రేపల్లె సంపద గల్ల ఊరు…. పాడి పంట ఎక్కడ జాసినా లచ్చిమి గల్లుగల్లున ఆడుతది…
గోపెమ్మల ఒంటి మీద తీరొక్క సొమ్ము గాదు.
కాల్లకు బంగారు కడియాలు తోడాలు పట్టగొలుసులు మెట్టెలు, నడుముకు ఒడ్డాణము మువ్వల గొలుసులు, మెడల పెద్దగొలుసు ముత్యాల హారాలు నానుగొలుసు కంటె … ముక్కుకు ముక్కు బేసరి బులాకి ముక్కు పోగు…
పాపిట బిల్ల , సూర్య చంద్రుల బిల్లలు నాగరం కుప్పె
తిరిగుడు పువ్వు జడ కుచ్చులు…
ఒక్కొక్క గోపెమ్మ నడుస్తుంటే లచ్చిమి నాట్యమాడినట్టుంటది. లచ్చమి దేవి పెనిమిటి గీడ ఉండంగ ఆమె ఎక్కడుంటది మరి….
కిట్టయ్య రేపల్లె మొత్తం దూం దుమారం జేస్తున్నడు…
మల్ల తల్లి కాడ ఏం తెల్వనోని లెక్క నాట్కమాడతడు…
…….
యసోదమ్మ పొద్దు వాటారెటేల కొడుకా కిట్టయ్యా ఏమన్న తింటవా? ఆకలౌతలేదా బిడ్డా..!! అంటడిగింది.
ఆటాలాడి వచ్చిన క్రిష్ణుడు ఏమెద్దమ్మా…
అంటుండగనే…. ఓ యసోదమ్మా!!! యసోదమ్మో!!
అని ఎవల్లో పిలిచిన్రు…
పెద్దర్వాజ కాడికొచ్చి… ఎవరూ అన్నది యసోదమ్మ
ఊర్లె ఉన్న గోపెమ్మలంత గుమిగూడి వచ్చి నిలవడిండ్రు
ఏమక్కా యిట్లొచ్చిన్రు… రండ్రి కూసోండ్రి…
కూసోనీకె గాదులే యసోదక్కా!!
మరేమిటికొచ్చిన్రు పెద్దమ్మా!! చెప్పుండ్రి
నువ్వే చెప్పు పెద్దమ్మా…అన్నది ఒక నడీడు గోపెమ్మ
నేనా!!వాయమ్మో నా నుంచి గాదే… నువుజెప్పు
ఎవరో ఒకరు చెప్పండక్కా… నా దగ్గర గింజుకుంటరెందుకు….
ఒక వయసు మల్లిన గోపెమ్మ “ ఏం లేదు యసోదమ్మా!!
నీ కొడుకు దూము కొంచం గాదు ఎట్ల జెప్పాలని శింత జేస్తున్నం….
ఏమైంది పెద్దమ్మ??
మా సంటోల్లకు పాలువిండుదామని ఆవుల కాడికివోతె ఎప్పుడొచ్చిండో నీ కొడుకు ల్యాగదూల్లను యిడిచిండు … అవి పాలన్నిదాగినయి… మా పోరలు ఒగటే ఏడుపు”
అదిగాదక్కా… అంట యింకో గోపెమ్మ “ నాలుగుకడవలల్ల పాలు బాగ కాగవెట్టి వారకు మూతవెట్టి పెట్టిన… యాడినించొచ్చిండో ఎప్పుడొచ్చిండో… పాలు తాగి కడవలు పలగ్గొట్టి పారిపోయిండు… పట్టుకుందమంటె చిక్కుతడా?
“ఇదిను శిన్నమ్మా… మా పక్క యింట్ల పాలకుండలను పలగ్గొట్టి మా యింట్లవడేసిండు…. వాల్లు మా మీద జగడానికొచ్చింన్రు తెలుసా?
ఇగో యసోదక్కా!! మా యింట్ల యింకా గోరం….. పూజజేస్కోని… ఎన్న నైవిద్యంవెట్టిన … మూసుకున్న
కళ్లు తెర్చి సూడంగనే ఎదుర్గ కిట్టయ్య … ఎన్న మొత్తం
ఎంగిలిజేస్తుండవట్టిండు. ఏంది కిట్టయ్యా గిట్ల జేస్తరా? అడిగితె నా కన్న దేవుల్లెవరు? అంటాని దేవుల్ల పటాలకు ఎంగిలివూసి ఉర్కడా…..
ఇంకిను నేను జెప్త… అని ఇంకో గోపెమ్మ మొదలువెట్టింది….గిట్ల జేస్తన్నడని మా యింట్ల పెరుగు పాల కడవల్ని ఉట్టికెక్కించినం….
పగటేల ఎవరులేంది జూసి పీటమీద పీట, పీటమీద పీటేసి సోపతి పోరగాండ్లను ఒంగవెట్టి ఎక్కి కుండ అందక పోతే… కుండ కింద తూటువెట్టి పాలు తాను తాగి సోపతి పిల్లలకు పోసిండు… అదిగాక నిద్రవోతున్న నా మూతికి పూసి పోయిండు. మా అత్త నేనే పాలదొంగనని ఒకటే తిట్లు…
ఇగో యసోదమ్మో!! నీకుంటే బంగారు తల్లెల ఎండి బువ్వ వెట్టుకోని తినుండ్రి… మంచిమంచి సీరలు గట్టుండి…మాకెందుకమ్మా ఈ బాద…
మీ పిల్లగానికి బుద్దిజెప్పకపోతే… మేమంత ఊరిడ్చి వెట్టిపోతం మా ఆవుల మీద ఒట్టు జూడు.
యింకేదో జెప్పబోతుంటే
ఇంక సాల్జేయండి అమ్మల్లారా…. నా బిడ్డ మీదగిన్ని సాడీల్జెప్తరా… నన్ను యిడిచి ఒక్క పారి కూడా అవుతలికి పోడు నా కొడుకు… ఇగ యిండ్లల్లకు పోండి….అని కండ్లల్ల నీల్లు తిరుగుతుండంగ ఇంట్లకు వోయ్యింది.
కిష్టయ్య తలుపు సాటుకు నిలవడి ఏం తెల్వనట్టు మొకం బెట్టిండు.
యసోదమ్మ కోపంబట్టలేక … క్రిష్ణయ్య ను రెక్కవట్టుకొని గుంజుకువోయి పెరట్ల ఉన్న రోటికి పల్పుతాడివెట్టి గట్టిగ్గట్టేసి ఏం మాట్లాడకుండ లోపలికివోయింది.