నలుసుగా అమ్మ కడుపులో పడినప్పటి నుండి
అమ్మ ఊహల్లో తాను సాధించలేకపోయిన వాటికి ప్రతినిధిగా
నన్ను ఊహించుకుని తెగ సంబరపడిపోతోంది
ఇక నాన్నేమో…నన్ను తన ఇంటికి వచ్చిన
మహాలక్ష్మిని నేనేనని నేను ఈ లోకంలో అడుగుపెట్టగానే
నా చిన్ని పాదాలను ముద్దాడుతూ పరవశించాడు
మరి అమ్మా నాన్నల ఆదిఅంత్యాక్షర బంధమైన అన్నేమో…
కష్టాల్లో చిక్కకుండా/చిక్కినప్పుడు రక్షాబంధనమవుతాడు
తన జీవితానికి అర్థానివి నీవేనంటూ నా జీవిత పరమావధి అవుతాడు పతి
అమ్మా అనే కమ్మని పేగుబంధంతో పున్నామ నరకం లేకుండా చేస్తాడు కుమారుడు
ఇలా అన్నిటా వెన్నుదన్నుగా ఉంటూ
మన్ను మిన్నుల మధ్య నున్న బంధాల కొలిమిలో
నన్ను మహిళామణిగా రూపొందించిన వారందరికి అభివందనాలు
కానీ మహిలో మహిళల జీవితం ఇంత సాఫీగా సాగుతోందా…
అన్నీ పగటికలలే కదూ…
ఎప్పుడో ఒకప్పుడు,
ఏదో ఒక చోట అసమానతలు వెక్కిరిస్తూనే ఉన్నాయి
బండెడు చాకిరి చేసినా
ఆడదానివి నువ్వేం చేస్తావు అనేమాటే మనసు విరిచేసేలా వినిపిస్తోంది
కనురెప్పలా కాపాడాల్సిన చోట కబందహస్తాలై కబళించివేస్తున్నాయి
మానవత్వం మరిచి మగువల పాలిట మృత్యుపాశాలవుతున్నాయి
ఓపికను ఓనమాలు దిద్దే ప్రాయంలోనే ఒంటబట్టించుకుంది కాబోలు…
మగువ బంధాల కొలిమిలో ఎన్నో అవమానపు దెబ్బలు తిని మహిళామణిగ మారింది