అభిరుచుల మేళవింపు

డా. చీదెళ్ళ సీతాలక్ష్మి

నన్ను ముట్టకు నామాల కాకి
అంటే సంఘంలో బ్రతికే వారికి కుదరదు
నీ దారి నీది నా దారి నాది అన్నా
రుచి ఒక్కటే అభిరుచులు ఎన్నో
కస్టమైనా ఇష్టాలను పంచుకుంటే ఆనందం!!

ఎవరి ఇష్టం వారిదైనా
ఎవరి అభిరుచి వారిదైనా
అభిరుచుల మేళవింపు మనసులు నింపు
సప్తవర్ణాల మేళవింపు తెలుపు
అందాల సింగిడి
అందరూ కలిస్తే అభ్యుదయం!!

జిహ్వకో రుచి పుర్రెకో బుద్ధి
నరం లేని నాలుక మాటలు కోటి
ఒక్క తీరు లేకున్నా ఐదు వేళ్ళు కలిస్తేనే కదా కడుపు నిండేది
రెండు చేతులు కలిస్తేనే కదా చప్పట్లు కొట్టేది
ఎవరి ఆలోచన వారిదైనా
ఎవరింట్లో వారున్నా
షడ్రుచుల సమ్మేళనం ఉగాది
అభిరుచుల సమ్మేళనం క్రాంతి
కలిసి వుంటే కలదు శాంతి!

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

సాహిత్య సమరాంగణ లు

తరుణి చిత్రం