అద్దకపు రంగులెన్నో పులుముకొని
గారాలు పోతోంది మరి
కంటికి అందని రంగుల మేళవింపు కదా మరి
ఊహల లోకంలో విహరింపచేసి కనులకు మాయతెరను కప్పేస్తుంది
వాస్తవాన్ని అదఃపాతాళానికి తొక్కేసి…
చిదిమేసానని వికటాట్టహాసం చేస్తుంది…
ఇంతేనా కనుల,వీనులవిందులకు
ఊడిగం చేయడమేన…
మనస్సాక్షి తన అస్తిత్వాన్ని కోల్పోయిందా…
నీ అంతర్ముఖాన్ని కప్పేసిన అబద్ధపు తెర తొలగినపుడు
నీకు నీవు సమాధానమిచ్చుకునే నిబ్బరాన్ని
ఇప్పటినించే కూడగట్టుకో…మరి
కాయాన్ని బాధపెడితే వచ్చేది నెత్తురే కావొచ్చు…కానీ
నర నరాన రుధిరాన్ని పారించే హృదయాలయాన్ని దెబ్బతీస్తే వచ్చేవి…
నయనాశ్రువులే …అవే
నీ మంచితనానికి పట్టిన
మాలిన్యాన్ని నిలువునా కడిగేస్తాయి…
కాలానికి ఎదురీది
అబద్ధపు తెరను ఉతికి ఎండగడతాయి