స్త్రీ…..ఆ పదమే అనిర్వచనీయమైన ఒక అనుభూతికి ఆవిష్కారం. మనిషి నిలువెత్తు రూపాన్ని
గీసిన సృష్టికర్త ఆమె. కాలాలు ఎన్ని మారినా ఎవరూ విశ్లేషించలేని సరికొత్త భాష్యం. ఎప్పటికప్పుడే నూతనత్వాన్ని ఆపాదించుకుంటున్న చైతన్యధార.
ఓరిమి ముంగిట్లో వెలిగే నిరంతర దీపకిరణం. త్యాగాల
సంద్రంలో అఖాతాల అంచులు చూసిన మేలిమి ముత్యపురాశి.
అవును మరి..కాదని ఎవరూ అనలేరు. కానీ ఇవన్నీ గొప్పలు చెప్పుకోవడానికి మాత్రమే పనికి వస్తాయి. ఉపన్యాసాలలో చప్పట్ల మోతలకు ఊతమిస్తాయి. వాస్తవానికి వస్తే, నిజ జీవితపు పరదా చాటున పురుష అధికారపు సంజ్ఞలతో ఆడే తోలుబొమ్మగా ప్రపంచమంతా అణువణువునా ఆమె కనిపిస్తుంది. వేదాలను, శాస్త్రాలను తప్పుదోవ పట్టించి, మహాత్ముల సూక్తులను తమకు అనుకూలంగా మార్చుకుంటున్నారు. పదే పదే మనసును నిలువుగా చీలుస్తూ చిత్రవధకు గురిచేస్తు న్నారు.’ కలకంఠి కంట కన్నీరొలికిన’ అంటూనే కంటి
చెలమను తవ్వుతూ వున్నారు..
సమానత్వం…సమానత్వం… నిజంగా పాటిస్తున్నారా? మగవారితో పోటీగా అన్నిరంగాల్లో
తనను తాను నిరూపించుకుంటున్నా ఇంకా వివక్షే.
ఎప్పుడూ చిన్నచూపే. మనసు, తనువు రెండూ వారికే
త్యాగం చేసి, అన్నీ కోల్పోయాక ఇంకా మిగిలింది
ఏముంది తనలో?
పూర్వకాలంనుండే విదుషీమణులు, లలితకళా కోవిదులు,యుద్ధ తంత్రాలను నెరపినవారు, రాజ్యాలను పాలించినవారు, చరిత్రను సృష్టించారు. అలాంటి ఎంతోమంది మహిళల గురించి తర్వాతి
తరాలు తెలుసుకోనక్కరలేదా? వారి మార్గదర్శకత్వం
ఇప్పటివారికి అవసరం కాదా?
ఇప్పుడు సమాజంలో స్త్రీలు అడుగుపెట్టని
రంగం లేదంటే ఎంతమాత్రం అతిశయోక్తి అనిపించుకోదు. విద్య, వైద్య, క్రీడ, శాస్త్ర సాంకేతిక, పోలీస్,పరిపాలన మొదలగు వాటిల్లో అనేకమైన కీలక పదవులను సమర్థవంతంగా నిర్వహిస్తున్నారు. సైకిల్
నుండి విమానం వరకు పురుషులతో సమానంగా అత్యంత ధైర్యంగా వాహనాలను నడుపుతున్నారు.
స్త్రీలు బలహీనులు కారని, మానసిక స్థైర్యమే కాక శారీరకదృఢత్వంలోను పురుషులకు తీసిపోరని అన్ని
సందర్భాల్లోనూ రుజువు చేస్తూనే ఉన్నారు.
అందరూ ఒప్పుకోవాల్సి నిజం..స్త్రీ లేకుంటే
పురుషుడు అన్ని విధాలుగా బలహీనుడవుతాడని… మనిషి పుట్టుకకు, నడకకు ,నడతకు అన్నింటికీ ఆమేగా తోడునీడ! ఆత్మవిశ్వాసపు పొదరింట్లో తన కుటుంబ రక్షణ కోసం తనను తాను నిరంతరం సంస్కరించుకుంటూ, త్యాగాలకు నిలయమైన సేవామూర్తి ఆమె. అయినప్పటికీ ఇవాళ లోకంలో జరుగుతున్న అనేక సంఘటనలు మనిషితనం నుండి మనిషిని వేరు చేస్తున్నాయి. తలదించుకొని సిగ్గుపడే పరిస్థితులు కల్పిస్తున్నాయి. సాధికారత సాధించి కూడా ఎన్నో కారణాలు స్త్రీలను బలవంతపు మరణాలకు ప్రేరేపిస్తున్నాయి.
“తానొక తెరిచిన పుస్తకమే కావచ్చు” మీ దృష్టిలో. అందులో మీరు తిరగేయని పేజీలెన్నో..
అర్థం కాని పదాలెన్నో… ఆమె మనోకాగితాన్ని విప్పి
చదవండి. కన్నీటితో అలుక్కుపోయి, మసకబారిన అక్షరాలు కనిపిస్తాయి…మిమ్మల్ని మీరు క్షమించుకోలేని మౌనభాష్యం మీకు వినిపిస్తుంది.ఆమెను ఆమెగానే బతకనివ్వండి. ఆమెలోని ఆమెకు స్వేచ్ఛ నివ్వండి చాలు.