స్త్రీ పాత్రలు – టీవీ

కార్తీకదీపం ధారావాహిక – పాత్రలవిశ్లేషణ

పద్మశ్రీ చెన్నోజ్వల

కాపుగంటి రాజేంద్ర గారి దర్శకత్వంలో ‘స్టార్ మా ‘లో బుల్లితెరపై నిరుపమ్ , ప్రేమీ విశ్వనాథ్ , శోభాశెట్టి , అర్చన, అరుణ్ కుమార్ ప్రధాన పాత్రధారులుగా బుల్లితెరపై ప్రసారమైన ‘కార్తీకదీపం ‘ సీరియల్ ప్రేక్షకులను ఎంతగా ఆకట్టుకుందో అందరికీ తెలిసిందే .

ఇక ఇందులోని పాత్రల విశ్లేషణలోనికి తొంగి చూస్తే అత్తగారైన సౌందర్య , కోడలు దీపల పాత్రలు చాలా విలక్షణమైనవి. అత్తగారు సౌందర్య, కోడలు దీప, ప్రతినాయిక మోనిత ఈ మూడు పాత్రల చుట్టూ కథ తిరుగుతూ ఉంటుంది. నాణానికి బొమ్మ బొరుసుా ఎంత సహజమో సమాజంలో మంచీ , చెడూ అంతే సహజం అని దీప , మోనితల పాత్రల ద్వారా మనకు తెలుస్తుంది. దుర్మార్గాన్ని తరిమికొట్టి మంచికి పట్టంగట్టే స్త్రీమూర్తులు కూడా మన చుట్టే ఉంటారని సౌందర్య పాత్ర ద్వారా మనం తెలుసుకోవచ్చు. ‘స్త్రీకి స్త్రీయే శత్రువు’ అనే నానుడి మనం తరచూ వింటూ వస్తున్నదే. విచిత్రంగా ఇక్కడ మనం ఈ సూక్తిని అన్వయిస్తే ఇక్కడ రెండు పార్శ్వాలు మనకు ప్రస్ఫుటమవుతాయి. అడుగడుగునా మోనితతో వేదన అనుభవిస్తూ ఉన్న దీప అత్తగారైన సౌందర్య బాసటతో జీవనం సాగిస్తూ ఉంటుంది. ‘స్త్రీకి స్త్రీయే శత్రువు ‘ అన్న నానుడి మోనిత విషయంలో నూటికి నూరు శాతం నిజమైనప్పటికీ ‘ అది అందరి విషయంలో కాదనీ , సమస్యల్లో సాయపడే స్నేహశీలురు కూడా ఉంటారనీ సౌందర్య , విహారి గారి సతీమణి అయిన తులసి పాత్రల ద్వారా మనం తెలుసుకోవచ్చు. ఎంతో అనుభవసారంతో వెలుగులోనికి వచ్చిన సామెతలు కొన్ని ప్రత్యేక పరిస్థితులలో ప్రత్యేక అనుభవాల ఫలితంగా వచ్చినవే గానీ, ప్రతి చోట ప్రతి వ్యక్తి విషయంలో అన్వయానికి తావు లేదనే విషయం మనం ఇక్కడ గమనించవచ్చు . అవి ఖచ్చితంగా విలువైనవే, సమర్ధనీయమైనవే. వాటి విలువను తగ్గించడం అనేది కాదు ఇక్కడ మనం చెప్పదలుచుకున్న విషయం . కానీ పరిస్థితులను బట్టి , సందర్భాన్ని బట్టి వాటి అర్థం మారుతూ ఉంటుందన్న విషయాన్ని మనం గమనించాల్సి ఉంటుంది.

కథ మొత్తం కుటుంబ నేపథ్యం తో సాగింది కాబట్టి ఆడ వాళ్ళు ,మగ మగవాళ్ళు అనే రెండు జాతుల పాత్రలూ ఉంటాయి. ఇందులో కార్తీక్ పాత్ర ప్రధానమైనదే అయినప్పటికీ ఎక్కువగా ఇది స్త్రీవాద సమస్య ఇతివృత్తంగా గమనించవచ్చు. అత్తగారైన సౌందర్య పాత్రను గమనిస్తే అందం, ఆత్మస్థైర్యం, దర్పం , మంచితనం కలగలిసిన పాత్ర . గృహిణిగా, వ్యాపారవేత్తగా, భార్యగా, తల్లిగా, అత్తగారిగా, నానమ్మగా అన్ని పాత్రలకు , అంటే తనవైన అన్ని బాధ్యతలకు న్యాయం చేసిన వ్యక్తిగా మనం గమనించవచ్చు . ఒకవైపు వ్యాపార సామ్రాజ్యాన్ని అత్యంత నేర్పుతో నిర్వర్తిస్తూ, మరోవైపు చిన్నాభిన్నం అయిన కొడుకు కాపురాన్ని చక్కదిద్దడానికి అనుక్షణం రాజీలేని పోరాటం చేస్తున్న ఆవిడను చూసి ప్రతి ఇంట్లో ఇటువంటి అత్తగారు ఉంటే ఏ దుష్టశక్తీ గడపలోనికి వచ్చే సాహసం చేయదు అని ప్రేక్షకులకు చాలా సందర్భాల్లో అనిపిస్తూ ఉంటుంది. ఇక్కడ భర్త అయిన ఆనందరావు గారి గురించి చూస్తే కనుక చాలాసార్లు అతను తటస్థంగా ఉన్నట్టే ప్రేక్షకులకు భావన కలుగుతూ ఉంటుంది . కథలో పెద్దగా ప్రధానమైన పాత్ర కాదు అనిపిస్తుంది . కానీ అది సరైన అభిప్రాయం కాదు . అతను తటస్థంగా ఉండటానికి కారణం అతని అవగాహన రాహిత్యమో లేదా మరేదో కాదు . అతనికి తన జీవిత భాగస్వామిపై ఉన్న అపారమైన నమ్మకం . కుటుంబ రథానికి ఆమె అత్యంత ప్రతిభావంతమైన సారధి అని అతని అభిప్రాయం. ఎంతటి క్లిష్ట సమస్యలైనా ఆమె చక్కబెట్టగలదన్న నమ్మకంతో పగ్గాలు ఆమె చేతిలో పెట్టి మౌనంగా పరిస్థితులను గమనిస్తూ, తన ప్రమేయం అవసరం అనుకున్నప్పుడు రంగంలోనికి దిగుతూ ఉండటం మనము గమనించవచ్చు . కార్తీక్ దీపల పెళ్లి జరిగిన కొత్త రోజుల్లో దీప విషయంలో సౌందర్య ప్రవర్తనను వ్యతిరేకించిన వ్యక్తిగా మనం ఇతడిని గమనించవచ్చు.

దీప విషయంలో తన ప్రవర్తన సరికాదని తెలుసుకున్న సౌందర్య తనను తాను సరి చేసుకోవడం మనకు తెలిసిందే. తప్పు చేయని వ్యక్తి అంటూ ఈ ప్రపంచంలో ఎవరూ ఉండరు కానీ చేసిన తప్పు తెలుసుకొని తనను తాను సంస్కరించుకోగలిగినప్పుడే ఆ వ్యక్తి పరిపూర్ణత పొందిన వాడవుతాడు. ఇక దీప విషయానికి వస్తే ఆమె ఆత్మ గౌరవమే ఆమెకు అత్యంత విలువైన ఆభరణం . ఎంతటి క్లిష్ట పరిస్థితులలో కూడా ఆమె తన ఆత్మ గౌరవానికి భంగం వాటిల్లే పరిస్థితులను సహించదు. పాత్ర ఆద్యంతం ఆమె వ్యక్తిత్వం చుట్టూనే తిరుగుతూ ఉంటుంది. నీతి, నిజాయితీ , న్యాయం, ధర్మం, మంచితనం మొదలైన లక్షణాలను కలిగి ఉంటుంది . ఇకపోతే ‘ఏ పని చేస్తున్నామన్నది కాదు దానిని ఎంత చిత్తశుద్ధితో చేస్తున్నామన్నదే ముఖ్యం ‘ అనే సూక్తి ఆధారంగా ఆమె తన ప్రయాణం సాగిస్తూ ఉంటుంది. అత్యంత సంపన్నుల ఇంటి కోడలిగా వెళుతున్నప్పుడు ఆమె పొంగిపోలేదు . ఆ గడప దాటాల్సి వచ్చినప్పుడు ఆమె కుంగిపోలేదు . దాటడానికి కారణమైన పరిస్థితులకు ఆమె హృదయం చిద్రమైందే తప్ప కోట్లకు పడగలెత్తిన వారి సంపదను గడ్డిపోచతో సమానంగా భావించి, అంతకంటే తన వ్యక్తిత్వమే విలువైంది అన్న భావనతో ఆమె ఇంట్లో నుండి వెళ్ళిపోతుంది. తనపై చిమ్మబడిన బురదను కడిగేసుకోవడానికి ఆమె చేసిన పోరాటం అభినందించదగినది .

ఏ వ్యక్తి అయినా తనకు తానే గురువు, తనకు తానే సంరక్షకుడు , తనకు తానే పరిపాలకుడుగా ఉండాలనే సందేశం మనకు ఇక్కడ అంతర్లీనంగా గోచరిస్తూ ఉంటుంది. ఏ వ్యక్తి అయినా తన వ్యక్తిత్వాన్ని నిలబెట్టుకోవడానికి, తన అస్తిత్వాన్ని కాపాడుకోవడానికి సర్వశక్తులొడ్డి పోరాడాలనే విషయం మనం ఈ పాత్ర ద్వారా తెలుసుకోవచ్చు . ఇకపోతే ఈ కథ ఈ మలుపు తిరగడానికి కారణమైన పరిస్థితులను గమనిస్తే అభిమానమైనా, ఆరాధనైనా, స్నేహమైనా , మరింకేదైనా , అది తప్పనిసరిగా కొన్ని పరిమితులకు, నియమాలకు కట్టుబడి ఉండాలనే విషయం అర్థమవుతుంది . (ఆ భావన ఎంత పరిమళభరితమైనదైనా, మధురమైనదైనా, ఎంత ఉన్నతమైనదైనా) చూసే దృష్టిని బట్టిీ, ఆలోచించే మనసును బట్టిీ ఆ భావాలు రంగులు మారుతూ ఉంటాయి . ఎవరికిీ ఏ అవకాశం ఇవ్వకుండా జీవితాన్ని సాగిస్తూ ఉండాలనే హెచ్చరిక ధ్వనిస్తూ ఉంటుంది . ఒకానొక సందర్భంలో విహారి గారి అర్ధాంగి అయిన తులసి కూడా దీప ముందు ఇదే అభిప్రాయాన్ని వ్యక్తపరుస్తూ ఉంటుంది . ఇదే విషయాన్ని కార్తీక్ విషయంలో కూడా అన్వయించవచ్చు . ఉన్నతమైన ఆశయాలు , ఆదర్శాలు కలిగిన కార్తీక్ మోనిత తన మనసులో నాటిన విషబీజం “ఇంతై వటుడింతై” అన్న చందంగా శాఖోపశాఖలుగా విస్తరించి ఎవరెస్టు శిఖరం అంత ఎత్తయిన అతని వ్యక్తిత్వాన్ని అధఃపాతాళానికి దిగజారుస్తుంది . ఏ వ్యక్తి అయినా ఏ బంధానికి గానీ, అనుబంధానికి గానీ పూర్తిగా లొంగిపోకూడదనీ, అన్నింటినీ నియంత్రించుకుంటూ, సమన్వయపరచుకుంటూ ముందుకు సాగాలని దిశానిర్దేశం చేస్తున్నట్లుగా ఈ పాత్ర మనకు కనిపిస్తూ ఉంటుంది. ఇక ముగ్గుల పోటీలో ప్రథమ బహుమతి పొందిన దీప నిర్వాహకులు పెట్టిన షరతును అంగీకరించక, బహుమతి వదులుకొని తిరిగి వెళ్ళిన వైనం కుటుంబ విలువలకు , అత్తాకోడళ్ళ అనుబంధానికి అద్దం పడుతుంది . తను గడప దాటడానికి ప్రత్యక్ష కారణమైన కార్తీక్ ను , పరోక్ష కారణమైన మోనిత వరకే తన వేదనను పరిమితం చేస్తుందే తప్ప మిగతా సభ్యులెవరినీ ఈ చట్రంలోనికి లాగదు . ఆ కుటుంబంలో ఒక్క కార్తీక్ మాత్రమే తన సమస్యకు కారకుడు .
ఇక్కడ మనం ఒక విషయాన్ని గమనించాల్సి ఉంటుంది. ఉదాహరణకు ఒక వ్యక్తి ఒక సమస్యతో బాధపడుతున్నప్పుడు ఆ బాధకు కారణమైన వ్యక్తిని మాత్రమే కాకుండా , ఏమాత్రం సంబంధంలేని వ్యక్తులను కూడా కేవలం కారకుడైన ఆ వ్యక్తికి సంబంధించిన వారు అన్న నెపంతో వారిని అకారణంగా ద్వేషిస్తూ, మానసికంగా హింసిస్తూ ఉంటారు. ఈ విధమైన మనుషులు మనకు సమాజంలో చాలావరకు కనిపిస్తూనే ఉంటారు . కానీ నాయిక ఆ బాధను అతడి వరకే పరిమితం చేసి , అత్తామామలను అమితంగా గౌరవిస్తూ , అభిమానిస్తూ , మరిదిని ఒక స్నేహితుడిగా, సోదరునిగా భావిస్తూ ఉంటుంది . ఇది ఆమె వ్యక్తిత్వంలోని ఔన్నత్యం గా మనం గుర్తించవచ్చు .

ఇక ప్రతినాయిక అయిన మోనిత విషయానికి వస్తే తను కావాలనుకున్న దానిని అందుకోవడానికి ఎంతటి నీచానికైనా దిగజారే మనస్తత్వం. కుటుంబ వ్యవస్థ అనేది చాలా బలమైన పునాదులపై నిర్మించబడిన రాజప్రాసాదం. అందులోనికి అక్రమంగా ప్రవేశించడం అంత సులువైన విషయం కాదు . కుటుంబంలోని ఒక్కొక్క వ్యక్తి ఒక్కొక్క సైనికుడై పహారా కాస్తూ ఉంటాడు . సౌందర్య వంటి సైనికాధికారులను దాటుకొని లోనికి వెళ్లాలనుకోవడం ఎక్కడికి దారితీస్తుందో తెలియదు . ఇటువంటి వాటికి సమాజ వ్యతిరేకత కూడా ఎదుర్కోవలసి ఉంటుంది . ఇటువంటి ప్రయత్నాలు ఫలించిన సందర్భాలు లేవనీ కాదు, సమాజమంతా చెడును వ్యతిరేకించే వాళ్లే ఉంటారనీ కాదు. కానీ భారతీయ కుటుంబవ్యవస్థ చాలా పటిష్టమైనదని మాత్రం అంగీకరించవచ్చు . ఒక వ్యక్తి బాహ్యసౌందర్యం కంటే అంతః సౌందర్యంతోనే గౌరవింపబడతాడు, ఆదరింపబడతాడు అనే విషయం దీప వ్యక్తిత్వానికి ఆకర్షింపబడిన సౌందర్య పాత్ర ద్వారా మనం తెలుసుకోవచ్చు .
చాలా పరిమితంగా కనిపించినప్పటికీ అత్యంత ఉన్నతమైన పాత్రల్లో విహారి దంపతులను గమనించవచ్చు . విలువలకు ప్రాధాన్యతనిచ్చే విహారి తులసి సౌందర్యవతి అయినప్పటికీ కూడా కేవలం ఉన్నతమైన ఆమె వ్యక్తిత్వానికి ముగ్ధుడై ఆమెను అర్ధాంగిగా స్వీకరిస్తాడు . అనుమానంతో దహించుకుపోతున్న కార్తీక్ ఎంతగా దుర్భాషలాడినా మౌనంగా భరిస్తాడే తప్ప , ఏ విధమైన వ్యతిరేకత వ్యక్తపరచడు. ఇది అతనిలోని ఔన్నత్యానికి స్థితప్రజ్ఞతకు నిదర్శనం . ఇక కష్టాల్లో కొట్టుమిట్టాడుతున్న దీపకు దుర్గ, సరోజక్క , వారణాసి అందించిన ఆదరాభిమానాలు సహాయ సహకారాలు సమాజంలో ఇంకా మంచితనాన్ని గౌరవించే వ్యక్తులు చాలా మందే ఉన్నారు అనే విషయాన్ని తెలియజేస్తుంది .
ఇంత అద్భుతమైన కథను రచించిన రచయిత గారికి , తెరకెక్కించిన దర్శకుల వారికి , సాంకేతిక బృందానికి, పాత్రలకు జీవం పోసిన నటీనటులకు మరియు ఆదరించిన ప్రేక్షక మహాశయులకు అందరికీ పేరుపేరునా హృదయపూర్వక ధన్యవాదములు.

 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

ఉషోదయం

మీ చుట్టూరా ఆమే..!!