రిజర్వేషన్ మాయ

మార్చ్ 25 , శనివారం తరుణి సంపాదకీయం

మాయా అంటే ఏమిటి? చూపించి చూపించకపోవడమా? కనిపించకుండా చేసేయడమా? ఏదైతే ఏం కానీ ,స్త్రీలకు రిజర్వేషన్ అనడం మాత్రం కచ్చితంగా ఒక పెద్ద మాయ!
అసలు రిజర్వేషన్స్ ఎందుకు స్త్రీలకు ఇంత శాతం అంటూ? అందరికీ సమాన అవకాశం ఇవ్వాలి కదా! అయితే వీళ్ళ దృష్టిలో స్త్రీలు కనిపించకపోవడం వల్లనే స్త్రీల కొరకు రిజర్వేషన్ అనేది మొదలుపెట్టారు. అందుకే రిజర్వేషన్ కూడా అవసరమే అని అనాల్సి వస్తుంది! చదువుకున్న వాళ్ళు లేరా? సమర్థవంతమైన స్త్రీలు లేరా? ఈ రంగంలోనూ సమాన ప్రాతిపదికన స్త్రీలు ఉద్యోగాలలో భర్తీ చేయబడడం లేదు. రాజకీయాల విషయానికొస్తే ,అది అందరాని చందమామ. ఎక్కడో చెమక్కున మెరిసే రాజకీయ నాయకురాలు ఉంటే ఆమెను వెనక్కి లాగడానికి తగ్గించి చూపడానికి తక్కువ చేసి విమర్శించడానికి వేల గొంతులు ముందుకు వస్తాయి. పేరే రాజకీయం కదా! వేరు చేసి చూపడం వారికి అంది వచ్చిన విద్య. అన్ని విభాగాలలో శిక్షణ తరగతులు ఉన్నట్లే రాజకీయ రంగంలోనూ శిక్షణ తరగతులను పెట్టి, నీతి న్యాయం ధర్మం తెలివిగా మాట్లాడడం తెలివిగా ప్రవర్తించడం ప్రజాపక్షాన గొంతే ఎత్తడం సమాజం పక్కన నిలబడడం వంటి ఉత్తమ విలువలను నేర్పించే శిక్షణ తరగతులు అత్యవసరం. ఈ మహత్తర కార్యక్రమంలో పురుషులతో సమంగా స్త్రీలకు అవకాశాలు ఇచ్చే రోజులు తొందరలో రావాలి. తాను పుట్టిన ప్రాంతపు, తమ దేశ భౌగోళిక ఆర్థిక సామాజిక విషయాలన్నీ నేర్చుకుని వాటికి అనుగుణంగా తమ ప్రవర్తన ఉండేలా చూసుకునే రాజకీయాలు కావాలి. వీటితోపాటు ప్రపంచంలో ఏ ఏ దేశాల లో ఏ ఏ పార్టీలు ఉన్నాయి ఏ పార్టీలకు నాయకుడు ఎవరు? ఆ పార్టీ స్థాపించినప్పుడు వారి సిద్ధాంతాలేవి ప్రస్తుతం మార్చినటువంటి అంశాలేవి అవన్నీ ఆయా దేశానికి ఎలా ఉపయోగపడుతున్నాయి, వాళ్ల పార్లమెంటరీ వ్యవస్థ ఏంటి అనే విషయాలన్నీ ఈ రాజకీయ తరగతుల శిక్షణ కార్యక్రమంలో ఉండాలి.
పాఠశాల కళాశాల చదువులలో ఒక సబ్జెక్టు వారి చదువు పూర్తి అయ్యేవరకు ఉండేలా పాఠ్యప్రణాళికలో చేర్చాలి. ఇందులో భాగంగా పైన సూచించిన విశేషాలన్నీ రావాలి. అప్పుడే భవిష్యత్తు తరంలోనైనా పటిష్టమైనటువంటి పార్టీ తయారవుతుంది, సమర్థవంతులైన నాయకులు తయారవుతారు. ఈ దిశగా స్త్రీలందరూ అడుగులు వేయాల్సిన అవసరం ఉంది. ప్రస్తుతం తాము పనిచేస్తున్న సంస్థల , కార్య శాలల ఉద్యోగాల లో ఈ విధమైన సూచనల చేస్తూ తమ గళం విప్పాల్సిన ఆవశ్యకత ఉన్నది.
అంతేకాదు రాజకీయ నేపథ్యపు విశేషాలను ఇంట్లో ,తమ సంతానంతో చర్చించాలి తమ భర్తతో మాట్లాడాలి .ఈ నాలెడ్జ్ ని రాజకీయ అంశాల చర్చ అనేది ఒక సుహృద్భావ వాతావరణం లో మన ఇంటి నే ‘వేదిక’ చేయాలి. ఆం! ఏం రాజకీయాలు ఏంటి!అంతా చెత్త ! అని కొట్టి పారేయకూడదు .ఇవాళ కొట్టి పారేసి ,రాజకీయాలపై శ్రద్ధ చూపించకుంటే ముందు ముందు రాజకీయాలు మరింత భ్రష్టు పట్టిపోతాయి.పుండు ఎక్కడుందో మందు అక్కడ పెట్టాలి. తల్లిగా ,నానమ్మగా, అమ్మమ్మగా ,అక్కగా ,టీచర్ గా ,తోటి స్నేహితురాలిగా స్త్రీలంతా ఈ రాజకీయాల ఆవశ్యకతను గుర్తెరిగి ,తగినంత నాలెడ్జ్ ని సంపాదించుకుని ,ఇంట్లో కూతురు కు కొడుకుకు నేర్పించాల్సిన అవసరం ఉంది. అంతేకాదు ఒక యుద్ధ ప్రాతిపదికన చేయాల్సిన బాధ్యత స్త్రీలదే! వార్తాపత్రిక చదవడం ,చదివించడం విధిగా చేయాలి. ఏ ఒక్క పార్టీకి మొగ్గు చూపి ,పిల్లలకి నేర్పకూడదు . ఏం పార్టీలోనైనా మంచి చెడు ఉంటాయి ,ఏ నాయకులలోనైనా మంచి చెడు ఉంటుంది. మంచి అయితే ఎలా మంచితనమైంది చెడు అయితే ఎందుకు వికృతత్వం చూపిస్తుంది అనేది నేర్పించాల్సిన మనం నిర్లిప్తంగా ఉండకూడదు. పిల్లల ముందు ఏ ఒక్క పార్టీని పొగడవద్దు ఏ ఒక్క పార్టీని తిట్టొద్దు ఈ వివేచనతో ఒక విశ్లేషణ చేయడం అలవర్చుకోవాలి. ఇదే భవిష్యత్తులో సమానత్వ దృష్టిని నేర్పిస్తుంది ఎన్నికల సమయంలో తాము ఓటు హక్కును కలిగిన సందర్భంలో ఈ తెలివినంత ఉపయోగిస్తారు. కాబట్టి తరుణులమందరము ఈ దిశగా అడుగులు వేద్దాం!
అప్పుడే ఈ రిజర్వేషన్ మాయ ఏంటో బోధపడుతుంది మాయలోంచి బయటపడతాం!

Written by Dr. Kondapalli Neeharini

డా|| కొండపల్లి నీహారిణి, తరుణి సంపాదకురాలు

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

ఉగాది

ఆపాత మధురాలు- Part2