తరుణి పాఠకులందరికీ నమస్కారం!
తురుణి పత్రిక ప్రారంభించి సంవత్సరం పైనే గడిచింది. ప్రారంభంలో పాఠకులు పరిచయం కావాలని ప్రతి రోజు కొన్ని ఆర్టికల్స్ ని పెడుతూ వచ్చేదాన్ని. కవయిత్రులు, రచయిత్రులు, కళాకారులు తరుణి పత్రికకు పరిచయం అయ్యాక, నేను ముందు నిర్ణయించుకున్నట్టుగా దినపత్రిక నుంచి వారపత్రికకు మార్చుకున్నాను. ఇదంతా బాగానే ఉంది. లబ్ద ప్రతిష్టులైన రచయితలు వర్ధమానకవయిత్రులు తరుణి ద్వారా పాఠకులకు పరిచయమయ్యారు. రచనలు ఎక్కువై అంటే లోడ్ ఎక్కువై వెబ్సైట్ తిరుగుతూ ఉండేది , సరిగ్గా ఓపెన్ కాకపోయేది !ప్రారంభంలో నేను తీసుకున్న వెబ్సైటు డిజైన్ ఎలాంటిదో సాంకేతిక విజ్ఞానం తెలియదు.సాంకేతికంగా ఇతరులపై ఆధారపడి చేస్తున్నాను. మళ్లీ వెబ్సైట్ డిజైన్ అంత చేంజ్ చేయించి ఇప్పుడు వస్తున్న విధంగా ఒక క్యాలెండర్ ఒక పద్ధతిగా చేయడానికి మళ్లీ కసరత్తు చేయాల్సి వచ్చింది. అప్పుడు ప్రారంభంలో వచ్చిన ఆర్టికల్స్ ఏవి ఇప్పుడు కనిపించడం లేదు కాబట్టి ఆ ఆర్టికల్స్ అన్ని మళ్ళీ ఇప్పుడు తరుణిలో చేర్చాలని నిర్ణయించుకున్నాను. చక్కని కవితలు, కథలు,ఉషోదయం, తరుణీయం ,ఉషోదయం, న్యాయ సలహాలు, డాక్టర్ సలహాలు అన్నీ కూడా ప్రతివారం కొన్ని కొన్ని పెట్టాలని నిర్ణయించుకున్నాను ఇది పాఠకులు గమనించాలని అభ్యర్థన. చిత్రాలు వాటికి నేను రచించిన చిత్ర కవితలు అన్ని చేరుస్తాను. చూడండి మీ అభిప్రాయాలను తెలియజేయండి.
మీ,
కొండపల్లి నీహారిణి, తరుణి పత్రిక వ్యవస్థాపకురాలు, సంపాదకురాలు.
మనిషిలోని అంతర్గత శక్తిని వెలికితీసే గొప్ప సాధనాలు కళలు అంటున్న నాట్యకళావారధి రాగసుధ వింజమూరి గారితో తరుణి ప్రత్యేక ఇంటర్వ్యూ
ఆసక్తిగా ప్రారంభమైన నాట్యకళ ఆమెను అరుదైన అవార్డులతో సత్కారం అందుకునేలా చేసింది. హైదరాబాద్ లోని త్యాగరాజ గానసభలో ఇచ్చిన నాట్యప్రదర్శనలు ఆమెలోని నర్తకిని ప్రోత్సహిస్తూ బ్రిటిష్ పార్లమెంట్ లో ప్రదర్శనలు ఇచ్చే స్థాయికి ఎదిగేలా చేశాయి. ఆమే రాగసుధ వింజమూరి. శాస్త్రీయ నృత్యకారిణి, రచయిత. లండన్ లోని సుందర్‌ల్యాండ్ విశ్వవిద్యాలయంలో అసోసియేట్ లెక్చరర్. ప్రపంచాన్ని వణికించిన కోవిడ్ కారణంగా లాక్ డౌన్ విధించిన సమయంలో ప్రజలలో మనోధైర్యాన్ని పెంచడానికి వైద్య నిపుణులతో కలిసి 20 విభిన్న భాషల్లో వారి సూచనలు, సలహాలు తీసుకుని వివిధ రకాల ప్రాంతీయ కళలపై అనేక వెబ్‌నార్లను నిర్వహించారు. ఇవి “డిక్షన్ బై డాక్టర్స్” పేరుతో ప్రచురించబడ్డాయి. ఇవి కోవిడ్ మహమ్మారి ప్రభావాలను ఎదుర్కొనేందుకు అవగాహన కల్పిస్తూ ప్రజల్లో ఆశావాద దృక్పధాన్ని పెంచాయి. శారీరక , మానసిక ఆరోగ్యం, నృత్యం – మధుమేహం నిర్వహణ, సంగీత చికిత్స, మహిళా సాధికారత, నీటి సంరక్షణ మొదలైన అంశాలపై నృత్య రూపకాలు ప్రదర్శించారు. లండన్ లో భారతీయ నృత్యానికి సముచిత స్థానం కల్పించారు. కళ ద్వారా ప్రజాసేవ చేసిన ఆమె కృషికి మెచ్చిన బ్రిటిష్ ప్రభుత్వం గత ఏడాది బ్రిటిష్ సిటిజన్ అవార్డుతో సత్కరించారు. అరుదైన గుర్తింపు అందుకున్న తెలుగుమహిళగా పేరుగాంచారు. లండన్ లో నివసించే రాగసుధ వింజమూరి గారితో తరుణి ప్రతినిధి యశోద వంగ ఇంటర్వ్యూ తరుణి పాఠకుల కోసం..
తరుణి : నమస్కారం రాగసుధ గారు. మీరు అనేక పర్యాయాలు బ్రిటిష్ పార్లమెంట్ లో నృత్య ప్రదర్శనలు ఇస్తూ భారతీయ నృత్య కళకు ఆదరణ తీసుకువస్తున్నారు. మీకు మా తరుణి తరపున అభినందనలు. అనేక అవార్డులు సొంతం చేసుకున్నారు. నృత్యంపై మీకు ఎలా ఆసక్తి ఏర్పడింది.
రాగసుధ : తరుణి పాఠకులకు నమస్కారాలు. అంతర్జాల వేదికపై మహిళల కోసం ప్రత్యేకంగా పత్రికను తీసుకువస్తున్నందుకు సంతోషంగా ఉంది. మహిళల కోసం అంతర్జాతీయ స్థాయిలో ఎన్నో పత్రికలు, వెబ్ సైట్లు ఉన్నా తెలుగులో రావడం సంతోషదాయకం. మన భాష, కళలు ప్రపంచవ్యాప్తంగా గుర్తింపు రావాలన్న తపనతోనే లండన్ లో నృత్యపాఠశాల నిర్వహిస్తున్నాను. ఇందుకు మూలాలన్ని నా చిన్నతనంలోనే పడ్డాయి. మా అమ్మనాన్న కళలకు ఇచ్చిన ప్రాధాన్యత కారణంగానే ఈ రోజు ఖండాంతరాలు దాటి మన సంస్కృతిని ఇక్కడ విస్తరించగలుగుతున్నాను. మా నాన్న వింజమూరి శేషాచార్య. హైదరాబాద్ లోని ఖాదీభవన్ లో అధికారిగా పనిచేశారు. అమ్మ రాఘవ కుమారి గృహిణి. వారికి నేను ఒక్కదాన్నే సంతానం కావడంలో ఎంతో అల్లారు ముద్దుగా పెంచారు. వారికి సంగీత, సాహిత్యవేత్తల వారసత్వం ఉండటంతో నాకు ఎనిమిదేళ్లు ఉన్నప్పుడే ప్రముఖ నాట్యగురువు ఉమారామారావు గారి వద్ద చేర్చారు. ఆమె శిక్షణలో సంవత్సరాల తరబడి సాగిన సాధన తర్వాత త్యాగరాజు గానసభ, రవీంద్రభారతి, లలితకళానిలయం తదితర ఎన్నో వేదికలపై ప్రదర్శనలు ఇచ్చాను. మా గురువుగారి ప్రోత్సాహంతో శివాజీ మహారాజ్ వంశస్థులు రాసిన తంజావూరు లైబ్రరీలో ఉన్న కంపోజిషన్స్ సేకరించి నృత్యం దర్శయామి అనే ప్రదర్శన ఇచ్చాం.
తరుణి : హైదరాబాద్ నుంచి లండన్ వరకు సాగిన మీ నాట్య ప్రయాణం …
రాగసుధ : నిజాం కాలేజీలో డిగ్రీ పూర్తి అయిన తర్వాత జర్మనీలో ఉన్నత చదువులు పూర్తి చేశాను. ఆ తర్వాత తెలుగు విశ్వవిద్యాలయంలో టూరిజం విద్యార్థులకు రెండు సంవత్సరాల పాటు పాఠాలు చెప్పాను. ఇంటర్నేషనల్ ఎయిర్‌పోర్ట్ ట్రాన్స్పోర్ట్ అసోసియేషన్ కన్సల్టెంట్ గా అనేక దేశాలకు వెళ్ళాను. ఆ తర్వాత మహారాష్ట్రకు చెందిన సుశీల్ తో పెళ్లి జరిగింది. ఆయన లండన్ లో ఉద్యోగం చేసేవారు. దాంతో నేను ఆయనతో పాటు లండన్ వెళ్లాను. సుందర్లాండ్ విశ్వవిద్యాలయంలో టూరిజం ఫ్యాకల్టీగా పనిచేస్తున్నాను. మా పాప కావ్య. అక్కడ స్థిరపడిన తెలుగు వారి పిల్లలకు భరతనాట్యం నేర్పించేందుకు సంస్కృతి పేరుతో ఒక సంస్థను ప్రారంభించాను. భరతనాట్యం నేర్చుకోవడానికి చాలామంది పిల్లలు వస్తుంటారు. మా దగ్గరకు వచ్చే చిన్నారులకు ముందుగా రాగాలు, ఆ తర్వాత నాట్యం నేర్పిస్తున్నాను. ఇక్కడ కొన్ని ప్రత్యేక సందర్భాలలో బ్రిటన్ పార్లమెంట్ లో నృత్య ప్రదర్శనలు నిర్వహిస్తారు. ప్రతి సంవత్సరం హిందూ ఫోరం ఆఫ్ బ్రిటన్ ఆధ్వర్యంలో దీపావళి వేడుకలు బ్రిటన్ పార్లమెంట్‌లో చాలా ఘనంగా జరుగుతాయి.భారతదేశ నృత్యం ప్రదర్శించే అవకాశం చాలా సార్లు వచ్చింది. దాంతో త్యాగరాజ గానసభలో ప్రారంభమైన నృత్యప్రదర్శనలు బ్రిటన్ పార్లమెంట్ వరకు కొనసాగుతున్నాయి. ఇలా ఎవరికీ లభించని అరుదైన అవకాశం బ్రిటన్ పార్లమెంట్ లో నాట్య ప్రదర్శనలు ఇచ్చే అవకాశం నాకు లభించింది.
తరుణి : మీరు మూడు రంగాల్లో గుర్తింపు పొందారు. ఆ రంగాలు, మీరు అందుకున్న అవార్డుల గురించి చెప్పండి?
రాగసుధ : ముందుగా నాట్యకళాకారిణిగా గుర్తింపు లభించింది. ఆ తర్వాత పర్యాటక రంగంలో భాగంగా ఇరు దేశాల మధ్య కళావారధిగా వ్యవహరిస్తూ కళాప్రదర్శనలు నిర్వహించాం. దాంతో టూరిజం రంగంలోనూ అవార్డులు అందుకున్నాను. వీటితో పాటు జర్నలిజంలోనూ ప్రవేశం ఉండటంతో వివిధ జర్నల్స్ కు మంచికథనాలు రాసే అవకాశం వచ్చింది. రచయితగా రామానుజం చరిత్రను పుస్తకరూపంలోకి తీసుకువచ్చే మరో అరుదైన అవకాశం లభించింది. ఈ రంగాల్లో నేను చేసిన కృషికి అవార్డు ఫర్ కల్చరల్ ఎక్సలెన్సీ, కళా వారధి” అవార్డులు అందుకున్నాను. అంతేకాదు బ్రిటిష్ సిటిజన్ అవార్డుతో సత్కరించారు.
తరుణి : బ్రిటిష్ లైబ్రరీ క్యాటలాగ్ లో రామానుజ చరిత్ర చేరడం వెనుక మీరు పడిన శ్రమ వివరిస్తారా?
రాగసుధ : ఉద్యోగం, కుటుంబ నిర్వహణ లో ఎంత బిజీగా ఉన్న వీకెండ్స్ ఏ మాత్రం ఖాళీ సమయం లభించినా లైబ్రరీలో గడపడం నాకు చాలా చాలా ఇష్టమైన పని. అలా తరచుగా బ్రిటన్ లైబ్రరీకి వెెెళ్లడంతో ఎంతో జాగ్రత్తగా ప్రిజర్వ్ చేసిన తాళపత్ర గ్రంధాలను పరిశీలించే అవకాశం వచ్చింది. అవి మూడు వందల సంవత్సరాల క్రితం రాయబడినవి అని చరిత్రకారులు చెప్పారు. వాటిలో తెలుగులో రాయబడిన రామానుజాచార్యుల జీవిత చరిత్ర ఉంది. దానిని ఇల్లెండు రామానుజాచారి తాళపత్రాలపై రచించాడు. వాటిలో ఉన్న పూర్తి సమాచారాన్ని డిజిటల్ రూపంలోకి తీసుకు వచ్చాం. ఈ పుస్తకాన్ని బ్రిటన్ పార్లమెంట్ లో ఆవిష్కరించారు. ఆ తర్వాత బ్రిటిష్ లైబ్రరీ క్యాటలాగ్ లో ఆ పుస్తకాన్ని చేర్చాం.
తరుణి :మీరు బ్రిటిష్ పార్లమెంట్ లో, అత్యంత ప్రతిష్టాత్మకమైన వేదికలపై ప్రముఖులు సమక్షంలో నాట్య ప్రదర్శన ఇచ్చే అవకాశాన్ని అందుకున్నారు. మీ ప్రత్యేక జ్ఞాపకాలలో ఒకటి ..
రాగసుధ : హైదరాబాద్ లోని త్యాగరాజగానసభలో ప్రారంభమైన నాట్యప్రదర్శనలు ఆ తర్వాత ప్రపంచవ్యాప్తంగా అనేక వేదికలపై ప్రదర్శించే అవకాశం లభించింది. నాట్యప్రదర్శన నిర్వాహకులందరికీ కృతజ్ఞతలు. శాస్త్రీయ నృత్యం గురించి నాకు తెలిసిన వాటిని విభిన్న ప్రేక్షకులతో పంచుకునేలా చేస్తుంది. 50 మంది ప్రేక్షకుల నుండి 20,000 మంది ప్రేక్షకుల సమక్షంలో నృత్యాన్ని ప్రదర్శించే అదృష్టం దక్కింది. నాట్య కళా ప్రదర్శనలో ముఖ్యమైనవి, ప్రత్యేకమైనవి , చిరస్మరణీయమైనవి చాలానే ఉన్నాయి. వాటిలో నాకు బాగా సంతోషాన్ని కలిగించిన సందర్భం తెలుగు భాషా దినోత్సవాలు 2021 సందర్భంగా గౌరవనీయ భారత ఉపరాష్ట్రపతి శ్రీ వెంకయ్య నాయుడు గారి ముందు వర్చువల్ ప్లాట్‌ఫారమ్‌పై డ్యాన్స్ ప్రదర్శించడం పూర్తిగా భిన్నమైన అనుభవం. ఉప రాష్ట్రపతి గారు కీలక ప్రసంగం చేసే ముందు ఈ నృత్యం ప్రదర్శించబడింది. ఇది ప్రత్యేక జ్ఞాపకంగా మిగిలిపోయింది.
తరుణి : శాస్త్రీయ నృత్యాన్ని తర్వాతి తరానికి అందించడానికి మీరు చేస్తున్న కృషిని ..
రాగసుధ : మనది సంపన్నమైన, ప్రాచీనమైన , శక్తివంతమైన నాగరికత. . మన కళలు, సంస్కృతి పట్ల శ్రద్ధ వహించాల్సిన బాధ్యత మనందరికీ ఉంది. మన పూర్వీకులు మనకు అపారమైన వారసత్వ సంపదను అందించారు, ఇప్పుడు రాబోయే తరాలకు విలువైన వారసత్వాన్ని అందించడం మన బాధ్యత. సాంస్కృతికంగా , సామాజికంగా ముఖ్యమైన కథలు ఎన్నో ఉన్నాయి. మనందరికీ తెలిసినట్లుగా ప్రజలను కమ్యూనికేట్ చేయడానికి , ఒక విషయాన్ని చెప్పడానికి నృత్యం ఒక ముఖ్యమైన సాధనం. శాస్త్రీయ నృత్యంలో తరువాతి తరానికి అంతగా తెలియని కథలను తీసుకురావాలన్న ప్రయత్నం చేస్తున్నాను. శాస్త్రీయ నృత్యానికి సృజనాత్మకత , పరిశోధనను జోడిస్తే అది మరింత విస్తృత వర్ణపటం గా మారుతుంది.
తరుణి : బ్రిటన్, భారతదేశంతో మీ సంబంధాన్ని ఎలా వివరిస్తారు?
రాగసుధ : భారతదేశం నా జన్మభూమి . లండన్ నా కర్మభూమి (పని భూమి). నా మూలాలపై నేను గర్వపడుతున్నాను. నేను ఇప్పుడు నివసిస్తున్న సమాజం పట్ల గొప్ప బాధ్యతను ఫీల్ అవుతున్నాను. బ్రిటన్ , భారతదేశం రెండూ గర్వపడేలా ఇరు దేశాల మధ్య సాంస్కృతిక అవగాహన , పరస్పర గౌరవం పెంచడం నా బాధ్యత. భారతీయ కళా ప్రదర్శనల ద్వారా బ్రిటన్‌లో సాంస్కృతిక ఫాబ్రిక్‌ను మెరుగుపరచడం ఉడుతా భక్తిగా భావిస్తున్నాను.
తరుణి :లాక్‌డౌన్ , కోవిడ్-19 మహమ్మారి సమయంలో మీరు నేర్చుకున్న పాఠాలు..
రాగసుధ : లాక్‌డౌన్ మనకు విలువైన పాఠాలను అందించింది- మనం ఆత్మవిశ్వాసం ఎప్పటికీ వదులుకోకూడదని, ప్రతికూల పరిస్థితుల్లో కూడా మనం అర్థవంతంగా ఏదైనా చేయగలమని నిరూపించింది. లాక్డౌన్ నెలల్లో కోవిడ్ 19 కారణంగా పెర్ఫార్మింగ్ ఆర్టిస్టులు అత్యంత దెబ్బతిన్నారు. వేదికలు మూసివేయబడ్డాయి, జీవనోపాధి కోల్పోయారు. అన్నింటికంటే ప్రతిభ ,కళాత్మక సామర్థ్యాలను పంచుకున్నందుకు సంతృప్తి చెందే అవకాశాలు తగ్గాయి. ఇలాంటి సమయంలో సంస్కృతీ సెంటర్ ఫర్ కల్చరల్ ఎక్సలెన్స్ ద్వారా, మేము వర్చువల్ ప్లాట్‌ఫారమ్‌లలో ప్రేక్షకుల ముందుకు వచ్చాం. ప్రత్యేకమైన ప్రాంతీయ సంస్కృతులు , కళారూపాలపై వెబ్‌నార్లు, వర్క్‌షాప్‌లను నిర్వహించాం. మానసిక ఆరోగ్యంలో కళలప్రదర్శన పాత్రను తక్కువగా అంచనా వేస్తారు. కానీ కళాత్మక ప్రదర్శనలు ఉల్లాసాన్నే కాదు ఆత్మవిశ్వాసాన్ని పెంచుతాయి అని వివిధ వర్గాల నుండి వచ్చిన అద్భుతమైన అభిప్రాయాల ద్వారా మరోసారి స్పష్టమైంది. భారతదేశ అనేక ప్రాంతీయ కళారూపాలను మా వెబ్‌నార్ల ద్వారా అనేక వేల మంది వీక్షకులకు అందించాం. ఎలాంటి విపత్కర పరిస్థితుల్లోనైనా మానసిక, శారీరక ఆరోగ్యానికి కళలు దోహదం చేస్తాయి, మనిషిలోని అంతర్గత శక్తిని వెలికితీసే గొప్ప సాధనాలు కళలు కోవిడ్ సమయంలో మరోసారి స్పష్టమైంది.
తరుణి : తెలుగుభాష వ్యాప్తి కోసం మీరు చాలా కృషి చేస్తున్నారు. మీ సంస్థ ద్వారా ఎలాంటి కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు?
రాగసుధ : కామన్ వెల్త్ జర్నలిస్ట్ గా గత కొన్ని సంవత్సరాలుగా నుంచి పనిచేస్తున్నాను. కామనెవెల్ జర్నలిస్ట్ అసోషియేషన్లో సభ్యురాలిగా ఉన్నాను. రెండు పత్రికలకు ఫ్రీలాన్స్ గా రాస్తుంటాను. 1830 సంవత్సరంలోనే బ్రిటన్లో తెలుగు భాష ఉందన్న విషయం తెలిసి, వారిపై సంవత్సరానికి పైగా పరిశోధన చేసి రాసిన వ్యాసం మారిషస్ పత్రికలో ప్రచురితమైంది. దాన్నే ప్రపంచ తెలుగు మహాసభల ప్రత్యేక సంచిక 2012లో తెల్లదొరలు – తొలి తెలుగు చిగురులు’ పేరుతో తెలుగులో ప్రచురించారు. ఇక్కడ నాట్యం నేర్చుకోవడానికి వచ్చే పిల్లలకు తప్పనిసరిగా సంగీతం, తెలుగు చదవడం నేర్పిస్తాం. కమ్మనైన తెలుగును విశ్వవ్యాప్తంగా గుర్తింపు తీసుకురావాలన్నది నా ప్రయత్నం. అందుకోసం ప్రత్యేకంగా లండన్ లోని తెలుగువారి పిల్లలకు తెలుగు క్లాస్ లు ఏర్పాటుచేస్తున్నాం
(16.4.2022 తరుణి అంతర్జాల వారపత్రిక నుండి)