మనసులో దిగులు మేఘం కమ్ముకున్నప్పుడల్లా
అదేంటో…
ధారాపాతంగా కన్నీటి చుక్కలు
బుగ్గలపై నుండి జాలువారుతయి
ప్రతి అశ్రునయనం వెనుక
తీరని సుడిగుండాలెన్నో
ఆ కన్నీటి సాళ్ళ మాటున
పంటకు రాని విత్తులెన్నో
తీరని బడబాగ్ని సెగలో
ఆవిరయ్యే కన్నీ ళ్ళెన్నో…
మది సంద్రపు తరంగాల హోరులో
చుక్కాని లేని నావ తీరు పయనం ఈ జీవితం…
ఎవరి ఆసరాని అంగీకరించని హృది
హఠాత్తు పరిణామాలకు మౌన వ్రతం పూనింది
నిబ్బరంగా బ్రతుకీడుస్తామన్న చోటే
నిప్పులు కురిపిస్తుంటే…
ఆ దావానలంలో బూడిదగా మారాల్సిందేనా…
అమాయకపు బతుక్కి సుఖమెప్పుడూ ఎండమావే మరి
నిరాశా,నిస్పృహల మాటున
నీరెండ మేఘపు అనుభూతికై వేచిన కన్నుల గాథ …
కంచికి చేరేదెన్నడో