మంజుల మనస్సు అల్లకల్లోలంగా ఉంది. పదే పదే క్రితం రోజు కొడుకు తనతో ప్రస్తావించిన విషయమే మదిలో మెదులుతోంది. అప్రయత్నంగా ఆమె క్రితం రోజు జరిగిన సంఘటన తలుచుకుంది.
రాత్రి భోజనాలయినాక వంటిల్లంతా సర్దుకుని తన గదిలోకి రాబోతున్న మంజులను కొడుకు సుధీర్ పిలవటంతో వెనుతిరిగి చూసింది ఏమిటన్నట్లు.
“అమ్మా ఓ సారి ఇలా వస్తావా? నీతో కొంచెం మాట్లాడాలి” అన్నాడు సుధీర్. ఎందుకై ఉంటుందా అనుకుంటూ కొడుకు వెనకాలే హాల్లోకి వెళ్లింది. “కూర్చో అమ్మా” అన్నాడు సుధీర్. కొడుకు ఇంత ఆదరణగా మాట్లాడి ఎన్ని రోజలయిందో అనుకుంటూ కొడుకు చూపించిన కుర్చీలో కూర్చుంది తను నా ఓ కుర్చీలో కూర్చుంటూ అన్నాడు సుధీర్.
“అమ్మా నీతో ఈ విషయం మాట్లాడాలని ఎన్నాళ్నుంచో అనుకుంటున్నాను. కానీ అది విని నీవేమంటావోనన్న సందిగ్ధంలో పడి మాట్లాడలేకపోయాను. భయం ఏంటంటే మా ఆఫీసులో మా కొలీగ్స్ అంతా కలసి ఓ రియల్ ఎస్టేట్ కడుతున్న ఓ మల్టీ స్టోరీయిడ్ ఎపార్ట్మెంట్స్లో ఓ ప్లాట్ బుక్ చేసుకోవాలను ఉన్నాము. అందుకు ఇనిషియల్ గా రిజిస్ట్రేషన్ కోసం ఒక లక్ష రూపాయలు కట్టాల్సి వస్తుంది. అంత డబ్బు ప్రస్తుతం నా దగ్గరలేదు. కనుక నీవు నీ నగలు ఇస్తే అవి అమ్మి ఆ లక్ష రూపాయలు కట్టేద్దామనుకుంటున్నాను. మిగతా డబ్బు నేనూ శిరీషా మా ఆఫీసుల్లోంచి లోన్ తీసుకుని ఇన్ స్టాల్ మెంట్స్ మీద తీరుద్దామనుకుంటున్నాము. మరి నీవేమంటావు?” అని తల్లికేసి చూసాడు.
ఒక్క క్షణం మంజుల అవాక్కయింది. గతం ఆమె కళ్ల ముందు కదిలింది. మంజుల భర్త భాస్కర్ రావు ఓ ప్రైమరీ స్కూల్లో టీచర్. మంజుల పదవతరగతివరకు చదువుకుంది. ఏదో సంసార పక్షంగా ఉంటే చాలనుకుని తల్లీతండ్రీ కుదిర్చిన సంబంధాన్ని కాదనకుండా మంజులను వివాహం చేసుకున్నాడు. మంజుల ఉన్నదాన్లో పొదుపుగా ఎలా సంసారం చేయాలో తెలిసిన మనిషి కావటంతో వారి దాంపత్యం మూడు పువ్వులూ ఆరుకాయల్లా సాగింది. వారి అన్యోన్య దాంపత్యానికి చిహ్నంగా సుధీర్ పుట్టాడు. తమ శక్తికి మించిన దైనా అప్పు చేసైనా సరే కొడుకుని ఇంజనీర్ ని చేద్దామని నిశ్చయించుకున్నారు. అనుకున్నట్లుగానే భాస్కర్ సుధీర్ ను ఇంజనీరును చేశాడు. అందుకు కొంత అప్పు చేయవలసి వచ్చింది. అయినా భాస్కర్ అంతగా పట్టించుకోలేదు.
ఇంజనీరింగ్ డిగ్రీ రావటంతోటే అదృష్టవశాత్తూ సుధీర్ కి ఓ మంచి కంపెనీలో ఉద్యోగం వచ్చింది. ఇక కొడుకుని ఓ ఇంటివాడిని చేస్తే తమ బాధ్యత తీరిపోతుందని అనుకున్నారా దంపతులు వెంటనే ఓ మంచి సంబంధం చూసి ఆ శుభకార్యం కూడా అయిందనిపించారు.
అంతలో భాస్కర్ రిటైర్ అయ్యాడు. తనకు రావలసిన పి.ఎఫ్. వగైరాలు తాను కొడుకుని ప్రయోజకుణ్ణి చేసేందుకుగాను తీసుకున్న అప్పు తీర్చడానికి బొటాబొటిగా సరిపోవడంతో చేతికి ఏది రాలేదు భాస్కర్కు. తనకు వచ్చే ఫించన్ తో కొడుకు నీడలో రోజులు వెళ్ళిపోతాయిలే అని సరిపుచ్చుకున్నాడు.
కానీ కోడలు వచ్చిన కొత్తలో చూపించిన పై పై మన్నన గౌరవం రోజులు గడిచే కొద్దీ మాయం కావటమే కాకుండా తన అసలు రూపం బయటపెట్టింది. అత్తమామలను ఏ మాత్రం ఆదరించకుండా అనవసర వ్యక్తుల కింద జమ కట్టనారంభించింది. కొడుకు కూడా ఆమెకు వంత పాడడంతో ఆ దంపతులు కృంగిపోయారు.
ఈ దిగులుతో అనారోగ్యానికి గురయ్యాడు భాస్కర్. ఓ రోజు భాస్కర్ కు ఫీవర్ వచ్చింది. అదే తగ్గిపోతుందని ఏవో టాబ్ లెట్స్ వేసుకున్నాడు. కానీ జ్వరం తగ్గకపోగా ఇంకా ఎక్కువైంది. ఇక లాభం లేదని కొడుకుని పిలిచి తండ్రిని ఆసుపత్రికి తీసుకెళ్లమని అర్థించింది. మంజుల, అందుకతనన్న మాటలు ఈనాటికీ మంజుల చెవుల్లో రింగుమంటున్నాయి.
“ఆ ఉత్త జ్వరమే కదమ్మా అదే తగ్గిపోతుందిలే అయినా నీ దగ్గర ఏవో చిట్కా వైద్యాలు ఉంటాయి కదా. ఈ మాత్రం దానికి హాస్పటల్ కి ఎందుకు? అక్కడికి వెళ్తే ఈ టెస్టూ ఆ టెస్టూ అంటూ వేలకు వేలు గుంజుతారు” అనేసి వెళ్లిపోయాడు.
ఈ మాటలు గదిలో పడుకున్న భాస్కర్ కి కూడా వినపడ్డాయి. ఆ మాటలు ఆయన హృదయాన్ని చిధ్రం చేశాయి. భాస్కర్ తీవ్ర మనస్థాపానికి గురయ్యాడు. ఫలితంగా ఆ రోజు తెల్లవారు ఝామున గుండెపోటోతో మరణించాడు. మంజుల కుమిలి కుమిలి ఏడ్చింది. కానీ సుధీర్ కి శిరీషకి చీమకుట్టినట్టు అయినా అనిపించకపోవటం ఆశ్చర్యం!!
అంతేకాదు తండ్రి కర్మకాండ కూడా చేయడానికి నిరాకరించాడు. సుధీర్ దాంతో ఇంకా కృంగిపోయింది మంజుల. కొడుక్కి తెలియకుండా తనవి కొన్ని నగలు అమ్మి విడిగా బ్రాహ్మడి చేత కర్మకాండంతా చేయించింది. కర్మకాండ సరిగా చేయకపోతే చనిపోయిన వారి ఆత్మశాంతించదని నమ్మేవాళ్లలో ఆమె కూడా ఒకత్తి.
“అమ్మా! ఏమిటమ్మా ఆలోచిస్తున్నావు, నేను అడిగినదానికి సమాధానం చెప్పకుండా?” అన్న మాటలతో ఈ లోకంలోకి వచ్చిన మంజుల కొడుకునుద్దేశించి ఇలా అంది. “ఆ నగలు నాకు నా పుట్టింటివారు స్త్రీధనం కింద ఇచ్చినవి. వాటిని నేను ప్రాణావసరానికి తప్పితే అమ్మే ప్రసక్తే లేదు. నా జీవితానికి ఆ నగలే ఆధారం” అంది స్థిరంగా.
ఆ మాటలకు కొద్దిగా ఖంగుతిన్న సుధీర్ “అది కాదమ్మా. నేను ఉన్నానుగా నిన్ను వృద్ధాప్యంలో చూసుకోవడానికి ..
నా మీద నమ్మకం లేదా?” అన్నాడు.
అందుకు మంజుల “ఇన్ని మాటలు అనవసరం రా నాకా నగలు అమ్మడం ఇష్టం లేదు. అంతే” అంటూ లేచి విసవిసా తన గదిలోకి వెళ్లిపోయింది. సుధీర్ కు తల్లిమీద పీకల దాకా కోపం వచ్చింది. లేచి తల్లి కూర్చున్న కుర్చీని ఒకతన్ను తన్నాడు. ఈ ముసలి దానికి ఎన్ని తెలివితేటలు? అనుకున్నాడు కసిగా.
క్రితం రాత్రి జరిగిన సంఘటన అంతా నెమరు వేసుకున్న మంజుల మనస్సు పరిపరి విధాల పోయింది. కొడుకుని నమ్ముకుని తనుకున్న ఈ ఒక్క ఆధారాన్ని చేజార్చుకుంటే ఇక తన గతి అధోగతే. అని తన అంతరాత్మ ప్రబోధించసాగింది. అందుకే ఆ నగలు ఇవ్వడానికి నిరాకరించి తను సరైన నిర్ణయమే తీసుకుందని పించింది.
కన్నతండ్రిని ఎంత బాగా చూశాడో తాను కళ్లారా చూసింది. ఇక తనను ఉద్దరిస్తాడనుకోవడం ఎండమావులలో నీళ్లకోసం వెతకటమేనని ఆమె మనస్సుకు అనిపించింది. అంతేకాదు ఇప్పుడు నగలు ఇవ్వలేదన్న కక్ష పెట్టుకుని తనని రంపపు కోతకి గురిచేయడన్న గ్యారెంటీ ఏమీ లేదు కనుక తమ ముందుగానే జాగ్రత్త పడటంమంచిది అనుకుని మంజుల తన స్నేహితురాలైన ప్రక్కింటి వనజ దగ్గరికి వెళ్లింది.
ఆమెతో మంజుల తన గోడంతా వెళ్లబోసుకుంది. అదంతా విన్న వనజ “పిన్నిగారూ మీరు మంచి పని చేశారు. ఆ నగలను మీరు ఎట్టి పరిస్థితులోనూ వాళ్లకివ్వకండి. మీరు మీ అబ్బాయి దగ్గర ఉండలేననుకుంటే ఏ వృద్ధాశ్రమంలోనో ఉండవచ్చు. అందుకు డబ్బుకావాలి. ఎందుకంటే ఉచితంగా నడిపే వృద్ధాశ్రమాలలో మీరుండలేరు. అందుకే నగలను భద్రంగా మీదగ్గర ఉంచండి. మీకు కావాలంటే వృద్ధాశ్రమాల వివరాలు సేకరించిమీకు ఇస్తాను” అన్నది.
అందుకు మంజుల “వృద్ధాశ్రమంలో చేరే ఉద్దేశం నాకు లేదు వనజా. ఎందుకంటే నాకు ఇంకా శరీరంలో ఓపిక ఉంది. నేను ఏదైనా అనాథాశ్రమంలో అనాథ పిల్లల సేవ చేసుకుంటూ బతుకుదామనుకుంటున్నాను.”అన్నది.
అలాగే పిన్నిగారూ మీ కోరిక ప్రకారమే కానివ్వండి. నేను నాకు వీలు కాగానే అనాథాశ్రమాల కెళ్లి అక్కడి వివరాలన్నీ సేకరించుకుని వస్తాను. ఈలోగా మీరు న్యూస్ పేపరులో అనాధాశ్రమాల గురించిన ప్రకటనలు ఏమైనా పడ్డాయేమోనని చూస్తూండండి. నేనూ కూడా అదే పనిలో ఉంటాను” అని సలహా చెప్పింది వనజ. ఆరోజునుంచే మంజుల కొడుకూ కోడలూ ఆఫీసుల క న్యూస్ పేపర్స్ చదవటం అలవాటుచేసుకుంది.
ఆ రోజు తాను నగలను ఇవ్వడానికి నిరాకరించినప్పటినుంచీ కొడుకు తనతో మాట్లాడడం మానేసాడు. కోడలు చీటికీ మాటికీ ధుమధుమ లాడుతోంది. అయినా మంజుల మాత్రం నిమ్మకు నీరెత్తినట్లు ఉండసాగింది. ఇంతలో అనుకోకుండా ఓ అనాథశ్రమం వాళ్లు వేసిన ప్రకటన చూసింది మంజుల. ఇక అక్కడ అనాథ పిల్లలను చూసుకోవటానికి ఓ మేట్రన్ అవసరమనీ, అందుకు పదవ తరగతి చదువుకుని ఉంటే చాలని ఎవరైనా కొంచెం వయస్సు పైబడినవారైతే -కుని మరీ మంచిదనీ తిండి గుడ్డా నీడా అన్నీ ఇచ్చి నెలకు ఇంతని జీతం ఇస్తామనీ దాని సారాశం.
అది చదివిన మంజుల ఆనందానికి అవధులు లేవు. వెంటనే పరుగు పరుగున వనజ దగ్గరికి వెళ్లి ఆ ప్రకటన చూపించింది. వనజ కూడా ఎంతో విన్న నందించింది. “పిన్నిగారూ వెతకబోయిన తీగ కాలికి తగిలినట్లు అయింది. ఇది మీకు బాగా ఉపయోగిస్తుంది. పదండి ఇప్పుడే ఆ అనాధాశ్రమానికి వెళ్దామని తను తొందరపడుతూ, మంజులనుకూడా తొందరపెట్టసాగింది. మంజుల వనజకేసి మురిపెంగా చూసింది. ప్రపంచంలో అందరూ తన కొడుకూ కోడలు లాగా ఉండరు. మంచివాళ్లూ కూడా ఉన్నారు అనుకుంది మనస్సులో.
వనజ సలహామేరకు ఆ అనాథాశ్రమానికి వెంటనే బయలేదేరారిద్దరూ తేలికపడిన హృదయంతో.
మంజులనీ, వనజనీ ఆ అనాధాశ్రమంవారు సాదరంగా ఆహ్వానించారు.
తాము వచ్చిన పని చెప్పగానే ఆ ఆశ్రమం కార్యకర్తలు ఎంతో సుముఖత వ్యక్తం చేశారు. అక్కడ చేరితే ఏమేమి పనులు చేయవలసి ఉంటుందో వివరించారు. అన్నిటికీ మంజుల అంగీకరించింది. అయితే ఈరోజే చేరిపొమ్మని ఆశ్రమంవారు మంజులని కోరారు. ఇంటికి వెళ్లి తన సామానుతో పాటు వస్తామని ఆశ్రమం వారి దగ్గర అనుమతి తీసుకుని ఇంటికి వచ్చారిద్దరూ.
మంజుల ఓ సూట్కేస్ తన బట్టలు నగలూ సర్దుకుని కొడుకు పేరన ఓ చీటిని రాసి ఆ చీటిని టీపాయి మీద ఉంచి దాని మీద పేపరు వెయిట్ పెట్టి వనజతో సహా ఆటో ఎక్కింది.
***
చేరిన కొద్ది రోజులకే మంజుల తన సహనం ఓర్పుతో కష్టపడే మనస్తత్వంతో ఆశ్రమంలోని వాతావరణంలో ఇట్టే ఇమిడిపోయింది. తనకు కేటాయించబడిన పనులు అయిపోయిన తరువాత ఖాళీ సమయంలో ఉన్న వారందరితో కలసిపోయి వారి పనులలో కూడా సాయం చేస్తూ అందరికీ తలలో నాలుకలా మసలసాగింది. ఇలా ఓ రెండేళ్లు గడిచిపోయాయి.
ఇంతలో ప్రశాంతంగా ఉన్న నీటిలో ఎవరో రాయి విసిరినట్లు ఆ అనాధశ్రమానికి ఫండ్స్ కొరత ఏర్పడింది. ఎవరైనా దాతలు ముందుకు వచ్చి డబ్బు డొనేట్ చేస్తే కానీ ఆశ్రమం నడపటం కష్టమైన పరిస్థితి నెలకొంది. ఆ క్లిష్టసమయంలో తన నగలను అమ్మి ఆ డబ్బుని ఆశ్రమానికి డొనేట్ చేసి ఆశ్రమాన్ని కోరిన కోరిక ఆదుకుంది మంజుల . ఆమె చేసిన ఈ ఉదాత్త చర్యకు ఆశ్రమంలోని వారందరూ హర్షం వ్యక్తం చేశారు. ఆమె చేసిన ఈ త్యాగానికి గానూ ఆ ఆశ్రమం వారు ఆమెకు సన్మానం జరిపించారు. ఆ వార్త మర్నాడు అన్ని పేపరులోనూ ఆమె ఫోటోతో సహా ప్రచురించారు.
***
మంజుల ఇంట్లోంచి వెళ్లిపోయిన రోజు సాయంకాలం ఇంటికి వచ్చి మంజుల ఇంట్లో లేకపోవడంతో షాక్ తిన్నారు సుధీరు దంపతులు. ఇల్లంతా ఆమెకోసం వెతికారు. ఆమెరాసి పెట్టిపోయిన చీటిని చదివి మరింత దిగ్భాంత్రికి గురయ్యారు. ఆమె కోసం తమ శాయ శక్తులా వెతికారు. పోలీసు కంప్లెయింట్ కూడా ఇచ్చారు. కానీ ఫలితం లేకపోయింది. ఈ సత్యాన్ని జీర్ణించుకొనేందుకు వారికి చాలా రోజులే పట్టింది. చూస్తుండగానే రెండేళ్లు కాలగర్భంలో కలసిపోయాయి.
శిరీష ఓ పండంటి బాబుకి తల్లి అయింది. మెటర్నిటీ లీవ్ అయిపోయాక పురుడు పోయడానికి వచ్చిన శిరీష తల్లి బాబు ఆలనా పాలనా చూడటానికి నిరాకరించటంతో చేసేది లేక బాబుని క్రష్లో వేసారు శిరీష సుధీరులు.
కానీ ఆ క్రష్ లో బాబు సంరక్షణ సరిగా లేకపోవడంతో ఏదో ఒక అనారోగ్యంతో చిక్కి శల్యమయ్యాడు బాబు. దాంతో ఏం చెయ్యాలో దిక్కుతోచని పరిస్థితిలో పడ్డారు. ఈ సమయంలో అత్తగారు ఉండి ఉంటే తమకు ఇన్ని కష్టాలు తప్పేవని శిరీష అనుకోసాగింది. ఆ మాటే అంది సుధీర్తో. వాళ్లలా అనుకుంటున్న సమయంలో పేపర్లో మంజుల సన్మానం గురించిన వార్త చదివాడు సుధీర్. “శిరీషా అమ్మ ఎక్కడుందో తెలిసిపోయింది. పద ఇప్పుడే వెళ్లి అమ్మను తీసుకువద్దాం.” అన్నాడు ఎంతో ఉత్సాహంగా. ఇది విన్న శిరీష కూడా ఆనందం పట్టలేకపోయింది.
అనుకున్నదే తడవుగా ఇద్దరూ బాబుతో సహా మంజుల ఉంటున్న అనాధాశ్రమానికి బయలుదేరారు. మనవడ్ని చూసిన ఆనందంలో ఆవిడ తాము కోరిన కోరిక కాదనదన్న ధీమాతో ఉన్నారు.
తన కోసం వచ్చిన కొడుకూ కోడలినీ చూడటానికి అయిష్టంగానే ఒప్పుకొంది మంజుల. ఆమె తన మొహంలో ఎటువంటి భావమూ కనపడకుండా శాగ్రత్త పడుతూ ఎందుకొచ్చారనన్నట్లు చూసింది.
అప్పుడు సుధీర్ “అమ్మా నీవెందుకమ్మా ఇల్లు వదిలివచ్చేశావు? నికోసం ఎంతగా వెతికామో తెలుసా? చూడు ఇప్పుడు నీకు మనవడు పుట్టాడు. మేము పేమిద్దరం ఆఫీసులకెళ్తే వీడ్ని చూసే దిక్కులేక క్రష్ లో వేశాము. అప్పటినుంచే ఏదో ఒక అనారోగ్యంతో బాబు చిక్కి శల్యమయ్యాడు. ఈ రోజు నీకు సన్మానం జరిగిన వార్త తెలియగానే ఆఘమేఘాల మీద పరుగెత్తుకొచ్చాం. నిన్ను మాతో తీసుకెళ్దామని. నువ్వు మా కోసం కాకపోయినా, ఈ పసివాడి మొహం చూసైనా మన ఇంటికి వచ్చేయమ్మా” అని బ్రతిమిలాడారు ఇద్దరూ.
మనవణ్ణి చూడగానే మంజులలో నిద్రాణంగా ఉన్న వాత్సల్యం మమతానురాగాలూ పొంగి ఒక్క క్షణం తనని తాను మరిచిపోయింది. తన రక్తంలో రక్తమైన మనవడి కోసం తనదీక్ష ఆశయం అన్నింటినీ పక్కకు పెట్టి కొడుకు ఇంటికి వెళ్లిపోదామని మనస్సు కొట్టుకుంది.
కానీ వెంటనే వాళ్లు తన పట్ల, తన భర్త పట్ల ప్రవర్తించిన నీరు గుర్తుకొచ్చాయి. ‘ఓసీ పిచ్చిదానా వాళ్లు నీ మీద ప్రేమతో రాలేదు. వాళ్ల స్వార్థం కోసం వచ్చారు. ఇప్పుడు వాళ్లకు నీతో అవసరం ఉంది. ఇటువంటి అవకాశవాదుల కోసం నీవు కొత్తగా ఎంతో కష్టపడి మలచుకున్న జీవితాన్ని ఆశయాన్ని త్యాగం చేస్తావా? వద్ద ఎన్నటికీ అలా చేయకు” అని అంతరాత్మ ఘోషిస్తుంటే ఇలా అంది.
“మనవడు పుట్టినందుకు సంతోషం. నేను ఇక్కడికి వచ్చి ఒకటి నేర్చుకొన్నాను. మనదీ, మనవాళ్లూ అన్న స్వార్థం మనం ఏం చేసినా దానికి ప్రతిఫలం ఆశిస్తాము. అది దొరకనప్పుడు మనకి మిగిలేది దుఃఖమే. ఇప్పుడు నాకు ఒకడు కాదు ముప్పైమంది మనమలూ, మనమరాళ్లూ ఉన్నారు. ఒక్కడి కోసం ముప్పైమంది సంతోషాన్ని నాశనం చేయటం సబబేనంటావా? ఆలోచించు! నీ బిడ్డకు మీరిద్దరూ ఉన్నారు. వీరు ఎవరూ లేని అనాథలు. వీరికి నేను చేసే సేవలో నిస్వార్ధత ఉంది. అందుకే ఈ అనాథలు ప్రేమతో శ్రద్ధాభావంతో ఓ పువ్వు ఇచ్చినా నాకు కలిగే ఆనందం అంతులేనిది. నాకు మీ మీద కోపంగానీ ద్వేషంగానీ లేవు. ఇంకా చెప్పాలంటే మీ ప్రవర్తనవల్లే నేను ఈ కొత్తమార్గాన్ని వెతుక్కోగలిగాను. అందుకు నేను మీకు సదా కృతజ్ఞురాలిని. ఈ మార్గంలోనే నా జీవితానికి సార్థకత అంటూ ఉన్నది. నా ఆశీస్సులు మీకెప్పుడూ ఉంటాయి. కానీ నేను మీతో రాలేను. ఇకముందు కూడా ఈ కోరికతో మాత్రం నా దగ్గరకు రావద్దు. సెలవు” అనేసి లోనికి నడిచింది మంజుల.