వృత్తి అంశాలే ఇతివృత్తాలుగా … డాక్టర్ పర్చా అంజనీ దేవి.

ఆమె చేతులు కత్తి పట్టి శస్త్రచికిత్సలు చేస్తాయి. ఆమె చేతులు కుంచె పట్టి అందమైన చిత్రాలను వేస్తాయి. వైద్యసేవ వృత్తిగా ఐదు దశాబ్దాలుగా వేలాది మంది తల్లులకు తమ పేగు బంధాన్ని అందిస్తున్నారు.  కళాసేవ ప్రవృత్తిగా కథలు, కవితలు రాస్తూ, చిత్రాలు, కార్టూన్లు వేస్తూ ఏడు పదుల వయస్సులోనూ నిత్యవిద్యార్థిగా ప్రపంచంలో నేర్చుకోవల్సింది ఎంతో ఉంది అంటున్నారు. ఆమే వరంగల్లోని కళ్యాణి హాస్పిటల్ మేనేజింగ్ డైరెక్టర్, ప్రముఖ గైనకాలజిస్ట్, రచయిత, చిత్రకారిణి పర్చా అంజనీ దేవి. ఆమే హస్తవాసి ఉన్న డాక్టర్. అంతకు మించి పేదవారికి ఉచితంగా వైద్యం అందించే మనసున్న డాక్టర్. తన దేహంలో ఓపిక ఉన్నంత వరకు మరో ప్రాణికి ఊపిరి పోసేందుకు తాను సిద్దం అంటూ మనసున్న డాక్టర్ గా పేరుగాంచిన మానవతావాది ఆమె. తీరిక సమయంలో  రచనలు చేస్తూ, కళాకృతులను రూపొందిస్తూ ప్రతిరోజు సరికొత్తగా ఉండాలన్న ఆలోచనతో అహర్నిశలు కృషి చేస్తున్నప్రముఖ డాక్టర్ పర్చా అంజనీ దేవి గురించి ఈ వారం తరుణిలో తెలుసుకుందాం..
తరుణి : నమస్కారం డాక్టర్ అంజనీ దేవి గారు. డాక్టర్ అంటేనే తీరికలేని వృత్తి.  గత ఐదు దశాబ్దాలుగా డాక్టర్ గా కొనసాగుతున్నారు. మీతో వైద్యసేవలను అందుకున్న వారి కుమార్తెలకు, మనుమరాలకు కూడా వైద్యం అందిస్తున్నారు. అమ్మమ్మ, అమ్మ, అమ్మాయి ముగ్గురూ కూడా మీ ద్వారా మాతృత్వాన్ని ఆస్వాదించిన వారే కావడం అభినందనీయం. మీరు డాక్టర్ కావాలని ఎందుకు అనుకున్నారు? మీ పరిచయం, చిన్ననాటి అంశాలు వివరిస్తారా?
అంజనీ దేవి : నా బాల్యమంతా గ్రామీణ ప్రాంతంలోనే గడిచింది. 400 కుటుంబాలు ఉండే ఒక చిన్న గ్రామం. అమ్మ కొమరగిరి సుగుణ,  నాన్న కొమరగిరి అప్పారావు. మేం పదిమంది పిల్లలం.  ఐదుగురు చెల్లెళ్లు, నలుగురు తమ్ముళ్లు. మా ఊరిలో కరెంటు కూడా ఉండేది కాదు. కిరోసిన్ దీపాలు వెలిగించుకొని ఆ దీపపు వెలుగులో చదువుకునే వాళ్ళం. ఒక చిన్న రూమే మా స్కూల్ గా ఉండేది. మా హెడ్ మాస్టర్ పిల్లలకు అన్ని భాషలు రావాలి అన్న సంకల్పంతో చురుకైన కొంతమంది పిల్లలకు అన్ని భాషల్లో ప్రావీణ్యం వచ్చేలా శిక్షణ ఇప్పించారు.
ఐదో తరగతి వరకే మాకు ఇంగ్లీష్ హిందీ తెలుగు చక్కగా వచ్చేవి. ఆ రోజుల్లో మాకు వినోదం అంటే రేడియో ఒక్కటే. మా ఊరి ప్రెసిడెంట్ గారి ఇంట్లో రేడియో ద్వారా మేం ప్రపంచం సంబంధించిన అనేక విషయాలు తెలుసుకునే వాళ్ళం. ఇంటి ముందు వీధి నాటకాలు, హరికథలు ఇలాంటి కార్యక్రమాలు కూడా జరిగేవి. చదువు కోసం ఖమ్మంలో అమ్మమ్మ గారింటికి వచ్చాను. స్వాతంత్రం వచ్చిన తొలినాళ్ళలో చదువు కోసం ఒక ఆడపిల్ల పల్లెటూరు నుంచి ఖమ్మం పట్టణానికి రావడం అనేది ఒక విశేషంగా ఉండేది. బంధువుల్లో, స్నేహాతుల్లో గొప్పగా ఉండేది. పట్టణమైనప్పటికీ కూడా  అమ్మమ్మ వాళ్లింట్లో కరెంటు ఉండేది కాదు. ఇంటికి దగ్గరలో ఉన్న గుడి దగ్గర ఉన్న గుంటుమల్లన్న సత్రం లో గుడి ఉండేది అక్కడ గర్భ గుడి వెనకాల ఎప్పుడూ ఒక దీపం వెలుగుతూ ఉండేది. అక్కడ పూజారిని అడిగి ఆ గుడి వెలుగులో చదువుకునేదాన్ని. మా మేనమామ జియాలజీ చేయాలని బాగా ప్రోత్సహించారు.
చిన్నతనం నుంచి గణితం అంటే చాలా ఆసక్తి పదో తరగతి వరకు గణితంలో నాకు మంచి మార్కులు వచ్చేవి. అయితే ఇంటర్లో మాత్రం మా నాన్న గారి కోరిక మేరకు పియుసి సైన్స్ లో జాయిన్ అయ్యాను. 1961లో ఎంబిబిఎస్ లో సీటు వచ్చింది. ఆ విషయం హిందువు లోకల్ పేపర్లో రావడంతో ఆ పేపర్ తీసుకొని మా నాన్నగారు సైకిల్ మీద పక్క ఊరిలో ఉన్న వాళ్ళ స్నేహితుడి వద్దకు వెళ్లి చెప్పారు. నాకు ఎంబిబిఎస్ లో సీట్ రావడంతో నాన్న ఎంత సంతోషపడ్డారు. ఆయన సంతోషం నాకు కొత్త శక్తిని ఇచ్చింది. ఉస్మానిమా మెడికల్ కాలేజీలో సీటు వచ్చింది. అయితే మెరిట్ వచ్చిన వారిలో 20మందిని కాకతీయ మెడికల్ కాలేజీ కి మార్చారు. దాంతో వరంగల్ కు వెళ్లాను. అక్కడే ఎంబిబిఎస్ పూర్తి చేశాను.  గవర్నమెంట్ సివిల్  అసిస్టెంట్ సర్జన్ గా 14 ఏండ్లు, స్త్రీ వైద్యనిపుణురాలిగా 50 ఏండ్లుగా పనిచేస్తున్నాను.
తరుణి : స్కూల్, కాలేజీ రోజుల్లో మీరు చదువుతో పాటు వినోదం కార్యక్రమాల్లో పాల్గొన్నేవారా , లలితకళల్లో ఆసక్తి ఎలా ఏర్పడింది?
అంజనీ దేవి : స్కూల్, కాలేజీ రోజుల్లో జరిగే అన్ని సాహిత్య పోటీల్లో పాల్గొన్నేదాన్ని. అమ్మ చాలా బాగా బొమ్మలు వేసేవారు.  దాంతో మేం అందరం చిన్నతనం నుంచే బొమ్మలు వేసేవాళ్లం. అందరూ కళకారులే. నేను చాక్ పీస్ లతో బొమ్మలు చేసేదాన్ని. ఇక సాహిత్యంపై ఆసక్తి కలగడానికి మా తెలుగు మాస్టారు ఆదినారాయణ గారు కారణం. ఆయన రాగయుక్తంగా పద్యాలు పాడుతూ పాఠం  చెప్పే తీరు ఎంతో ఆకట్టుకునేది. అలా తెలుగుపై మమకారం పెరిగింది.
తరుణి :  మీరు మొదటి కథ ఎప్పుడు రాశారు?
అంజనీ దేవీ :  1962లో రెండు కథలు రాశాను. అందులో ఒకటి అన్వేషణ పత్రికలో అచ్చు అయ్యింది. మరో కథ తిరిగి వచ్చింది. అది కాస్త మా కాలేజీ అబ్బాయిల చేతిలో పడింది. దాంతో వారు రచయతకు సన్మానం అంటూ బోర్ట్ పై రాశాను. ఆ తర్వాత రాయడం మానేశాను.  1973లో ఆల్ ఇండియో రేడియో వారి ప్రోత్సహాంతో కథా స్రవంతి కార్యక్రమంలో పాల్గొన్నేదాన్ని. చిన్నచిన్న కథలు, కథానికలు రాశాను. 2005లో లేబర్ రూం పై రాసిన కథకు మంచి గుర్తింపు వచ్చింది. నాకు నచ్చిన గది ,నా మది నిండిన గది అన్న పేరుతో కథ రాశాను. అది పేపర్ లో వచ్చింది. కులమతాలు, వర్ణాలు, పేద ధనిక తేడాలు లేకుండా ప్రసవ వేదన పడే ప్రతి మాతృమూర్తి జీవితంలో లేబర్ రూం ఎంతో ముఖ్యమైనది.  తక్కువ బాధ తో బిడ్డను ఈ ప్రపంచంలో కి తీసుకువచ్చే ప్రయత్నం చేసేదాన్ని. బిడ్డను ఆ తల్లి చేతులకి ఇచ్చినప్పుడు ఆమె ముఖంలో అప్పటివరకు పడిన బాధ మర్చిపోయి కనిపించే ఆనందం నన్ను మంత్రముగ్ధురాలిని చేసేది. ప్రతిసారి ఇదే అనుభవం ఎదురైనప్పటికీ కొత్తగా ఉండేది. అందుకే నచ్చిన గది పేరుతో లేబర్ రూం పై కథ రాశాను.
తరుణి :  మీ కథల్లో ఎక్కువగా  ఆరోగ్య సమస్యలను ఇతివృత్తంగా తీసుకుని వాటిని ఎలా ఎదుర్కోవాలి అన్న అవగాహన కల్పించేలా ఉంటాయి. ఇప్పటి వరకు ఎన్ని కథలు రాశారు? పుస్తకంగా వచ్చాయా?
అంజనీ దేవి నా వృత్తి వైద్యం, ప్రవృత్తి రచన. అందుకే వృత్తి పరమైన అంశాలపై రచనల ద్వారా అవగాహన కల్పించే ప్రయత్నం చేస్తున్నాను. ప్రోస్టేట్ గ్రంథి గురించి రాసిన కథకు కూడా మంచి గుర్తింపు వచ్చింది. ప్రతి ఏడాదికి  ఒకటో రెండో కథలు రాయడం అలవాటుగా పెట్టుకున్నాను. ఇప్పటివరకు 25కు పైగా కథలు రాశాను. త్వరలోనే పుస్తకంగా తీసుకువస్తాను.
తరుణిసాహిత్యంతో పాటు చిత్రలేఖనం, సంగీతం నేర్చుకున్నారా?
అంజనీ దేవి  : చిన్నతనం నుంచి చాక్ పీస్ తో చాలా బొమ్మలు చేశాను. పెన్సిల్ డ్రాయింగ్, వాటర్ కలర్స్ తో చిత్రాలు వేశాను.   60ఏండ్లు నిండిన తర్వాత డ్రాయింగ్ పరీక్షలో పాస్ అయ్యాను.  కార్టూన్స్ గీయడం నేర్చుకుంటున్నాను. నేర్చుకోవాలన్న ఆసక్తి ఉంటే జీవితంలో ఎప్పుడైనా నేర్చుకోవచ్చు. సంగీతం అంటే చాలా ఇష్టం. వీణ నేర్చుకున్నాను.
తరుణి  మీకు ట్రావెలింగ్ కూడా ఇష్టం కదా ఇప్పటి వరకు ఏయో దేశాల్లో పర్యటించారు.
అంజనీ దేవి 1986లో మొదటి సారి నెదర్లాండ్స్ వెళ్ళాం.  ఆ తర్వాత ఈజిప్ట్, ఫ్రాన్స్, దక్షిణాఫ్రికా, ఆమెరికా, యూరప్ దేశాలు వెళ్ళాం.
తరుణి  మీ కుటుంబం గురించి చెప్పండి.
అంజనీ దేవి మా ఆయన పర్చా కోదండ రామారావు. సికెఎం కాలేజీలో ఇంగ్లీష్ హెచ్ ఓ డిగా రిటైర్ అయ్యారు.  మాకు ఒక అబ్బాయి, ఇద్దరు అమ్మాయిలు. కొడుకు డాక్టర్ చేతన్, కోడలు డాక్టర్ రేఖ. కూతురు డాక్టర్ వినూత్న, అల్లుడు డాక్టర్ గోపాలకృష్ణ, లండన్ లో సెటిల్ అయ్యారు. చిన్న కూతురు స్పందన,  అల్లుడు రమణకుమార్ (ఎయిర్ ఫోర్స్).  నలుగురు మనుమలు, ఒక మనుమరాలు. మా వారు, మా పిల్లల సహకారంతోనే నేను నా వృత్తిలోనూ, ప్రవృత్తిలోనూ రాణించగలుగుతున్నాను.
తరుణి   ఇంత బిజిగా ఉండే మీకు టైం ఎలా కుదురుతుంది.
అంజనీ దేవి  నిజమే.. వారమంతా హస్పిటల్ లోనే సరిపోతుంది. ఇది ఆదివారం మాత్రం నాకు ఇష్టమైన పనులకు టైం కేటాయించుకుంటాను. ఇంట్లో వారి సహకారం,  కొత్తగా చేయాలన్న తలంపు ఉంటే ఏదైనా సాధ్యం అవుతుంది. ఏ‌ కాస్త టైం దొరికినా కథ రాయడంమో, బొమ్మలు గీయడమో, చాక్ పీస్ ను బొమ్మగా చెక్కడం .. ఇలా ఏదో ఒకటి చేస్తాను. పని ఒత్తిడి నుంచి కళలే రిలాక్స్ ఇస్తాయి.
తరుణి     ఇన్ని సంవత్సరాల అనుభవంతో నేటి యువతలో మీరు గమనించిన మార్పులు?
అంజనీ దేవి   నేడు పిల్లల్లో పుస్తకాలు చదవడం బాగా తగ్గిపోయింది. ఎలక్ట్రానిక్ వస్తువులు సంఖ్య పెరిగి యాంత్రికంగా మారారు. ఉన్న సౌకర్యాలను ఉన్నతికి ఉపయోగించుకోవాలి.
తరుణి  ఈ రోజుల్లో డాక్టర్ కు పేషెంటుకు మధ్య సంబంధం గురించి మీ అభిప్రాయం
అంజనీ దేవి   నా చిన్నప్పుడు డాక్టర్ పేషెంట్ అన్న విధంగా కాకుండా డాక్టర్ ని కూడా ఒక కుటుంబ సభ్యుడిగా ట్రీట్ చేసేవాళ్ళు. ఇప్పుడు డాక్టర్ కి పేషెంట్ కి మధ్య ఆరోగ్య బంధమే తప్ప అనుబంధం అనేది పెద్దగా లేదని చెప్పవచ్చు.
తరుణి  మీ అందుకున్న అవార్డులు ?
అంజనీ దేవి  వైద్యరంగంలో, సామాజిక సేవారంగంలో అందిస్తున్న సేవలకు అనేక సంస్థలు సత్కరించాయి.  తెలంగాణ ప్రభుత్వం నుంచి విశిష్ట మహిళా పురస్కారం  అందుకున్నాను.
తరుణి  అంతర్జాతీయ మహిళా దినోత్సవం సందర్భంగా మహిళలకు మీరిచ్చే సూచన..
అంజనీ దేవి  ప్రపంచంలో అన్నింటికన్నా అత్తుత్యత్తమైన ప్రాణి ఆడ ప్రాణి. సృష్టిని కొనసాగించే మహత్తర బాధ్యత ఆడ జీవి పైనే ఉంది. అయితే బుద్ధి జీవి అయిన మనిషి మాత్రం మహిళను రెండవ పౌరురాలిగా చూస్తున్నారు. మహిళల శక్తి ముందు ఏ శక్తి అయితే తక్కువే. మహిళలు వారి శక్తిని గుర్తించి వారికి ఆసక్తి ఉన్న రంగంలో రాణించాలి. తమ శక్తి తాము తెలుసుకుంటే చాలు ఎందులోనైనా రాణిస్తారు. ఓ మహిళా నీ శక్తి ఎంటో నీవు తెలుసుకో.. కోరుకన్న గమ్యం చేరుకో..

Written by vanga Yashoda

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

తరుణులందరికీ స్వాగతం-సుస్వాగతం!

ఆడపిల్ల ఆధిక్యత