మన మహిళామణులు

డాక్టర్ తిరుమల నీరజ

నిర్మొహమాటంగా మనసులో మాట ని చెప్పే ఆమె జర్నలిస్టు, అనువాదకురాలు, ఆధ్యాత్మిక విషయాలు ఆడియోలో అందరికీ వినిపిస్తూ, మన పురాణాలు వాటి విశేషాలు చెప్తున్నారు. నేటి మన జీవిత విధానం మార్చుకునే పద్ధతులు మన రామాయణ భారతాల్లో ఉన్నాయి అంటారు.
కీర్తిశేషులు శ్రీ తిరుమల రామచంద్ర అనంత లక్ష్మి గార్ల తొలి సంతానం నీరజగారు. మరి ఆమె మాటల్లోనే తెలుసుకుందాం.
“నేను పుట్టింది కర్ణాటకలో. పెరిగింది తమిళనాడులో. స్థిరపడింది తెలుగు నాట తెలంగాణలో. ఆంధ్రప్రభ వీక్లీ, డెయిలీలలో సబ్ – ఎడిటర్ గా 25 ఏళ్ళు పని చేశాను.
ఇక నా బాల్యం, విద్యాభ్యాసం వివరాలు చెప్తాను. చెన్నై ట్రిప్లికేన్ లో1_4 వ తరగతి దాకా చదివాను. ప్రతి సబ్జెక్టు లో ఫస్ట్, సెకండ్, థర్డ్ ప్రైజులు నాకే వచ్చేవి. ఇక మా ఇరుగుపొరుగు వారి సాయం, మాట మంచితనం నిజంగా మధురానుభూతి. ఆదరంతో కూడిన పలకరింపు మనిషికి వెయ్యి ఏనుగుల బలం ఇస్తుంది. అలా హాయిగా బాల్యం చదువు పూల నావలా సాగింది.
కానీ లెక్కల్లో వెనుకబడిన అమ్మాయినే. ఎప్పుడూ స్టాండప్ ఆన్ ద బెంచే! బెంచీపై ఎక్కి దెబ్బలు తినే దాన్ని. లెక్కల్లో ఫస్ట్ వస్తే తెలివి గల వారు అని, మార్కులు రాకుంటే మొద్దులు అని ముద్ర వేసే రోజులు అవి. ఇక తెలుగు మీడియం అంటే ఎందుకూ పనికిరాని సరకు అని అందరికీ చులకన! 5_11 తరగతులు లేడీ విల్లింగ్టన్ గవర్నమెంట్ స్కూల్ లో చదివాను. 9వ క్లాస్ లో స్వరాజ్ అనే టీచర్ సైన్సును కథలలాగా చెప్పటం, లెక్కలు చెప్పే విధానంతో హాఫ్ ఇయర్లీ పరీక్షలలో 98% తెచ్చుకోవటంతో ఆమె నాకు దేవతగా నిలిచారు. ఆన్సర్ పేపర్ ని భద్రంగా నా పెళ్ళి అయినాక కూడా దాచుకున్నాను. ఎన్.ఇ. కమల టీచర్ చాలా స్ట్రిక్ట్ చదువు విషయంలో. కానీ మిగిలిన విషయాల్లో ఆమె ఆదరణ, ప్రేమ మరువలేనివి.
బి.ఎ. మొదటి ఏడాది వరకు ఇంగ్లుషు ఉండేది. ఆ పైన అంతా తెలుగే! మృచ్ఛకటికం, ఉత్తర రామచరితం వంటి నాటకాలు చదివే అదృష్టం లభించింది. రుక్మిణి గారు, ల…
బి.ఎ. క్వీన్ మేరీస్ కిలేజీలో, ఎం.ఏ.ప్రెసిడెన్సీ కాలేజీ లో చేశాను. శ్రీ దేవళ్ల చిన్ని కృష్ణయ్యగారు వ్యాకరణం, సంస్కృతం; శ్రీ ఎల్.బి. శంకరరావుగారు భాషాశాస్త్రం; శ్రీ కృష్ణమూర్తి గారు ప్రాచున గ్రంథాలు బోధించారు. ప్రెసిడెన్సీ కాలేజీ లోనే జక్కన విక్రమార్క చరిత్ర మీద పిహెచ్.డి. చేశాను.
1978లో పెళ్లి కావటంతో హైదరాబాద్ లో స్థిరపడ్డాను.
ఆపై ఆంధ్ర ప్రభలో చేరాను. ఎన్నో విషయాలపై రకరకాల ఆర్టికల్స్ రాశాను. అక్కడ శ్రీ దక్షిణామూర్తి గారు ప్రూఫ్ రీడర్ గా ఉండేవారు. ఓ రోజు ఆయన “స్థిమితం అని కాదు, స్తిమితం అని ఉండాలి. ప్రాథీయపడు అని రాయాలి.ఇలాంటి తప్పులు కూడా సరిదిద్దాలమ్మా!” అని నాకు సలహా ఇచ్చారు. నిజంగా అలాటి వ్యక్తుల వల్ల నిఘంటువును ఎలా చూడాలో తెలిసింది. శబ్దరత్నాకరం, సూర్య రాయాంధ్ర నిఘంటువు వంటివి చూడాలి ఎవరికైనా సందేహాలు వస్తే.
ప్రభ నుంచి బైటికి వచ్చాక తొమ్మిదేళ్లు ఎమెస్కో బుక్స్ సంస్థలో పని చేశాను. ఆ తర్వాత ప్రస్తుతం నాలుగు ఏళ్లుగా ఆర్య సమాజ్ వారికి హిందీ పుస్తకాలు తెలుగులోకి అనువాదం చేస్తున్నాను. తమిళ హిందీ ఆంగ్ల భాషల నుంచి ఎన్నో రచనలు తెలుగు లోకి అనువాదం చేశాను. ఎమెస్కో వారికి 4పుస్తకాలు, గోదావరి పబ్లికేషన్స్ వారి కి అబ్దుల్ కలాం గారిది అనువాదం చేశాను.
పోతన గారి భాగవతంలో కథలు, తిరుప్పావై, కనకధారా స్తోత్రం యూట్యూబ్ లో ప్రవచనాలుగా చెప్పాను. ఇపుడు కవిత్రయం వారి ఆంధ్ర మహా భారతం ఆడియోలు చేసి మితారులకు, చుట్టాలకు పంపుతున్నాను.
ప్రతి మనిషికి సంతృప్తి, ధైర్యం ఉండాలి.
సంతోషంగా ఉండేవాడు ఎందులో నైనా సంతోషాన్ని పొందగలడు. భారత భాగవత రామాయణాలు పూర్తిగా చదివితే ఎవరూ ఆత్మహత్యలు చేసుకోరు.
ఓల్డ్ ఈజ్ గోల్డ్. పాత మిత్రులతో గత స్మృతులు పంచుకోవటం నాకు ఆనందం కలిగించే విషయం. కాలేజీ మిత్రురాళ్లతో మాట్లాడుతుంటాను.
మనకి ఉన్నంతలో కొంత అవసరానికి ఇవ్వటం వల్ల జన్మకు సార్థకత కలుగుతుందని నా అభిప్రాయం. మనం సముద్ర మంత సాహిత్యంలో ఓ నీటిబొట్టు మాత్రమే నేర్చుకోగలం. ప్రశాంతంగా ఆధ్యాత్మిక చింతనతో సంతృప్తిగా ఉండటమే నేనిప్పుడు చేస్తున్న పని.”
ఒక సాహితీ వేత్తగా ఒక జర్నలిస్టు గా ఆమెఅనుభవాలు రాయటం నాకు ఆనందం అనిపించింది. కానీ ఆమె రాస్తేనే బాగుంటుం దనుకున్నాను. మొదట్లో నీరజ గారిని గురించి రాయాలి అనుకుని అడిగితే, “ఏమీ లేదమ్మా చెప్పటానికి” అన్నారు. కానీ ఫోన్ లో ఆమె మాటలు విని రాశాను. కొండను అద్దంలో చూపే ప్రయత్నం చేశాను. నీరజగారి దగ్గర నుంచి భాషను గూర్చి నేర్చుకోవలసినవి చాలా ఉన్నాయి. ఆమెకు ధన్యవాదాలు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

బాల తరుణి

కళాతరుణి