తారలు నింగికి
కళలు నేలకు
లయకు కదలికలు
సంప్రదాయ సరిగమలు
బీజభూతమై
సంస్కార హితమై
కనికట్టు చేస్తుంది
భావం రహితాలు కావు
శూన్య శిఖరాలు కావు
నేల పసరిక నవ్వినట్టు
గజ్జెలు ఘల్లుమనగానే
ముద్రాంకిత నాట్యం తాండవిస్తుంది
కట్టు బొట్టు
కమనీయ దృశ్యం
ధిమిద్ధిమి తద్ధిమి తాళాల
తబలా విద్వాంసమంతా
మునివేళ్ళ కళాత్మక చైతన్యం
జతి స్వరం శృతి చేసే రాగం
సంభ్రమాశ్చర్యాల సమ్మేళనం
ఆమె నర్తిస్తుంది
హృదయానికది వర్తిస్తుంది
తనువూ మనసూ మురిసే స్నేహం
భాష భావం విరిసే సౌందర్యం
నాట్యం ఒక అనిర్వచనీయ కళ
దేశ అస్తిత్వానికదొక సుసంపన్న చిహ్నం
చిత్ర కవిత- డాక్టర్ కొండపల్లి నీహారిణి