ఋతువుల సంవాదం

కామేశ్వరి

వనదేవత ఒకసారి అడవిలో విహారం చేస్తూ ప్రకృతి అందాలను వీక్షిస్తోంది. అప్పుడే వసంత ఋతువు ప్రవేశించినట్లు ఉంది. మనం ఆహ్లాదకరంగా సౌందర్యంతో నిండి ఉంది. ఇంద్రియాలకు చక్కని ఆనందాన్ని కలిగిస్తుంది. వన దేవత అలా వీక్షిస్తుండగా ఒక కోలాహలం చెవిన పడింది అడవి మధ్యలో నుండి. ఏమిటో చూద్దామని అటుగా వెళ్లిన వన దేవత ఆ చెట్టు చాటున దాగి చూడ సాగింది.
అక్కడ ఒక ఆరుగురు యువతులు తమలో తాము వాదులాడుకుంటున్నారు. వారి మాటలను బట్టి ఏదో గట్టి సంవాదమే జరుగుతోంది అనుకుంది వన దేవత. వారిలో నుంచి ఒక యువతి లేచి ” నేను వసంత రుతువును. ఈ అడవి ఇంత అందం సంతరించుకోవడానికి నేనే కారణం. శశిరంలో మోడిపోయిన చెట్లకి చిగురులు, ఆకులు, పువ్వులు, సువాసనలు విరగ

డానికి నేనే కారణం ” అంది.
ప్రక్కన కూర్చున్న గ్రీష్మరుతువు కి చివ్వున కోపం వచ్చి ” ఏమిటి మాట్లాడుతున్నారు. నేను ఎండలు నిండుగా కాయటం వలన భూమి మీద నీరు ఆవిరిగా మారి మేఘ రూపం దాల్చి వర్షాలకు కారణభూతురాలను అయ్యాను సుమా ” అంది..
మూతి మూడు వంకర్లు తిప్పి ” ఏమిటి అలా డప్పు కొట్టుకుంటున్నారు మీకు మీరే. నేను సకాలంలో వర్షాలు కురిపించకపోతే మీ బ్రతుకులు అంతే. నేను ఎక్కువ కురిస్తే వరదలు, తక్కువ కురిస్తే అనావృష్టి. ప్రజలలో ధర్మం నశించడం వలన నా ధర్మాలు కూడా గతి తప్పుతున్నాయి. ఇందులో నా తప్పేమీ లేదు.
ఇది విన్న శరదృతువు కోపం నషాలానికి అంటింది. ” ఏమిటేమిటి ఎండ వానలే సరిపోతాయా? నేను చంద్రుని ద్వారా వెన్నెలను బాగా కురిపించడం వలన మీకు పోషకత్వము ఔషధ గుణాలు సంప్రాప్తిస్తున్నాయి.. నేను లేకపోతే మీ శ్రమ అంతా వృధా.
అయితే అక్కడే ఉన్న హేమంతం ఊరుకుంటుందా! ” ఔరౌరా ఏమి మీ మిడిసిపాటు, మీ దారిన మీ పనులు చేసుకుంటూ పోతే సరిపోతుందా. నేను తెల్లవార్లు మంచు కురిపించి ఈ జీవులకు చల్లదనాన్ని ఇస్తున్నాను.. పూసిన పువ్వులను కాచిన కాయలను నిలబడేలా చేస్తున్నాను” అంది.
వెంటనే శిశిరం అందుకుంది ” ఆహాహా ఎంత బాగా మిమ్మల్ని మీరు సమర్ధించుకుంటున్నారు.. మనుషులు చలికాలంలో ముడుచుకుని పడుకున్నట్లు, ఆకులకు చలివేయకుండా వాటిని రాల్చేసి ( అప్పటికే వాటికి వృద్ధాప్యం వచ్చేసింది ) ముడుచుకుపోతాను. పాతవన్నీ రాల్చేసి కొత్త వాటికి పునాది వేసాను. నా పని ఏమీ తక్కువ కాదు” అంది.
ఇలా వారిలో వారు వాదులాడుకుంటుంటే, వనదేవత చెట్టు చాటు నుండి బయటకు వచ్చి ” ఋతువుల్లారా ఏమిటి తగవు? ప్రతి పుట్టుకకు ఒక పరమార్ధం ఉంది. జీవరాసులకు సకాలంలో అన్ని అందించడానికే ప్రకృతి మిమ్మల్ని ఏర్పాటు చేసింది. మీరే మానవ జాతి మనుగడకు కారకులు. ఈ కలియుగం మానవులు గతి తప్పి బతుకుతున్నారు. ప్రకృతిని జయించాలని చూస్తున్నారు. దానివల్ల మనకి నష్టం కలుగుతుంది వారికి నష్టం కలుగుతోంది. మనకు పైన ఆ పంచభూతాలు కూడా ఉన్నాయి మనకి సహకరించడానికి. ఆ బ్రహ్మ కీటపర్యంతం భగవంతుడు వారి వారి విధులను వారికి అమర్చాడు. దాని ప్రకారం మనం నడుచుకుంటే ఈ భూగోళం సస్యశ్యామలంగా ఉంటుంది. ఐకమత్యంలోనే ఉంది బలమంతా అని మీరు వినలేదా. నేను క్రొత్తగా చెప్పేది ఏమిటి. ” అంటూ వనదేవత అదృశ్యమైపోయింది.

Written by Kameshwari

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

వేముగంటి శుక్తిమతిగారి కథ

మన మహిళామణులు