మనము ఎవరితో కలిసి జీవిస్తామో, వారి లక్షణాలు – మనకు కొన్ని సంక్రమిస్తాయి. కొన్ని సందర్భాలలో పూర్తిగానూ అలవడతాయి. అటువంటప్పుడు సజ్జనులతోడి సహవాసైతే మన జీవితాలు ఉత్కృష్టంగా ఎదుగుతాయి. భర్తృహరిగారి మాటల్లో –
శ్లో. జాడ్యంధియో హరతి, సిఞ్చతి వాచిసత్యం
మానోన్నతిం దిశతి, పాపమపాకరోతి
చేతః ప్రసాదయతి, దిక్షు తనోతి కీర్తిః
సత్సఙ్గతిః కథయ కిం నకరోతి పుంసామ్
అన్న హితవాక్యాలు కనిపిస్తాయి. ఈ శ్లోకాన్ని ఏనుగు లక్ష్మణకవిగారు
సత్యసూక్తి ఘటించు, ధీజడిమమాన్చు
గౌరవ మొసంగు, జనులకు గలుష మడచు
కీర్తి బ్రకటించు, చిత్తవిస్ఫూర్తి జేయు
సాధు సంగంబు సకలార్థసాధనంబు
అని పద్యీకరించారు.
పై పద్యానికి భావం ఏమిటంటే, సజన సహవాసం సత్యవాక్యాలనే పలికింపజేస్తుంది. బుద్ధి మాంద్యాన్ని పోగొడుతుంది. గౌరవాన్ని కలిగిస్తుంది. పాపాలను దూరం చేస్తుంది. కీర్తిని వ్యాపింపజేస్తుంది. మనోవికాసాన్ని కలిగింపజేస్తుంది. సజ్జన సహవాసం సమస్త ప్రయోజనాలనూ సాధిస్తుందన్నది సత్యం.
ఈ విషయాన్నే మరింత లోతుగా ఆలోచించినట్లయితే ఒక మనిషిపై నాలుగు ప్రధానాంశాలు ప్రభావం చూపుతాయి. 1. కుటుంబం, 2. పాఠశాల, 3. సమాజం, 4. స్నేహం. ఈ నాలుగు అశాలలోను మంచి చెడులు మిళితమై ఉంటాయి. మనం ఎవరిని, దేనిని ఆదర్శంగా తీసుకొని జీవిస్తామో అటువంటివారి లక్షణాలే మనలను చేరుతుంటాయి. కాబట్టి ఎంపిక మన చేతుల్లోనే ఉంది. మరి, ఏది మంచి, ఏది చెడు అని ఎలా తెలిసేది? అని ప్రశ్నించుకుంటే, పాఠశాలలో (విదాయలయంలో) గురువులు నేర్పిన విద్యయే మనకు శ్రీరామరక్షగా నిలుస్తుంది. అటు కుటుంబంలోనూ, ఇటు సమాజంలోనూ ఎవరిని ఆదర్శంగా తీసుకోవాలన్నది విద్య నేర్పుతుంది. దీని సహాయంతో సజ్జనముతో మనం స్నేహం ఏర్పరచుకోవాలి.
ఇలా ఏర్పరచుకున్న సజ్జన స్నేహం, మనల్ని మరింత ఉత్తములుగా తీర్చిదిద్దితుంది. మనకు మేధోపరమైన సహాయాలిన అందిస్తుంది. సమాజంలో మనకు ఒక మంచి స్థానాన్ని అందిస్తుంది. పొరపాటున చేయబోయే చెడు కర్మలను అడ్డుకుంటుంది. మనోధైర్యాన్ని, మానసిక వికాసాన్ని కలిగిస్తుంది. ఉన్న స్థితి నుండి ఉన్నత స్థితికి చేరుస్తుంది.
‘పూలతో కూడిన దారము కూడా శిరోధార్యమగును కదా!’ అన్నట్లుగా సజ్జన సహవాసం మనల్ని అందరికంటే మేటిగా నిలబెడుతుందనటంలో ఎటువంటి సంశయమూ లేదు.
అందుకే స్వామి వివేకానంద అంటారు – ‘ఈ ప్రపంచం ఒక గొప్ప వ్యాయామశాల. మనల్ని మరింత బలవంతులుగా తీర్చిదిద్దుకోవడానికి ఈ ప్రపంచంలోకి వచ్చాం! అందుకు గొప్ప వ్యక్తుల సాన్నిహిత్యం మనకు అవసరం.
ఈ మాటలు మనకు నిరంతర స్మరణీయాలు కావాలి.