చల్లనిగాలి మొహాన్ని తాకటంతో విశాలాక్షికి మెలకువ వచ్చింది. కళ్ళు తెరిచి గోడ గడియారం వైపు చూసింది. ఐదు దాటుతోంది. అయ్యో ఏంటి ఇంతసేపు పడుకున్నాను అనుకుంటూ పక్కకి ఒత్తిగిల్లి మంచం దిగి, హాల్లోకి నడిచింది. అంతా నిశ్శబ్దంగా ఉంది. శ్లోక కనిపించలేదు.. టీ మరుగుతున్న వాసన కూడా లేదు.. రోజూ ఈ పాటికి టీ తీసుకుని వచ్చి నిద్రలేపే కోడలు ఏం చేస్తోంది.. ఆవిడ అనుమానంగా శ్లోక గదివైపు వెళ్ళింది.. అక్కడా కనిపించలేదు. బాత్ రూమ్ తలుపు తెరిచే ఉంది. వీధి తలుపు లోపల గడియ వేసి ఉంది. ఎక్కడికి వెళ్ళింది ఈ పిల్ల? ఆవిడ బాల్కనీ వైపు నడిచింది.
బాల్కనీలో ఒక మూల స్టూల్ మీద కూర్చుని ఉంది శ్లోక.. ఆ పిల్లని చూస్తుంటే ఏదో దీర్ఘంగా ఆలోచిస్తున్నట్టు కనిపిస్తోంది . కోడలివైపు జాలిగా చూస్తూ దగ్గరకు నడిచింది ఆవిడ. శ్లోక కూర్చున్న స్టూల్ వెనక ఎయిర్ బ్యాగ్ ఉంది. ఆ బ్యాగ్ బరువుగా ఉంది. ఆవిడ నొసలు ముడిపడ్డాయి.
అత్తగారి అడుగుల చప్పుడుకి శ్లోక ఉలిక్కిపడి లేచి నిలబడింది.
ఆవిడ కోడలి మొహం లోకి, గోడకి ఆనించి పెట్టిన బ్యాగ్ వైపు మార్చి, మార్చి చూసింది.
అనుభవజ్ఞురాలైన ఆవిడ దృష్టిలో , శ్లోక కనుకొలకుల తడి పడనే పడింది. ఆమె హృదయం కోడలిపట్ల జాలితో నిండింది.. శ్లోకకి ఆ జాలి చూపులంటే భయం.. అందుకే తలవంచుకుంది.
బాల్కనీ పిట్టగోడ మీదకి వంగిన బాదం చెట్టు నుంచి రాలిపడిన పండుటాకులు , శ్లోక కూర్చున్న కుర్చీ దగ్గర తుంపి కుప్పలా పడిఉన్నాయి. ఆ కుప్ప శ్లోక మనసులో చెలరేగుతున్న సంఘర్షణని తెలియచేస్తోంది. ఆవిడకి కోడలి మానసిక స్థితి అర్థం అయింది. ఏం చేయాలో తెలియక ఏదన్నా చేయాలన్న ఆలోచనలతో తల్లడిల్లిపోతున్న ఆ అమ్మాయి మనసు తేటతెల్లం చేస్తోంది ఆ కుప్ప. ఆవిడ హృదయం ద్రవించింది. పచ్చటి శ్లోక కుడిచెంప మీద ఎర్రగా గీరుకుపోయిన గీత ఒకటి కనిపించింది. ఆవిడ కళ్ళల్లో విపరీతమైన జాలి కదిలింది. ఆ గీత ఎలా వచ్చిందో ఆవిడకి తెలుసు. తన కొడుకు చేసిన గాయం..ఆమె శరీరం మీద అలాంటి గాయాలు చాలా చేస్తున్నాడు ఆ కొడుకు.. కానీ అవి కోడలి శరీరం మీద కాదు.. తన మాతృత్వం మీద.
తను, తన భర్త కూడా ఎంతో, క్రమశిక్షణతో జాగ్రత్తగానే పెంచారు కొడుకుని. ఒకే ఒక్క కొడుకని కోరిన చదువు చెప్పించారు.. కోరినదల్లా కాదనకుండా చేసారు.. ఆయన పోయిన తరువాత కూడా తను ఎంతో ప్రేమగా చూసుకుంది.. పెళ్లి చూపులకి వెళ్ళేరోజు కూడా అడిగింది… “ నీ మనసులో ఎవరన్నా ఉన్నారా చెప్పు నాన్నా!” అని..” అదేం లేదమ్మా” అన్నాడు మనస్ఫూర్తిగా.
పెళ్ళిచూపుల నాడు కూడా పదే , పదే అడిగింది “నీకు నచ్చిందా అమ్మాయి” అని.
ఆనాడు, ఆ తరవాత కూడా తను కని, పెంచి పెద్దచేసిన కొడుకులో ఇంత రాక్షసత్వం ఉందని ఊహించలేదు. ఎలా వచ్చింది? ఎప్పుడూ అందరితో సరదాగా, కలుపుగోలుగా ఉండేవాడు.. ఎవరినీ ఏమి అనలేదు… అలాంటి ఫిర్యాదులు కూడా తను ఏనాడూ వినలేదు.. పెళ్లి అయిన కొన్ని రోజులు ఇద్దరూ ప్రేమగానే ఉన్నారు.. అకస్మాత్తుగా వాడు ఎందుకు ఇంత క్రూరంగా అయాడు? ఆవిడకి మనసంతా ఆందోళనతో నిండింది.. శ్లోక బుద్ధిమంతురాలు.. ఈ రోజుల్లో ఆడపిల్లలు చిన్న మాట అన్నా get అవుట్ అని అనేస్తున్నారు మొగుడిని. అలాంటిది.. మొగుడు కొట్టినా పడి ఉంటోంది ఈ పిల్ల… ఎలా వచ్చింది ఈ సహనం..
అత్తగారు తన వైపే అలా చూస్తూ నిలబడిపోవడంతో శ్లోక ఇబ్బందిగా తల వంచుకుంది.
ఆవిడ తనని తాను తమాయించుకుని “ టీ పెట్టలేదేమ్మా “ అంది..
శ్లోక తడబడుతూ “ పె .. పెడతాను.. మీరు లేవలేదు కదా అని..” అసంపూర్ణంగా ఆపేసింది వాక్యం
“ఇప్పుడు లేచాగా “ అందావిడ పెదాల మీద నవ్వు పులుముకుని. .
“పెడతాను..” శ్లోక ఆవిడని దాటుకుని వంట గదివైపు నడవబోయింది.
“ఆ బ్యాగ్ కూడా తీసుకుని వెళ్లి లోపల పెట్టు” అంది ఆవిడ.
శ్లోక ఒక్క క్షణం అలాగే నేలకి పాదాలు అంటుకున్నట్టు కదలకుండా తలవంచుకుని నిలబడింది.
ఆవిడ కోడలి భుజం మీద చేయి వేసి మృదువుగా అంది..“ తీసుకో.. లోపల పెట్టు. టీ తాగాక మాట్లాడుకుందాం “ అంది.
శ్లోక గబుక్కున బ్యాగ్ తీసుకుని వేగంగా తన గదివైపు వెళ్లి బ్యాగ్ మంచం మీద పడేసి వచ్చి టీ పెట్టడానికి వంటగదిలోకి వెళ్ళిపోయింది.
విశాలాక్షి డైనింగ్ టేబుల్ దగ్గర కుర్చీ లాక్కుని కూర్చుంది. మోచేయి టేబుల్ మీద పెట్టి, అరచేతిలో గడ్డం ఆనించుకుని స్టవ్ దగ్గర వెనక నుంచి కనిపిస్తున్న కోడలి వైపు జాలిగా చూస్తూ కూర్చుంది.. పెద్ద జడ ఆమె కదలికలికలకి అటూ, ఇటూ తిరుగుతోంది. చీరకి , జాకెట్ కి మధ్య పచ్చని నడుం భాగం అందంగా ఉంది కవులు వర్ణించినట్టు..
“అమ్మా! అమ్మాయి జడ బాగుంది కదూ “ తన చెవిలో రహస్యంగా చెబుతున్న హరీష్ స్వరం అస్పష్టంగా వినిపించింది..
ఆవిడ తల విదిలించింది..
“అమ్మాయి చాలా బాగుందమ్మా! ఈ మ్యాచ్ ఫైనల్ చేసేయి..” పెళ్లిచూపులు చూసి ఇంటికి వస్తుంటే కారులోనే చెప్పేసాడు. అలా చెబుతున్నప్పుడు అతని మొహం లో కనిపించిన ఆనందం టేబుల్ నీడలో తారాడింది.
“మరి ఏమొచ్చిందిరా దరిద్రుడా! ఆరోజు కనిపించిన అందం ఇప్పుడెందుకు కనిపించడం లేదు నీ భార్యలో. అందంతో పాటు, అణకువ, చదువు, మంచి కుటుంబ నేపథ్యం … నీకింకా ఏం కావాలిరా! ఎందుకు దాని ఉసురుపోసుకుంటున్నావు”?
ఆవిడ పళ్ళు కోపంతో గిట్టకరుచుకున్నట్టు అయాయి. కంఠం దగ్గర నరాలు బిగుసుకున్నాయి. శ్లోక టీ ట్రే తో వచ్చింది.
ఆవిడ సర్దుకుంటూ టీ కప్పు అందుకుంది. తన టీ కప్పు తీసుకుని వెళ్తున్న కోడలి వైపు చూసి చిరునవ్వుతో అంది “కూర్చో.. ఇద్దరం కలిసి తాగుదాం “ అంటూ డైనింగ్ టేబుల్ మీద ఉన్న బూందీ సీసా దగ్గరకు లాగింది. అక్కడే ప్లేట్ స్టాండ్ లో ఉన్న ప్లేట్ తీసుకుని బూందీ అందులో వేసింది. ఇద్దరికీ మధ్యలో బూందీ పెట్టి తీసుకో అన్నట్టు సైగ చేసింది కోడలికి.
గొణుగుతున్నట్టు “ వద్దత్తయ్యా టీ తాగుతాను చాలు “ అంది శ్లోక.
ఆవిడ చూపుడు వేలు, బొటనవేలుతో రెండు బూందీ నోట్లో వేసుకుని నెమ్మదిగా అంది “ఎయిర్ బ్యాగ్ బయట ఎందుకు పెట్టావు? ఎవరూ చూడకుండా రాత్రికి ఇంట్లో నుంచి వెళ్లిపోదామనా!”
శ్లోక సిప్ చేసిన రెండు చుక్కల టీ గొంతులో అడ్డంగా ఉండి పోయింది. తల మరింతగా వంచుకుంది.
“తలవంచుకునేంత తప్పు నువ్వు చేయలేదు.. నాకు తెలుసు. కానీ, నువ్వు అలా వెళ్ళిపోతే లోకం లేచిపోయావు అంటుంది అప్పుడు నేను తలవంచుకోవాలి. నీకు అది ఇష్టమా !”
శ్లోక మాట్లాడలేదు.. కన్నీళ్లు ఉబికి వస్తుంటే టీ కప్పు చేతిలో పట్టుకుని మౌనంగా ఉండిపోయింది.
“శ్లోకా ! నాకు తెలుసు వాడు నీ పట్ల చాలా క్రూరంగా ప్రవర్తిస్తున్నాడు.. అది భరిస్తూ పాతకాలం ఆడవాళ్ళలా పడి ఉండమని నేను చెప్పను.. కానీ వెళ్ళేముందు ఒంటరిగా ఎక్కడికి వెళ్ళాలి?. ఎలా బతకాలి? అనే స్పష్టత ఉందా! నిన్ను ఆదరించి ఒక జీవితం ఇచ్చేవాళ్ళు ఎవరన్నా ఉన్నారా!”
శ్లోక చివ్వున తలెత్తింది..
ఆవిడ జాలిగా నవ్వింది.. “నాకు తెలుసు నువ్వు ఎంత మంచిదానివో! అందుకే భయపడుతున్నాను. అలా అని ఇక్కడే ఉండమనీ చెప్పను.. కానీ, వెళ్లేముందు సరైన అండ వెతుక్కో.. ఒక ఉద్యోగం వెతుక్కో.. ఒక స్థిర నివాసం వెతుక్కో.. అన్నీ వెతుక్కున్నాక నాకు చెప్పు.. దగ్గరుండి పంపిస్తా.. ఇలా దొంగతనంగా వెళ్లక్కరలేదు.”
శ్లోక టీ కప్పు టేబుల్ మీద పెట్టేసి తల టేబుల్ మీద వాల్చి వెక్కి, వెక్కి ఏడవసాగింది ..
ఆవిడ స్వరంకూడా దుఃఖం తో పూడుకుపోయింది..
వాళ్ళ పెళ్లి అయి ఏడాది దాటుతోంది.. బహుశా ఐదారు నెలలు బాగా చూసుకుని ఉంటాడు భార్యని హరీష్. ఆ తరవాత నుంచీ ప్రతి చిన్న విషయానికీ, భార్యని కసురుకోడం, ఏం చేసినా వంకలు పెట్టడం, ఒక్కతీ కూర్చుని ఫోన్ మాట్లాడుకుంటూ ఉంటే వెటకారంగా “ఎవరితో అంత రహస్యంగా మాట్లాడుతున్నావు” అని అనుమానించడం.., ఆ అమ్మ్యాయి సమాధానం చెబితే “హౌ డేర్! నాకు ఎదురు సమాధానం ఇస్తావా!” అని చెంప పగల గొట్టడం అన్నీ ఆవిడ కళ్ళ ముందే జరుగుతున్నాయి. అక్కడికీ ప్రారంభంలో కల్పించుకుని “ ఎందుకురా అలా అరుస్తున్నావు? ఏమైంది నీకు.. ఆ అమ్మాయి ఏమందని.ల్.” అని కల్పించుకుంది.
“ అమ్మా . ఇది నా పర్సనల్ విషయం నువ్వు కలగచేసుకోవద్దు “ అంటూ కసురుకున్నాడు.
ఏం జరిగిందమ్మా.. వాడెందుకు అలా కసురుకుంటున్నాడు? ఏమన్నా అన్నావా!” అని అడిగింది కోడలిని..
లేదత్తయ్యా నేనేమి తప్పు చేయలేదు..” అంటూ బావురుమంది.
ఆరోజు నుంచి ఇద్దర్నీ అబ్సేర్వ్ చేస్తోంది.. ఎంత లోతుగా, పరిశీలనగా చూసినా శ్లోకలో తప్పేమీ కనిపించలేదు.
ఏనాడూ లేనిది ఇటీవల ఆఫీస్ నుంచి లేట్ గా వస్తున్నాడు.. పోనీ ఎక్కడో తిని, తాగి వస్తాడా అంటే అదీ లేదు.. రాగానే భార్య నిద్రలో ఉన్నా గట్టిగా కసురుతూ లేపి “అన్నం పెట్టు.. మహరాణిలా పడుకున్నావేంటి” అంటాడు నిర్దయగా.
ఒక సగటు మగాడిలా ప్రవర్తిస్తున్న సాఫ్ట్ వేర్ ఇంజనీరు ని చూసి ఆవిడే నిర్ఘాంత పోయింది. మగాడికి పెళ్ళాం అనే పేరుతొ ఒక ఆడపిల్ల దగ్గరగా రాగానే ఆ పిల్ల మీద అన్ని హక్కులు వచ్చినట్టేనా..
“నేనేం చేసానత్తయ్యా ఆయన ఎందుకలా ప్రవర్తిస్తున్నారు” అని కన్నీళ్ళతో అడిగిన కోడలికి సమాధానం చెప్పడానికి ఆవిడ కి తెలిస్తే కదా!
“అక్కడికీ అతను కసురుకున్నా నాలుగుసార్లు మండ పడింది.. “ఏమొచ్చిందిరా నీకు.. భార్య మీద చేయి చేసుకుంటున్నావు.. తలకాయ తిరుగుతోందా “ అని.
చేతికి అందిన వస్తువు విసిరేసి కోపంగా బయటకు వెళ్ళిపోడం తప్ప మరో సమాధానం లేదు. “వీడు నా కొడుకేనా.. నేనింత దరిద్రంగా పెంచానా వీడిని” అని ఆలోచించడంతోటే గడిచిపోతోంది కాలం.
కాలింగ్ బెల్ మోగింది.. ఆవిడ ఆలోచనల నుంచి తెప్పరిల్లింది..
శ్లోక తల తిప్పి డోర్ వైపు చూసింది. చెంగుతో కళ్ళు తుడుచుకుని లేచివెళ్లి తలుపు తీసింది..
చేతిలో వెండి కుంకుమ భరిణ తో పక్క ఫ్లాట్ విశ్వ నిలబడి ఉంది . “రండి” అడ్డు తొలగి నవ్వు పులుముకుని ఆహ్వానించింది.
విశ్వ లోపలికి వచ్చి శ్లోక నుదుటి మీద బొట్టు పెట్టి “ రేపు నేను, పక్కన అమ్మవారి గుళ్ళో కైలాస గౌరీ వ్రతం చేసుకుంటున్నాను .. వచ్చి పసుపు, కుంకుమ తీసుకోండి.. అలాగే లంచ్ కూడా చేసి వెళ్ళండి” అని చెప్పి విశాలాక్షి వైపు నడిచి “ ఆంటీ మీరు కూడా వచ్చి భోజనం చేసి వెళ్ళండి “ అంది.
“కూర్చో విశ్వా!” . అంది ఆవిడ..
“లేదాంటీ..చాలా పనుంది.. రేపటికి అన్నీ అరేంజ్ చేసుకోవాలి.. వస్తాను” అని శ్లోక వైపు తిరిగి “త్వరగా రండి.. మళ్ళి క్యూ పెరుగుతుంది” అని “ఏంటి డల్ గా ఉన్నారు.. ఒంట్లో బాగా లేదా” అంది.
“లేదు.. బాగానే ఉన్నా.. పడుకుని లేచాను” అంది శ్లోక రాని నవ్వు తెచ్చుకుంటూ.
“ఓ కే బై …తప్పకుండా రండి “ మరోసారి చెప్పి విశ్వ వెళ్ళిపోయింది.
తలుపు వేసి వచ్చింది శ్లోక.
విశాలాక్షి ఆలోచించ సాగింది.. కైలాస గౌరీ వ్రతం.. శ్రావణ గౌరీ వ్రతం,,, పూ తాంబూలం, పండు తాంబూలం.. ఇలాంటి ఏ నోములు తను ఈ అమ్మాయితో నోయించలేదు.. తనకి ఆ అర్హత లేదు. కనీసం ఈ మె తల్లికి అన్నా ఉండాలి కదా. అందుకేనా ఇష్టంగా చేసుకున్న భార్యని అంత నిర్దయగా చూస్తున్నాడు వాడు.. నిజంగా నోములలో మహత్తు ఉందా.. నిజానికి విశ్వ ఎప్పుడూ నవ్వుతూ, హుషారుగా ఉంటుంది.. మొగుడూ, పెళ్ళాం చిలకా, గోరింకల్లా సినిమాలకి, షికార్లకి వెళ్ళడం తను చాలా సార్లు చూసింది.. విశ్వే కాదు.. ఈ అపార్ట్ మెంట్ లో చాలా జంటలు అన్యోన్యంగా ఉంటాయి.. మరి ఈ అమ్మాయి ఖర్మ ఎందుకిలా అయింది..
ఆవిడ ఆలోచన తెగలేదు.. శ్లోక నిశ్శబ్దంగా తన పనుల్లో పడిపోయింది.. రాత్రి డిన్నర్ కి ఏవో చేస్తోంది కిచెన్ లో.
దొరగారు అర్ధ రాత్రి, అపరాత్రి వచ్చేసరికి వేడి, వేడిగా అన్నీ సిద్ధంగా ఉండాలి.. ఒకరోజు తిన్నది మరో రోజు తినడు.. ఈ అలవాటు ఇంతకు ముందు లేదు తనేది పెడితే అదే తినేవాడు.. పెళ్లి అయాక భార్య అంటే పని మనిషి, వంట మనిషి అనుకుంటాడా మగవాడు.. ఆయన ఏనాడూ అలా చేయలేదే.. ఆవిడకి భర్త గుర్తు వచ్చాడు. పెళ్లి అయిన కొత్తల్లో ´రాత్రికి ఏం చేయమంటారు” అని అడిగితే , “ ఏదో ఒకటి చేయి.. అయినా పొద్దున్న కొంచెం ఎక్కు వ చేస్తే చాలుగా ఎందుకు రెండు సార్లు పని పెట్టుకుంటావు.. కిచెన్ లో టైం వెస్ట్ చేయకు.. ఏదన్నా ఉపయోగకరమైన పని చేయి.. చదువుకో.. డిగ్రీ రాయచ్చుగా.. ఇంటర్తో ఆగిపోతావా.!”
ఆరోజు తన తల గిర్రున తిరిగింది . ఇలా అనే భర్తలు ఉంటారా అనుకుంది. తనకి పెద్దగా శ్రద్ధ లేకపోయినా ఆయన బలవంతం మీద డిగ్రీ సంపాదించింది డిస్టెన్స్ ఎడ్యుకేషన్ ద్వారా… ఆయన ప్రోత్సాహంతో హాండీ క్రాఫ్ట్స్ నేర్చుకుంది.. పిల్లలు పుట్టాక వాళ్ళ బాధ్యతలు మీద పడ్డాక ఆగిపోయింది . అలాంటి వ్యక్తీ తొందరపడి వెళ్ళిపోయారు.. ఉండి ఉంటే వీడి చెంప పగల గొట్టి “వెధవా! భార్య అంటే బానిస కాదురా” అని చెప్పేవారు కాదా! చెట్టంత కొడుకుని తను ఎలా కొట్ట గలదు !.
మర్నాడు శ్లోక, ఆవిడ కలిసి విశ్వ చేసుకుంటున్న నోముకి వెళ్ళారు. అపార్ట్ మెంట్ లో ఉన్న ఆడవాళ్ళు, పట్టు చీరలు, తలలో పూలు, చేతుల నిండా గాజులు కళకళలాడుతూ వచ్చారు. అందరికీ దోసిళ్ళతో పసుపు, కుంకుమ పంచి పెడుతోంది విశ్వ.. కోడలి వైపు చూసింది విశాలాక్షి, నారింజ రంగు చీరకు కాపర్ సల్ఫేట్ బోర్డర్ ఉన్న కంచి పట్టు చీర, మెడలో తాళి, నల్ల పూసల గొలుసు, కంఠాన్ని చుట్టుకుని చిన్న నెక్లస్ , చెవులకు జూకాలు..
ఆవిడ మనసంతా జాలితో నిండిపోయింది.. . బంగారు బొమ్మ .. ముట్టుకుంటే మాసిపోయే రంగు.. ఎండిన ఆకు, మీద పడితే కందిపోయే నాజూకుదనం.. ఈ పిల్ల ఒంటి మీద చేయి వేసే క్రూరత్వం వాడికి ఎక్కడి నుంచి వచ్చింది.. ఎందుకిలా తయారు అయినాడు. ఒకవేళ శ్లోకకే ఏదన్నా శని పీడ ఉందేమో.. ఆవిడ ఆలోచనలు ప్రవాహంలా సాగిపోతున్నాయి.
భోజనాలు చేసి ఇంటికి వచ్చాక శ్లోక తో అంది.. “ నువ్వు కూడా అలాంటి నోము చేసుకుంటావా!”.
“నేనా !” ఆశ్చర్యంగా చూసింది..
నిజంగానే శ్లోకకి కూడా అదంతా చూసాక అనిపించింది తను కూడా ఇలా నోము నోచుకుంటే బాగుండు అని. అత్తగారు కూడా అడగడంతో పిల్ల కళ్ళల్లో లిప్తకాలం మెరుపు మెరిసింది.
“ చేసుకో మీ అమ్మగారిని రమ్మంటాను వచ్చే వారం చేసుకో.. విశ్వాని అడిగి ఎంత ఖర్చు అవుతుందో తెలుసుకో.. వాడిని అడిగి తీసుకో డబ్బులు.
శ్లోక ఉలిక్కిపడింది.. “అమ్మో! ఎప్పుడన్నా డబ్బులడిగితే ఎందుకు? ఏమిటి అసలు నీకు డబ్బులెందుకు ఇంట్లో ఉండేదానివి” అని ఒక్క రూపాయి కూడా విదల్చని వాడు. నోము నోచుకుంటా డబ్బులు ఇవ్వమంటే ఇస్తాడా..
“ఏంటి ఆలోచిస్తున్నావు? ఇస్తాడా లేదా అనా. ఎవరికోసం ఇస్తాడు! చేసేది వాడి కోసమేగా. వాడు బాగుండాలనేగా యీ పూజలు.. ఇవ్వాలి కూడా” ఆవిడ ఆవేశంగా అంది.
అత్తగారి వైపు అప్రతిభురాలై చూడసాగింది శ్లోక.
ఆవిడ మరోసారి ద్రుధంగా అంది.. “ రాత్రికే అడిగి తీసుకో..”
శ్లోక మనసంతా ద్వైదీభావంతో నిండిపోయింది.. నోము చేసుకోవాలి డబ్బు ఇవ్వండి అని ఎలా అడగడం.. అతని ముందు నోరే పెగలదు.. ఇవ్వను అంటే ఏం చేయాలి? అత్తగారు అన్నట్టు అతని కోసమేగా.. అవునూ అతని కోసం అంటే! ఆమె ఆలోచన ఆగిపోయింది.. అతను మారాలనా.. మారతాడనా ! లేక అతని ఆయుష్యు కోసమా! అదే అయితే తిట్లు తింటూ ఎందుకు అడగాలి? ఆమె ఆలోచనలు సాగుతూనే ఉన్నాయి.. రాత్రి అయింది.. అతను వచ్చాడు..
అన్నం కంచంలో పెట్టి పిలిచింది.. మౌనంగా వచ్చాడు.. “నువ్వు తిన్నావా” అని ఏనాడూ అడగడు. పెట్టింది అయిష్టంగా, విసుక్కుంటూ తిని లేచి వెళ్ళిపోతాడు..
ఆమె నెమ్మదిగా గొంతు పెగల్చుకుంది.. “ నాకు.. యాభై వేలు కావాలి “ అంది.
అతని చేతిలో ముద్ద జారిపోయింది.. “ యాభై వేలా! నీ అబ్బ ఇచ్చిన డబ్బు మూలుగుతోందా !”
తన గదిలో కూర్చుని నిశ్శబ్దంగా వాళ్ళ సంభాషణ వింటున్న విశాలాక్షి రక్తం ఉడికింది.
శ్లోక వణుకుతున్న గొంతుతో అంది.. “నోము నోచుకోవాలి “
అతను విసురుగా టేబుల్ కాలితో తన్నుతూ లేచాడు.. కంచం గబాల్న కింద పడింది.. అన్నం, కూర చెల్లాచెదురైంది.. అక్కడే నిలబడిన శ్లోక, గదిలో ఉన్న విశాలాక్షి నిర్ఘాంతపోయారు.
అతని ఎడం చేయి ఆమె మెడ దగ్గర జడ మొదట్లో బిగుసుకుంది.. శ్లోక కెవ్వుమంది..
“ఎవడి కోసం నోచుకుంటావు.. అయినా నీకెంత ధైర్యం నన్ను డబ్బు అడగడానికి.” బలంగా లాగాడు.
శ్లోక విలవిలాడుతూ “వదలండి..” అంది.
విశాలాక్షి దిగ్గున లేచింది.. పరుగులాంటి నడకతో గది గుమ్మం దాటుతూ శక్తి కొద్దీ అరిచింది.. “ఒరేయ్ రాక్షసుడా! వదులు “
“ నువ్వు లోపలికి వెళ్ళు” తల్లి వైపు చూస్తూ గట్టిగా అరిచాడు. ఆవిడ ఆవేశంగా అతని దగ్గరగా వచ్చి కుడిచేయి చాచి చెంపల మీద ఎడాపెడా వాయించసాగింది. శ్లోక చేష్టలుడిగి నిలబడిపోయింది. హరీష్ తల్లిని దూరంగా తోసాడు.
ఆవిడ పడబోయి కుర్చీ కోడు పట్టుకుని నిలదొక్కుకుంటూ.. “ ఒరేయ్ నీ ఈ ప్రవర్తనకి కారణం ఏమిటో నీకన్నా తెలుసా! చెప్పు “ అంది.
“ఏంటి చెప్పేది.. నా పెళ్ళాం.. నా ఇష్టం.. కొట్టడంకాదు చంపుతా..నువ్వెవరు అడగడానికి “ అరిచాడు.
ఆవిడ నింపాదిగా వంటగదిలోకి వెళ్లి చాకు తీసుకొచ్చి కొడుక్కి ఇచ్చింది.. “ చంపు “ అంది.
హరీష్ తెల్లబోయి చూసాడు.. “ చంపరా “ ఆవిడ రెట్టించింది.
హరీష్ పళ్ళు పట, పట లాడిస్తూ శ్లోక వైపు చూసి, “ నీ నంగనాచి తనంతో మా అమ్మని నా మీదకి ఉసిగోల్పావనమాట.. చూస్తా నీ సంగతి.. “ అన్నాడు.
“ఏంటిరా నువ్వు చూసేది.. తనుకాదు నన్ను నీ మీదకి ఉసి గోలిపింది.. నీ రాక్షసత్వం.. నీలో ఉన్న పశుత్వం.. సిగ్గులేదురా నీకు! పెళ్ళాం అంటే నీ చేతిలో కీలుబొమ్మ అనుకుంటున్నావా! ఎందుకు దాన్ని కొడుతున్నావో, ఎందుకు అనవసరంగా తిడుతున్నావో నీకు తెలుస్తోందా! పెళ్ళాన్ని కొట్టే వాడివి అమ్మని మాత్రం కొట్టవా .. పెళ్ళాన్ని చంపాలి అనుకునే వాడివి అమ్మని చంపవా ! నీ దగ్గర దానికే కాదు నాకు కూడా రక్షణ లేదు.. వెళ్ళు.. తక్షణం ఈ ఇంట్లో నుంచి వెళ్ళు.. ఒక్క క్షణం ఆలస్యం చేసినా ఈ చాకు నీ మెడ మీద పడుతుంది.. కొడుకుని చంపిన తల్లిగా చరిత్రలో మిగిలిపోతాను.. వెళ్ళరా..” ఉద్రేకంతో వణికిపోతూ అరిచి నిలబడిన చోటే కుప్పకూలింది విశాలాక్షి .
“అత్తయ్యా! “ శ్లోక గబుక్కున ఆవిడ దగ్గరగా వచ్చి ఆమెని తన ఒడిలోకి తీసుకుని, భర్తవైపు చూస్తూ కఠినంగా అంది..” డాక్టర్ కి ఫోన్ చేస్తారా! ఆవిడని చంపుకుంటారా!”
హరీష్ అలాగే స్థాణువులా నిలబడ్డాడు.. ఏం జరిగిందో, ఏం జరుగుతోందో అతనికి అర్థం కావడంలేదు. ఎంతో ప్రేమగా ఉండే అమ్మ ఇవాళ ఎందుకింత ఉద్రేకపడింది.. ఎందుకిలా శక్తిలా మారింది? అనేక ప్రశ్నలు, సందేహాలు అతని మనసులో గిర్రున తిరుగుతున్నాయి. తల కూడా అదే వేగంతో తిరుగుతున్నట్టు అనిపించింది..
కదలకుండా నిలబడిన అతన్ని చూస్తుంటే శ్లోక ఆవేశం హద్దులు మీరింది.. ఇంతకాలం అణచుకున్న సహనం చచ్చిపోయింది.. గట్టిగా, శక్తి కొద్దీ అరిచింది శ్లోక “ ఒరేయ్ దరిద్రుడా మీ అమ్మ చచ్చిపోతోందిరా డాక్టర్ కి ఫోన్ చేయి..”
ఆమె అరుపుకి హరీష్ త్రుళ్ళిపడ్డాడు.. అరిచింది తన భార్య శ్లోకేనా! ఏమన్నా నోరెత్తని శ్లోక, ఏం చేసినా ఎదురుచెప్పని శ్లోక … ఏమైంది ఇప్పుడు? ఎక్కడి నుంచి వచ్చింది ఈ ధైర్యం! తనని, మొగుడిని పట్టుకుని ఒరేయ్ అంటోంది.. తనేమి అనలేకపోతున్నాడేందుకు ?
బలహీనంగా ఉన్నా ధృడంగా ఉన్న స్వరంతో తల్లి అంటున్న మాటలు అతన్ని నిర్వీర్యుడిని చేస్తూ వినిపించాయి.
“వాడు మనిషి కాదమ్మా… నువ్వింక ఇక్కడ ఉండద్దు.. వెళ్ళిపో.. తక్షణం నీ పెట్టె తీసుకుని వెళ్ళిపో.. నా ఆశీర్వాదం నీకు ధైర్యాన్ని ఇస్తుంది.. ఆత్మవిశ్వాసం ఇస్తుంది.. వెళ్ళు తల్లీ.. “ ఆవిడ చేతులు కొంచెం పైకి లేచాయి.. శ్లోక తల మీద నిలిచాయి.
శ్లోక బావురుమంది.. అతను గజ,గజ వణికాడు..
విశాలాక్షి కళ్ళు కొడుకు వైపు తిరిగాయి.. ఆ కళ్ళల్లో అసహ్యం..
అతని కళ్ళల్లో భయం….