“అత్తా కోడళ్ల మధ్య మనస్ఫర్థలు, మాట పట్టింపులు ఈనాటివి కావు. అనాదిగా వస్తున్నవే. కాలం ఎంతగా మారినా ఈ విషయంలో మాత్రం ఏ మార్పూ రాలేదు.
తమాషా ఏమిటంటే పెళ్ళయినాక కొడుకు తనకు దూరం అయ్యాడని బాధపడే ప్రతి తల్లీ సాధారణంగా కూతురి విషయంలో అలా ఆలోచించదు. చిన్నప్పటి నుంచీ అల్లారు ముద్దుగా పెంచుకున్నా అల్లుడి కారణంగా కూతురు తనకు దూరం అయిందని ఏ తల్లీ అనుకోదు. పైగా కూతురూ, అల్లుడూ చిలకాగోరింకల్లా కాపురం చేసుకుంటుంటే చూసి ఆనందిస్తుందే కాని అల్లుడి మీద విముఖత పెంచుకోదు.
అందుకు కారణం ఏంటంటే చిన్నప్పటి నుంచీ తల్లిదంరడులు, కూతురు ఎప్పటికైనా పరాయి ఇంటికి వెళ్లవలసిన పిల్లే (ఆడపిల్లే కానీ ఈడ పిల్లకాదు) అని మానసికంగా తమని తాము సంసిద్ధం చేసుకుంటారు. కూతురితో విడిపోవడానికి సిద్ధపడే ఉంటారు. అందుకు ముఖ్య కారణం మన సమాజఁలో ముసలి తల్లి దండ్రులను వృద్ధాప్యంలో కొడుకే చూసుకోవాలనీ, ఆఖరుకి చనిపోయాక తలకరివి పెట్టవలసిందీ కొడుకేననీ తరతరాలుగా నూరిపోయటం మూలాన వారు కొడుకుపై ఎన్నో ఆశలు పెట్టుకొని పెంచుతారు. ముఖ్యంగా తల్లి – కొడుకు తనవాడు అని అనుబంధాన్ని, మమకారాన్నీ పెంచుకుంటుంది. అందుకే కోడలు వచ్చేటప్పటికి తనను కొడుకు నుంచీ దూరం చేసిన ఓ శత్రువుగా పరిగణించడం ప్రారంభిస్తుంది. అప్పటి నుంచే వారిద్దరి మధ్యా కలతలు మొదలవుతాయి.
ఈ విధంగా ఈ అత్తాకోడళ్లిద్దరూ బద్ధ శత్రువుల్లా మారకుండా ఉండాలంటే ఇరువురివైపు నుంచీ కొంత కృషి ప్రయత్నం అవసరం. ముందుగా కన్నతల్లులు చిన్నప్పటి నుంచీ కొంత కృషి ప్రయత్నం అవసరం. ముందుగా కన్న తల్లులు చిన్నప్పటి నుంచే కొడుకు మీద ఎక్కువ మమకారం పెంచుకోకూడదు. ఎప్పటికైనా కొడుకును పరాయి పిల్లకి అప్పగించవలసిందేనని మానసికంగా సంసిద్ధురాలు కావాలి.
అందుకని ముందునుంచే కొంత డిటాచ్డ్ గా ఉండటం అలవరచుకోవాలి. ఎందుకంటే చిన్నప్పటి నుంచే కొడుకుమీద పంచప్రాణాలూ పెట్టుకుని పెంచడంవల్ల కోడలు వచ్చిన తరువాత కొడుకు తనకు మునుపు ఇచ్చినంత ప్రాధాన్యత ఇవ్వకపోవడాన్ని తట్టుకోలేదు. ఆమె ఆ దూరాన్ని భరించలేక అందుకు కారణమైన కోడలిమీద ఈర్ష్యాసుయాలను పెంచుకుంటుంది. అందుకే మొదటి నుంచి కొడుకుని కూడా కూతురిలానే పెంచితే కొడుకు పెద్దవాడై పెళ్లి చేసుకున్నాక ఆ కొత్త కోడల్ని మనస్ఫూర్తిగా స్వాగతించగలుగుతుంది. అంతేకాదు కొడుకుని కన్న ప్రతి తల్లీ కోడలు వచ్చాక ‘పాతికేళ్లు తను కంటికి రెప్పలా కాపాడింది. ఇక నుంచీ వాడితో తోడూ నీడగా కలసి జీవితం పంచుకోవడానికి కోడలు వచ్చింది. తాను ఎల్లకాలం ఉండలేదు కదా’ అన్న పాజిటివ్ దృక్పథంతో కనుక మసలుకొంటే అసలు అత్తా కోడళ్ల మధ్య విభేదాలు తలెత్తవు. అంతేకాదు అల్లుడిని చూసినట్లుగానే కోడలిని కూడా చూడగిలిగితే సమస్యే లేదు.
ఉదాహరణకి అల్లుడి ఇష్టానిష్ఠాలు కనుక్కుని మరీ వంటకాలు చేసినట్లే కోడలి యిష్టాయిష్టాలు కూడా కనుక్కుని అల్లుడికి చేసి పెట్టినట్లే కోడలికి కూడా చేసి పెడ్తే అటువంటి అత్తగారిని ఏ కోడలు అభిమానించకుండా ఉండగలదు?
అదేవిధంగా కొడుక్కి అదిష్టం అని ఇదిష్టం అని పెళ్ళి కానంతవరకూ చేస్తే తప్పులేదు. కానీ కోడలు వచ్చాక ఏం చేయాలంటే ఇన్నాళ్లు తాను పెంచింది కాబట్టి కొడుకు ఇష్టాయిష్టాలు ఒకవేళ కనుక కోడలు తెలుసుకోవటానికి సుముఖత కానీ ఉత్సుకత కానీ చూపిన పక్షంలో అలా చేస్తే కొడుకుమీద ఇన్నేళ్ళ నుంచీ తనకు ఉన్న పట్టు సడలిపోతుందేమోనని సంకుచితంగా ఆలోచించకుండా ఉదార హృదయంతో కోడలికీ అన్నీ నేర్పించి వాటిని పాటిఁచడమో పాటించకపోవడమో అన్న విషయాన్ని కోడలి ఇష్టానికే వదిలివేసి తన పెద్దరికాన్ని నిలుపుకోవాలి.
ఇకపోతే పెద్దతనంలో తమని చూసుకోవడం మాటకొస్తే ఈ రోజులలో అమ్మాయిలకి కూడా ఆస్తిలో వాటా హక్కు ఉంది కనుక బాధ్యత కూడా తీసుకోవలసిన అవసరం ఎంతైనా ఉంది. ఇద్దరూ సమానమే. అందుకని తల్లిదండ్రులన వృద్ధాప్యంలో చూసుకోవలసిన బాధ్యత ఇరువురిదీ అవుతుంది. అసలు ఈ రోజులలో తలకొరివి పెట్టిన అమ్మాయిల ఉదంతాలు ఎన్నో!! అందుకే కొడుకే తలకరివి పెట్టాలి అన్న గుడ్డి నమ్మకాన్ని ఎంత త్వరగా వదిలి వేస్తే అంత మంచిది.
ఇక కోడలిగా అత్తింట అడుగుపెట్టిన అమ్మాయిలవైపు నుంచి ఎటువంటి ప్రయత్నం అవసరమో చూద్దాం. మొట్టమొదటగా అమ్మాయి చేయవలసినదేమిటంటే అత్త మామలను గౌరవించటం, ముఖ్యంగా అత్తగారితోనే తాను ఎక్కువ సన్నిహితంగా గడపవలసి ఉంటుంది. కనక అత్తగారి వ్యక్తిత్వాన్ని బాగా చదవాలి. అంటే ఆమె పుటి పెరిగిన వాతావరణం ఎటువంటిదీ, ఆమె కోడలిగా అత్తింట అడుగుపెట్టినప్పుడు కోడలి నుంచి ఎటువంటి ప్రవర్తన ఆశించేవారు కోడలిగా ఆమె ఎదుర్కొన్న పరిస్థితులెలాంటివి లాంటి విషయాల గురించిన ఓ విధమైన అవగాహన ఏర్పరుచుకోవాలి. ఆ తరువాత ఆవిడ బలహీనతలు అర్థం చేసుకుని సాటి స్త్రీగా సానుభూతితో అందుకు తగిన రీతిగా ఆవిడ ఆత్మాభిమానం దెబ్బతినకుండా చూసుకోవాలి. పైన చెప్పినట్లుగా అత్తాకోడళ్ల సామరస్య సహజీవనానికి ఇరుపక్షాల నుండి ఎంతో సంయమనం సమన్వయం అవసరం. అప్పుడే ఆ అనుబంధం కలకాలం నిలిచిపోతుంది.