సారీ మర్చిపోయాను

కథ

తరుణి పాఠకులందరికీ నమస్కారం!
తురుణి పత్రిక ప్రారంభించి సంవత్సరం పైనే గడిచింది. ప్రారంభంలో పాఠకులు పరిచయం కావాలని ప్రతి రోజు కొన్ని ఆర్టికల్స్ ని పెడుతూ వచ్చేదాన్ని. కవయిత్రులు, రచయిత్రులు, కళాకారులు తరుణి పత్రికకు పరిచయం అయ్యాక, నేను ముందు నిర్ణయించుకున్నట్టుగా దినపత్రిక నుంచి వారపత్రికకు మార్చుకున్నాను. ఇదంతా బాగానే ఉంది. లబ్ద ప్రతిష్టులైన రచయితలు వర్ధమానకవయిత్రులు తరుణి ద్వారా పాఠకులకు పరిచయమయ్యారు. రచనలు ఎక్కువై అంటే లోడ్ ఎక్కువై వెబ్సైట్ తిరుగుతూ ఉండేది , సరిగ్గా ఓపెన్ కాకపోయేది !ప్రారంభంలో నేను తీసుకున్న వెబ్సైటు డిజైన్ ఎలాంటిదో సాంకేతిక విజ్ఞానం తెలియదు.సాంకేతికంగా ఇతరులపై ఆధారపడి చేస్తున్నాను. మళ్లీ వెబ్సైట్ డిజైన్ అంత చేంజ్ చేయించి ఇప్పుడు వస్తున్న విధంగా ఒక క్యాలెండర్ ఒక పద్ధతిగా చేయడానికి మళ్లీ కసరత్తు చేయాల్సి వచ్చింది. అప్పుడు ప్రారంభంలో వచ్చిన ఆర్టికల్స్ ఏవి ఇప్పుడు కనిపించడం లేదు కాబట్టి ఆ ఆర్టికల్స్ అన్ని మళ్ళీ ఇప్పుడు తరుణిలో చేర్చాలని నిర్ణయించుకున్నాను. చక్కని కవితలు, కథలు,ఉషోదయం, తరుణీయం ,ఉషోదయం, న్యాయ సలహాలు, డాక్టర్ సలహాలు అన్నీ కూడా ప్రతివారం కొన్ని కొన్ని పెట్టాలని నిర్ణయించుకున్నాను ఇది పాఠకులు గమనించాలని అభ్యర్థన. చిత్రాలు వాటికి నేను రచించిన చిత్ర కవితలు అన్ని చేరుస్తాను. చూడండి మీ అభిప్రాయాలను తెలియజేయండి.
మీ,
కొండపల్లి నీహారిణి, తరుణి పత్రిక వ్యవస్థాపకురాలు, సంపాదకురాలు.

నమస్తే నా ప్రభాతకమలం కు స్వాగతం.

మాలాకుమార్

సారీ మర్చిపోయాను. ఏమిటిది స్వాగతం చెపుతూ ఏమి మర్చిపోయావు తల్లీ అంటున్నారా? ఏమీ లేదండీ సామాన్యంగా సారీ మరిచిపోయాను అనే వాక్యం పిల్లాపెద్దా అందరి నోటా మనం తరుచుగా వింటూనే ఉంటాము. ఎవరి దాకో ఎందుకు ఎప్పుడో అప్పుడు మనకు కూడా కొన్ని సార్లు ఈ మరిచిపోవటము వలన ఇబ్బందులు ఎదురుకున్న సందర్భాలు ఉంటూనే ఉంటాయి. కాదంటారా? సరే ఈ వాక్యము మీదనే మనకథలూ, మనభావాలూ ఫేస్ బుక్ కథల గ్రూప్ లో 500 ల పదాల వరకూ కథ రాయమంటే నేను రాసిన కథ ఇప్పుడు మీకు వినిపించబోయే కథ అన్నమాట. అదే సారీ మర్చిపోయాను మినీ కథ. ఇక కథ విందాం రండి.

కథ పేరుసారీ మర్చిపోయాను!

పార్క్ లో వాకింగ్ చేస్తున్న కళ్యాణ్ “అరే కల్యాణ్” అన్న పిలుపుకు వెనక్కి తిరిగి చూసాడు. మదన్ కళ్యాణ్ ను సంభ్రమాశ్చర్యాలతో చూస్తున్నాడు. “హాయ్ మదన్ వాటే సర్ ప్రైజ్? ఎప్పుడొచ్చావు?” అంటూ మదన్ పక్కనున్న జయంతిని చూస్తూ “నువ్వూ వచ్చావా? ” అని సంతోషంగా అడిగాడు.

“మా పెద్దనాన్న మనవడి పెళ్ళికి వచ్చాము. నువ్వీ ఊళ్ళో ఉన్నావని తెలియదు. ఈ మధ్య మనం కలవక చాలా ఏళ్ళయ్యింది కదా” అన్నాడు మదన్.

“వసంత ఎలా ఉంది?” అడిగింది జయంతి.

“ఈ పక్కనే మా ఇల్లు. రండి మిమ్మలిని చూసి వసంత కూడా సంతోష పడుతుంది” అంటూ ముందుకు దారి తీసాడు కళ్యాణ్.

మదన్, కళ్యాణ్ ఉద్యోగంలో చేరిన కొత్తల్లో ఒకేచోట ఉండేవారు.అప్పుడే పెళ్ళిళ్ళు కూడా కావాటంతో ఇరు కుటుంబాలు ఒకటిగా కలిసిపోయి చాలా స్నేహంగా ఉండేవారు. రిటైరయ్యాక,దారులు వేరై కలవటం తక్కువయ్యింది. ఆ సంగతులన్నీ మాట్లాడుకుంటూ కళ్యాణ్ ఇంటికి వచ్చారు. వీధి తలుపు తీసి ఉంది. హాల్ లో టీ.వీ మోగుతోంది. వారిద్దరినీ కూర్చోమని “వసంతా” అని పిలుస్తూ లోపలికి వచ్చిన కళ్యాణ్, మంచం మీద పడుకొని పైకి చూస్తున్న వసంతను ఆశ్చర్యంగా చూస్తూ ” హాల్ లో టీ.వీ పెట్టి ఇక్కడ ఇట్లా పడుకున్నావేమిటి?” అడిగాడు.

“టీ. వీ పెట్టానా? మర్చిపోయాను” అని లేచింది వసంత.

“మదన్, జయంతి వచ్చారురా” పిలిచాడు.

హాల్ లోకి వచ్చిన వసంతను చూసి, “హాయ్ వసంతా” అంటూ దగ్గరకు వచ్చిన జయంతిని కొద్ది సేపు గుర్తుపట్టనట్లు చూసి, వెంటనే “హలో జయంతి” అని పలకరించింది వసంత.

“ఈరోజు వీళ్ళిద్దరూ ఇక్కడే ఉంటారు. వంట చేసేయి. భోజనం చేసి కబుర్లు చెప్పుకుందాం” అన్నాడు కళ్యాణ్ ఉత్సాహంగా.

” ఇంట్లో బియ్యం అయిపోయాయి. అయ్యో మీకు చెప్పటం మర్చిపోయా… సారీ” అంది వసంత నొచ్చుకుంటూ.

“పరవాలేదు కళ్యాణ్. ఏదైనా రెస్టారెంట్ కు వెళ్ళి సరదాగా కబుర్లు చెప్పుకుంటూ తిందాం. పదండి” అన్నాడు మదన్.

పాత, కొత్త కబుర్లు చెప్పుకుంటూ భోజనం ముగించారు. వసంత, జయంతి వాష్ రూం కు వెళ్ళారు. వాళ్ళు వెళ్ళిన వైపు చూస్తూ వసంతకు ఈ మధ్య మతిమరుపు ఎక్కువయ్యింది. తన మతిమరుపుతో నాకు చిర్రెత్తుకొస్తోంది” అన్నాడు కళ్యాణ్.

“కొన్ని సార్లు అందరమూ అలాగే మర్చిపోతుంటాము. దానికి చికాకెందుకు?” అన్నాడు మదన్.

“మామూలు మతిమరుపు కాదు. నువ్వే చూసావుగా, టీ.వి పెట్టి చూడటం మర్చిపోయిందిట. లోపల పడుకుంది. మిమ్మలినీ వెంటనేగుర్తు పట్టలేదు. మొన్న వంట చేయటానికి స్టవ్ వెలిగించి ఎందుకు వెలిగించిందో మర్చిపోయి బయటకు వచ్చి కూర్చుంది. పక్కింటి వాళ్ళు చూసి స్టవ్ ఆర్పేయలేదని చెప్పారు.ఫ్రిడ్జ్ ముందు, అలమారా ముందు నిలబడి ఇక్కడికి ఎందుకొచ్చానాని ఆలోచిస్తూ నిలబడిపోతుంది. ఉండుండి ఏదో ఆలోచనలో పడిపోతుంది.ఒకటా రెండా ఎన్నని చెప్పను. ఏ పని చెప్పినా సారీ మర్చిపోయాను అంటుంది. నాకు చిరాకు, కొన్ని సార్లు ఇదేమిటి అని డిప్రెషన్ వస్తుంది” అన్నాడు కళ్యాణ్.

“వసంతకు అరవై దాటాయి కదా. కొంత మంది కి వయసు వల్ల ఇలా మతిమరుపు వస్తుంది. దిగులు పడకు” అన్నాడు మదన్.

“అంటే కొంపతీసి అల్జీమర్స్ కావచ్చంటవా? ఈ మధ్య ఒకావిడెవరో మా ఇంటికి వచ్చి ఇది మా ఇల్లు. మీరెందుకున్నారిక్కడ అని గొడవ పడింది. ఎన్నిసార్లడిగినా ఆమె పేరు కూడా చెప్పలేకపోయింది. ఏమి చేయాలా అనుకుంటుంటే వాళ్ళ అబ్బాయి ఆమెను వెతుక్కుంటూ వచ్చి, ఆవిడకు మతిమరుపు వ్యాధి వచ్చిందని సారీ చెప్పి తీసుకెళ్ళాడు. అట్లా కాదుకదా!” అన్నాడు కళ్యాణ్ భయంభయంగా.

“అట్లా ఎందుకనుకుంటావు? ఈ మతిమరుపుకు చాలా కారణాలుంటాయి. ఈ మధ్య మా మామయ్య కొడుకుకు కూడా ఇలాగే మతిమరుపు వచ్చింది. డాక్టర్ కు చూపించాము. కొంతమందికి వయసు వల్ల, లేదా కొన్ని హార్మోనల్ డిస్టర్బెన్స్ వల్ల, డైయాబిటిక్, హై బీ.పీ, కొన్ని మిటవిన్స్ లోపం వల్ల, ఇంకేదైనా జబ్బు వల్ల కూడా రావచ్చుట. డాక్టర్ చెప్పాడు” అన్నాడు మదన్.

“మరి దేనితో వచ్చిందో, అసలు వసంతది అల్జీమర్స్ నేనా? ఎట్లా తెలుస్తుంది?” అడిగాడు కళ్యాణ్.

“కొన్ని క్లినికల్ పరీక్షలు, mmseపరీక్షలు చేసి వ్యాధి ఏ స్టేజ్ లో ఉందో నిర్ధారిస్తారు. వ్యాధి ప్రారంభదశలోనే ఉంటే కౌన్సిలింగ్ చేస్తారు.మైండ్ ఎక్సర్సైజ్ లు అంటే పజిల్స్ చేయటమూ, వర్డ్ బిల్డింగ్ లాంటి ఆటలాడటమూ చేయమన్నారు.అవసరమనుకుంటే మందులు ఇస్తారు. అసలు చిన్నపటి నుంచే మెదడును ఆక్టివ్గా ఉంచేలా పిల్లలను క్విజ్ పోటీలల్లో పాల్గొనేలా చేయాలి. మన మెదడు పూర్తిగా కొవ్వుతో ఉంటుందిట. అందుకని మెదడును ఆరోగ్యంగా, ఆక్టివ్ గా ఉంచాలంటే కొవ్వు, జింక్ మొదలైన పోషక పదార్ధాలు ఉన్న పల్లీలు, శెనగలు మొదలైన గింజలు పిల్లలకు పెట్టాలిట. మనమూ నానేసిన బాదం పప్పులూ, అక్రూట్ లాంటివి తినాలిట. కొబ్బరి ఎక్కువగా తినాలిట. అంతెందుకు కొబ్బరి ఎక్కువగా తినే కేరళవారికి చూడు ఎన్ని తెలివి తేటలుంటాయో.మన శరీరభాగాలన్నిటికన్నా మెదడుకు ఆక్సిజన్ ఎక్కువ అవసరమట. అందుకని ప్రాణాయామము లేదా డీప్ బ్రీత్ ఎక్సర్సైజ్ లు అనుకో రోజూ తప్పనిసరిగా చేసి మెదడుకు ప్రాణవాయువును అందించాలట. వీటన్నిటినీ ముందు నుంచి పాటిస్తే వీలయినంతవరకు మతిమరుపు వ్యాధి రాకుండా నిరోధించ వచ్చు.ఈ విషయాలన్నీ నేను మా కజిన్ తో డాక్టర్ దగ్గరకు వెళ్ళినప్పుడు తెలిసాయి. నేనుకోవటము వసంతకు వయసుతో వచ్చిందే కావచ్చు. నువ్వు చెప్పిన దానినిబట్టి ప్రారంభదశలోనే ఉంది. డాక్టర్ కు చూపిద్దాము. తగ్గిపోతుంది.దిగులు పడకు”అనునయంగా అన్నాడు మదన్.

వసంత, జయంతి వాష్ రూం నుంచి రావటం తో వారి సంభాషణను ఆపేసారు. బేరర్ బిల్ తెచ్చాడు. నేనిస్తానంటేనేనిస్తాని వాదించుకున్నాక, వాదనలో గెలిచిన కళ్యాణ్ పర్స్ తీసి చూసి “వసంతా నిన్న నా క్రెడిట్ కార్డ్ తీసుకున్నావు. మళ్ళీ పర్స్ లో పెట్టలేదా?” అడిగాడు.

“అయ్యో పెట్టలేదా? సారీ మర్చిపోయానండీ!”

ఇదండీ ఈనాటి మిని కథ సారీ మర్చిపోయాను. ఈ కథ మీద మీ అభిప్రాయం చెపుతారుగా. వచ్చే వారం మరో కథతో కలుసుకుందాము. అందాకా సెలవా మరి.

Written by Mala kumar

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

అనగనగా అమెరికా

రెండక్షరాల కవిత