ఎందుకు ఈరోజు కొత్తగా వుంది
పూల గాలి ఒకంత మత్తుగా ఉంది
పుడమి అంతా బంగారు తాపడం చేసినట్టు
నవ కాంతులతో గమ్మత్తుగా ఉంది
కొమ్మలు వింత రంగుల లతాంతాలను ప్రసవించాయి
సూర్యుని లేత కిరణాలు పూలపై ప్రసరించాయి
జగతిలోని సహజ అందాలు నవ్వుతున్నాయి
ధరణిపై దివ్య దీప్తులతో ప్రకాశించాయి
చెట్టు కొత్త చిగుళ్ళకు జన్మనిచ్చాయి
ఆకులకు తీగలు ప్రాణమిచ్చాయి
తోట పరిమళం విరులకు క్రొంగొత్త ఊపునిచ్చాయి
తేటి పాటలకు ఆతిథ్యం ఇచ్చాయి
అగ్నిపూలు అడవంతా ఎర్రని హంగులనద్దాయి
దిరిసెన పూలు పసుపుపచ్చని వింత శోభలు దిద్దాయి
ముందే వచ్చిన వసంతోత్సవ సంబరాలు
వనాలన్నింటికీ ఆకుపచ్చని రంగులు రుద్దాయి
వేపకొమ్మ తెల్లని పువ్వులను సింగారించింది
మామిడి వృక్షం పిందెల హారాలు సవరించింది
చింత చెట్టు వోనగాయల లోలకులు ధరించింది
పొలం చెరుకుగడల వరుసలను అలంకరించింది
పండి వంగిన వరి చేను పచ్చని శోభలీనాయి
నింగిలోని నక్షత్రాలు మిల మిలలాడాలి
కొమ్మ కొమ్మన కోయిలమ్మలు
కొత్త రాగాలు ఆలపించాయి
మల్లె పూలు సువాసనలు వెదజల్లాయి
ప్రకృతి కాంత వింత శోభతో ఒప్పింది
మావి చెట్టు మాధవీలతను
మంచుతెరై కప్పేసింది
ఉగాది వచ్చిందని నా మది
పదేపదే చెప్పింది!!!