ప్రత్యూష పవనవీచికతో మేల్గాంచిన నాకు
సుందర మనోహరమైన ఆ దృశ్యంతో
మనసు ఉత్తుంగ తరంగమై పరువెత్తింది
“పూలదండను కూర్చడం కళ” గా భావించిన ఓ కోమలాంగి
తన లేప్రాయపు వలపులకు
సొగసులు కలబోయాలని ఆ విరిబోడి
తన సుందర సుకుమార కరదోయితో
అతి నెమ్మదిగా త్రెంచే ప్రయత్నంలో…
అందీ అందక ఆరడి పెడుతున్న ఆ కుసుమాలతో- విసిగి దీన వదనయైన ఆ కలికి కళ్ళలో
ఎన్నెన్ని కలత కన్నీళ్లో!!
చెలియ చెక్కిటగారే భాష్పధారల గాంచిన
తుంటరి విరిబాలలు కొంటెగా నవ్వాయి కాబోలు…
ఆ విరుల సొగసును తన్మయత్వంతో చూస్తూ-
“పూల అందాలను ఆరాధించడం ఒక సాధన” గా
తలచిన ఆ తనూలత కళ్ళలోని భావం…
ఓ…హ్… అతి
సుందరం సుమధురం మనోహరం