అనగనగా అమెరికా

తరుణి పాఠకులందరికీ నమస్కారం!
తురుణి పత్రిక ప్రారంభించి సంవత్సరం పైనే గడిచింది. ప్రారంభంలో పాఠకులు పరిచయం కావాలని ప్రతి రోజు కొన్ని ఆర్టికల్స్ ని పెడుతూ వచ్చేదాన్ని. కవయిత్రులు, రచయిత్రులు, కళాకారులు తరుణి పత్రికకు పరిచయం అయ్యాక, నేను ముందు నిర్ణయించుకున్నట్టుగా దినపత్రిక నుంచి వారపత్రికకు మార్చుకున్నాను. ఇదంతా బాగానే ఉంది. లబ్ద ప్రతిష్టులైన రచయితలు వర్ధమానకవయిత్రులు తరుణి ద్వారా పాఠకులకు పరిచయమయ్యారు. రచనలు ఎక్కువై అంటే లోడ్ ఎక్కువై వెబ్సైట్ తిరుగుతూ ఉండేది , సరిగ్గా ఓపెన్ కాకపోయేది !ప్రారంభంలో నేను తీసుకున్న వెబ్సైటు డిజైన్ ఎలాంటిదో సాంకేతిక విజ్ఞానం తెలియదు.సాంకేతికంగా ఇతరులపై ఆధారపడి చేస్తున్నాను. మళ్లీ వెబ్సైట్ డిజైన్ అంత చేంజ్ చేయించి ఇప్పుడు వస్తున్న విధంగా ఒక క్యాలెండర్ ఒక పద్ధతిగా చేయడానికి మళ్లీ కసరత్తు చేయాల్సి వచ్చింది. అప్పుడు ప్రారంభంలో వచ్చిన ఆర్టికల్స్ ఏవి ఇప్పుడు కనిపించడం లేదు కాబట్టి ఆ ఆర్టికల్స్ అన్ని మళ్ళీ ఇప్పుడు తరుణిలో చేర్చాలని నిర్ణయించుకున్నాను. చక్కని కవితలు, కథలు,ఉషోదయం, తరుణీయం ,ఉషోదయం, న్యాయ సలహాలు, డాక్టర్ సలహాలు అన్నీ కూడా ప్రతివారం కొన్ని కొన్ని పెట్టాలని నిర్ణయించుకున్నాను ఇది పాఠకులు గమనించాలని అభ్యర్థన. చిత్రాలు వాటికి నేను రచించిన చిత్ర కవితలు అన్ని చేరుస్తాను. చూడండి మీ అభిప్రాయాలను తెలియజేయండి.
మీ,
కొండపల్లి నీహారిణి, తరుణి పత్రిక వ్యవస్థాపకురాలు, సంపాదకురాలు.

 

డా|| కె.గీత ప్రముఖ రచయిత్రి, గాయని, భాషా నిపుణులు. “నెచ్చెలి” అంతర్జాల వనితా మాస పత్రిక వ్యవస్థాపక సంపాదకులు. కాలిఫోర్నియాలో నివాసం.  అమెరికాలో సాఫ్ట్ వేర్ ఫీల్డు లో  “తెలుగు భాషా నిపుణురాలి” గా పనిచేస్తున్నారు.

ద్రవ భాష(2001), శీత సుమాలు(2006), శతాబ్ది వెన్నెల (2013) , సెలయేటి దివిటీ (2017)  కవితా సంపుటాలు, సిలికాన్ లోయ సాక్షిగా(2018) కథా సంపుటి, వెనుతిరగని వెన్నెల (2021) నవల ప్రచురింపబడ్డాయి. వివిధ పత్రికల్లో, సంకలనాల్లో  కవిత్వం, కథలు,  కాలమ్స్,  ట్రావెలాగ్స్, వ్యాసాలు అనేకం ప్రచురింపబడ్డాయి.  కవిత్వంలో అజంతా అవార్డు, దేవులపల్లి అవార్డు, కుందుర్తి అవార్డు మొ.న ప్రతిష్టాత్మక పురస్కారాలు ఎన్నో పొందారు. వీరి రచనలు ఇంగ్లీషు, హిందీ, కన్నడ, తమిళం వంటి భాషల్లోకి అనువాదం అయ్యేయి. దేశీయంగా అనేక విశ్వవిద్యాలయాల్లో, సాహిత్య అకాడెమీ సభల్లో , అమెరికాలో తానా, ఆటా, వంగూరి వంటి వివిధ వేదికల మీద పాల్గొని అనేక ఉపన్యాసాలు ఇచ్చారు.

పిల్లల వీకెండ్

అక్కడో కాలిఫోర్నియా రాష్ట్రం. (ఈ మధ్య కపిలారణ్యమని అందరూ కనిపెట్టేరు కదా అదన్నమాట).అది మామూలు అరణ్యం కాదు ధనారణ్యం. అందులో ప్రపంచాన్ని మార్చేసే ప్రోగ్రాములు నిమిషానికొకటి పుట్టి క్షణాల్లో జగమంతా వ్యాపింపజేసే జంతర్ మంతర్ లోయ ఒకటి. దాని పేరు సిలికాను లోయ.ఎక్కడ చూసినా భారతీయులు  ఇబ్బడిముబ్బడిగా కనిపించే ఈ లోయలో దొరకని ఇండియన్ వస్తువులూ, తినుబండారాలూ ఉండవు. లేని దేవుడూ లేడు.వారమల్లా ఉద్యోగార్థమై  పరుగులెట్టే పెద్దలు వారాంతాలలో పిల్లలతో బాటూ పరుగులెడతారు.పెద్దల  వీకెండ్,  పిల్లల పాలిటి వీక్ ఎండ్. అలాంటి పరుగు పిల్లల్లో ఒక చిట్టి, ఒక చిన్ని.చిట్టికి నాలుగేళ్లు, చిన్ని కి ఆరేళ్లు.చిన్నికి ఈ మధ్యనో పెద్ద బాధ పట్టుకుంది. ఎవ్వరితో చెప్పుకోవాలో అర్థం కావడం లేదు.”ఎప్పటికీ చిట్టి లాగా ఉండి పోతే ఎంత బావుణ్ణు” అనుకుంది.కళ్లు గట్టిగా మూసుకుని మనసులో అనుకుంది. “దేవుడూ! మొదట వీకెండ్ తీసెయ్యి.  అంటే శనివారాలు, ఆదివారాలు రెండూ తీసెయ్యి.”రెంటినీ బేరీజు వేసుకుని మళ్లీ ఇలా అంది. “శనివారాలు మొదట తీసెయ్యి. ఎందుకంటే శనివారం ఉదయానే మామూలు కంటే బాగా పొద్దున్నే లేవాలి. తల స్నానం చేసి అమ్మా, నాన్నా వేంకటేశ్వర పూజ చేస్తుంటే నేనూ, చెల్లీ కదలకుండా కూర్చోవాలి. మధ్యలో అమ్మ చెప్పినట్లు దణ్ణాలు పెట్టడం, నాన్న చెప్పినట్లు గంట వాయించడం. ఇంకా పెద్ద బాధ  కాసిన్ని పాలూ, కార్న్ ఫ్లేక్సు గబగబా మింగి ఇండియన్ బట్టలేసుకుని ఉదయానే భాషా బడికి వెళ్లడం. అక్కడ వారమల్లా మాట్లాడే  ఇంగ్లీషు భాష కాకుండా ఇండియాలో అమ్మా, నాన్నా మాట్లాడే భాష నేర్చుకోవాలి. వెళ్లేటప్పుడు, వచ్చేటప్పుడు కారులో భక్తి పాటలో, భగవద్గీత శ్లోకాలో వినాలి. విని విని నోటికి వచ్చిన వాటిని తిరిగి వినిపించాలి. ఇంటికొచ్చి అమ్మ వండిన ఇండియన్ భోజనం గబగబా తిని శాస్త్రీయ సంగీతం క్లాసుకి, అట్నించటే శాస్త్రీయ నృత్యం క్లాసుకి. సాయంత్రం గుడికి. అదింకా కష్టమైన విషయం ఎటూ ఆడుకోవడానికి పోకూడదు. ప్రసాదం ఒక్కటి బావుంటుందనుకో. కానీ అదొక్కదానికోసం శనివారమంతా అవసరమంటావా?  ఇక గుళ్లో ఏవైనా స్పెషల్ కార్యక్రమాలు ఉన్నాయంటే అక్కడే అమ్మ ఒళ్లోనో, నాన్న ఒళ్లోనో పడుకోవలసిందే. ఇంటికి ఎప్పుడు వస్తామో కూడా తెలీదు.”కాస్సేపు ఆలోచించి ఆదివారం అడుగుదామా? అనుకుని ఆదివారం బానే ఉంటుంది కాస్త. ఉదయమే లేవక్కరలేదు. కానీ పదకొండుగంటలకి నాన్నకిష్టమైన సాకర్ నేర్చుకోవడానికి వెళ్లాలి. కాళ్లు నొప్పులు పెడుతున్నా గ్రవుండంతా పరుగెత్తాలి. ఇంటికొచ్చే సరికి కళ్లు తిరుగుతూ ఉంటాయి. మధ్యాహ్నాలు ముందు రోజు క్లాసుల తాలూకు హోం వర్కులుచెయ్యాలి. అదో పెద్ద బాధ. అమ్మా, నాన్నా టీవీ చూస్తూంటే తన గదిలో తను కూర్చుని భాషా బడి హోం వర్కు రాయడమూ, సంగీతం, డాన్సు ప్రాక్టీసు చెయ్యడమూ…. చెల్లి వాళ్లతో బాటూ ఇంచక్కా టీవీ చూడొచ్చు.రెండూ తీసెయ్యమంటే ? కానీ ఒక్కోసారి ఇండియన్ బర్త్ డే పార్టీలు ఉంటాయే! అవన్నీ పోతాయి కదా!అయినా బర్త్ డే పార్టీలకి వెళ్లినంత సేపు బానే ఉంటుంది. కానీ తిరిగిచ్చాక మధ్యాహ్నం చెయ్యాల్సిన లిస్టు రాత్రికి పూర్తి చేసి పడుకోవాలి. అదింకా ఇంకా పేద్ద బాధ.ఇంతలో తన స్నేహితురాళ్లు గుర్తుకొచ్చారు, తనకొక్కదానికే వీకెండ్లు తీసేస్తే మిగతా పిల్లల బాధ మాటేమిటి? “పిల్లలందరి వీకెండ్లూ తీసెయ్యి” అని,ఉహూ, పాపం మధ్యలో ఇంచక్కా ఆడుకునే అమెరికను పిల్లలంతా ఏం పాపం చేసారు?  అందుకే  “అమెరికాలో ఇండియన్ పిల్లల వీకెండ్లన్నీ తీసెయ్యి” అంది.”ఎప్పటికీ చిట్టి లాగా ఉండి పోతే ఎంత బావుణ్ణు” అని మరోసారి అనుకుంది చిన్ని. కానీ ఆ శనివారం సంగీతం టీచరుతో, భాషా బడి మాస్టారితో నాన్న మాట్లాడడం వింది.” మా అమ్మాయి సంస్కృత శ్లోకాలు బాగా పాడుతుందండి. సంగీతం క్లాసులోను, భాషా తరగతి లోనూ  వచ్చే వారం నుండి వేసేస్తాను.” అది విని ఇక చిట్టికీ తప్పడం లేదు పాపం అని నిట్టూర్చింది.అయినా తప్పు తనదేలే- తనే చెప్పింది నాన్నకి,  కారులో రోజూ విన్నవన్నీ చిట్టి చక్కగా పాడేస్తూందని.అసలు ఈ క్లాసులన్నీ  ఎందుకో, ఎప్పుడు చూసినా గుళ్ల చుట్టూ తిరగడమెందుకో, ఇండియన్సు తోటే ఎందుకు స్నేహం చెయ్యాలో  చిన్ని బుజ్జి బుర్రకి ఎంత ఆలోచించినా తట్టలేదు.అమ్మా, నాన్నా ఇండియన్ సంస్కృతి పేరుతో కనబడ్డవన్నీ అమెరికాలో పాటించడం వెనుక నిజంగా భక్తి, ఇష్టమూ ఉన్నా లేకపోయినా, అమెరికన్ సంస్కృతి నేర్చేసుకుని తమ పిల్లలు ఎక్కడ చెడి పోతారోనన్న భయమూ, న్యూనతా భావమూ మాత్రం బలంగా ఉన్నాయని పాపం చిన్నికేం తెల్సు!!

Written by Dr. K Geetha

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

బంధాల కొలిమిలో మహిళామణి

ఫోటోవార్త