నేను ఒక రచయిత్రిని కాలేనా?

మాధవపెద్ది నాగలక్ష్మి

నాకు చిన్నప్పటి నుంచి కథలు వ్రాసి రచయిత్రిని కావాలని, బాగా పేరు తెచ్చుకోవాలని కోరిక ఉండేది. అసలు నాలో అలాంటి కోరికలు ఎందుకు వచ్చాయో కూడా నాకు తెలియదు. ఎందుకంటే మా ఇంట్లో ఎవరూ కథలు వ్రాసేవారు లేరు. పైగా రచయితలు, రచయిత్రులు, కథలు అంటే ఏవగింపు, అసహ్యము, మరి నాకెలా వచ్చిందో ఆ కోరిక తెలియదు. తలచుకుంటే ఇప్పటికి నవ్వు వస్తుంది. ఆశ్చర్యమేస్తుంది. ఏమిటో చిన్నతనం, చిలిపి ఊహలు, దాపరికం తెలియని రోజు. కాని ఈనాటికి ఆ నా కోరిక ఫలించనందుకు బాధ కలుగుతూనే ఉంటుంది. ఆ బాధ తగ్గించుకోవడానికే ఇప్పుడు వ్రాస్తున్నది.

అవి నేను ఇంటర్ చదివే రోజులు. ఆర రోజు ఆదివారం. ఎలా కలిగిందో నా మట్టి బుఱ్ఱలో ఒక ఆలోచన తళుక్కుమంది. అపుడు నా వయసు పదహారు. మనసు ఏ మాత్రం ఎదగలేదొ ఊహలలో తేలిపోవటం, కాలేజీలో కబుర్లు చెప్పుకోవటం ఇదే జీవితం. వ్రాద్దామని ఆలోచనరాగానే కాగితము, కలము తీసుకుని కార్యరంగంలోకి దిగాను. కథ కోసం ఆలోచించడం మొదలుపెట్టాను. నా కథకు రూపం కలిగించుకునేటప్పటికి నా తలప్రాణం తోకకు వచ్చిందంటే నమ్మండి. సరే ఇతివృత్తము తయారయింది కదా మెదడులో, ఇహ వ్రాద్దామనుకుని మొదలుపెట్టబోయాను. వెంటనే బుఱ్ఱలో ఒక అనుమానం వచ్చింది. కథకు ఏం పేరు పెడదామని. సరే ముందర కథ వ్రాద్దాము. కథ పూర్తయిన తరువాత చదువుకొని, అప్పుడు పేరు పెడదాము అనుకున్నా. కాని మరల ఆలోచన మొదలు అయ్యింది. ఏం కథ వ్రాద్దామని, చాలా కథలు బుఱ్ఱలో మెదిలాయి. ప్రేమించినవారి కథా, పెళ్ళయినవారి కథా, పిల్లల కథా, అలా అలా… చివరికి ప్రేమించినవారి కథకే నా మనస్సు మ్రొగ్గింది. వ్రాయటం మొదలుపెట్టాను. చకచకా సాగుతున్నది రచన. కథలో రసవత్తర ఘట్టం వచ్చంది. నా వయసుకు అది అపుడు నాకు రసవత్తర ఘట్టం. నా హీరోయినం అరుణ హీరో మధుకు ఉత్తరం వ్రాస్తున్నది.

అతని ఎడబాటు తనకెంత బాధ కలిగించిందో అన్న విషయము గురించి వ్రాస్తున్నది (హీరో సెలవులకు ఊరు వెళ్ళాడని మనము గమనించాలి). అనుభవం లేకపోయినా నా నవలా పరిజ్ఞానం అంతా ఉపయోగించి మరీ ఉత్తరము వ్రాశాను.

నా మధూ,

నీ ఉత్తరం చేరింది. అది చదువుతుంటే నీవు ఎదుట ఉండి మాట్లాడుతున్నట్లే అనిపిస్తున్నది. ప్రతిక్షణం నీ కోసం నీ ఉత్తరం కోసం ఎదురు చూశాను. ఇన్నాళ్ళకు నా నిరీక్షణ ఫలించింది. ఎంత బాగా వ్రాశావు ఉత్తరం మధూ. ప్రతి అక్షరం నా కోసం తీయని మధువుతో నింపి వ్రాశావా అనిపిస్తున్నది. నాకు నీలా వ్రాయటం చేతగాదు. నేను నీలా కవిత్వం వ్రాయలేను బాబూ. చేతనయినట్లు వ్రాస్తున్నాను. నవ్వుకోకు.

ఇంకా పదిరోజుల దాకా రానని వ్రాశావు. ఈ పదిరోజులు నిన్ను చూడకుండా ఎలా ఉండను? ఉండలేను మధూ. మనం ఎప్పుడెపుడూ టాంక్ బండ్ దగ్గర కలిసి కూర్చుని కబుర్లు చెప్పుకుందామా అనిపిస్తున్నది. ఎపుడెప్పుడు చేయిచేయి పట్టుకుని పబ్లిక్ గార్డెన్స్ లో తిరుగుదామా అనిపిస్తున్నది. త్వరగా వచ్చేయం మధూ. వస్తావు కదా.

నీ కోసం వేయికళ్ళతో ఎదురు చూసే నీ ప్రియతమ హీరో దగ్గర నుంచి జవాబు తెప్పించబోతున్నాను. ఇంతలో మా చెల్లెలు గబగబా లోపలికి పరిగెత్తుకుంటూ వచ్చి ఏమిటి వ్రాస్తున్నావు అక్కా అని నా చేతిలో కాగితాలు లాక్కుంది. దాని చేతిలో నుంచి కాగితాలు లాక్కుందామని లేచా! అది పరిగెత్తిపోయింది. దాని వెనక నేనూ పరిగెత్తా. దానికి కూడా కథలు చాలా ఆసక్తి. ఇంట్లో తెలియకుండా నవలలు చదువుతుంటుంది. తెలిస్తే ఊరుకోరు గదా. అందుకని చదువుతూ చదువుతూ నా కథ, మదు ఎవరు అక్కా అని అడిగింది. పెద్దగా, ఏమిటి రమా అడుగుతున్నావు అక్కని అంటూ నాన్నగారు బయటికి వచ్చారు. నా గొంతు తడి ఆరిపోయింది. మెల్లిగా అక్కడ నుంచి తట్టుకోబోయాను. కాళ్ళు, చేతులు చల్లబడుతున్నాయి. నాన్నగారు చెల్లి చేతిలో నుంచి కాగితాలు తీసుకుని చదువుతుంటే, నేను కథలు రవాస్తానని ఇంట్లో ఎవరికీ తెలియదు. ఇన్నాళ్ళు ఏదో మూల కూర్చుని చాటుగా ఎవరికంటపడక కథలు వ్రాయటం గురించి ఆలోచించే దాన్ని. అసలు ఇంతవరకు ఏదీ వ్రాయలేదు, బుఱ్ఱతో ఆలోచించటం తప్ప. అసలు కథలు వ్రాసేటంత బుఱ్ఱ నాకుందని తెలిస్తే చదువు చెప్పించకుండా పెళ్ళి చేసేవారేమో నాన్నగారు. కథలు అన్నా, కథలు వ్రాసేవారు అన్నా అంత ద్వేషం ఆయనకు.

మధు ఎవరు? గర్జిస్తూ అడిగారు ఆయన ఉత్తరం చదివి.

‘నాకు తెలియదు’ నూతిలో మంచి వచ్చినట్లుగా వచ్చింది నా సమాధానం. తెలియకపోతే ఎలా వ్రాశావు. ఎందుకు వ్రాశావు? తీవ్ర కంఠంతో అరచినట్లుగా అడిగారు.

అది నిజం ఉత్తరం కాదు నా సమాధానం.

ఓహో నిజం ఉత్తరాలు, అబద్ధం ఉత్తరాలు కూడా ఉంటాయా? వ్యంగ్యంగా అని, నిజం చెప్పు అని ఉరిమారు.

కథ వ్రాద్దామనిపించింది. వ్రాశాను. ఈ ఉత్తరం కథలో హీరోయినం హీరోకు వ్రాసినది. ఏడుస్తూ చెప్పా. అసలు ను ఏమి మాటాలడుతున్నానో నాకే తెలియని పరిమితిలో ఉన్నా.

ఏమిటీ, నీవు కథలు కూడా వెలగబెడుతున్నావా? ఇంకాస్తా మండిపడ్డాడు. ఇవి ఎన్నాళ్ల నుంచి? మౌనంగా కళ్లు తుడుచుకున్నా. ఇంతలో రంగంలోకి అమ్మ ప్రవేశించింది. ఏమిటంటీ అరుపులు అంటూ. ఇదిగో నీ కూతురు నిర్వాకం అంటూ విసుగుగా ఆ లెటర్ ఆమె మీదికి విసిరాడు. అంతా చదివి, నావైపు ఉరిమిచూస్తూ అడిగింది, ఎవరే ఈ మదు అని. నాన్నకు చెప్పిన సమాధానమే ఆమెకూ చెప్పాను. దానికి కాలేజి చదువులు వద్దంటే విన్నారా మీరు. అమ్మాయి తెలివైనది, చదువుకుంటానంటున్నది అని దాన్ని వెనకేసుకువచ్చి కాలేజీలో చేర్పించారుగా. అనుభవించిం. ఏం చేస్తాం అన్నది. ఇంకా తనవంతు ఉపన్యాసము చదువుతుండగా, నీవు నోర్మూయ్ అని ఆమెను కసిరి, నావైపు తిరిగి రేపటి నుంచి నీవు కాలేజీకి వెళ్లక్కరలేదు, హుకుం జారీచేసి, ఆ ఉత్తరము చింపి నా ముఖాన కొట్టి కోపంగా బయటికి వెళ్ళిపోయినారు. ఆ తరువాత నెలలోపుతోనే నా ప్రమేయం లేకుండా పెళ్ళి చేసేశారు.

ఇంత జరిగినా నాకు కథలు వ్రాయాలన్నా ఉబలాటం తగ్గలా.

తరువాత ఇదంతా ఒక మంచి రోజు చూసుకుని మా శ్రీవారికి చెప్పేశాను. తనైనా సానుభూతి చూపించి వ్రాయమని ప్రోత్సహిస్తారేమోనన్న ఆశతో అంతా విని ఎంత అమాయకురాలివి అరూ, నీవు అన్నారేగాని నే నాశించినట్లుగా వ్రాయమని చెప్పలేదు. అదీగాక ఒక సలహా కూడా ఇచ్చారు. అరూ నీవు ఆ కథల వ్రాతలలో మునిగిపోయి, ఇంటిని, నన్ను మరచిపోతే ఎలా చెప్పు? అదీగాక ఒక రచయిత్రి మొగుడ్ని అని పిలిపించుకోవాలని నాకు లేదు.  ప్లీజ్, ఈ కథలు వ్రాయాలన్న ఆలోచన నీ బుఱ్ఱలో నుంచి తీసెయ్యి. హాయిగా నాకు ఇష్టమయిన వంటలు చేసిపెడుతూ, నేను ఆఫీసు నుంచి వచ్చేటప్పటికి చక్కగా ముస్తాబయి, నాకు ఇష్టమయిన చీరెకట్టుకుని, నా కోసం ఎదురుచూస్తుండు, చాలు అన్నారు.

అలా ఆగిపోయింది, పెళ్ళయ్యాక నా కోరిక. ఇంతలో, పిల్లలు, వాళ్ళను పెంచటం, గానుగెద్దులా అయిపోయింది జీవితం. ఆ తరువాత పిల్లలందరి పెళ్ళిళ్ళు, పురుళ్ళు వగైరా వగైరాలతో గడిచిపోయింది జీవితం. ఇప్పుడు మళ్ళీ ఆశపోక, కోడలు కూడా వచ్చింది, కాస్త పనులలో సాయం చేస్తున్నది కదా అని మొదలుపెట్టా. కాని ఒకరోజు అనుకోకుండా నా కోడలు మా అబ్బాయితో అంటున్న మాటలు చెవిన పడ్డాయి. ప్రొద్దుగూకులు ఏవేవో పిచ్చి రాతలు వ్రాస్తూ కూర్చోకపోతే మీ అమ్మ కాస్త వంటింట్లో నాకు సహాయం చేయవచ్చు గదా. ఒక్క దాన్ని ఎంతని చేసేది అని. ఊరుకోవే వింటే అమ్మ బాధ పడుతుంది అంటున్నాడు అబ్బాయి. విననీయండి, నాకేంటి. అయినా ఈ వయసులో కృష్ణా, రామా అనుకోకుండా, ఆ పిచ్చి కథలు వ్రాయటం ఎందుకటా అంటున్నది. ఇది విన్న తరువాత ఇహ నాకు విరక్తి వచ్చింది. వ్రాస్తున్న కాగితాలు చింపేశాను. మళ్ళీ కలం ముట్టుకోలేదు.

కాని నా మనసులో మారుమూల ఆ కోరిక దాగి ఉంది. వచ్చే జన్మలో అయినా బాగా రచనలు చేసి, ఒక యుద్ధనపూడి సులోచనగారిలాగా, ఒక ముప్పాళ రంగనాయకమ్మగారిలా పేరు, ప్రఖ్యాతులు తెచ్చుకోవాలని, సన్మనాలు చేయించుకోవాలని, వేదికమీద రచనల గురించి మాట్లాడాలని. తీరుతుందంటారా నా కోరిక  – మీ అందరి ప్రేమానురాగాలు నా మీద ఉంటే తీరుతుందేమో.

 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

ఓ మహిళ

అంతర్జాతీయ మహిళా దినోత్సవం సందర్భంగా..