఉషోదయం, న్యాయ సలహాలు, డాక్టర్ సలహాలు అన్నీ కూడా ప్రతివారం కొన్ని కొన్ని పెట్టాలని నిర్ణయించుకున్నాను ఇది పాఠకులు గమనించాలని అభ్యర్థన. చిత్రాలు వాటికి నేను రచించిన చిత్ర కవితలు అన్ని చేరుస్తాను. చూడండి మీ అభిప్రాయాలను తెలియజేయండి.
మీ,
కొండపల్లి నీహారిణి, తరుణి పత్రిక వ్యవస్థాపకురాలు, సంపాదకురాలు.
“నాన్న దిద్దించిన రెండక్షరాలు….గుండెనుండి ఉవ్వెత్తున ఉప్పొంగే కవితలవుతాయననుకున్నానా?”
చాకలి పద్దు రాసి సంసారం దిద్దుకుంటే చాలని దిద్దించినక్షరాలు
దివిటీల వలె దిగంతాలదాకా వెలుగిస్తాయని తలచానా?
రెండక్షరాలొస్తే రెండో హృదయం తాకే కవితలల్లవచ్చని తలచానా?
ఏమో? ఏమైందేమో? రెండక్షరాలు
విస్ఫోటనమై, సమాజ పోకడ నచ్చలేదని నినదిస్తున్నాయ్!
అంతటా నవ్యత్వం కావాలని
అక్షర ధ్వజాలై రెపరెప మంటున్నాయ్!
సమస్యలను సమాధి చేయాలని,చెవినిల్లు కట్టుకుని
ఎలుగెత్తి అరుస్తున్నాయ్!
భావకుల హృదయాలను రంజిల చేయాలని,పఠితలముందు పద్యగద్యాలవుతున్నాయ్!
పసిపాపల కంటికి కమ్మని నిదురవ్వాలని జోలపాటలవుతున్నాయ్!
ఆ రెండక్షరాలు దిద్దకుంటే
దద్దమ్మ నై ఉండే దాన్నేమో?
అమ్మ చెప్పిన చాకలి పద్దు రాయడమే కాదు- జవాబుదారీ వ్యక్తులను ఉతికి ఆరవేస్తున్నాయ్ !
దిద్దాలి…దిద్దాలి .. రెండు అక్షరాలు
చిట్టా పద్దులై, పద్యాలై, కవితలై, పాటలై బతుకు పండించి పరవశింప చేస్తాయ్!
అటక మీద ఉన్న పలకక్కడే ఉంది!
తరతరాలను దిద్దించడానికి…
అక్షరాల మల్లెలు పూయించ..
వేలుపట్టుకుని దిద్దించి-గుబాళింపచేయ తరతరానికి అమ్మ అనే మల్లెచెట్టు ప్రతి ఇంటా ఉంది!!
రెండక్షరాల చెట్టు ప్రతి ఇంటా ఉండాలి!!