ఉషోదయం

అనుబంధాలు పెంచుకోకపోతే ఆత్మీయులు మిగలరు

       మాధవపెద్ది ఉషా

నేటి వేగవంతమైన జీవితంలో పరస్పర ప్రేమాభిమానాలు కూడా కొరవడు తున్నాయి. ముఖ్యంగా భార్యభర్తలిద్దరూ ఉద్యోగం చేసే వాళ్లైతే జీవితం ఉరుకులూ పరుగులూగా సాగుతోంది. సెలవురోజులలో కూడా బంధువులతోనూ, స్నేహితుల తోనూ, గడిపే అవకాశమే ఉండడం లేదు. వీకెండ్ వచ్చిందంటే పిల్లల చదువులూ, వారితో ఆటపాటలూ, వారమంతా చేయకుండా దాటవేసిన పనులు చేసుకోవడం వీటితోనే ఉద్యోగులకు సరిపోతుంది.

టెలిఫోను కంప్యూటర్ లాంటి ఆధునిక సదుపాయాలు ఎన్ని ఉన్నా వాటిని ఉపయోగించుకోవడానికి కావలసిన సమయమే ఉడడంలేదు. ఈ తరం వారికి ఇ- మెయిల్ ఇవ్వడానికీ, ఫోన్లు చేయడానికీ కూడా తీరిక ఉండడం లేదంటే వారు ఎంత బిజీగా ఉంటున్నారో మనం అర్థం చేసుకోవచ్చు.

భార్య ఉద్యోగస్తురాలు కాకపోతే కొంతలో కొంత నయం అయినా ఈ రోజుల్లో ఎంతోమంది గృహిణులు ఇంట్లో వంటా వార్పూ అయ్యాక ఖాళీగా కూర్చోవటం లేదు. ఏదో వేన్నీళ్లకు చన్నీళ్లుగా ఉంటుందన్నట్లు ఎంతో కొంత ఆదాయం ఆర్జించి పెట్టే పనులు చేస్తున్నారు. వేరింటి కాపురాలు చేస్తున్న వాళ్ల పిల్లలకు బంధువులు, బంధుత్వాలు తెలియటం లేదు. ఎప్పుడో ఏ పెళ్లిలోనో, ఏ ఫంక్షన్లోనో బంధువులను పరిచయం చేయడం వరుసలు కలపడం జరుగుతోంది. తీరా ఇంటికి వచ్చాక షరా మామూలే! పిల్లలు వారి వారి చదువుల్లోనూ స్నేహితుల సాంగత్యంలోనూ పడి ఆ బంధువులను మరిచిపోవటం జరుగుతోంది. కానీ ఈ ధోరణి అంత ఆరోగ్యకరమైనది కాదని తల్లిదండ్రులు తెలుసుకోవాలి.

బంధువులతో అనుబంధాలను పెంచుకోకపోతే వారికి పెద్దయ్యాక తమ కంటూ ఎవరూ ఆత్మీయులు మిగలరు. జీవితం సాఫీగా సాగిపోతున్ననంత కాలం ఆ లోటు మనకు తెలీదు. కానీ జీవితం అన్నాక కష్టం, సుఖం రెండూ 9 ఉంటాయి. కష్టకాలంలోనే స్నేహితులూ బంధువుల విలువ మనకు తెలుస్తుంది. ఎవరికివారే యమునాతీరే అన్నటుంటే కష్టకాలంలో మనలను అదుకునే దిక్కుండదు. అందుకనే ముందు జాగ్రత్తగా ఎంత బిజీగా ఉన్నా కాస్త టైమ్ తీసుకుని చుట్టూతా ఉన్న బంధువులతో అనుబంధం పెంచుకోవాలి. పెళ్లీ పేరంటాలకే కాకుండా విడప్పుడు కూడా నెలకోసారైనా అందరినీ తలచుకుంటూ ఫోన్లో మాట్లాడటమో, లేక ఇంటికి వెళ్లి పలుకరించటమో చేస్తూ ఉండాలి. అప్పుడే మనకి వారికీ మధ్య బంధం బలపడుతుంది.

పిల్లల విషయానికి వస్తే వారికి చిన్నప్పటినుంచే వారి పెదనాన్న, చిన్నాన్న పిల్లలు, మేనత్త మేనమామ బిడ్డలనూ కలుసుకోవడాన్నీ వారితో సమయం గడపటాన్ని ప్రోత్సహించాలి. ఎక్కువ రోజులు సెలవులు వచ్చినప్పుడు ఒకరిళ్లకొకరు వస్తూ పోతూ ఒకటి రెండు రోజులు వారితో గడిపేటట్లు ఒక ప్రణాళిక ప్రకారం ప్లాన్ చేయాలి. ఇక దూరంగా వేరే ఊళ్లల్లో ఉన్న వారితో కూడా టచ్ ఉండాలంటే వారికి మన పిల్లల చేత ఉత్తరాలు రాయించటం లేక ఇ- మెయిల్ ఇప్పించటం అలవాటు చేయాలి. కొంచెం పెద్ద పిల్లలైతే ఆయా ఊళ్లకి సెలవుల్లో పంపటం కూడా మెల్లిగా అలవాటు చేయవచ్చు అప్పుడే పిల్లలకు బాధ్యతగా వ్యవహరించటం నేర్పిన వాళ్లమవుతాం ఇలా చేస్తే పిల్లలు బంధువుల పట్ల ఆత్మీయతానురాగాలను పెంచుకుంటారు. అందుమూలాన జీవితంలో ఎదురయ్యే కష్టసుఖాలలో ఒకరికొకరు పాలు పంచుకుంటూ చేదోడు వాదోడుగా ఉండే మనస్తత్వాన్ని పెంపొందించుకుంటారు.

***

Written by tharuni

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

మన మహిళామణులు

తరుణి – న్యాయ సలహాలు