నవనాగరీకం

సంపాదకీయం

ఎవరు ఎన్ని చెప్పినా ,అనుకరణ అనేది అతి సాధారణమైన సహజమైన ఒక మానసిక చర్య. ఒకరిని చూసి ఒకరు నేర్చుకోవడం ,పెద్దలను చూసి పిల్లలు అనునిత్యం ఏదో కొంత గ్రహించడం అనేది సర్వసాధారణం. అందుకే పెద్దవాళ్లు తప్పనిసరి ఇది మాట్లాడినా ఏది చేసినా అది జాగ్రత్తగా ఉండాలి. ఎందుకంటే అప్పుడే పుట్టిన ఈ కొత్త మొలకలు మన వైపే చూస్తుంటాయి అనేది మరవకూడదు. చెప్పేది ఒకటి చేసేది ఒకటి అయితే పిల్లలు అసలే నమ్మరు. ఆరోగ్యం గురించి ఓ… పెద్ద లెక్చర్ ఇచ్చేసేసి ,వాళ్లకి ఆహారం పెట్టే సమయంలో భయభ్రాంతులకు గురి చేసేసి… మనమే కొన్నిసార్లు ఈ ఆరోగ్య నియమాలకు విలువ ఇవ్వక వాళ్ల ముందే అనేక రకాలైన కొనుగోలు తినుబండారాలను సేవిస్తుంటాం .ఇది పిల్లల మనసుల్లో ఎలాంటి ప్రశ్నలు లేవనెత్తుతుంద…
చేతిలో సెల్ఫోన్ పట్టుకొని ,చెవులలో ఇయర్ ఫోన్స్ పెట్టుకుని వంట చేస్తూ ఇంటి పని చేస్తూ తల్లిదండ్రులు పిల్లలకు ఓ వింత మానవుల్లా కనిపిస్తారు ,ఇది నిజం. ఎందుకంటే ప్రతిక్షణం వాళ్లతో గడపాలని వాళ్లకే కేటాయించాలని పిల్లలు అనుకుంటారు . ఇది పూర్తిగా సాధ్యం కాదు .అయినా సరే వీలైనంతవరకు పనులు చేస్తున్నంతసేపు పిల్లలతో మాట్లాడుతూ వాళ్ళని ఇన్వాల్వ్ చేస్తూ, ఆ పనిలో భాగస్తులను చేస్తే ఎంత ఆనందకరమైన జీవితాన్ని పిల్లలనుభవిస్తారు మీరు అనుభవిస్తారు. పిల్లల కు టీవీ పెట్టేసి ,మొత్తం నీతి సూత్రాలన్నీ టీవీ కథల తోటి నేర్పించేస్తున్న ఈ నవ నాగరిక ప్రపంచాన్ని చూస్తే ఓసారి ఎక్కడికెళ్తున్నావ్ ఏమైపోతోంది అనిపించక మానదు!
కొన్ని అనివార్య పరిస్థితులలో ఇవి తప్పదు! కానీ అనునిత్యం ఇదే తీరున బ్రతికేస్తూ పోతే రేపటి రోజున కొన్ని ప్రశ్నలకు కొడవళ్లు మిమ్మల్ని వెంటాడుతాయి. ఉద్యోగం చేయడం తప్పనిసరి! ఆర్థికంగా నిలదొక్కుకోవడం తప్పనిసరి !కానీ ,అదే జీవిత ధ్యేయం కాదు , కారాదు!ఈ చిన్న సూత్రం వంట పట్టించుకుంటే ఇటు సంసారం అటు ఉద్యోగం రెండు ఆనందంగా చేయగలుగుతారు ఆడవాళ్ళైనా! మగవాళ్ళైనా!
ఇంకా ముందుముందు రోబోట్ యుగం రాబోతోంది !సౌకర్యాలు ,అతి సౌకర్యాలు అత్యంత ప్రమాదకరంగా సంభవించబోయే రోజులు రానున్నాయి . నియంత్రణ అనేది ఎవరికైనా ఎక్కడైనా ఎప్పుడైనా తప్పనిసరి .నిజం !ఈ సత్యం గ్రహించినప్పుడు ఎంత నాగరికత ప్రవేశించినా మనదైన మనిషితత్వం అనేది మరుగున పడిపోకుండా ఉంటుంది.

Written by Dr. Kondapalli Neeharini

డా|| కొండపల్లి నీహారిణి, తరుణి సంపాదకురాలు

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

మనం మన సంస్కృతిని పాటిస్తున్నామా?

మా బంగారు సీతమ్మ