ప్రేమ అనేది ఒక అద్భుతమైన అనుభూతి. ఒక మానసికమైన పరిపక్వ దశ. కానీ చాలామంది యువతరం శారీరిక ఆకర్షణనే ప్రేమ అనుకుని పొరబడడం జరుగుతోంది. ఈరోజులలో యువతి యువకులు శారీరిక
ఆకర్షణనే ప్రేమ అనుకుని భ్రమపడి పెద్దలను ఎదిరించి మరీ వివాహం చేసుకుంటున్నారు. కానీ కొద్ది రోజులలోనే ఆ బ్రమలు తొలగిపోతాయి. ఆ తరువాత సాంసారిక జీవితంలో మనస్పర్ధలు తలెత్తుతాయి.
అందుకే మన పెద్దలు యిది గ్రహించే ప్రేమ వివాహాలను ఒప్పుకునే వారు కాదు. కానీ ఈ రోజులలో మన పిన్నలు పెద్దల మాటలను పెడచెవిన పెడుతున్నారు. పెట్టీ జీవితాంతం నష్టపోతున్నారంటే అతిశయోక్తి కాదు. ఎవరో కొందరు తప్ప చాలామటుకు జరుగుతున్నది ఇదే!
అంతే కాదు ఈనాటి యువత ప్రేమించిన అమ్మాయి తనను ప్రేమించలేదని ఆమెపై ఆత్యాచారాలకు గురి చేయడమేకాదు వారిపై యాసిడ్ దాడుల లాంటి క్రూరకృత్యాలకుకూడ పాల్పడుతున్నారు. దీనికంతా కారణం యువకులలో ప్రేమ గురించిన అవగాహన రాహిత్యమే ముఖ్య కారణమని చెప్పవచ్చు.
నేటి యువత యొక్క ఈ అవగాహన రాహిత్యానికి కారణభూతులైన నేటి కొందరు తల్లిదండ్రుల పాత్రను ఇక్కడ మనం విస్మరించరాదు. పూర్వం తల్లిదండ్రులు ఇద్దరు ఉద్యోగస్తులు కాకపోవడం మూలాన, తల్లులకు పిల్లల మీద శ్రద్ధ పెట్టి నీతి బోధలు, నైతిక విలువలు, అహింసా వంటి సుగుణాల ను వారికి హృదయానికి హత్తుకునేలా చెప్పేందుకు అవకాశం ఉండేది. అందుకే ఆ రోజులలో యువతి యువకులు తమ పరిధిదాటి వ్యవహరించే వారు కాదు.
కానీ ఈ రోజులలో పెద్దలకు ఆ అవకాశం ఉండడం లేదు.అందుకే ఈరోజులలో తల్లిదండ్రులకు పిల్లలకు ప్రేమ గురించిన సరియైన అవగాహన కలిగించే బాధ్యత ఎంతైనా ఉంది. అందుకు తల్లిదండ్రులు పిల్లలకు యుక్త వయసు వచ్చే ముందే వారికి వారి శరీరాలలో జరిగే మార్పుల గురించి వివరంగా చెప్పి ఆ మార్పులు ప్రకృతి సహజమని ఒకరిపట్ల ఒకరికి ఆకర్షణ కూడా అతి సహజమని కానీ దానినే ప్రేమ అనుకుని భ్రమ పడకూడదని, ఆకర్షణలకి దాసోహం అనకుండా తమ దృష్టి భవిష్యత్తుపై తమ చదువులపై సారించాలని బోధించాలి.
ప్రేమ అంటే హింస కాదని ప్రేమ అంటే ప్రేమించిన వారిపై అత్యంత సానుభూతి ఆత్మీయత కలిగి ఉండాలని, ప్రేమించిన వారు ఎక్కడ ఉన్నా సుఖంగా ఉండాలని కోరుకోవాలి అంతేగాని తిరస్కరించారని వారి పట్ల ద్వేషం పెంచుకోవటం సరి కాదనిబోధించాలి. ప్రేమ త్యాగం కోరుతుందని ద్వేషం కాదని పిల్లలకు నచ్చ చెప్పాలి. ఆంగ్లంలో ఒక సామెత ఉన్నది. ఏంటంటే ‘ఈఫ్ యు లవ్ సమ్ వన్ సెట్ ఇట్ ఫ్రీ. ఇఫ్,ఇట్ ఇస్ యువర్స్ ఇట్ విల్ కం బ్యాక్ టు యు అన్నది అందరూ గుర్తుంచుకోవలసిన విషయం.
ప్రేమికుల రోజు చేసుకున్నారు కదా ఇప్పుడు ఒకసారి మీకు మీరు ఆత్మవిమర్శ చేసుకోండి. వచ్చే ఏడాది కి మీలో ఏ మార్పు వస్తుందో చూసుకోండి
ప్రేమ ఒక మధురానుభూతి. ప్రేమ ప్రియుడు ప్రియురాలి ప్రేమ నే కాదు,
భార్యాభర్తలదీ
స్నేహితులనదీ
కన్నవారి దీ
తోబుట్టువులదీ
తోటి మనుషులదీ
ఆనందమయమైన జీవితం కావాలంటే ,ప్రేమ ఒక సాధనం ప్రేమ ఒక అవసరం. ఎంత ప్రేమ ను పంచుతుంటే అంత ప్రేమను పొందుతాము.కొలమానం లేనిది.
అందుకే నేనంటాను ప్రేమ ఒక సాహసం అని!!