ఆదర్శ మాతృమూర్తి కుంతి!

మాధవపెద్ది ఉషా

కన్న తల్లిని మించిన దైవం వేరు లేరని మన శాస్త్రాలు ఘోషిస్తున్నాయి.
అంతే కాదు తల్లి ప్రేమని పొందని వారు నిజంగా దురదృష్టవంతులే! సందేహం లేదు!!
◦ పూర్వం ఒక రాజుగారు సభలో కొలువు తీరి ఉండగా, రాజభటులు, ఇద్దరు యువతలు ఒక బిడ్డతో సహా వచ్చి మహారాజా ఈ ఇద్దరు యువతులూ,ఈ బిడ్డ నాదంటే నాదని వాదులాడుకుంటున్నారు. మీరే ఈ సమస్యకు పరిష్కారం చూపుతారని మీ దగ్గరకు తెచ్చామని చెప్పారు.
◦ అప్పుడు రాజుగారు వీరికి తగిన న్యాయం
చేయమని మంత్రిగారిని ఆదేశించారు. అప్పుడు మంత్రిగారు ఈ చిక్కుముడిని విప్పేందుకు పూనుకుని, ఆ ఇద్దరు స్ర్తీలను ఉద్దేశించి ఈ బిడ్డ మీలో ఎవరిదమ్మా? అని ప్రశ్నించారు. వారిద్దరూ నాదంటే నాదని ముక్తకంఠంతో పలికారు. అప్పుడు కొద్ది సేపు ఆలోచించి ఈవిధంగా పలికారు మంత్రిగారు. ‘ చూడండమ్మా మీరిద్దరూ ఈ బిడ్డ ఎవరికి వారు నాదే అంటున్నారు కానీ అది సంభవం కాదు. అందుకే మీ తృప్తికోసం ఈ బిడ్డను సగం చేసి మీ ఇద్దరికీ పంచి, మీకు న్యాయం చేస్తాము, మీకు సమ్మతమేనా?’ అని అడిగారు.
అప్పుడు వారిలో ఒక స్త్రీ అలాగే చేయండి అన్నది. కానీ మరో స్త్తీ మాత్రం ‘ వద్దు వద్దు అలా చేయకండి మహారాజా….నా బిడ్డను ఆమెకే ఇచ్చి వేయండి….. ఎక్కడో అక్కడ నా బిడ్డ పది కాలాలపాటు జీవించి ఉండాలని నేను కోరుకుంటున్నాను. దయచేసి నా బిడ్డని చంపకండి అని ప్రాధేయపడింది.
వెంటనే మంత్రిగారు రాజుగారివైపు తిరిగి, మహారాజా ఈమే అసలు తల్లి అని కచ్చితంగా నిర్ణయించారు. అదీ తల్లి హృదయం!!! తన కన్న బిడ్డలకోసం ఏత్యాగానికైనా ఒడికడుతుంది ఏ తల్లి అయినా!
ఈ సందర్భంలో, మనం పంచమవేదమైన మహాభారతంలోని కుంతి పాత్రని ఆదర్శంగా తీసుకోవచ్చు. పాండురాజు భార్యలైన కుంతి, మాద్రిలలో మాద్రి పాండురాజు మరణానంతరం సహగమనం చేస్తూ తన పుత్రులైన నకుల, సహదేవులను కుంతికి వప్ప చెప్పింది.
కుంతి కూడ అంతటి గురుతర భాద్యతను, స్వీకరించి వారిపై, తమ పుత్రులతో సమానంగా, మాతృప్రేమను కురిపించి కంటికి రెప్పలా కాపాడి పెంచింది. ముఖ్యంగా, సహదేవుడిని పంచపాండవులలో అందరికన్నా చిన్నవాడని, ప్రత్యేకంగా చూసిందని భారతం చదువుతే మనకు తెలుస్తుంది.


కుంతి తన జీవితమంతా తనపిల్లల కోసమే శ్రమించి, తపించింది. అంతే కాదు తన కుమారుడైన కర్ణుడి గురించి అనుక్షణం తలుచుకుని కుమిలిపోయేది. లోకులు పాండవులతో సహా అతనిని సూత పుత్రుడని, పిలుస్తుంటే విని తట్టుకోలేక, ఏకాంతంలో దుఖ్ఖిస్సూ ఉండేది. తన సంతానం మీద ఆమెకి అంతటి ఎనలేని ప్రేమ ఉండేది.
ఇక కురుక్షేత్ర యుధ్ధానంతరం ధర్మరాజు పట్టాభిషిక్తుడైన తరువాత అతని కోరికననుసరించి దృతరాష్ర్టుడు, గాంధారీ సమేతుడై పాండవుల దగ్గర కాలం వెళ్ళబుచ్చసాగారు. కానీ భీమసేనుడు మాత్రం రోజూ వచ్చి వారిద్దరినీ ఏదో ఒకటి అని బాధ పెట్టేవాడు. ఆ అవమానాలను తట్టుకోలేక ఒకసారి విదురుడికి చెప్పుకున్నాడు దృతరాష్ట్రుడు.
అప్పుడు విదురుడు పరాయిపంచన ఎన్నాళ్ళుంటారని బుద్ధి చెప్పి వనమునకు ప్రస్థానం కమ్మని దిశానిర్దేశం చేయగా సరేనని అడవులకు బయలుదేరారు. మరుక్షణమే కుంతిదేవి కూడ వారి సేవ చేసుకునే మిషతో తను కూడ వారితో బయలుదేరింది. ధర్మజుడు వారంచినా ససేమిరా అన్నది. ఎందుకో తెలుసా?
◦ ఎందుకంటే అప్పటికే గర్భశోకంతో ఉన్న శివభక్తురాలైన గాంధారి, తనపిల్లలు రాజ్యం అనుభవించడం చూసి ఓర్వలేక ఎక్కడ వాళ్ళను శపిస్తుందోనన్న భయంతోనే ఆమె అలా చేసింది. అక్కా, బావగార్ల దగ్గర ఉండి

◦ వారి శుష్రూష చేసుకుంటే గాంధారియొక్క క్రోధాగ్ని కొంతలో కొంతైనా చల్లారవచ్చు అన్న ఆలోచనతోనే, ఆ మహా సాధ్వి రాజమాతగా తను పొందుతూ ఉన్న రాజభోగాలన్నిటినీ తృణప్రాయంగా త్యజించివేసింది. అనంతరం వారితోపాటు వానప్రస్థానపు నియమాలను పాటిస్తూ, చివరికి దావాగ్నికి ఆహుతి అయిపోయింది. తల్లి ప్రేమకు ఇదే పరాకాష్ట!!!!కాదనగలరా???
17-3-2021
మాధవపెద్ది ఉష

Written by Madhavapeddi Usha

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

అమ్మా….! ఒక్కసారి ఆలోచించు..

అనగనగా అమెరికా