మగువే మణిహారం.

కథ.

    తాటికోల పద్మావతి

జూన్ నెల మొదటి వారంలో టెన్త్ క్లాస్ పరీక్షలు రిజల్ట్స్ వచ్చాయి. నాన్న నేను ఫస్ట్ క్లాస్ లో పాస్ అయ్యాను అంటూ బట్టలు ఇస్త్రీ చేస్తున్న తండ్రి వెంకటరమణకు చెప్పింది గాయత్రి.
వెంకటరమణ భార్యను పిలిచి ఏమైనా నాగమణి ఇంట్లో ఏమైనా స్వీట్ ఉంటే తీసుకురా అమ్మాయి నోరు తీపి చేయాలంటూ భార్యను పిలిచాడు.
నాగమణి లోపల నుంచి బెల్లం ముక్క తీసుకొచ్చి కూతురు నోట్లో పెట్టింది. ఆప్యాయంగా.
అమ్మ నేను కాలేజీలో చేరుతానే అంటూ గోముగా అడిగింది తల్లిని గాయత్రి.
గాయత్రి తండ్రి వెంకటరమణ నటరాజ అపార్ట్మెంట్లో వాచ్మెన్ గా ఉంటాడు. అక్కడ అందరి బట్టలు ఇస్త్రీ చేస్తాడు. భార్య నాగమణి ఇళ్లలో గిన్నెలు తోమి బట్టలు ఉతుకుతుంది. భార్యాభర్తలిద్దరూ కలిసి కష్టపడతారు. వాళ్లకి ఇద్దరు ఆడపిల్లలే. మగ పిల్లవాడు పుట్టలేదని ఏనాడు అనుకోలేదు.
ఈ రోజుల్లో ఆడపిల్లల్ని పెంచడం కష్టం అనిపించడం లేదు. చదువుకొని వాళ్లే ఉద్యోగాలు చేసుకుంటున్నారు. పెళ్లి చేయడం కూడా పెద్ద సమస్య కాదు. పెద్ద పెద్ద కోర్సులు నేర్చుకుని అన్ని రంగాలలో ఆరితేరుతున్నారు. ఆడపిల్లలంటే భయం లేదు.
ఒకప్పటి పాత రోజులు అమ్మో ఆడపిల్ల అనగానే భయం వేసేది. ఈనాడు విమానాలను సైతం నడుపుతున్నారు. అంతరిక్షంలోకి వెళ్లి వస్తున్నారు మన అమ్మాయిలు కూడా ఏదో ఒకటి సారిస్తారని గర్వపడతాడు వెంకటరమణ.
అపార్ట్మెంట్ వాళ్ళందరికీ తన కూతురు టెన్త్ క్లాస్ ఫస్ట్ లో వచ్చిందని గర్వంగా చెప్పుకున్నాడు అందరికీ.
అదృష్టం ఉండాలి కానీ చదువు అందరికీ ఒకటే. కష్టపడి చదివి పాస్ అయింది. మంచి కాలేజీలో చేర్పించు. అంతటితో ఆపకుండా చదివించమని సలహా ఇచ్చారు కొంతమంది.
నువ్వు చేసేది వాచ్మెన్ పని పెద్ద చదువు లేని ఏదో ఒక సంబంధం చూసి పెళ్లి చేసి పంపించమని ఉచిత సలహా ఇచ్చారు మరి కొంతమంది. వాళ్లకి గాయత్రీ చదువుకోవడం ఇష్టం లేదు.
ఎవరి మాటలు పట్టించుకోలేదు వెంకటరమణ. గాయత్రిలో చదువుకోవాలని పట్టుదల ఎక్కువైంది. ఇంతటితో నా చదువు ఆగిపోకూడదు. స్కాలర్షిప్లు సంపాదించుకున్నయినా చదవాలి అనుకుంది. నాలుగేళ్ల నుంచి సంగీతం నేర్చుకుంటున్నది. పాడుతా తీయగా పోటీలకు వెళ్లి వచ్చింది. మొదటి బహుమతి ఐదు లక్షలు గెలుచుకొంది. సంగీతం ఆమెకు పెట్టని ఆభరణం లాంటిది.
వాచ్మెన్ కూతురిగా ఉండిపోకూడదు. అమ్మానాన్న గర్వపడేలా ఏదో ఒకటి సాధించాలి. పేదరికం చూసి భయపడకూడదు. అందుబాటులో ఉన్న వాటిని అందుకోవటమే లక్ష్యం. ఆడపిల్లలం ఎందుకు పనికిరాని వాళ్ళం అనే రోజులు పోయాయి. మనకు ఇష్టమైన రంగాన్ని మనం ఎన్నుకోవచ్చు అని తనకు తానే ధైర్యం చెప్పుకుంది.
గాయత్రి కి సంగీతం అంటే ప్రాణం. రాత్రి పగలు కష్టపడి సాధన చేస్తుంది. ఉత్సవాలప్పుడు సంగీత కచేరీలకు వెళుతూ ఉంటుంది. సినిమాల్లో ఎప్పటికైనా అవకాశం వస్తుందని ఆమె నమ్మకం.
చూస్తుండగానే రెండేళ్లు గడిచిపోయాయి. ఇంటర్ పూర్తి చేసింది. సంగీతం మాత్రం మానుకోలేదు. పాత పనులు చేసుకునే నాగమణి కూతురు పాడుతా తీయగాలో మొదటి బహుమతి గెలుచుకున్నదని అందరికీ ఆశ్చర్యం వేసింది. నీ కూతురే కాదు నువ్వు అదృష్టవంతురాలివేనంటూ నాగమణి నీ పకడినప్పుడు ఆ తల్లి సంతోషం అంతా ఇంతా కాదు.
సినిమాలో కూడా పాటలు పాడే అవకాశం ఇస్తామన్నారు. రవీంద్ర భారతిలో గాయత్రి ప్రోగ్రాం ఉన్నదంటే చాలు హాల్ అంతా నిండుగా కళకళలాడిపోతుంది. కూతుర్ని ఒక అయ్య చేతిలో పెట్టాలని వెంకటరమణ తాపత్రయం. ఎప్పటికైనా పెళ్లి చేసి అత్తవారింటికి పంపించాల్సిందే కదా.
అమెరికా సంబంధం గాయత్రిని చేసుకోవడానికి ముందుకు వచ్చారు. తల్లిదండ్రులని వదిలి అంత దూరం వెళ్ళటం గాయత్రి కి ఇష్టం లేదు. ఇక్కడే సినిమాలో పాటలు పాడే అవకాశం వస్తుంది . మీరు ఈ అపార్ట్మెంట్ లో వాచ్మెన్ గా ఉంటూ, అమ్మ అందరి ఇళ్లలో పాచి పనులు చేయాల్సిన అవసరం లేదు. కొడుకు నైనా కూతుర్నేనా నేనే అనుకోమన్నది గాయత్రి. గాయత్రి తర్వాత ఆమెకు చెల్లెలు ఉంది. ఆ పిల్ల కూడా టెన్త్ క్లాస్ వరకు చదువుతున్నది.
కూతురి మాటకు ఎదురు చెప్పలేడు వెంకటరమణ. పెళ్లి సంబంధాలు వస్తున్నాయి గాయత్రి కి. పెళ్లయ్యాక సంగీతం, పాటలు పాడటం మానుకోలేనని ముందే చెప్పేసింది. అలాగైతేనే పెళ్లికి ఒప్పుకుంటానంది.
ఒకరోజు త్యాగరాయ గాన సభలో సంగీత కచేరీకి గాయత్రిని పిలిచారు. ముందుగా త్యాగరాయ కీర్తనలతో మొదలుపెట్టి, నెమ్మదిగా ఆ పాత మధురాలంటూ ఓల్డ్ సాంగ్స్ పాడించారు. అమర గాయకుల ఘంటసాల పి సుశీల గారి స్వరం నుంచి జాలువారిన పాటలు గాయత్రీ స్వరం నుంచి అంతే మధురంగా జాలు వారాయి. ఆలంతా చప్పట్లతో మారుమోగిపోయింది.
కార్యక్రమం జరుగుతున్నంత సేపు ప్రేక్షకులంతా మంత్రముగ్ధులయ్యారు. గాయత్రి కి సన్మానం జరిగింది. అప్పటివరకు ఉండి పాటలన్నీ విన్నాడు రవికాంత్. ఆ క్షణంలోనే గాయత్రీ ని చూసి ఇష్టపడ్డాడు. పెళ్ళంటూ చేసుకుంటే ఈ అమ్మాయిని చేసుకోవాలని నిర్ణయించుకున్నాడు కూడా.
రవికాంత్ కాలేజీలో ప్రొఫెసర్. చక్కగా మాట్లాడగల వాగ్దాటి ఉంది. గాయత్రీ కచేరీలు ఎక్కడ ఉంటే అక్కడికి వెళ్తాడు. ఆమెను ఒంటరిగా కలిసి మాట్లాడాలని ఎప్పటినుంచో అనుకుంటున్నాడు.
ఆరోజు ప్రోగ్రాం ముగించుకొని గాయత్రి ఇంటికి వెళ్ళిపోతుంటే ఎదురుగా వచ్చి రవి కాంతు పలకరించాడు.
ఎప్పటినుంచో మీతో మాట్లాడాలని మిమ్మల్ని కలవాలని ఎదురు చూస్తున్నాను. ఆ అదృష్టం ఈరోజు దక్కింది. మీరన్నా మీ పాటలన్నా నాకు చాలా ఇష్టం. మీ సంగీత కచేరీలకు తప్పకుండా వస్తానంటూ పరిచయం చేసుకున్నాడు.
అప్పటినుంచి ఇద్దరు మధ్య స్నేహం కుదిరింది. ఎక్కడ గాయత్రి ప్రోగ్రాం ఉంటే అక్కడికి వెళ్తాడు రవికాంత్.
ఒకరోజు మనసులో ఉన్న మాటను బయట పెట్టాడు. మీకు ఇష్టమైతే పెళ్లి చేసుకుంటానన్నాడు. పెళ్లి విషయంలో తల్లిదండ్రి చెప్పింది. నీకు ఇష్టమైతే మాకు ఏమీ అభ్యంతరం లేదన్నారు.
చెల్లెలు సావిత్రి డిగ్రీ ఫైనల్ ఇయర్ కి వచ్చేసింది. ఏదైనా ఉద్యోగంలో చేరితే చెల్లెలు జీవితం కూడా ఒక కొలిక్కి వస్తే బాగుంటుంది. తాను పెళ్లి చేసుకుని వెళ్లి వెళ్ళిపోతే అమ్మానాన్నల బాధ్యత ఎవరు చూస్తారు కష్టపడి నన్ను ఈ స్థితికి తీసుకొచ్చారు. కొడుకు అయినా కూతురైన నేనే వాడు రుణం తీర్చుకోవాలి అని ఒక నిర్ణయానికి వచ్చింది.
రవికాంత్ తో తన సంగీతానికి ఎటువంటి ఆటంకం రాకూడదు అని అలా అయితేనే పెళ్లి చేసుకోవడానికి ఒప్పుకుంటాను అన్నది.
అలాగే అన్నాడు రవికాంత్.
పెద్ద సమక్షంలో గాయత్రి కి రవికాంతతో వివాహం జరిగింది. అత్తవారింటికి వచ్చిన గాయత్రి కి కొన్నాళ్ళు బాగానే గడిచింది. ఆ తర్వాత రవికాంత్ కి గాయత్రి అలా బయటకు వెళ్ళటం ఇష్టం లేదు. ఇంట్లో వాళ్లంతా సంగీత కచేరీలకు వెళ్ళకూడదని ఆంక్షలు పెట్టారు.
అదృష్టం తలుపు తట్టినట్టు గాయత్రీ కి సినిమాలో పాటలు పాడాలని ప్రొడ్యూసర్ నుంచి కబురు వచ్చింది. భర్త కాదనడు అనే నమ్మకంతో అగ్రిమెంట్ మీద సంతకం కూడా చేసింది.
సాయంత్రం రవికాంత్ కాలేజీ నుంచి ఇంటికి రాగానే మీకోసం అంటూ అగ్రిమెంట్ విషయం చెప్పింది.
రవికాంత్ ముఖంలో రంగులు మారాయి. ఎంత పని చేశావు. ముందుగా నాతో ఒక్క మాట అన్నా చెబితే బాగుండేది అన్నాడు.
అదేమిటండీ అలా అంటారు. మీరే కదా నా స్వేచ్ఛకు ఎటువంటి ఆటకం కలగని అన్నారు అన్నది.
అది కాదు గాయత్రి. మనిద్దరం ఒక నెల రోజులు సరదాగా ఎటైనా తిరిగి రావాలని ప్లాన్ వేశాను.ఛీ! నా మూడ్ అంతా చెడగొట్టావు. ఇప్పుడున్న సరదా మళ్లీ వస్తుందా! ఇప్పటికైనా మించి పోయింది లేదు. నీ బదులు మరొకరిని తీసుకుంటారేమో చెప్పి చూడమన్నాడు రవికాంత్.
భర్త మాటలకు గాయత్రి కి మనసు చివుక్కుమంది. వచ్చిన అదృష్టాన్ని వదులుకుంటే మళ్లీ రాకపోవచ్చు. మనం మరోసారి టూర్ కి వెళ్ళచ్చు లే నా ప్రోగ్రాం మార్చుకోవటం వీలు పడదంది.

రవికాంత్ కి గాయత్రి అలా పైకి ఎదిగి రావటం ఏ మాత్రం ఇష్టం లేదు. నువ్వు పాటలు పాడటం మానేయమని చెప్పాడు.
ఎట్టి పరిస్థితుల్లోనూ నా గొంతును మూగబోనివ్వను. పెళ్లికి ముందే మీరు మాట ఇచ్చారు. ఇప్పుడు మాట తప్పుతారా. నేను వచ్చిన అవకాశాన్ని వదులుకోలేను అన్నది కొంచెం గట్టిగానే.
గాయత్రి ఇలాగే ఎదగనిస్తే తన మాట వినకపోగా లెక్కచేయదని భార్య తనకన్నా ఎక్కువ సంపాదిస్తున్నదని, పేరు ప్రతిష్టలు తెచ్చుకుంటున్నదని, అందరూ ఆమెనే గౌరవిస్తున్నారని రవికాంత్ కి మనసులో ఈర్ష్యగా ఉంది. నా మాటంటే లెక్కలేకుండా చూస్తున్నదని మనసులోనే తిట్టుకుంటూ పళ్ళు నూరాడు.
గాయత్రీ ఒక్కతే రికార్డింగ్ కి స్టూడియో కి వెళ్లి వచ్చింది. అది భర్తకి నచ్చడం లేదు. సాయంత్రం ఇంటికి వచ్చేసరికి గాయత్రీ కనపడలేదు. అవమానం అసహనంతో రగిలిపోయాడు. ఇవాళ తాడోపేడో తెలుసుకోవాలి అనుకున్నాడు.
గాయత్రి ఇంటికి రాగానే నా మాట అంటే నీకు లెక్క లేదా. ఇవాల్టితో మన బంధం తెగిపోయినట్లేనని భార్య మీద కోపం పట్టలేక బయటికి వెళ్లిపోయాడు.
గాయత్రి బాధపడుతూ కూర్చుంది. నాలుగు రోజులు గడిస్తే అతనే సర్దుకుంటాడులే అనుకుంది.
ఇంట్లో గాయత్రికి సమస్యలు ఎక్కువైనాయి. అత్తగారు ఆడపడుచు సాధింపులు. రవికాంత్ అసలు పట్టించుకోవడం మానేశాడు.
ప్రతిరోజు రాత్రికి ఇంటి ఆలస్యంగా వస్తున్నాడు.
రవికాంత్ తోడు రాకపోయినా వచ్చిన అవకాశం వదులుకోవటం ఇష్టం లేక గాయత్రి ఒక్కటే రికార్డింగ్ కు వెళ్ళింది. వచ్చేటప్పుడు ఆటో యాక్సిడెంట్ కి గురి కావడంతో గాయత్రి ని హాస్పిటల్ లో చేర్పించారు.
రవికాంత్ కి ఫోన్ చేసినా రెస్పాన్స్ లేదు. తల్లిదండ్రులకు ఫోన్ చేయించింది వాళ్లు వెంటనే పరిగెత్తుకుంటూ హాస్పిటల్ కి వచ్చారు.
ఏ దురదృష్టమో గాయత్రిని వెంటాడింది. రాత్రి జరిగిన యాక్సిడెంట్లో ఆమె కాలు సగం వరకు దెబ్బ తినడంతో అంతవరకు తీసివేయక తప్పలేదు. గంటలు గడిచే కొద్దీ ఆమె ప్రాణానికే ముప్పు అందుకే కాలు సగం వరకు తీసేయాల్సి వచ్చింది. ఆమె ప్రాణానికి ఎటువంటి ముప్పు లేదని చెప్పారు డాక్టర్లు.
అయ్యో భగవంతుడా నా కూతురికి ఇంతటి అన్యాయం ఎలా చేశావయ్యా.అది కళ్ళు తెరిచి చూసి సరికి సగం కాలు లేదని తెలిస్తే ఎలా బ్రతకగలదు అంటూ ఏడ్చారు గాయత్రి తల్లిదండ్రులు.
వెంటనే వెంకటరమణ అల్లుడు రవికాంత్ కి ఫోన్ చేశాడు. గాయత్రి కి ప్రమాదం జరిగింది వెంటనే హాస్పిటల్కి రమ్మన్నారు. నాకు కాలేజీలో ఎగ్జామ్స్ ఉన్నాయి రావడానికి వీలు లేదంటూ చెప్పాడు. ఒక్కరోజు కూడా వచ్చి గాయత్రిని పలకరించలేదు రవికాంత్.
డిశ్చార్జి చేసి వెంకటరమణా తన ఇంటికి తీసుకువెళ్లాడు కూతుర్ని. నెల రెండు నెలలు చూస్తుండగానే ఆరు నెలలు గడిచిపోయాయి. గాయత్రీ డబ్బంతా హాస్పిటల్కి ఖర్చు పెట్టవలసి వచ్చింది. ఎందుకు పనికిరాని అవిటి దాన్ని నా ఇంటికి పంపిన మా మధ్య ఎటువంటి సంబంధం ఉండదని భార్యని ఇంటికి తీసుకురావద్దని తెగేసి చెప్పాడు రవికాంత్.
గాయత్రి కి పౌరుషం పెరిగింది సగం కాలు లేకపోయినా అంత మాత్రాన నేను బ్రతకలేనా? మిగతా అవయవారాన్ని బాగానే ఉన్నాయి. స్వరం నాకు ఒక వరం. బ్రతికినంత కాలం నా గాత్రమే నా సర్వస్వం. భర్తకి దూరమైన భార్యలు ఈ లోకంలో ఎంతమంది ఉన్నారు. వాళ్లంతా బ్రతకడం లేదా! ఆత్మస్తర్యం ఉంటే అదే చాలు అనుకొని ధైర్యంగా నిలబడటానికి ఆత్మవిశ్వాసం పెంచుకుంది గాయత్రి.
నా గురించి మీరేమీ బాధ పడాల్సిన అవసరం లేదు. జరిగిన దానికి ఏడిస్తే ఏం లాభం. నా భర్త మనసు మార్చుకుని వచ్చి నన్ను తీసుకొని వెళ్తేనే నేను వెళతాను. ఇక్కడే ఉండిపోతాను. ఈ రోజుల్లో సంగీతానికి ఉన్న విలువ దేనికి లేదు. నాకు వచ్చే అవకాశాలు ఎలాగూ వస్తాయి. మీరు కూడా ధైర్యంగా ఉండమని తల్లిదండ్రులను ఓదార్చింది.
జైపూర్ కాలు పెట్టించుకుని మామూలు మనిషిగా తిరుగుతున్నది గాయత్రి. ఇదివరకులా సంగీత కచేరీలకు వెళ్లి వస్తున్నది. సినిమా పాటలు పాడుతున్నది. పాపులారిటీ పెరిగిపోయింది. ఇంటిదగ్గర మ్యూజికల్ నేర్పబడును అనే బోర్డు పెట్టింది. పాడుతా తీయగా లో మొదటి బహుమతి గెలుచుకున్న గాయత్రి అంటే అందరికీ ఇష్టం. ఒక గాత్రమే కాదు వీణ, వయోలిన్, గిటార్ లాంటివి కూడా అందరికీ నేర్పుతుంది. చిన్నపిల్లల నుంచి పెద్దవాళ్ల వరకు సంగీతం నేర్చుకోవడానికి ముందుకు వస్తున్నారు.
కాలం గడిచిపోతున్నది. భార్యాభర్తల మధ్య మనస్పర్ధలు వచ్చి దూరమయ్యారు. అప్పటికే గాయత్రి తల్లి కాబోతున్నది. ఈ విషయం తెలిసిన రవికాంత్ లో ఎలాంటి మార్పు రాలేదు.
అనుకున్నది సాధిస్తున్నది గాయత్రి పిల్లలకు సంగీతం నేర్పుతున్నది. ఆడపిల్ల పుట్టింది. ఆ పాపను ధైర్యంగా పెంచుతున్నది. ఆ పాపకి ఇప్పుడు పదేళ్ల వయసు. గాయత్రిలో ఆత్మవిశ్వాసం పెరిగింది తన కాళ్ళ మీద తాను నిలబడగలిగింది.
ఒకరోజు అనుకోకుండా ఎవరో తలుపు తట్టారు. తలుపు తీసి చూసింది గాయత్రి ఎదురుగా భర్త కనిపించాడు. లోపలికి రావచ్చా అంటూ అక్కడే నిలబడ్డారు.
రావాలి అనుకుంటే రావచ్చు అన్నది. లోపలికి వచ్చి కుర్చీలో కూర్చున్నాడు. ఆరోజు సంగీతం పాఠాలు చెప్పుకునే పిల్లలందరినీ పంపించి వేసింది.
ఎందుకు వచ్చారు చెప్పండి అన్నది.
అక్కడున్న పాపను చూసి ఈ పాప మన పాపేనా! నీ పోలికలు కనిపిస్తున్నాయంటూ పాపను దగ్గరగా తీసుకున్నాడు.
అవును మన పాప అన్నది గర్వంగా.
నిన్ను క్షమించమని అడిగా అర్హతను కోల్పోయాను. నువ్వు ఇంట్లో ఉన్నన్నాళ్ళు నీ విలువ తెలియలేదు. నిన్ను అనగదొక్కాలని చూశాను. చివరికి నువ్వే గెలిచావు. నీ విలువ ఏంటో ఇప్పుడే తెలిసింది. నిన్ను చాలా హీనంగా చూశాను కదూ. ఒక కాలు పూర్తిగా లేకపోయినా బిడ్డకు జన్మనిచ్చి ధైర్యంగా నిలబడ్డావు. ఎందరో మహిళలకు ఆదర్శంగా ఉన్నావు. నీలాంటి భార్యను దూరం చేసుకున్నందుకు ఆదరించే వాళ్ళు లేక అనారోగ్యం పాలై ఒంటరి వాడినయ్యాను. క్షమించాను అంటే కలిసి ఉంటాను. నువ్వు కాదంటే అనాధలా మిగిలిపోతానంటూ దుఃఖంతో కుమిలిపోయాడు రవికాంత్.
గాయత్రి ఒక క్షణం ఆలోచించింది. తప్పులు చేయని వాళ్ళు ఎవరు ఉంటారు. పిల్లలకి తండ్రిని దూరం చేయటం ఇష్టం లేక భర్తని వదులుకోలేక తన మానవత్వాన్ని నిరూపించుకుంది. భార్యాభర్తల అన్నాక సర్దుకుపోవాలి. తన కాళ్ళ మీద తాను నిలబడటానికి తన ఆత్మస్థైర్యమే తనకు రక్ష. కోకిల నల్లగా ఉన్నా తన గొంతుతో అందరినీ అలరిస్తుంది. అలాగే తనకి అవిటితనమైన తన స్వరం మాత్రం నిరంతరం పాడుతూనే ఉంటుంది. తను మరో కోయిలమ్మ గా మారింది.
ఆడది కావాలని తన భర్తను దూరం చేసుకోలేదు. భార్య ఎదుగుదలను ఓర్వలేక మీరే నన్ను దూరం చేసుకున్నారు.
మట్టిలో కూడా మాణిక్యాలు ఉంటాయని ఇప్పుడే తెలుసుకున్నాను. నీలాంటి భార్య దొరకటం నా అదృష్టం అంటూ రవి కాంతు పాపను దగ్గరగా తీసుకున్నాడు.
ఎంతటి అనకువగా ఉన్న మట్టిలో మాణిక్యాలు మగువలు.
మగువే మణిహారం.
రచన తాటి కోల పద్మావతి గుంటూరు.
సెల్ నెంబర్ 9441753376.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

ఎందుకో….

నిజం చెప్తే….