ఉషోదయం

మనమూ – మన సుభాషితాలు

 శ్రీ రామకృష్ణ పరమహంస గారిని గురించి తెలియని వారు ఎవరు ఉండరు . ఆ మహానుభావుల దగ్గరికి ఒకసారి ఒక వ్యక్తి వచ్చి స్వామి నాకు బ్రహ్మజ్ఞానం కలిగే మార్గం చూపించండి అని అడిగాడు. అప్పుడు ఆయన నాయనా నువ్వు ముందు ఆ చెరువులో మునిగి ముక్కు మూసుకుని ఒక ఐదు నిమిషాల పాటు అలాగే ఉండు అని చెప్పారు. అతను కూడా సరేనని అలాగే చేశాడు. అప్పుడతని కి నీటిలో ఊపిరాడక గిలగిలా కొట్టుకొని అతి కష్టం మీద బయటికి వచ్చి నేరుగా రామకృష్ణ పరమహంస గారి దగ్గరికి వచ్చి ఇలా అన్నాడు, స్వామి బ్రహ్మజ్ఞానం నేర్పకపోతే నేర్పకపోయారు కానీ మీ సలహా పాటించటం వల్ల కాస్త లో నా ప్రాణంపోయేదే కదా ఎంత పని చేశారు స్వామి అని అన్నాడు.
అతని మాటల విన్న పరమహంస ఒక చిరునవ్వు నవ్వి ఇలా అన్నారు. ఏమయ్యా నీటిలో ఒక మునక వేయటానికి అంతలా విలవిలలాడిపోయావే బ్రహ్మ జ్ఞానం అంటే ఏమిటి అనుకుంటున్నావు ఇట్టే వచ్చేయడానికి! పోయి సాధన చేయి అని అతనిని మందలించి పంపించి వేశారట!

మహాత్మా గాంధీ గారు చెప్పిన సూక్తులు– ఒకసారి ఏమైందంటే గాంధీ గారు అంటే ఎంతో గౌరవం ఉన్న వ్యక్తి పిల్లవాడిని తీసుకొచ్చి ఇలా అన్నారు ” గాంధీజీ మావాడు ఒకటే పంచదార తింటాడండి . వాడిని ఆ అలవాటు నుంచి ఎలా తప్పించాలో తెలియడం లేదు మీరు ఏదైనా సలహా ఇస్తారని మీ దగ్గరికి తీసుకు వచ్చాను ” అని అన్నాడు. అప్పుడు గాంధీ గారు నాకు ఒక వారం సమయం ఇవ్వండి మీ అబ్బాయి చేత పంచదార మాన్పించే పూచి నాది అని అన్నారు. అలాగేనండి అని అతను వెళ్ళిపోయాడు.
వారం రోజుల అనంతరం ఆ వ్యక్తి తన కుమారునితో తిరిగి గాంధీజీ వద్దకు వచ్చాడు. ఈసారి మాత్రం గాంధీజీ మారు మాట్లాడకుండా,
ఆ పిల్లవానికి చక్కెర ఎందుకు మానాలి దాని సాధక బాధకాలు
అన్ని వివరించారు. అప్పుడు ఆ వ్యక్తి ఎంతో ఆశ్చర్యపోయి ” గాంధీ గారూ , మీరు ఆ రోజే చెప్పి ఉండవచ్చు కదా అన్న సందేహం వెలిబుచ్చాడు. ఇప్పుడు గాంధీజీ చిరునవ్వుతో నాయనా ఆరోజు వరకు నేను కూడా చక్కెరకు బానిసనే కాబట్టి నేను మీ అబ్బాయికి చక్కర మానమని చెప్పలేకపోయాను. నేను ఈ వారం రోజులు చక్కెర మానేసి సాధన చేశాను. కాబట్టి నేను ఇప్పుడు మీ పిల్లవానికి చక్కెర ఎందుకు మానాలి దాని సాధక బాధకాలు ఎమిటీ అనేవి
అన్నీ వివరించగలిగాను” అన్నారు.

చూశారా ! మన మహాత్మా గాంధీ “ప్రాక్టీస్ బిఫోర్ యు ప్రీచ్” అన్న సామెతని నిజం చేసి చూపించారు . మానమని చెప్పేందుకు అర్హత సంపాదించుకున్నారు. అందుకే గాంధీ మన కు మహాత్మా అయ్యారు. చేసేదే చెప్పాలన్న మాటను నిజం చేసారు! మరి మనం?

Written by Madhavapeddi Usha

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

ప్రకృతి విసిరిన పంజా

నివాళి