మన మహిళామణులు

ఆంధ్ర బాలానందం సంఘం కి బలం జవం శ్రీమతి జంధ్యాల కామేశ్వరి

రేడియో అక్కయ్య అన్నయ్య గా ప్రసిద్ధి కెక్కిన న్యాయపతి కామేశ్వరి రాఘవరావు గార్లు నెలకొల్పిన ఆంధ్ర బాలానందసంఘం నారాయణ గూడా లో ఇంకా తన వైభవాన్ని చాటుతోంది.కార్యదర్శి జె.వి.కామేశ్వరిగారు తన దీక్ష దక్షతతో నడుపుతున్నారు.20ఫిబ్రవరి 2023 నా 83వ వార్షికోత్సవం ని ఘనంగా రవీంద్ర భారతిలో జరిపారు.ఆమె తల్లి దండ్రులు శ్రీమతి కమల సూరిబాబు గార్లు.తండ్రి రేడియో అక్కయ్య తమ్ముడు.బాల్యం నుంచి బాలానందం తో తనకున్న అనుబంధం అనుభవాలను ఈమె తరుణి తో పంచుకున్నారు.ఆమె మాటల్లోనే చదవండి
“నేను అక్కయ్య అన్నయ్య వద్దనే పెరిగాను.ఆమె పేరే నాకు పెట్టారు.మూడో ఏటనే ముద్దు ముద్దుగా స్టేజీపై డాన్స్ చేశాను.బాలానందం ప్రతి ప్రోగ్రాం లో నేను ఉండేదాన్ని.పిల్లలనివిహారయాత్రకి తీసుకుని వెళ్లేవారు.న్యూఢిల్లీ కూడా వెళ్లాం.ఎన్నో పోటీల్లో బహుమతులు గెలుచుకున్నాం.ఎన్నో నాటకాలకు దర్శకత్వం వహించాను.నాటకపోటీల్లో ప్రశంసలు పొందాను.బాల్యమంతా ఆటపాటలతో రేడియో ప్రోగ్రాంలతో సాగింది.పదిమందిలో నిర్భయంగా మాట్లాడటం అనుకున్నది చేసి చూపటం చేయించడం లాంటి నాయకత్వ లక్షణాలు అక్కయ్య గారి ద్వారా అబ్బాయి.రేడియోలో బాలవినోదం ప్రోగ్రాంలనుఅన్నయ్యతో కల్సి నిర్వహించడం నాకు గొప్ప మరపురాని అనుభూతి.ఆనందం కల్గించింది.అదేమార్గంలో ఇప్పుడు కూడా నేను నడుస్తూ ఉన్నాను.ఈతరం వారికి ఆనాటి ఆటపాటలు విలువలు నేర్పుతున్నాము . కాలేజీ చదువు పెళ్లి తో నాజీవితం కొత్త మలుపు తిరిగింది.
మావారు జంధ్యాల బాలాప్రసాద్ స్టేట్ బ్యాంక్ ఆఫీసర్.ఆయన మద్రాసు బాలానందం సంఘం లో మెంబర్.బొంబాయి గోవా కొచ్చిన్ మొదలైన చోట్ల ఆయన ఉద్యోగరీత్యా తిరిగాను.సుమబాల సిద్ధార్ధ్ మా పిల్లలు వారి చదువు తో సంసారం పూలనావలాగా సాగింది.ఆతర్వాత మావారికి జాంబియా లో ఇంకా పెద్ద జాబ్ దొరకడంతో దాదాపు అక్కడే సెటిల్ ఐనాము.నేనుకూడా అక్కడ ఇంటర్నేషనల్ స్కూల్ ఆఫ్ లుసాకా లో టీచర్ గాచేరాను.అక్కడ ప్రపంచంలోని అన్ని దేశాల పిల్లలుంటారు.చదువేగాక సాంస్కృతిక కార్యక్రమాలు చేయించేదాన్ని.పిక్నిక్ లు అక్కడ గ్రామాల్లో వెనుక బడిన బడులను భాగస్వాములు గా చేసి ఎన్నో నేర్పించాను.అలా 12ఏళ్లు హాయిగా ఆనందంగా గడిపాం అందరం.
అంతే విధికి కన్ను కుట్టింది.నాజీవితం చుక్కాని లేని నావ ఐంది.21ఏళ్ల మాపాప యాక్సిడెంట్ లో పోవటం ఆబెంగతో మావారు మూడు నెలలు తిరగకుండానే గుండె పోటు తో మరణించడంతో నాజీవితం చీకటి తో నిండి పోయింది.అప్పటికి నా వయసు 43.మాబాబు15ఏళ్ళవాడు.10వక్లాస్ లో ఉన్నాడు.వాడి భవిష్యత్తు ని దృష్టిలో పెట్టుకొని నేను బతకటమేగాక దిగువ స్థాయిలో ఉన్న జాంబియన్స్ కి హెల్త్ క్యాంపులు ఐ_క్యాంపులు పెట్టి సోషల్ వర్క్ లో మునిగాను డబ్బు సమస్యతో చదువులేని చతికిలబడిన తెలివైన పిల్లలకు ఇంజనీరింగ్ కంప్యూటర్ కోర్సులు చేసేందుకు ఆర్ధిక సాయం అందించాను.నాకొడుకుని ఆస్ట్రేలియా లో ఉన్న మాచెల్లి దగ్గర ఉంచి ఇంజనీరింగ్ లో చేర్చాను.ఇక నేను 2000లోహైదరాబాద్ కి తిరిగి వచ్చి సెటిల్ అయ్యాను.
రోడ్ వెడల్పు చేసే పనిలో బాలానందం భవనం సగంభాగంని గవర్నమెంట్ తీసుకుంది.మళ్ళీ దాన్ని తిరిగి కట్టడానికి ఆర్ధిక ఇబ్బందులు ఎదుర్కొన్నాం.బాలానందంకి పూర్వవైభవం తెచ్చే పనిలో పూర్తిగా మునిగిపోయాను.అనేక కొత్త ప్రోగ్రాంలు డాన్స్ సంగీతం లలిత సంగీతం చిత్రలేఖనం ప్రతినెలా సాంస్కృతిక కార్యక్రమాలు ఏర్పాటు చేయటంలో నిమగ్నమై పోయాను.అన్నయ్య అక్కయ్య లో శతజయంతులు ఘనంగా చేశాం.80ఏళ్ల బాలానందసంఘ ఉత్సవాలు నభూతో నభవిష్యతి లాగా జరిగాయి.ఆస్ట్రేలియాలో ఆరు నెలలు మాఅబ్బాయి కోడలు ఇద్దరు మానవులు దగ్గర గడిపి మిగతా 6నెలలు హైదరాబాద్ లో బాలానందం కార్యకలాపాలు చూస్తాను.”

నిజంగా జె.కామేశ్వరిగారి జీవితం స్ఫూర్తి దాయకం.న్యాయపతి దంపతుల కలలోకి సాకారం ఆమె!ఇంకా నిండు నూరేళ్ళు చల్లగా ఆమె సంఘసేవ చేయాలని ఆశిద్దాం

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

ఋతువుల సంవాదం

ఉషోదయం