అంతర్జాతీయ మహిళా దినోత్సవం సందర్భంగా..

     రంగరాజు పద్మజ

మహిళా దినోత్సవం జరుపుకుంటున్న మనం మనకే స్ఫూర్తి అయినా కూడా…. మన భుజంతట్టేందుకు, మనను ఉత్తేజపరిచేందుకు , లక్ష్య సాధన ఎలా చేయాలి అనే దానికి మార్గదర్శకంగా ఆదర్శ మహిళలు ఆనాటి నుండి ఈనాటి వరకు ఎందరో ఉన్నారు.. వారందరినీ ఒకసారి స్మరించుకొని వారి అడుగుజాడల్లో నడిచి లక్ష్యాన్ని సాధిద్దాం…
కాకతీయుల కాలంలో సాహితీ ప్రేమికురాలు మాచల్దేవి గురించి క్రీడాభిరామములో… ఇలా చెప్పారు.
మాచల్దేవి మందిరం అలంకారానికి చెప్పుకో తగిందట! ఆమె అధ్వర్యంలో నాట్య, నృత్య, సంగీత, సాహిత్య సభలు జరిగే మందిరాలు ఎన్నో ఉండేవట… అందుకే ఆమెకో బిరుదు ఉండేది.
* ప్రతాపరుద్ర ధరణీ శోపాత్త గోష్టీ ప్రతిష్టా పారీణ*
అనే ఈ బిరుదు వల్ల ఆమె ఎంత గొప్ప పేరున్న సాహితీ ప్రేమికురాలో చెబుతున్నది.
ఆమె నాటకాలను ఆనాటి ప్రజలు ప్రదర్శించే వారట! అంత గొప్ప సాహితీ ప్రేమికురాలు..
ఈ విశేష సందర్భంలో మనం ఒకటి గుర్తుపెట్టుకోవాలి. ఏమిటంటే…..

” అరక్షితా గృహే రుద్ధాః పురుషై రాస్త కారిభః
ఆత్మానా మాత్మానాయాస్తు రక్షేయుస్తాః! సురక్షితాః ”

అంటే పురుషులు స్త్రీలను ఎంత ప్రేమగా చూసుకున్నా… వారిని ఇంట్లో నిర్బంధిస్తే ఆ స్త్రీలు నిజంగా రక్షితులు అనబడరు…. ఏ స్త్రీలైతే తమను తామే కాపాడుకుంటారో వారే నిజంగా సంరక్షితులని అనుకోవాలి.
స్త్రీలకు మొట్టమొదటి వారసత్వపు హక్కు కల్పించింది కౌటిల్యుడు. అంతేకాదు మెగస్తనీసు అనే గ్రీకు యాత్రికుడికి రక్షక దళం స్త్రీలే ఉండేవారట.
శాతవాహనుల కాలంలోను స్త్రీకి ఎక్కువ గౌరవం దక్కింది. . ఎలా అంటే ఆ రాజులు తమ పేరు ముందు తల్లి పేరు చెప్పి తమ పేర్లను తర్వాత చెప్పుకున్నారు.. ఉదాహరణకు గౌతమీపుత్ర శాతకర్ణి; వాసిష్టీపుత్ర పులోమావి, మాఢరీపుత్ర శకసేన శాతకర్ణి… ఇలా పేర్లు పెట్టుకున్నారు.
ఇక్ష్వాకుల కాలంలోనూ ఇదే మాదిరిగా పేర్లు పెట్టుకుని వారికి స్త్రీల పట్ల ఉన్న గౌరవం చాటుకున్నారు.
ఇక్ష్వాకుల కాలం నాటి తెలుగు మహిళలు భర్తల పేర్లు తమ పేర్లకు జతచేసి పెట్టుకున్నారు.
అశోకుని కాలంలో సముద్రం దాటి సంఘమిత్ర శ్రీలంకకు వెళ్లి బౌద్ధమత ప్రచారం చేసింది. అంతటి ధీశాలి ఆమె!
పూర్వకాలంలో మన తెలుగు గడ్డ మీద స్త్రీలు ఇటు ఇంటికీ- అటు సమాజానికి ఆదర్శంగా ఉంటూ పురుషులతో సమానమైన స్వేచ్ఛతో ధర్మ కార్యాలను చేశారు.
మధ్యయుగం వచ్చేసరికి ముస్లిం స్త్రీలకు ఘోషా పద్దతి వచ్చింది. అయినా వారు కూడా రాజ్యాన్ని పరిపాలించారు.. 13వ శతాబ్దిలో * రజియా సుల్తానా* ఎంతో నేర్పుతో పరిపాలించింది.
అక్బరు కాలంనాటి చాంద్ బీబీ గొప్ప పరిపాలకురాలు.
నూర్జహాన్ కూడా చారిత్రకంగా పేరు పొందిన వనితనే!
ఆ కాలంలో సల్ బదన్ బేగం* జహనారా* అనే గొప్ప రచయిత్రులూ ఉన్నారు.
సోమేశ్వర చాణిక్యుడి భార్య మాలిలా దేవి క్రీ.శ.1053 లో “బనవాసి” అనే పెద్ద ప్రాంతాన్ని పాలించింది.
మూడో విజయసింహ రాజు సోదరి అక్కమహాదేవి క్రీ.శ.1022లో ” కిస్సుగడ” అనే ప్రాంతాన్ని పాలించింది.
ఆరో విక్రమాదిత్యుని పట్టపు రాణి క్రీ.శ 1075నుండి 1125 వరకు రాజ్యాన్ని ఏలింది.
హొయసల రాజైన విష్ణువర్ధనుని భార్య బమ్మలదేవి క్రీ.శ.1125 లో రాజ్యపాలన చేసింది.
ఇలా చరిత్రలో ఎంతోమంది స్త్రీలు పేరు పొందిన వారున్నారు. అన్ని రంగాలలోనూ నిష్ణాతులని నిరూపించుకున్న వారూ ఉన్నారు.
అంతేకాదు వేదాలలో ఉపనిషత్తులలో సమాన స్థాయి పొందిన బ్రహ్మ వాదినిలూ ఉన్నారు.
మత ప్రచారకులు లేదా మత ప్రవక్తలు కూడా స్త్రీలకు ప్రాముఖ్యతనిస్తూ… తమ ప్రచారాలకు వారి అవసరం ఎంతో ఉందని గ్రహించి, గౌరవించారు.
ముఖ్యంగా కాకతీయుల పాలనలో మహిళలకు సమున్నత స్థానమే దక్కింది. రుద్రమదేవి వంటి రాణులు రాజ్యాలను నిలుప కలిగినవారు ఉన్నారు.
కామసాని అనే ఆమె తాను చాకచక్యంగా కాకతి మొదటి బేతరాజు రాజ్యం పోగొట్టుకోకుండా నిలిపింది. ఆ తరువాత కూడా కాకతీయ సామ్రాజ్యానికి వెన్నుదన్నుగా నిలిచింది.
ఇలా చెబుతూ పోతే మనకు చరిత్రపుటల్లో ఎందరో స్పూర్తివంతమైన మహిళలు కనపడతారు. ఏ రంగంలో ఉన్నా…. ఎన్ని ఒడుదొడుకులు ఎదురైనా… వారు అనుకున్న లక్ష్యం చేరగలగాలి అనే ఈ మహిళల గురించి చెప్పుకుంటున్నాం!
అంతెందుకు, చరిత్రలో నాయకురాలు నాగమ్మ కూడా స్ఫూర్తి మంతురాలే!,
ఒక రాజ్యాలేలే రాణులే కాదు… మంచి మంచి సలహాలు ఇస్తూ రాజ్యాలను నిలిపిన మంత్రులూ ఉన్నారు.
మన కవయిత్రులకు మొల్ల ఆదర్శప్రాయురాలే కదా? ఆమె అననుకూల పరిస్థితుల్లో కూడా తన రామాయణాన్ని ఆ స్థానంలో చక్కగా చదివి వినిపించింది. తొలి కవయిత్రి తాళ్ళపాక తిమ్మక్క కూడా మనకు ఆదర్శమే!
మైలమ్మ, కుప్పాంబిక వంటి పేరుపొందిన కవయిత్రులు ఉన్నారు.
కొడుకులను వీరులుగా తీర్చిదిద్దిన శీవాజీ తల్లి జిజియాబాయి వంటి నారీమణులు ఉన్నారు. స్వయంగా చానమ్మ, పోలమ్మ , విశాలాక్షి వంటి వీరనారీమణులు ఉన్నారు.
అలా అని వీరందరి జీవితాలు గులాబీ పూల పాన్పు ఏమీ కాదు… సమాజం స్వాతంత్రం ఇస్తూనే… ఎన్నో అంక్షలు కూడా పెట్టింది.. అయినా వాటిని అధిగమిస్తూ… వారు అనుకున్న లక్ష్యాలు సాధించగలిగారు… మనకూఎన్నో అడ్డుగోడలు వస్తూనే ఉన్నాయి… మనము కూడా వాటిని ఎదుర్కొందాం! ధైర్యంగా ముందుకు సాగుదాం! అనుకున్నది సాధిద్దాం!
అంతేకాదు ఆనాటి స్త్రీలు గౌరవ మర్యాదలు ఉన్నవారని బసవ పురాణం ద్వారా తెలుస్తున్నది.
ఇక నేటి కాలానికి వస్తే… శ్రీకృష్ణ భాషా నిలయం రజతోత్సవ వేడుకల్లో మహిళలకు ప్రత్యేకంగా సభను ఏర్పాటు చేశారు. ఆ మహిళలకు ఉన్న తెలుగు భాషాభిమానాన్ని గుర్తించి, వారిని ప్రోత్సహించడానికోసం రజతోత్సవ సందర్భంగా సమావేశ పరిచారు. ఆ మంచి సంకల్పాన్ని సద్వినియోగ పరచుకొని, ఆంధ్ర భాషా నిలయం సభ్యులైన శ్రీమతి వీరరాఘవమ్మ గారు నిలయం పక్షాన నగరంలోని మహిళా మణులందరినీ ఆహ్వానించారు.
ఈ సభకు మద్రాసు విశ్వవిద్యాలయ పట్టభద్రురాలైన స్టాన్లీ బాలికల ఉన్నత పాఠశాలలో అధ్యాపకురాలిగా పనిచేస్తున్న ఈమె మహిళలను సంబోధిస్తూ స్త్రీలు సమాన హక్కులు కలవారని, రామాయణం మొదలైన పూర్వ గ్రంధాలలోని కథలను చెబుతూ… స్త్రీ స్వాతంత్ర్యం గురించి ఎంతో చక్కగా బోధ చేశారట.
శ్రీ తారాబాయి గారి మాతృభాష తెలుగు కాకున్నా చక్కని తెలుగులో చక్కని వ్యాసం రాసి ఇతర మహిళలకు మార్గదర్శకులయ్యారు.
శ్రీ వరసిద్ధి అమ్మగారు ఇంటిని ఎలా చక్కదిద్దుకోవాలో అన్ని ఎన్నో సూచనలు చేశారట. శ్రీమతి రుక్మాబాయి గారు స్త్రీల ధర్మాలను గురించి రాశారు.
ఇలా అన్ని కాలాలలోనూ ప్రతిభగల స్త్రీలు ఉన్నారు. ఈనాడు మహిళా దినోత్సవంగా జరుపుకోవడం, స్పూర్తి మంతంగా వారి అందర్నీ గుర్తు చేసుకొని, వారి బాటన నడవాలి…
అందరికీ మరొక్కమారు శుభాకాంక్షలు. రంగరాజు పద్మజ.

Written by Rangaraju padmaja

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

నేను ఒక రచయిత్రిని కాలేనా?

తరుణి సంపాదకీయం