రాత్రి 11 గంటలకు అవుతుండగా శ్రీవారు హడావుడిగా బయటకు వెళ్తూ వ్యాన్ కీస్ అడిగారు ఆ కీస్ ఇచ్చేప్పుడు నా చీర కొంగు దానికి చిక్కుకుంది చూడకుండానే తీసుకొని వెళుతూనే ఉన్నారు.
అప్పుడు గజేంద్రమోక్షంలో విష్ణుమూర్తి లా కనిపించారు.
ఎక్కడికి వెళ్తున్నరని తెలియక మా పక్కింట్లో ఉండే వారి ఫ్రెండుని అడిగాను.
పిటి సార్ వాళ్ళ ఆవిడ బాగా కడుపునొప్పి తో బాధపడుతున్న పడుతుంటే అపెండిటైటిస్ కావచ్చు అని ఆపరేషన్ చేయించాలని హడావుడిగా వ్యాన్లో తీసుకెళుతున్నారు. అని చెప్పారు.
అమ్మ! ” నాన్న ఎక్కడికి వెళ్తున్నారు” అని మా పెద్దమ్మాయి అడిగింది.
నాన్న ప్రాణ దానం చేయడానికి వెళ్తున్నారు .
అని చెప్పాను “ప్రాణదానం” అంటే? అడిగింది పాప ప్రాణాపాయ స్థితిలో ఉన్న ఆమెను సరైన సమయానికి హాస్పిటల్ లో చేర్చడం అంటే ప్రాణదానం చేసినట్టే కదా!….
అసలు “దానం” అంటే ఏమిటి ?
అని అడిగింది పాప
“మనం ప్రతిఫలం (తిరిగి సహాయం) ఆశించకుండా చేసే సహాయం ఏదైనా దానమే” అని చెప్పాను.
అన్నదానం, విద్యాదానం, స్వర్ణదానం, భూదానం, గోదానం, రక్తదానం, ధన దానం అంటూ చాలా ఉంటాయి అన్నాను. అవునా !అంటూ ..
నా వంక ఆశ్చర్యంగా చూసింది.
మీ నాన్నగారు చాలా దానాలు చేశారు తెలుసా? అన్నాను.
అయితే చెప్పమ్మా…అంది
ఓ రోజు ఓ సారు డిగ్రీ బుక్స్ తీసుకొచ్చి ఇచ్చారు.
ఎవరికోసం?
అని అడిగితే.. సార్ “వాళ్ళ తమ్ముని కోసం” అన్నారు.
డిగ్రీ చదివే తమ్ముడు ఇవ్వరా? అని ఆలోచిస్తుండగానే ..
స్కూల్ ఆఫీస్ బాయ్ వచ్చి బుక్స్ అని అడిగితే ఇస్తూ … ఎవరికీ ఇవి ?
అని అడిగాను.
” నా కోసమే మేడం” అన్నాడు.
సార్ వాళ్ళ తమ్ముని కోసం అని చెప్పి తెప్పించారు.
అలా అన్నందుకైనా బాగా చదవాలి అని చెప్పి ఇచ్చాను.
ఇలా విద్యాదానం చేశారు.
టీచర్ గా మీ నాన్న చేసేది విద్యాదానమే అనుకో..
మొన్న మనం భువనగిరికి వెళ్ళినప్పుడు ఓ పిచ్చి ఆవిడ చూసి జాలి పడ్డాము.
కానీ ఏమీ చేయలేకపోయాం.
మరుసటి రోజు మీ నాన్న వాళ్ళ ఫ్రెండ్ కు ఫోన్ చేసి “ఆమెకు కాస్త తిండి అన్న పెట్టు లేకుంటే విషయం అన్న పెట్టరా “అని ఆవేశంలో అంటుంటే విని ..
ఎవరి గురించి మాట్లాడుతున్నారు? అన్నాను.
నిన్న భువనగిరిలో ఓ పిచ్చామే కళ్ళు తిరిగి పడిపోతే సోడా తాపించి ..ఇడ్లీ పెట్టించాను .
ఆమెకు మన భాష రాదు అనుకుంటా..
సోడా తాగిస్తుంటే ఏదో భాషలో తిడుతుంది.
అని చెప్తుంటే నవ్వొచ్చింది .
కానీ “నేను చేయలేని పని మీరు చేశారు” చెప్తూ ఆనందపడ్డాను.
మీ నాన్న ఇలా అన్నదానం చేశారు.
నాన్న వాళ్లందరికీ ఒక గ్రూపు ఉంది .
అందులో వాళ్ళ ఫ్రెండ్స్ అందరూ వారి వారి బ్లడ్ గ్రూప్స్ నోట్ చేసుకొని పెట్టారు.
ఎవరికైనా బ్లడ్ అవసరమైతే ఆ గ్రూపు వారికి ఫోన్ చేస్తారు. వాళ్ళు వచ్చి రక్తదానం చేస్తారు .
అలా మీ నాన్న ఎన్నోసార్లు రక్తదానం చేశారు .
మరి “ధనదానం చేయలేదా?”అని అడిగింది పాప
ఎవరికి ఏ అవసరం వచ్చినా మొదట మీ నాన్ననే అడుగుతారు. మీ నాన్న జీతం ముందే తీసుకొని అడిగిన వారికి లేదనకుండా ఇచ్చి ఇచ్చి ఏనాడు పూర్తి జీతం తీసుకోలేదు.
మనం ఈ చిన్న ఇంట్లో ఉంటున్నాం కదా… ఓసారి రామకృష్ణ సార్ వచ్చి
“డాడీ మాకు డబల్ బెడ్ రూమ్ ప్లాట్ ఇప్పించి రెంట్ కడుతూ.. పాపం డాడీ ఇంత చిన్న ఇంట్లో ఉంటున్నారా?” అని చెప్పే వరకు ఆ విషయం నాకు తెలియదు.
నాన్నను ఆ సార్ “డాడీ” అని ఎందుకు అంటున్నారు ?అని అడిగితే …
ఓ తండ్రిలా వారి బాగోగులు చూస్తున్నారుగా.. అందుకే అలా పిలుస్తున్నారు .
అని చెప్పాను .
మనం ఇంకో ఇల్లు తీసుకుందాం అంటే రెండు ఇళ్లకు కిరాయి కట్టడం కష్టం కాబట్టి మనల్ని ఈ ఇంట్లోనే ఉంచారు మీనాన్న.
“మరి స్వర్ణ దానం అంటే ?
బంగారం దానం చేయడం మా పెళ్లి రోజునే వాళ్ళ ఫ్రెండ్ కి ఏదో అవసరం ఉందని అంటే వాళ్ళ అక్క పెట్టిన బంగారు ఉంగరం పసుపు బట్టల మీద ఉన్నా..తీసి ఇచ్చారు. “అలా ఇవ్వొద్దా?” అమ్మా !అని అడిగింది పాప .
ఇవ్వకూడదని అంటారు.
అయినా అవసరం కంటే ఆచారం ఎక్కువ కాదని ఇచ్చారు.
మరోసారి వాళ్ళ ఫ్రెండ్ కి యాక్సిడెంట్ అయితే పరుగు పరుగునా..హాస్పిటల్ కి తీసుకెళ్లి వారిని డాక్టర్ కి చూపించి.. ఇంట్లో దింపి.. వారికి కార్ అవసరం ఉంటుందని మన కారు ఇచ్చి ట్రైన్ కి వచ్చాం .
చెల్లి పుట్టేముందు డెలివరీ ఖర్చుల కాని దాచుకున్న డబ్బులు కూడా వాళ్ళ ఫ్రెండ్ కి అవసరమైతే ఇచ్చారు. తీరా డెలివరీ రోజు డబ్బులు అడగడానికి వెళ్లి చెల్లి పుట్టాక ఆలస్యంగా వచ్చారు.
నాన్న సహాయం చేసిన వాళ్ళతో మరో ముగ్గురికి సాయం చేయమని చెప్పితే బాగుండేది కదా,!.. అన్నది పాప.
అవును అన్నాను.
కొందరు మనుషులు ‘మన’ అనే మాటలో ‘మ’ మానవత్వం మరిచి ‘నా’ అనే స్వార్థంతో బ్రతుకుతుంటారు .
కానీ మీ నాన్న మానవత్వమే తత్వం గా…
మంచితనమే ధనంగా
భావించే వ్యక్తి.
ఒక వ్యక్తి మంచితనం ను ఆ వ్యక్తి కున్న స్నేహితులను జాబితాను బట్టి చెప్పొచ్చు అంటారు. అవును …నాన్నకు చాలామంది స్నేహితులు ఉన్నారు కదూ …
అవును అన్నాను.
నాన్న ధన దానం, స్వర్ణదానం ,రక్తదానం, ప్రాణదానం, విద్యాదానం ఇన్ని చేశారా? అని ఆశ్చర్యం గా అడిగింది పాప..
మీరు పెద్దయ్యాక మీ పెళ్లి చేసేటప్పుడు కన్యాదానం కూడా చేస్తారని చెపితే అమ్మాయి ఆశ్చర్యపోయింది.
ఆపదలో ఉన్నవారికి సాయం చేసే మనసు తో పాటు.. స్నేహస్తం ఇచ్చేవారు నిజమైన దాతలు..