చల్లని ఉషోదయ వేళ నీ కిచకిచల శ్రావ్య సంగీతానికి మా చెట్టు ఆకులపై తొలకరి చినుకుల టపటపలు తాళం వేస్తూ ఉంటే , మది భూపాల రాగం వింటున్నంత ఆనందంతో పులకించిపోతుంది
పంటచేలలో నీ సయ్యాటలు ఆకుపచ్చని తివాచీ పై
ప్రముఖ నర్తకీమణి పదవిన్యాసాన్ని తలపిస్తాయి
చూరుకు వేలాడే వరి కంకులు నీకు సాదర ఆహ్వానం పలుకుతూ ఉంటే మా ఆతిథ్యాన్ని స్వీకరించడానికి ఇంకా ఎందుకు నీకు సందేహం?
ఎక్కడో , ఎవరో వెన్నకుండలపై వీరంగం చేశారట కదా!
వాళ్లను ఆదర్శంగా తీసుకున్నావా ఏంటి?
ధాన్యరాశులపై నీవు చేసే సయ్యాట ల విహారాలు
అంతా ఇంతా కాదు
చిన్న అలికిడికే కళ్ళలో ముగ్ధత్వం ప్రతిఫలిస్తూ ఉండగా
భీరువులా బుర్రుమంటూ పారిపోతావు
నా కిలకిలారావాలే ఔషధాలుగా, మీ గుండెల్లో మోస్తున్న వేదనాగిరులను బద్దలు కొట్టే మానసిక వైద్యుడిని నేనేనంటావా?
అబ్బో ఎంత ఆత్మస్థైర్యం నీది! అవును మరి,
అది లోపించడం వల్లే కదా మీరు అనాలోచిత నిర్ణయాలు తీసుకుంటున్నది
మానసిక వైద్యుడిని మాత్రమే కాదు ప్రవర్తనా శిక్షకుడిని కూడా నేనే అంటావా?
ఆరోమా థెరపీలు, ఆవకాయలూ ఎందుకు? కాణీ ఖర్చు లేకుండా మీ మనసును ఉల్లాసపరిచే పరిమళమంతా నా గళానికే సాధ్యం అంటావా?
నీ ముద్దు మోహన రూపానికి పరవశించిన చిన్ని హృదయం పట్టుకోవాలని వస్తే అందుబాటు ఆదరణను హరించి వేస్తుందనుకున్నావేమో
అద్దంలో చందమామే ఆదర్శం అంటూ ఒకింత దర్పాన్నీ ప్రదర్శిస్తూ
బుర్రుమంటూ ఎగిరిపోతావు
నీ ఉనికిని మటుమాయం చేసే కాంక్రీట్ జంగిళ్లు ఇకనైనా కళ్ళు తెరచి వెలుగులు చూడాలి
తాము కోల్పోయే విలువైన సంపదను
తిరిగి సముపార్జించుకోవడానికి
అలిగి వెళ్లిన అతిథివి నీవు
నీకోసం
స్వాగత తోరణాలు కట్టే వేళ ఆసన్నమైంది
నీ రమణీయ రూపంతో
నీ కమనీయ గాత్రం తో
నీ నెచ్చలులతో కలిసి గుంపులుగుంపులుగా వచ్చి
మా ఇంటి చెట్లపై కొమ్మ ఊయలలూగుతూ
మాకు కనువిందు చేయడానికి
మమ్మల్ని అలరించడానికి తప్పకుండా వస్తావు కదూ!
నీ రాక కోసం మేమంతా వేయి కళ్ళతో వేచిచూస్తూ ఉంటాం.