అమృతతుల్యమైన తెలుగు భాష మృతభాషగా మారుతుందేమో అన్న ఆవేదన ఈనాటి తెలుగు సాహిత్యవేత్తల్లో, భాష ప్రేమికుల్లో కనిపిస్తోంది. కానీ, నేటి యువత తమ సృజనాత్మకతను చాటేందుకు, తాను చూస్తున్న జీవితాలను కథావస్తువులుగా తీసుకుని కథలు, నవలలు రాసేందుకు ఎక్కువగా ఆసక్తి చూపిస్తున్నారు. ఇటీవల హైదరాబాద్ లో జరిగిన పుస్తక ప్రదర్శనలో ఎంతో మంది యువ రచయితలు తమ పుస్తకాలను ఆవిష్కరించారు. పాఠకులకు అందుబాటులోకి తీసుకువచ్చారు. అలా తెలుగు పాఠకుల చేతిలోకి చేరిన పుస్తకం ఇసుక అద్దం. పేరు ఆసక్తిని పెంచింది. అందుకుకే ఆ పుస్తక రచయిత శ్రీ ఊహ గారితో తరుణి ముఖాముఖీ
తరుణి : మీ వివరాలు అమ్మానాన్న పేరు, చదువు, మీ ప్రాంతం,ఊరు
శ్రీ ఊహ : పుట్టి పెరిగింది హైదరాబాద్. నాన్న ఎస్ ఎస్ ఆర్, జర్నలిస్ట్. అమ్మ లక్ష్మి, బ్యాంక్ మేనేజర్. ఎం బి ఏ చేశాను, ప్రస్తుతం తెలంగాణ ప్రభుత్వ కార్యాలయంలో పని చేస్తున్నాను.
తరుణి : సాహిత్యం వైపు ఆసక్తి ఎలా కలిగింది రచనలు చేయాలని ఎందుకు అనిపించింది?
శ్రీ ఊహ : ఇంట్రావర్ట్ ని. నాకు వెంట్ అవుట్ ఛానల్ నా రచనలు. ఏ చిన్న కాగితం కనపడినా చదివేయడం ఇష్టం. కిరాణా షాపులో చింతపండు ప్యాక్ చేసిన కాగితం కూడా వదిలేదాన్ని కాదు. స్కూల్ మ్యాగజైన్ కి చిన్న చిన్న కథలు రాయడం మొదలుపెట్టి, ఆఫీస్ కమ్యూనికేషన్ టీం కి ఎడిటర్ గా, చివరికి ప్రొఫెషనల్ రైటింగ్ లో కి ప్రవేశించాను. ఒక కథ ని ఎక్కువ రోజులు లోపల దాచుకోలేను. రాయాల్సిందే
తరుణి : “ఇసుక అద్దం” గురించి
శ్రీ ఊహ : ట్రూ స్టోరీ. ప్రాజెక్ట్ పని మీద దుబాయ్ వెళ్ళినప్పుడు కలిసిన వ్యక్తి ఇసుక అద్దం లో ని మెయిన్ క్యారెక్టర్. ఆయన హైదరాబాద్ నుండి అక్కడకి వెళ్ళి అంత ఎత్తైన భవనం క్లీనింగ్ పని ఎందుకు ఒప్పుకున్నారో తెలుసుకోవాలని చేసిన చిన్న ప్రయత్నం. తర్వాత ఆయన ఇండియా కి రావడం, కలిసి ఇంటర్వ్యూ తీసుకోవడం జరిగింది. నా పుస్తకం నాకు చాలా ఇష్టమైన కథ కూడా.
తరుణి : సాహిత్యంలో మీరు ప్రేరణ ఎవరు?
శ్రీ ఊహ : చాలా మంది ఉన్నారు. నా పుస్తకం ముందు మాటలో చెప్పినట్టు, ప్రొఫెషనల్ రైటింగ్ లో ఓనమాలు దిద్దించిన ఖదీర్ బాబు గారి నుండి భుజం తట్టి ప్రోత్సహించిన వారు చాలా మంది ఉన్నారు. ఇంకా చేస్తూనే ఉన్నారు. ఏ చిన్న అనుమానం వచ్చినా ముందు నా రీసెర్చ్ నేను చేసాక, చుట్టూ ఉన్న సపోర్ట్ సిస్టం దగ్గరకి వెళ్తాను. కాదు, లేదు అని ఎవరూ తిరస్కరించలేదు.
తరుణి : మీకు ఇష్టమైన పుస్తకాలు, రచయితలు?
శ్రీ ఊహ : మహమ్మద్ ఖదీర్ బాబు గారి దర్గామిట్ట కథలు, కథలు ఇలా కూడా రాస్తారు; నామిని గారి మిట్టూరోడి సాహిత్యం; ఈనాటి జీవితంలో గల కల్మషాన్ని కడగటానికి అవసరమైన అభ్యుదయ భావాలను పుష్కలంగా అందించిన చాసో కథలు, ఇంకా ఎన్నో. రంగనాయకమ్మ గారి రచనలు, ఈ లిస్ట్ అనంతం.
తరుణి : భవిష్యత్తులో ఇంకా ఏయే అంశాలు రాయాలన్న ఆలోచన ఉంది?
శ్రీ ఊహ : గ్రామ కథలు, నా ప్రయాణాల్లో కలిసిన వ్యక్తులు, చుసిన సన్నివేశాలు, చేనేత కళాకారుల కథలు, కార్పొరేట్ జీవితాలు
తరుణి : కథావస్తువు ఎంపిక లో మీరు తీసుకునే జాగ్రత్తలు?
శ్రీ ఊహ : చుట్టూ ఉండే స్ఫూర్తిదాయకమైన మనుషుల మనస్తత్వాన్ని లోతుగా పరిశోధించి వారి కథలు రాయడం ఇష్టం
తరుణి : మీ వృత్తి, ప్రవృత్తి ని ఎలా బ్యాలెన్స్ చేస్తూంటారు?
శ్రీ ఊహ : మొదట్లో చాలా కష్టం అయింది. కొన్ని రోజుల పాటు సమయం దొరకక రాయడం కుదరలేదు. అసహనం పెరిగిపోయింది. అప్పుడే నాకోసం ఇంట్లో ఒక చిన్న గది, రైటింగ్ టేబుల్ సెట్ చేసుకున్నాను. ఇది చాలా అవసరం. ఉదయం అయిదు గంటలకు ఎలాంటి డిస్టర్బన్స్ లేని టైం ఫిక్స్ చేసుకున్నాను. ప్రశాంతగా ఉంటుంది, కొత్త ఆలోచనలు వస్తాయి. అది నా టైం. అప్పుడు రాయడం తప్ప మరో పని ముట్టుకోను,ఆలోచించను కూడా.
తరుణి : మాతృభాష పరిరక్షణకు ఎలాంటి చర్యలు తీసుకోవాలని మీరు అనుకుంటున్నారు?
శ్రీ ఊహ : భాషగా మాత్రమే మాతృభాషను నేర్చుకునే పరిస్థితికి స్వస్థి చెప్పాలి. భాషావేత్తలు, ఉపాధ్యాయులు, తల్లిదండ్రులు, మీడియా మాతృభాష పరిరక్షణలో భాగస్వాములు కావాలి. ప్రాచీన సాహిత్యాన్ని సరళ తెలుగులో యువతకు అందుబాటులోకి తెచ్చే ప్రయత్నాలు జరిగితే బాగుంటుంది. మారుమూల గ్రామాల నుంచి భాషాపదజాలాన్ని సమీకరించడం, అంతరిస్తున్న పదాలను వెలికి తీసి కాపాడుకోవడం, వృత్తి పదకోశాలు, మాండలిక పదకోశాలు రూపొందించడం లాంటివి చాలా అవసరం.
తరుణి : కొత్త గా కవితలు, కథలు రాసే వారికి మీరిచ్చే సూచనలు
శ్రీ ఊహ : ఎక్కువ చదవండి, రోజుకి కనీసం ఒక పేజీ రాయండి. వీటితో పాటు, విమర్శ వస్తే కుదిరినంత వరకు పాజిటివ్ గా తీసుకోండి. మీ పీర్స్ ఏమి రాస్తున్నారు, సీనియర్స్ ఏమి రాశారు, అలాగే కొత్త కొత్త టాపిక్స్ కోసం అప్డేటెడ్ గా ఉండండి.