నెలసరి సెలవులు

                        వరిగొండ సురేఖ

మహిళలు మహారాణులు… అని ఒక తెలుగు సినీ గేయ కవి అన్నట్టు , నిజంగానే మహిళలు మహారాణులు. ఆ పదం రాణి వాసపు సౌకర్యాల కి ప్రతీకగానో లేక ఆడంబర జీవితాలకి అద్దం గానో వాడబడ లేదు.  వారి సామర్థ్యానికి , శక్తికి , సహనానికి ఇత్యాది సుగుణాల కి ప్రతీక గా వాడబడింది. నిత్యం అనేక ఘటనలు , సంఘర్షణలతో సావాసం చేసే మహిళలు మహారాణులే మరి. అయితే ఎన్నో సమస్యలని ధైర్యంగా , బహిరంగంగా చర్చించే మహిళలు , నెలసరి సంబంధిత విషయాలని మాత్రం సమస్యగా భావించరు . అది ప్రతి స్త్రీ ఎదుర్కొనే సాధారణ అంశంగా పరిగణిస్తారు . నిజమే , అది  స్త్రీ జీవ లేదా శరీర సంబంధ విషయమే. సాధారణ విషయమే. అది వాస్తవానికి సమస్య కూడా కాదు. మరి అంత సాధారణ విషయం స్త్రీలని ఎందుకు చిరాకుకు గురి చేస్తుంది . అంతర్గతం గా హార్మోన్ల లలో వచ్చే మార్పులు , ఆ సమయంలో ఉండే శారీరక , మానసిక మార్పులుస్త్రీలని ఇబ్బందికిగురిచేస్తాయి.  అయితే మూడు రోజుల ఈ పండుగా అందరికీ మూడు రోజులే ఉండాలి అని కూడా లేదు , కొంత మందికి ఆరోగ్య లేదా శరీర తత్వాలని అనుసరించి కొంత అటు ఇటు గా కూడా ఉంటుంది.  ఇదీ ఆరోగ్య సంబంధిత విషయమే . సమస్య వస్తే వైద్యుడిని సంప్రదించాలి. ఇందులో ఇంకా చర్చ ఏముంది . నిజమే. కానీ ఒక్క సారి బయటకి చదువు నిమిత్తమో , ఉద్యోగ నిమిత్తమో వెళ్లే మహిళలు , ఆడపిల్లల గురించి ఆలోచిస్తే వారు ఎదుర్కొనే ఇబ్బందులు అర్థమవుతాయి. అంత మాత్రాన ఇంట్లో ఉండే స్త్రీలకి ఆ రోజులలో కావాల్సిన సౌకర్యాలు అన్నీ దక్కి ఇంటి వారందరూ అర్థం చేసుకొని మెలుగుతారు అని అనుకోవడానికి కూడా లేదు . అందువల్ల ఇది సమస్యే. చర్చించవలసిన అవసరం , ఆవశ్యకత ఉన్న విషయమే.

పాఠశాలలో పిల్లలకి చదువు సరిగ్గా చెబుతున్నారా లేదా అన్న విషయం తో పాటు వారి భద్రత, ఆరోగ్యము కూడా ముఖ్యమే . వాస్తవానికి ఆ బాధ్యత కూడా పాఠశాలలదే కానీ దురదృష్టవశాత్తు ఆ పని చేయడం లేదు. అలాగే ఉద్యోగాలు చేసే చోట్ల కూడా ఈ విషయమై ప్రత్యేక ఏర్పాట్లు , అనుకూలత వంటివిఉండటం లేదు .మరి దీని గురించి ఎవరూ చర్చించట్లేదా ? అందరూ మౌనంగానే ఉన్నారా?  అంటే, ముందు తో పోలిస్తే ఇపుడు పెదవి విప్పి , బిడియం మాని కొంత చర్చిస్తున్నారు అనే చెప్పవచ్చు.  కేంద్ర , రాష్ట్ర ప్రభుత్వాలు కూడా , 10-19 సంవత్సరాల వయసు ఉన్నఆడపిల్లలకు ఋతుక్రమ ఆరోగ్య  మరియు  శుభ్రత  రీత్యా ఉచిత శానిటరీ పాడ్స్ పంపిణి ఇత్యాదివి చేస్తున్నాయి . కానీ ఈ అవసరంతో పాటు మరో అభ్యర్థనని  కూడా ఉద్యోగినులు చాలా కాలం గా ప్రభుత్వాల ముందు పెడుతున్నారు. అదే “మెన్స్ట్రుల్ లీవ్” అంటే ఋతుక్రమ కాలంలో వేతనంతో కూడిన సెలవులు ఇవ్వాలి అని.

దేశ సర్వోన్నత న్యాయస్థానం లో కూడా దీనికి సంబంధించి ప్రజా ప్రయోజన వ్యాజ్యం (పిల్) వేయడం జరిగింది. దేశ వ్యాప్తంగా వివిధ రంగాలలో పని చేసే మహిళా కార్మికులు / ఉద్యోగిణిలు మరియు విద్యార్థినిలు ఈ దావా వేయడం జరిగింది. జనవరి 10 ,2023 న న్యాయవాది  శ్రీ శైలేంద్ర మణి త్రిపాఠి ఈ పిటిషన్‌ దాఖలు చేశారు.ఈ వ్యాజ్యములో “యూనివర్శిటీ కాలేజ్ లండన్” చేసిన అధ్యయనాన్ని ఉదహరించింది, దీని ప్రకారం ఋతుస్రావం సమయంలో ఒక స్త్రీ అనుభవించే నొప్పి  ఒక వ్యక్తి గుండెపోటు సమయంలో అనుభవించే నొప్పికి సమానమని ఆ అధ్యయనం సారాంశం.

అలాగే యునైటెడ్ కింగ్‌డమ్, వేల్స్, చైనా, జపాన్, తైవాన్, ఇండోనేషియా, దక్షిణ కొరియా, స్పెయిన్ మరియు జాంబియా లాంటి దేశాలు ఇప్పటికే ఏదో ఒక రూపంలో ఋతుక్రమ కాలంలో సెలవులను ఇస్తున్నాయి అని చెప్పారు. దీనితో పాటు దేశంలో కూడా కొన్ని రాష్ట్రాలు ఈ దిశగా అడుగు వేసి సెలవులు లాంటివి ఇస్తుండగా, ఇది దేశ  వ్యాప్తంగా సమానంగా  అన్ని రాష్ట్రాలలో అమలు కావాలి అని కూడా కోరడం జరిగింది .అంతేగాక,స్త్రీలు తమ ఋతుచక్ర సమయంలో ఒకే విధమైన శారీరక మరియు ఆరోగ్య సమస్యలతో బాధపడుతున్నప్పటికీ,  రాష్ట్రాలు వారి  సమస్యని సమ దృష్టి తో  చూడటం జరగడం లేదని వారి వాదన.ఈ అంశమై వేరు వేరు రాష్ట్రాలలో  వేర్వేరుగా  వ్యవహరించడం జరుగుతోంది అని ఆ వ్యాజ్యంలో చెప్పారు.అలాగే  కొన్ని భారత దేశంలో ఉన్న భారతీయ మరియు విదేశీయ సంస్థలు ,   Ivipanan, Zomato, Byju’s, Swiggy, Mathrubhumi, Magzter, Industry, ARC, FlyMyBizమరియు Gozoopవంటి కొన్ని సంస్థలు ఇలాంటి సెలవులు అంటే వేతనంతో కూడిన పీరియడ్ సెలవులని ఇవ్వడాన్ని కూడా వ్యాజ్యములో చెప్పడం జరిగింది.

ఈ అంశంపై ఇపుడు దేశ వ్యాప్తంగా చర్చలు బలంగా పెరుగుతున్న  నేపథ్యములో పార్లమెంట్ లో కేంద్ర ప్రభుత్వం యొక్క  ప్రతిస్పందన చాలా మందిని నిరుత్సాహ పరిచింది. ప్రభుత్వ అన్ని కార్యాలయాల్లో మహిళలకు తప్పనిసరిగా వేతనంతో కూడిన ఋతుక్రమ సెలవులు కల్పించే అంశాన్ని పరిశీలించడం లేదని ప్రభుత్వం తెలిపింది.

కేరళ ప్రభుత్వం రాష్ట్ర విశ్వవిద్యాలయాల్లోని విద్యార్థినులందరికీ రుతుక్రమ సెలవులు ప్రకటించిన తరుణంలో ఈ చర్చ కి తెరలేపడం జరిగింది. వాస్తవానికి , 1992లోనే  బీహార్ ప్రభుత్వం ప్రభుత్వ ఉద్యోగులకు రెండు రోజుల పీరియడ్ లీవ్‌ను మంజూరు చేసిన విషయం చాలామందికి తెలియదు. పార్లమెంట్ బడ్జెట్ సమావేశాలలో భాగంగా దీనిని ప్రైవేట్ బిల్లు గా ప్రవేశపెట్టడం జరిగింది.

ఏది ఏమైనప్పటికి ఇది ప్రతి ఒక్కరు ఆలోచించవలసిన అంశం . కేవలం మహిళల శరీరానికి కి సంబంధించిన ఒక అంశంగా పరిగణించకుండా ఆ రోజుల్లో వారి శరీర , మానసిక స్థితుల్లో జరిగే మార్పులు దాని వల్ల వారి ఆరోగ్యంలో కలిగే పరిణామాలు కూడా పరిగణించాలి. విద్యార్థినిలు కానీ పని చేసే మహిళలు కానీ అన్నేసి గంటలు ఆ సమయంలో కూర్చొనో , నుంచునో లేదా బరువులు మోస్తునో , అటు ఇటూ తిరుగుతూనో ఏదో ఒక కదలికలో నో స్థితిలోనో ఉండాలి. కనీసం పాడ్స్ మార్చుకునే సౌకర్యాలు కూడా కొన్ని ప్రదేశాలలో ఉండవు . నొప్పిని భరిస్తూ పని మీద శ్రద్ధ పెట్టమనడం యెంత వరకు మానవత్వం. ఏ చిరాకు లేకపోతే మహిళలే వచ్చి పని చేస్తారు . సరే ఆ సెలవులు దుర్వినియోగం చేస్తారు అన్నా, సిక్ లీవ్స్ లాంటివి కూడా  దుర్వినియోగం చేయొచ్చుగా. దుర్వినియోగం సంగతి తరువాతి మాట. ముందు పెయిడ్ లీవ్ అయినా ఈ కారణం నిమిత్తం సెలవు పెడుతున్నాము అని చెప్పుకోగలిగిన స్థితి యెంత మంది మహిళలకు వారి వారి పని ప్రదేశాల్లో ఉంటోంది.  సమాజ నిర్మాణములో మూల స్థంభాలైన   విద్యా  సంస్థలు సైతంఈ దిశగా అడుగులు వేయాలి.  ప్రతి మహిళ కూడా  ఈ అంశం పట్ల చర్చకై తమ వంతు కృషి చేయాలి. అలాగే పురుషులు కూడా సంస్కారవంతులై తమ ఇంట్లో  బయట కూడా ఋతుక్రమ సమయ లో ని మహిళలు ఎదుర్కొనే సమస్యల పట్ల సానుకూలంగా వ్యవహరిస్తూ వారికి అండగా , సహాయంగా  నిలబడాలి.

 

డా. వరిగొండ సత్య సురేఖ

Written by Varigonda Surekha

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

వెన్నెలేరు

స్పృహ